Skip to main content

దేశ భవిష్యత్తునుకుల గణన మారుస్తుందా?

డా॥బి.జె.బి. కృపాదానం, సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ, ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్.
2011 జనాభా గణాంకాల ప్రకారం భారతదేశంలో 46 లక్షల కులాలు, ఉపకులాలు ఉన్నాయి. 15వ జన గణన ప్రత్యేక గుర్తింపును సాధించింది. 1931 తర్వాత తొలిసారిగా కులప్రాతిపదికన జనాభా గణాంకాలను సేకరించారు. 2011 జన గణన నినాదం- ‘మన జనాభా గణాంకాలు, మన భవిష్యత్’. మరి ప్రతిష్టాత్మకంగా సేకరించిన కుల గణన వివరాలు భారత భవిష్యత్తును నిర్దేశిస్తాయా?

దేశంలో కుల గణాంకాల సేకరణ జరగాలని 2014 వరకు అధికారంలో ఉన్న యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములైన లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, ములాయంసింగ్ యాదవ్ డిమాండ్ చేశారు. దీన్ని అప్పటి ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, అకాలీదళ్, శివసేన, అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం సమర్థించాయి. 2011కుల గణాంకాల సేకరణ ప్రధానంగా ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీల) జనాభాను కచ్చితంగా తెలుసుకునేందుకు ఉద్దేశించినది.

1968లో కేరళ రాష్ట్రంలో....
స్వతంత్ర భారతావనిలో ఒకే ఒకసారి కేరళలో 1968లో కుల గణాంకాలను సేకరించారు. బ్రిటిష్‌వారి హయాంలో కులప్రాతిపదికన జనాభా లెక్కల సేకరణ 1871లో ప్రారంభమైంది. ఇది కేవలం భారతీయ సమాజాన్ని ‘విభజించి, పాలించేందుకు..’ ఉపయోగపడింది. అప్పట్లో ప్రభుత్వ పరంగా బలహీన వర్గాలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. 1881 జన గణన కుల గణాంకాలను స్పష్టంగా తెలియజేయడంలో విఫలమైంది. 1911లో జరిగిన జన గణన విస్తృత స్థాయిలో కుల గణాంకాలను సేకరించింది. బ్రాహ్మణుల విషయంలో మాత్రమే జాతీయ స్థాయిలో స్పష్టత లభించింది. మిగిలిన కులాల విషయంలో స్పష్టత లోపించింది.

1941లో నిలిపివేత...
1931 జనాభా లెక్కల సేకరణ శాసనోల్లంఘన ఉద్యమ నేపథ్యంలో జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతున్న సమయంలో 1941లో జనాభా లెక్కల సేకరణ జరిగింది. ఈ సమయంలో కుల గణాంకాల సేకరణ నిలిపేయాలని అప్పటి జనాభా లెక్కల కమిషనర్ డబ్ల్యు.ఎం.ఈట్స్ నిర్ణయించారు.

కులరహిత సమాజం లక్ష్యం!
స్వాతంత్య్రం వచ్చాక భారత రాజ్యంలో రాజకీయ ప్రధాన స్రవంతి (Mainstream Politics) ఉండాలని, కులరహిత సమాజం, రాజకీయ వ్యవస్థ రూపొందాలనే ఆశయంతో ప్రభుత్వం కులగణాంక సేకరణకు స్వస్తిపలికింది. కేవలం షెడ్యూలు కులాలు, తెగలను మాత్రమే రాజ్యాంగంలో ప్రస్తావించారు. దురదృష్టవశాత్తు సమాజంలో తరతరాలుగా కొన్ని వర్గాల విషయంలో కొనసాగుతున్న వివక్ష ఏమాత్రం తగ్గలేదు. పేరుకు కులరహిత రాజ్యాంగమేకానీ, గత 65 ఏళ్ల కాలంలో కులాల మధ్య అసమానతలు పెరిగాయే కానీ తగ్గలేదు. దీని పర్యవసానమే ‘మండల్ కమిషన్’ ఏర్పాటు. దిగువస్థాయి కులాలుగా పరిగణిస్తున్న బహుజనులు తమకు న్యాయబద్ధంగా చెందాల్సిన రాజకీయ, ఆర్థిక రాయితీల కోసం ఉద్యమిస్తున్నారు. కుల ప్రాతిపదికన గణాంకాల సేకరణ ముఖ్య లక్ష్యం.. దేశంలో ప్రతి వ్యక్తి కులాన్ని గుర్తించడం ద్వారా సామూహిక చిత్రం (Collective Portrait) తయారు చేయడం.

ఓ అభ్యుదయ వ్యూహం:
ఒక వ్యక్తి అనుభవించే సదుపాయాలు లేదా అవి లభించకపోవడాన్ని సామాజిక నేపథ్యం నిర్ణయిస్తుంది. అందుకే అణగారిన వర్గాలు సకారాత్మక వివక్ష (Positive Discrimination) కోరుతున్నాయి. దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు నమ్మదగిన సమాచారం లేదు. సర్వేల ద్వారా లభ్యమైన సమాచారం ప్రకారం చూస్తే వివిధ సామాజిక వర్గాల మధ్య మానవ ప్రగతి కారకాల్లో ఎన్నో అంతరాలు కనిపిస్తున్నాయి. విద్య, ఆదాయం, జీవన ప్రమాణాల్లో తేడాలున్నాయి. అయితే సర్వేల ద్వారా లభ్యమయ్యే వివరాలు ప్రామాణికం కావు.

సమస్యలు తీరేదెలా?
  1. నమూనా పరిమాణం (Sample Size) చిన్నదిగా ఉండటం వల్ల అల్ప సంఖ్యాక వర్గాల ఆర్థిక, ఆరోగ్య, విద్య, ఉద్యోగ ముఖచిత్రం స్పష్టంగా లభించదు. ఈ వర్గాల ముఖచిత్రం స్పష్టంగా తెలియాలంటే జాతీయ స్థాయి జనాభా గణాంకాల సేకరణ చేపట్టాలి.
  2. ఆయా వర్గాలకు ఏ మేరకు రిజర్వేషన్ సదుపాయాలు కలిగించాలనే విషయంలో స్పష్టమైన డేటా లేకపోతే వారికి అన్యాయం జరిగే అవకాశముంది. అందువల్ల కులాలతో పాటు వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులను (అక్షరాస్యత, ఉద్యోగం తదితర) హేతుబద్ధంగా అంచనా వేయాలంటే కులగణాంకాల సేకరణ అవసరం.
  3. ఉన్నత వర్గాలకు చెందిన కొందరు వ్యతిరేకించినప్పటికీ, కుల గణాంకాల సేకరణ ద్వారా భారతదేశం చట్టబద్ధంగా కుల సమాజమవుతుంది. రాజ్యాంగం గుర్తించకున్నా, ఈ ప్రక్రియ ద్వారా కులం వైకల్యాన్ని (Disability) గుర్తించేందుకు దోహదపడుతుంది. అంటరానితనం, అఘాయిత్యాలు, సామాజిక వెనుకబాటుతనం వంటివాటిని అంచనా వేసేందుకు కుల గణాంకాలు అవసరం. భారతీయ సమాజం కులసమాజమనే భావన ఈనాటిది కాదు. భారత సమాజంలో కులం మూలబిందువని కుల వ్యతిరేక ఉద్యమాలు నొక్కి చెప్పాయి. కొందరు సంఘ సంస్కర్తల అభిప్రాయంలో ‘కుల వ్యవస్థ.. సమాజంలో వ్యక్తి హోదాను, సంపదను, జ్ఞానాన్నీ, అధికారాన్ని నిర్ణయిస్తుంది’. ఈ మధ్య కాలంలో దళిత రచయితలు, విమర్శకులు, పరిశోధకులు, కార్యకర్తలు.. భారతీయ సమాజంలో కులం విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నదని, అది అణగారిన వర్గాలను చైతన్యవంతం చేసేందుకు తోడ్పడుతుందని అభిప్రాయపడుతున్నారు. షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలపై అఘాయిత్యాలను నిరోధించే చట్టాన్ని (1989) ఆమోదించడానికి ఇది ప్రబలకారణం.
    • సుప్రీంకోర్టు.. ఇంద్రాసాహ్ని-యూనియన్ ఆఫ్ ఇండియా (1992) కేసులో కులాన్ని చట్టబద్ధంగా గుర్తించింది. దళితులు, వెనుకబడిన కులాలు ఒక సామాజిక వర్గంగా పరిణామం చెంది, సమకాలీన సమాజంలో శక్తిమంతమైన వ్యవస్థగా రూపొందాయి. ఎన్నికల్లో కుల ప్రభావం ఎంతగా ఉందో అందరికీ తెలుసు. కుల రహిత సమాజం కోసం పోరాడుతున్నామనే కొన్ని పార్టీలు కూడా వారు నిలబెట్టే అభ్యర్థులు ఆ నియోజకవర్గంలో ప్రాధాన్యమున్న కులానికి చెందినవారే!
  4. పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణకు, రిజర్వేషన్లకు ప్రాతిపదిక కులగణాంకాలన్నది మరచిపోకూడదు.
  5. కుల గణన అనేక కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఇప్పటి వరకు సమాజంలో కొన్ని ప్రత్యేక సదుపాయాలు అనుభవిస్తున్న కొన్ని సామాజిక వర్గాల సంఖ్యా బలాన్ని బహిర్గతం చేస్తుంది. అనర్హులైన సామాజిక వర్గాలు అనుభవిస్తున్న సదుపాయాలను బహిర్గతం చేసి, వాటిని నిలిపేసేందుకు తోడ్పడుతుంది.
  6. గణాంకాలు కుల వ్యవస్థపై రాజకీయ వర్గాల్లో అర్థవంతమైన చర్చకు ఊతమివ్వొచ్చు. దీని ఫలితంగా వివిధ కులాల మధ్య ఉద్రిక్త వాతావరణం తలెత్తవచ్చు. దీనివల్ల ఆర్థిక, రాజకీయ, సామాజిక ఆధిపత్యాన్ని చలాయిస్తున్న వర్గాలు తమ ప్రాభవాన్ని కోల్పోయే అవకాశముంది. ఈ ప్రజాస్వామ్యబద్ద ప్రవృత్తి కొన్ని ఘర్షణలకు, అనిశ్చితికి దారితీసినప్పటికీ, అంతిమంగా భారతీయ సమాజ రూపాంతీకరణ (Transformation)కు దోహదం చేస్తుందని చెప్పొచ్చు!
కుల గణాంక సేకరణ-వ్యతిరేక వాదనలు:
దాదాపు 46 లక్షల కులాలు, ఉపకులాలను అర్థవంతమైన ప్రధాన సామాజిక వర్గాలుగా విభజించడం కష్టం. అయితే సమాచార, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించడం, నిల్వ ఉంచడం, అవసరమైనప్పుడు దాన్ని తిరిగి (retrive) పొందడం, విశ్లేషించడం అసాధ్యం కాదు. జనాభా లెక్కలు సేకరించేవారు ఆయా ప్రాంతాలకు చెందినవారై ఉంటారు. అక్కడి ప్రజల కుల వివరాలు బాగా తెలుసు. అవసరమైతే సామాజిక, ఆంత్రోపాలజీ నిపుణుల సహాయంతో డేటాను విశ్లేషించవచ్చు.

రాజకీయపరమైన అభ్యంతరం:
కుల గణాంకాల సేకరణ ప్రక్రియ బ్రిటిష్ వారు అనుసరించిన ‘విభజించి, పాలించు..’ అనే విధానాన్ని పునరుజ్జీవితం చేస్తుందనే రాజకీయ పరమైన అభ్యతరం ఉంది. ఇది కేవలం ఇప్పటి వరకు రాజకీయ అధికారాన్ని చెలాయిస్తూ, సంపద గుత్తాధిపత్యాన్ని కలిగున్న కొన్ని వర్గాల నిర్హేతుకమైన వాదన. తమ ప్రయోజనాలు, ఆధిపత్యం దెబ్బతింటుందనే బాధ వీరిలో ఉంది. రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యీకరణకు కుల గణాంకాలు దోహదం చేస్తాయి. ఇవి అవసరం.
Published date : 19 Sep 2015 12:42PM

Photo Stories