Skip to main content

జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ - స్వరూపం

బి. కృష్ణారెడ్డి, డెరైక్టర్, క్లాస్-1 స్టడీ సర్కిల్, హైదరాబాద్.
ఉన్నత న్యాయస్థానాలైన సుప్రీంకోర్టు, హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకం విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేయడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఇటీవల ఆమోదించాయి. చరిత్రాత్మక బిల్లు అమల్లోకి వస్తే ప్రస్తుతం అమలవుతోన్న కొలీజియం స్థానంలో... పారదర్శకత, జవాబుదారీ తనం పెరిగి పౌర సమాజానికీ చోటు దక్కుతుంది. రాజ్యాంగ విధులకు సంబంధించిన ఏ వ్యవస్థ లోనైనా ఏ ఒక్కరూ సర్వాధికారిగా ఉండకూడదనే ప్రజాస్వామ్య సూత్రానికి గీటురాయి అవుతుంది. ఈ నేపథ్యంలో గత కొలీజియం పద్ధతిలోని లోపాలు, ప్రతిపాదిత జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ విధానంలో పరిమితులపై విశ్లేషణ.

న్యాయమూర్తుల నియామక విధి విధానాలు, అర్హతలు రాజ్యాంగంలో ఉన్నాయి. 124, 217 అధికరణలలో వీటిని ప్రస్తావించారు. సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా నియమించాలంటే ఏదైనా హైకోర్టులో ఐదేళ్లు న్యాయమూర్తిగా అనుభవం ఉండాలి. న్యాయవాదుల కోటా నుంచి న్యాయమూర్తులను నియమించాలంటే ఏ హైకోర్టులోనైనా పదేళ్లు న్యాయవాదిగా పనిచేయాలి. న్యాయమూర్తులుగా, న్యాయాధికారులుగా పనిచేయని ప్రతిభావంతులైన న్యాయవేత్తలను (jurist) సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించే వీలు కల్పించారు. ఈ వెసులుబాటు హైకోర్టుకు వర్తించదు.

నియామక ప్రక్రియ-సమ్మతా? సిఫారసా?
సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఇదివరకే అనేక మార్పులు జరిగాయి. 1983లో జస్టిస్ భగవతి నేతృత్వంలోని ధర్మాసనం న్యాయమూర్తుల బదిలీ, నియామకాల్లో కేంద్రప్రభుత్వం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తే (Consultation) చాలని, సమ్మతి (Concurrence) పొందనక్కర్లేదని స్పష్టం చేసింది. సలహా అనేది ఒక తంతుగా ఉండకూడదని, అది ఒక ప్రక్రియ కాబట్టి సలహా అంటే సమ్మతిగా భావించాలని 1993లో రెండో జడ్జి కేసులో అత్యున్నత ధర్మాసనం భాష్యం చెప్పింది. దీనిపై మరింత స్పష్టత కోరుతూ 1998లో అప్పటి రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాకు నివేదించారు. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన మెజారిటీ తీర్పు ప్రకారం న్యాయమూర్తుల నియామకం, బదిలీ, పదోన్నతుల్లో కొలీజియం విధానం తెరపైకి వచ్చింది. ప్రధాన న్యాయమూర్తితో పాటు నలుగురు సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తులు మాత్రమే కొలీజియంలో ఉంటారు. దీంతో న్యాయమూర్తుల నియామకం కేవలం న్యాయ వ్యవస్థకే పరిమితం అయింది. కార్య నిర్వాహక వ్యవస్థ జోక్యానికి వీల్లేకుండా పోయింది. అయితే కొలీజియం ద్వారా జరిగిన నియామకాల్లో అనేకం ప్రస్తుత దిద్దుబాటు చర్యలకు ప్రధాన కారణం.

కొలీజియం వ్యవస్థ-లోపాలు:
అధికార పృథక్కరణ సూత్రం ప్రకారం ప్రభుత్వ అంగాలైన శాసన, కార్య నిర్వాహక, న్యాయ శాఖలు తమకు నిర్దేశించిన విధులను మాత్రమే నిర్వర్తించాలి. ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు. అలా జరిగితే ప్రజల హక్కులకు భంగం కలగడంతోపాటు నియంతృత్వానికి దారితీస్తుందని ప్రఖ్యాత ఫ్రెంచి రాజనీతి తత్వవేత్త మాంటెస్క్యూ పేర్కొన్నాడు. నియామకాలు కార్య నిర్వాహక పరిధిలోకి వస్తాయి. ఇందులో న్యాయ స్థానాల జోక్యం సాధారణంగా అనుమతించరు. రాజ్యాంగంలోని కొలీజియం విధానం సుప్రీంకోర్టు సృష్టించిన వివాదాస్పద అంశం. న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించడం సమంజసం కాదు. ఇది వృత్తిపరమైన ప్రీతి (Proffessional fraternity) కి దారితీస్తుంది. పారదర్శకత, జవాబుదారీతనానికి విఘాతం వాటిల్లుతుంది. దేశంలో ఉన్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తుల నియామక ప్రక్రియ చిదంబర రహస్యమని సుప్రీం కోర్టు మహిళా న్యాయమూర్తి రుమాపాల్ గతంలో వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల రుజు ప్రవర్తనను నిక్కచ్చిగా నిగ్గుతేల్చే అంతర్గత వ్యవస్థ, పటిష్ట యంత్రాంగం లేకపోవడం కొలీజియం వ్యవస్థలో ప్రధాన లోపం. ఈ విషయం ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడైంది. 1999 నుంచి 2007 వరకు వివిధ హైకోర్టులకు జరిపిన 350కి పైగా న్యాయమూర్తుల నియామకాల్లో ప్రధాన న్యాయమూర్తి కొలీజియాన్ని సంప్రదించలేదన్నది వాస్తవం. ఈ పరిస్థితులను అధిగమించే మెరుగైన ప్రత్యామ్నాయ మార్గమే జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ .

జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్:
జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ (నేషనల్ జుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్-ఎన్.జె.ఎ.సి) బిల్లు-2014ను ఆగస్టు 13న లోక్‌సభ, ఆ మరుసటి రోజునే రాజ్యసభ ఆమోదించాయి. సగానికి తక్కువ కాకుండా రాష్ట్ర శాసనసభలు ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. ఈ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడానికి 99వ రాజ్యాంగ సవరణ చేశారు.

కమిషన్- నిర్మాణం- అధికరణ 124 ఎ:
జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ (ఎన్.జె. ఎ.సి.) లో మొత్తం ఆరుగురు సభ్యులు ఉంటారు.
 • కమిషన్‌కు చైర్మన్‌గా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తారు.
 • సుప్రీం కోర్టులోని ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు.
 • మరో సభ్యుడు కేంద్ర న్యాయశాఖ మంత్రి
 • ఇద్దరు ప్రముఖులు పౌర సమాజం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. వీరిలో ఒకరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అల్ప సంఖ్యాక వర్గానికి చెందినవారై ఉండాలి. లేకపోతే మహిళ అయి ఉండాలి. ఈ ఇద్దరు సభ్యులను ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న కమిటీ ఎంపిక చేస్తుంది. ప్రధాని అధ్యక్షతన ఉన్న ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు సభ్యులుగా ఉంటారు. పౌర సమాజం నుంచి ఎన్నికైన ప్రముఖుల పదవీకాలం మూడేళ్లు. వీరిని ఒకసారి మాత్రమే నియమించాలి. పునర్‌నియామకానికి అర్హులు కారు.
ఎన్.జె.ఎ.సి - విధులు (ప్రకరణ 124 బి):
 • సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల నియామకానికి కమిషన్ సిఫారసులు చేస్తుంది.
 • హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల బదిలీల్లో చొరవ తీసుకుంటుంది.
 • ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల ఖాళీలను గుర్తించి ప్రభుత్వానికి తెలియజేస్తుంది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక పద్ధతి:
 • సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపార అనుభవం గల సీనియర్ న్యాయమూర్తినే నియమిస్తారు.
 • ప్రకరణ 124(బి) ప్రకారం సమర్ధత, ప్రతిభ ఉన్నవారినే ఇతర న్యాయమూర్తులుగా నియమించాలి.
 • కమిషన్‌లోని ఏ ఇద్దరు సభ్యులు అంగీకరించకపోయినా, అలాంటి వారిని న్యాయమూర్తిగా నియమించేందుకు వీలులేదు.
హైకోర్టు న్యాయమూర్తుల నియామకం:
 • ప్రధాన న్యాయమూర్తిగా నియమించడానికి సీనియారిటీతోపాటు, సమర్ధత, ప్రతిభ పరిగణనలోకి తీసుకుంటారు.
 • హైకోర్టు ఇతర న్యాయమూర్తులను 217(2) ప్రకారం నియమిస్తారు. ఈ సందర్భంలో ఇద్దరు ఇతర సీనియర్ న్యాయమూర్తులను, న్యాయవాదులను ప్రధాన న్యాయమూర్తి సంప్రదించాలి.
 • సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్‌లను కూడా ఎన్‌జేఏసీ సంప్రదించాల్సి ఉంటుంది.
 • హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల బదిలీ విషయంలోనూ రాష్ట్రపతి నేషనల్ జుడీషియల్ అపాయింట్‌మెంట్ కమిషన్ (ఎన్‌జేఏసీ)ని సంప్రదించాల్సి ఉంటుంది. కమిషన్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా ఆ నిర్ణయం మేరకు వ్యవహరించాల్సి ఉంటుంది.
సవరణలు- వాస్తవిక పరిష్కారాలేనా?
అత్యున్నత స్థాయి న్యాయమూర్తుల నియామక విషయంలో వ్యక్తులు కేవలం న్యాయ పారంగతులు, నిష్ణాతులయితే సరిపోదు. నడత, నిబద్ధత, సామాజిక స్పృహ, మచ్చలేని గత చరిత్ర ఉండాలి. వీటిని అంచనావేయడానికి కొలమానాలు, సమర్థ యంత్రాంగం అవసరం. కొలీజియం విధానంలో ఇవి ప్రధాన పరిమితులు. కాగా నూతన పద్ధతి ఎన్.జె.ఎ.సి.లో వీటిని ఆశించవచ్చు. న్యాయమూర్తుల నియామకంలో జవాబుదారీతనం, పారదర్శకత కీలకమైనవి. జాతీయ కమిషన్ ఏర్పాటు ద్వారా దిద్దుబాటు చర్యలకు మార్గం సుగమమవుతుంది.
 • ‘న్యాయమూర్తుల నియామకం కేవలం న్యాయవ్యవస్థకు పరిమితం చేయకుండా ప్రభుత్వానికి ఇందులో చోటు కల్పించడం, సమాజ ప్రతినిధులుగా ఇద్దరు ప్రతినిధులను నియమించడం సమంజసమే. కానీ దీనివల్ల న్యాయమూర్తుల స్వతంత్ర ప్రతిపత్తి దెబ్బతింటుంది’ అని ప్రముఖ న్యాయవాది నారీమన్ వ్యాఖ్యానించారు.
 • రాజకీయ, ఆశ్రీత పక్షపాతం, అవినీతికి తావులేకుండా విజ్ఞానం, ప్రతిభ, గొప్ప వ్యక్తిత్వం, నిబద్ధత ఉన్నవారిని నియమించడంతోపాటు, ఆ ప్రక్రియను పారదర్శకం చేయడం అవసరం. అలాగే న్యాయవ్యవస్థను సమగ్రంగా, సంపూర్ణంగా సంస్కరించడం అనివార్యం. న్యాయం చేయడమే కాదు..న్యాయం చేస్తున్నట్లు కనిపించాలని పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయమూర్తుల నియామకాల్లో జరుగుతున్న జాప్యం వల్ల తలెత్తుతున్న పరిణామాలను ఈ బిల్లు పరిగణనలోకి తీసుకోవడం శుభపరిణామం. దేశవ్యాప్తంగా 24 హైకోర్టులలో మూడు వందలకు పైగా ఖాళీలున్నాయి. వెంటవెంటనే నియామకాలు చేపట్టకపోవడంతో అపరిష్కృత కేసుల సంఖ్య పెరిగిపోయింది.
పదిలం... వ్యవస్థపై నమ్మకం:
ఆలస్యమైన న్యాయం అన్యాయంతో సమానం (Justice delayed is Justice denied). అలాని తొందరపాటు కూడా మంచిది కాదు. (Justice hurried is justice burried). సత్యాన్ని కూడా గుర్తుంచుకొని మధ్యేమార్గాన్ని అనుసరించడం శ్రేయస్కరం.సమన్యాయ పాలన, జనస్వామ్యం వర్ధిల్లాలంటే స్వతంత్ర, సర్వోన్నత నిష్పాక్షిక న్యాయ వ్యవస్థ తప్పనిసరి. 98 శాతం ప్రజలకు ఉన్నత న్యాయస్థానాలపై నమ్మకం ఉందని ఈ మధ్యనే ఓ సర్వేలో వెల్లడైంది. ఇతర విభాగాలైన శాసన, కార్యనిర్వాహక శాఖలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోందనేది కఠోర వాస్తవం. సత్యమేవ జయతే.

99 రాజ్యాంగ సవరణ-ముఖ్యాంశాలు
 • కొత్తగా చేర్చిన ప్రకరణలు: 124(ఎ), 124 (బి), 124 (సి)
 • 124(ఎ): జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ నిర్మాణం
 • 124(బి): జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ విధులు
 • 124 (సి): నియామక ప్రక్రియకు సంబంధించి పార్లమెంట్‌కు చట్టాలు చేసే అధికారం కల్పించడం
 • సవరించిన ప్రకరణలు: 124, 127, 128, 217, 222, 224, 224(ఎ), 231
Published date : 28 Aug 2014 05:41PM

Photo Stories