Skip to main content

Manipur Violence: ‘ప్రశాంత మణిపూర్‌’ ఎట్లా.. నాయ‌కులేమంటున్నారు..?

నెలరోజులుగా భగ్గున మండుతున్న మణిపూర్‌లో ప్రశాంతత నెలకొల్పేందుకు ఎట్టకేలకు ఒక రాజకీయ ప్రయత్నం మొదలైంది.
Manipur violence

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆ రాష్ట్రంలో పర్యటించి పరస్పరం కలహిస్తున్న మెయితీ, కుకీ తెగల నాయకులతో, పౌర సమాజ కార్యకర్తలతో, రాజకీయ పార్టీలతో మే 30న సమావేశమయ్యారు. సమస్య ఉగ్రరూపం దాల్చినప్పుడు, జనం చావుబతుకులమధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు పాలకులుగా ఉన్నవారు సంయమనంతో మెలగటం, సాధారణ స్థితి ఏర్పడేందుకు ప్రయత్నించటం అవసరం. మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌ సింగ్‌కు ఈ ప్రాథ మిక విషయాలు కూడా తెలిసినట్టు లేదు.

ఇప్పటివరకూ జరిగిన ఘర్షణల్లో దాదాపు 80 మంది ప్రాణాలు కోల్పోయారు. 40,000 మంది వరకూ కొంపా గోడూ వదిలి చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు. ఊళ్లకు ఊళ్లే మంటల్లో మాడి మసయ్యాయి. పోలీస్‌ స్టేషన్లపై దాడులు చేసి తుపాకులు, మందుగుండు అపహరించిన ఉదంతాలు జరిగాయి. ఇలాంటి సమయంలో ‘ఇదంతా కుకీ ఉగ్ర వాదులకూ, భద్రతా దళాలకూ సాగుతున్న ఘర్షణ తప్ప మరేంకాద’ని బీరేన్‌ సింగ్‌ ప్రకటించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. పరోక్షంగా కుకీలను మిలిటెంట్లుగా, ఉగ్రవాదులుగా చిత్రీకరించటమే ఆయన ప్రకటన వెనకున్న సారాంశమన్న విమర్శలు వెల్లువెత్తాయి.

Artificial Intelligence: కృత్రిమ మేధ విసరనున్న సవాళ్లు.. ఇప్పుడు చర్చ మొత్తం భద్రత పైనే..

రక్షణ దళాల చీఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ సీఎం ప్రకటనను తోసిపుచ్చారు. ఇది కేవలం రెండు తెగల మధ్య ఘర్షణేనని తేల్చి చెప్పారు. మెయితీ తెగకు చెందిన నేతగా బీరేన్‌ సింగ్‌కు వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయాలైనా ఉండొచ్చు. కానీ పాలకుడిగా స్పందించాల్సి వచ్చినప్పుడూ, రాష్ట్రం ఇంకా ఘర్షణలతో అట్టుడుకు తున్నప్పుడూ ఆచి తూచి మాట్లాడాలి. తమ తెగవారిపై జరుగుతున్న దాడుల మాటేమిటని కుకీ శాసనసభ్యులు నిలదీస్తే ఆయన నుంచి సమాధానం లేదు.

ఇదొక్కటే కాదు... హింసను సాకుగా చూపి 25 మిలిటెంట్‌ సంస్థలతో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు బీరేన్‌ సింగ్‌ ఏకపక్షంగా ప్రకటించటం కూడా సమస్య తీవ్రతను పెంచింది. కుకీలతో అమిత్‌ షా నిర్వహించిన సమావేశానికి సీఎం రాలేని స్థితి ఏర్పడటం, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వారు కోరటం రాష్ట్ర ప్రభుత్వంపై ఏర్పడిన అవిశ్వాసానికి అద్దం పడుతుంది.

మణిపూర్‌తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాలు ఎంతో వైవిధ్యభరితమైనవి. అక్కడి నాలుగున్నర కోట్ల జనాభాలో 400కు పైగా తెగలున్నాయి. మాండలికాలు సైతం దాదాపు అంతే సంఖ్యలో ఉంటాయి. వీరంతా భిన్న సంస్కృతులు, విశ్వాసాలకు చెందినవారైనా... అప్పుడప్పుడు అపోహలు తలెత్తిన సందర్భాలున్నా మొత్తంమీద శతాబ్దాలుగా కలిసిమెలిసి ఉంటున్నారు. అయితే ఇంచుమించు ఏభైయ్యేళ్లుగా ఇదంతా మారింది. తెగల పరిరక్షకులమంటూ సాయుధ బృందాలు తలెత్తటం మొదలైంది.

Turkey President Erdogan : ప్రజాస్వామ్యంలో నిరంకుశ నేత.. 

ఉపాధి లేమివల్ల కావొచ్చు... జీవికకు ముప్పు కలుగుతుందన్న భయాందోళనల వల్ల కావొచ్చు చిన్న సమస్య రాజుకున్నా అది క్షణాల్లో కార్చిచ్చుగా మారి కల్లోలం రేపుతోంది. తమకు స్వయం పాలిత ప్రాంతాన్ని ఏర్పరచాలన్న డిమాండ్‌ బయల్దేరుతోంది. వివిధ రాష్ట్రాల్లో తమ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలను కలిపి ‘ప్రత్యేక నాగాలిమ్‌’ ఏర్పరచాలని నాగాలు పదేళ్ల క్రితం తీవ్ర ఆందోళనకు దిగారు.

పరిమిత వనరులను పలువురితో పంచుకోవటం తప్పనిసరి కావటంతో అవత లివారు శత్రువులుగా కనిపిస్తున్నారు. మెయితీలను సైతం ఎస్టీలుగా పరిగణించాలన్న న్యాయస్థానం ఆదేశాలు ఈ కారణంతోనే ఆదివాసీలైన కుకీల్లో కల్లోలం సృష్టించాయి. ఇదే అదునుగా ఘర్షణలు తలెత్తాయి. పొరుగునున్న మయన్మార్‌ నుంచి వచ్చిపడుతున్న శరణార్థులను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మెయితీ నాయకులు చెప్పటం సమస్యను తగ్గించి చూపటమే అవుతుంది.

అసలు కుకీలు స్థానికులు  కాదనీ, వారు మయన్మార్‌ నుంచి వలస వచ్చినవారనీ చాన్నాళ్లనుంచి మెయితీలు వాదిస్తున్నారు. రాష్ట్రంలో జాతీయ పౌరసత్వ చిట్టా (ఎన్‌ఆర్‌సీ) అమలు చేసి, పౌరసత్వాన్ని నిగ్గుతేల్చి స్థానికేతరులను పంపేయాలని వారు కోరుతున్నారు. 53 శాతంగా ఉన్న మెజారిటీ తెగ నుంచి ఇలాంటి డిమాండ్‌ రావటం కొండప్రాంతాల్లో ఉంటున్న కుకీల్లో సహజంగానే గుబులు రేపుతోంది. 1901 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో కుకీలు 14.5 శాతం. 110 ఏళ్ల తర్వాత 2011 నాటికి వారి జనాభా పెరుగుదల రెండు శాతం మాత్రమే. అలాంటపుడు కుకీలపై స్థానికేతరుల ముద్రేయటం అసంబద్ధం కాదా? 

RBI Annual Report: కట్టలు తెంచుకున్న కరెన్సీ.. ఆర్‌బీఐ వార్షిక నివేదిక వెల్లడి.. వార్షిక నివేదికలోని ముఖ్యాంశాలు..

ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రకటనలనూ, తెగల మధ్య అపోహలు పెంచే వదంతులనూ నివారించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దాని పర్యవసానంగానే ఇంత హింస చోటుచేసుకుంది. నిరుడు యూపీలోని మధురలో కన్నవారి కర్కశత్వానికి బలైపోయిన 21 ఏళ్ల యువతిని మెయితీ తెగ మహిళగా చిత్రించి, ఆమెపై కుకీలు అత్యాచారానికి పాల్పడి హతమార్చారని తప్పుడు ప్రచారం జరపడంతో ఉద్రిక్తతలు రాజుకున్నాయి. కుకీ తెగ మహిళలపై దాడులు జరిగాయి.

అత్యాచార ఉదంతాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక చుర్‌చాంద్‌పూర్‌లో హిందూ దేవా లయాలపై దాడులు సాగించారన్న వదంతులు లేవదీశారు. ఇదంతా అబద్ధమని వెంటనే ఆ ప్రాంత మార్వాడీ, పంజాబీ సొసైటీలు, బెంగాలీ సొసైటీ, బిహారీ సొసైటీ సంయుక్తంగా ప్రకటించాయి. తెగల పేరుతో, మతం పేరుతో ప్రజల్లో చీలికలు తెచ్చే యత్నాలను మణిపూర్‌ పౌర సమాజం ఐక్యతతో తిప్పికొట్టాలి. పాలకులు, రాజకీయ పార్టీల నేతలు జవాబుదారీతనంతో మెలగాలి. అప్పుడే ప్రశాంత మణిపూర్‌ సాధ్యమవుతుంది. 

Sengol: రాజరాజ చోళుడి కంటే ముందే ‘సెంగోల్‌’.. కొన్ని వందల ఏళ్ల క్రితమే వినియోగించిన బాదామీ చాళుక్యులు..!

Published date : 02 Jun 2023 01:39PM

Photo Stories