Skip to main content

భూసేకరణ చట్టం – సమీక్ష

ప్రజా ప్రయోజనాల కోసం చేసే భూసేకరణ (Land Acquisition) లో దశాబ్దాల తరబడి రైతులకు అన్యాయం జరుగుతోంది. పరిహారం పేరుతో వారికి చెల్లించే డబ్బు మార్కెట్ ధర కంటే ఎంతో తక్కువగా ఉండేది. ఆ స్వల్ప పరిహారం చెల్లింపులో కూడా విపరీత జాప్యం చేసేవారు. భూముల కొనుగోలుదారులు నానాటికీ అభివృద్ధి చెందుతుంటే, భూములు కోల్పోయినవారు పేదరికంలో మిగిల్చేరీతిలో భూసేకరణ విధానం కొనసాగుతోంది.

1990 దశకం నుంచి కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణల ప్రభావం వల్ల అభివృద్ధి ప్రక్రియల్లో అనేక పరిమాణాత్మ, గుణాత్మక మార్పులు సంభవించాయి. మౌలిక సదుపాయాల రంగంలో అవసరమైన భారీ పెట్టుబడులకు ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని ఆహ్వానించింది. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ప్రాజెక్టులను చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుల్లోనూ భూయజమానులు తీవ్రంగా అన్యాయాలకు గురవుతున్న ఉదంతాలు లెక్కకు మించి ఉన్నాయి. 12 వ పంచవర్ష ప్రణాళికలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనివ్వడమే కాకుండా 2020 నాటికి 60 లక్షల కోట్లను మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు చేయాలన్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి గాను పెద్ద ఎత్తున భూసేకరణ అవసరమవుతోంది. అందువల్ల ఈ ప్రక్రియలో సామాన్య రైతులు, ప్రజలు నష్టపోకూడదన్న మహోన్నత ఆశయంతో భూసేకరణ mచట్టాన్ని రూపొందించారు. నూతన భూసేకరణ చట్టంలోని సానుకూల ప్రతికూల అంశాలను సమీక్షిద్దాం.

సానుకూల అంశాలు: (Favourable points)
ఆహార భద్రత
: ఇప్పటి వరకు సారవంతమైన భూములను వివిధ కారణాలు, ఒత్తిళ్ల వల్ల ఇతర అవసరాల కోసం యథేచ్ఛగా సేకరిస్తూ వస్తున్నారు. అయితే నూతన చట్టం వ్యవసాయ భూమిని సేకరించేటప్పుడు ఆహార భద్రతకు భంగం కలగకుండా చూడాలని నిర్దేశిస్తోంది. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ఎలాంటి పరిస్థితులలోనూ రెండు మూడు పంటలు పండే సారవంతమైన భూములను, నీటి పారుదల సదుపాయాలు గల భూములను సేకరించరాదు. దీనివల్ల సారవంతమైన భూములను ఇతర అవసరాలకు సేకరించకుండా అడ్డుకట్టపడుతుంది.

బాధితుల అంగీకారం: 1894 చట్టంలో భూసేకరణలో బాధితుల అంగీకారానికి చోటు లేదు. కానీ తాజా చట్టంలో ప్రైవేటు కంపెనీలకు భూసేకరణ చేసేటప్పుడు 80 శాతం వరకు, పబ్లిక్ ప్రైవేటు ప్రాజెక్టులకు నిర్వాసితుల్లో 70 శాతం మంది అంగీకారం తప్పనిసరి. దీనివల్ల భూమిని బలవంతంగా సేకరించడం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు.

నష్టపరిహారం: 1894 చట్టంలో నష్టపరిహారంగా మార్కెట్ విలువనే ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. అయితే నూతన చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 4 రెట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు ఎక్కువ పరిహారం చెల్లించాలి. దీనివల్ల సంబంధిత భూయజమానులకు సరైన న్యాయం జరుగుతుంది.

మార్కెట్ విలువ: 1894 చట్టం ప్రకారం ప్రస్తుతం ఆ భూమి నిరుపయోగత, ముందుగా ఊహించని వినియోగం ఆధారంగా భూమి మార్కెట్ విలువను ఖరారు చేసేవారు. నూతన భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ సమయంలో సంబంధిత భూమికి సంబంధించి మార్కెట్ విలువను నిర్ణయించడానికి బేసిక్ ధరకు మూడు రెట్లు లేదా గత మూడు సంవత్సరాలలో జరిగిన భూ లావాదేవీల్లో అత్యధిక విక్రయధర ఆధారంగా వీటిలో ఏది ఎక్కువయితే దానిని పరిగణనలోకి తీసుకోవాలి. దీనివల్ల భూయజమానులకు న్యాయబద్ధమైన ప్రయోజనం చేకూరుతుంది.

సామాజిక ప్రభావం అంచనా: 1894 చట్టంలో సామాజిక ప్రభావ అంచనా నిబంధనే లేదు. కానీ నూతన భూసేకరణ చట్టంలో ప్రతి సేకరణ విషయంలో సామాజిక ప్రభావ అంచనా తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ నిబంధనతో నిర్దేశిత భూసేకరణ వల్ల సమాజంపై ప్రతికూల ప్రభావం కలుగుతుందని అంచనా వేస్తే సేకరణ చేపట్టరాదు.

భూమి తిరిగి విక్రయిస్తే అనుమతి తప్పనిసరి: 1894 నాటి చట్టంలో భూమి తిరిగి విక్రయించే అంశం ప్రస్తావనే లేదు. అయితే నూతన చట్టం ప్రకారం భూ యజమాని నుంచి కొనుగోలు చేసిన భూమిని తిరిగి విక్రయించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. దీనివల్ల భూ విక్రయాల్లో పారదర్శకత చోటు చేసుకుంటుంది.

లాభాల పంపిణీ: 1894 చట్టంలో లాభాల పంపిణీ విషయానికి సంబంధించి ఎటువంటి ప్రతిపాదన లేదు. నూతన చట్టం ప్రకారం సేకరించిన భూమిని తిరిగి విక్రయించాలంటే 40 శాతం లాభాలను ఆ భూ యజమానులతో పంచుకోవాల్సి ఉంటుంది. ఇది భూయజమానులకు అత్యంత ప్రయోజనకరమైన నిబంధన.

100 శాతం తాత్కాలిక పరిహారం: అసౌకర్యానికి గురికావడం, గాయపడడం లేదా ఇతరత్రా కలిగిన నష్టాలకు 30 శాతం తాత్కాలిక పరిహారంగా చెల్లించాలని 1894 నాటి చట్టం నిర్దేశిస్తోంది. అయితే కొత్త భూసేకరణ చట్టం ప్రకారం తాత్కాలిక పరిహారం 100 శాతం చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల భూ యజమానులకు గతంలో కంటే మూడు రెట్లు అధిక ప్రయోజనం చేకూరుతుంది.

భూ బ్యాంకులో జమ: భూ సేకరణ జరిగిన తర్వాత భూమిని ఉపయోగించకుండా ఖాళీగా ఉంచితే, ఆ భూమిని తిరిగి సొంతదారుకు అప్పగించడం లేదా రాష్ట్ర భూ బ్యాంకుకు జమచేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ప్రాజెక్టుల్లో జాప్యానికి తెరపడుతుంది. భూమి సేకరించినవారు నిర్లిప్తంగా ఉండకుండా వెంటనే ప్రాజెక్టును పట్టాలెక్కించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రాజెక్టు ఫలితాలు సత్వరమే లభిస్తాయి.

ఎస్సీ, ఎస్టీలకు మరింత ప్రయోజనం: నూతన చట్టంలో ఎస్సీ, ఎస్టీలపై ప్రత్యేక శ్రద్ధ చూపించటం జరిగింది. ప్రాజెక్టుల నిర్మాణం సందర్భంగా భూమిని కోల్పోయే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి భూమికి భూమినే నష్టపరిహారంగా ఇవ్వాలని చట్టం నిర్దేశిస్తోంది. భూసేకరణ వల్ల ప్రభావితమయ్యేవారు ఈ వర్గాలవారైతే వారిని మరో జిల్లాకు తరలించాల్సి వస్తే అదనంగా 25 శాతం పునరావాసం పరిహారం చెల్లించాలి. ఏక మొత్తంగా చెల్లించాల్సిన రూ.50 వేలకు ఇది అదనం.

సమగ్ర పరిహార ప్యాకేజీ: భూసేకరణ జరిగే సందర్భంలో భూమికి భూమి కేటాయించాలి. ఇళ్లు మంజూరు చేయాలి. ఉపాధిని కల్పించాలి. అదేవిధంగా భూమికి ఏక మొత్తంలో చెల్లించిన నగదుకు అదనంగా జీవితాంతం వడ్డీలాంటి ప్రయోజనాలను కల్పించాలి.

గత అన్యాయాలకు పరిహారం: గతంలో జరిగిన అన్యాయాలను, నష్టాలను సరిదిద్దడంలో భాగంగా గతంలో భూసేకరణ జరిగి నష్టపరిహారం లభించని వారికి ఇప్పుడు పరిహారం అందించాలని నూతన చట్టం పేర్కొనడం విశేషం. చారిత్రక అన్యాయాలకు ఈ చట్టం పరిష్కారం చూపుతుంది.

పరిహారం తర్వాతే సేకరణ: నష్ట పరిహారం పూర్తిగా చెల్లించేంతవరకు పునరావాసానికి, ప్రత్యామ్నాయ స్థలాలను సిద్ధం చేసేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ భూసేకరణ జరపడానికి వీల్లేదని నూతన చట్టంలో పేర్కొన్నారు.

జీవనోపాధికీ పరిహారం: భూసేకరణ వల్ల జీవనోపాధిని కోల్పోయిన వారికి నెలకు రూ.3000 చొప్పున మొదటి సంవత్సరం అందించాలి. ఆ తరువాతి ఏడాది నుంచి 20 సంవత్సరాల పాటు నెలకు రూ.2000 నష్ట పరిహారాన్ని అందించాలి. ఇప్పటి వరకు ఉన్న చట్టంలో జీవనోపాధి పరిహారం ప్రస్తావనే ఉండేది కాదు.

గృహానికి గృహం: భూసేకరణ వల్ల ఇల్లు కోల్పోయినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 100 చదరపు మీటర్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే 50 చ.మీ.ల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించి ఇవ్వాలి.

ఆయకట్టులో వాటా: సాగునీటి ప్రాజెక్టుల కోసం భూమిని సేకరిస్తే సాగులోకి వచ్చే ఆయకట్టు పరిధిలో ఒక్కో కుటుంబానికి ఒక ఎకరం భూమిని ఇవ్వాలి. అలాగే ప్రతీ ప్రాజెక్టులోనూ ఒక్కో షెడ్యూల్డ్ తెగ కుటుంబానికి ఒక ఎకరం భూమిని ఇవ్వాలి. ప్రతి నిర్వాసిత కుటుంబంలో ఒకరికి తప్పనిసరిగా ఉద్యోగాన్ని ఇవ్వాలి.

సేకరణ అనంతర ప్రయోజనం: సేకరణ వల్ల భూమి కోల్పోయిన వారిని సేకరణ అనంతరం జరిగే అభివృద్ధిలో భాగస్వాములను చేయడం, వారి సామాజిక, ఆర్థిక స్థాయిని మెరుగుపర్చడం నూతన చట్టంలోని అత్యంత సానుకూల అంశం.

పునరావాసానికి చట్టబద్ధత: ఇప్పటి వరకూ ఉన్న చట్టాలు ప్రధానంగా భూములు కోల్పోయే వారికిచ్చే నష్ట పరిహారాన్ని గురించి మాత్రమే ఉండగా కొత్త చట్టంలో పునరావాస, పునర్నిర్మాణ అంశాలను చేర్చడం విశేషం. నూతన చట్టం ద్వారా భూసేకరణతో పాటు పునరావాసానికి కూడా చట్టబద్ధత కల్పించినట్లయింది.

ఉమ్మడి జాబితా: నూతన చట్టం ఉమ్మడి జాబితాలో ఉంటుంది. కేంద్రం ఉద్దేశం దెబ్బతినకుండా ఈ అంశంపై రాష్ట్రాలు సొంతంగా చట్టం తీసుకురావచ్చు. అంటే రాష్ట్రాలకు తగినంత స్వేచ్ఛ లభించి తమ అవసరాలకు అనుగుణంగా చట్టాలను రూపొందించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తుంది.

విమర్శలు లేదా ప్రతికూల అంశాలు:
నూతన భూసేకరణ చట్టంపై వామపక్షాలు, పారిశ్రామిక వర్గాలు, ప్రైవేటు యాజమాన్యాలు, రియల్టర్ల నుంచి అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.

బ్యూరోక్రాటిక్ అవరోధాలకు ఆజ్యం: రైతులకు మేలు చేస్తున్నామన్న ముసుగులో ఈ భూసేకరణ చట్టం , భూసేకరణ ఆమోదానికి జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిలలో కమిటీల రూపంలో అన్ని రకాల బ్యూరో క్రాటిక్ (ఉద్యోగిస్వామ్యపరమైన) అవరోధాలను సృష్టిస్తుంది. ఉదాహరణకు ప్రాజెక్టుకు సంబంధించిన భూమిసేకరణ జరిపేటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సభలతో కలసి, పట్టణ ప్రాంతాల్లో అటువంటి ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థ తోడ్పాటుతో సామాజిక ప్రభావ అంచనా సర్వే నిర్వహించవలసి ఉంటుంది. అలా సిద్ధం చేసిన నివేదికను నిపుణుల బృందం ఒకటి అధ్యయనం చేస్తుంది. ఆ బృందంలో సామాజిక శాస్త్రవేత్తలు ఇద్దరుంటారు. వారు అనధికారులై ఉంటారు. వారు అధ్యయనం చేయడంతో పని పూర్తి కాదు. దాన్ని నిర్దేశించిన నిబంధనల మేరకు భూసేకరణ జరిగిందా లేదా అన్న అంశాన్ని మరో కమిటీ పరిశీలిస్తుంది. దీనివల్ల ప్రాజెక్టుకు భూసేకరణ చేపట్టడం అత్యంత సంక్లిష్టంగా మారుతుంది.

ఆర్థిక కార్యాకలాపాల స్తంభన: సామాజిక ప్రభావ అంచనాలు, పునరావాస నిబంధనల వల్ల ఏ కాస్త భూమిని సేకరించాలన్నా అసాధ్యమనిపించే పరిస్థితులు ఏర్పడతాయి. ఫలితంగా రైతుకి లాభం జరగదు. ఆర్థిక కలాపాలు ఏళ్ల తరబడి స్తంభించిపోతాయి. దేశం 1970 ల నాటి లైసెన్స్ పర్మిట్ వ్యవస్థలోకి దిగజరాపోతుంది.

80 శాతం ఆమోదం కష్టం: ఆమోదం ఏదైనా పరిశ్రమకు భూమిని సేకరిస్తున్నప్పుడు ఆ భూయజమానుల్లో మెజారిటీ ఆమోదాన్ని పొందాలనడం బాగానే ఉన్నప్పటికీ, పరిశ్రమ ఏర్పాటయ్యే ప్రాంతంలోని ప్రజల్లో 80 శాతం మంది ఆమోదం లభించాల్సిన అవసరం ఉంది. ఎనభై శాతం మంది సంసిద్ధత వ్యక్తం చేస్తేనే సేకరణ చేపట్టాలంటే వాస్తవికంగా చాలా కష్టం. ఇది ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టుల్లో పాల్గొనే విషయంలో ప్రైవేటు భాగస్వాములకు నిరుత్సాహం కలిగిస్తుంది. అనుమతుల మంజూరు అత్యంత కష్టసాధ్యమవుతుంది.

ఘర్షణలకు రాచమార్గం: పరిశ్రమ కోసమని భూమి తీసుకున్నప్పుడు నేరుగా నష్టపోయేది ఆ భూయజమానే అయినా ఆ పరిశ్రమ మున్ముందు వెదజల్లే కాలుష్యం వల్ల బాధితులయ్యేది ఆ ప్రాంత ప్రజలందరూ అని గుర్తుంచుకోవాలి. ఫలితంగా భూయజమానులంతా ఆమోదం తెలిపినా ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తే(సామాజిక ప్రభావ అంచనా సర్వేలో) మళ్లీ అది ఘర్షణలకే దారితీస్తుంది. కొత్త చట్టం ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా చూడాల్సింది పోయి ఈ నిబంధన ద్వారా వాటికి తలుపులు తెరిచే ఉంచింది.

ఎమర్జెన్సీ నిబంధనతో మొదటికే మోసం: చట్టంలో ప్రజాప్రయోజనం అనే పదానికి భాష్యం చెప్పినా అది సంపూర్ణంగా ఉన్నట్టు కనిపించట్లేదు. ప్రజా ప్రయోజనంలో గనులు, మౌలిక సదుపాయాలు, రక్షణ, తయారీ రంగం, రోడ్లు, రైల్వే మొదలుకొని విద్యా, వైద్య, పరిశోధన సంస్థల వరకు ఉన్నాయి. Emergency Clause కింద ఏ భూమినైనా ప్రభుత్వం తీసుకోవచ్చన్న వెసులుబాటు పెట్టారు. అధికారంలో ఉన్నవారు తలచుకుంటే ఈ క్లాజు కిందకు రానిది ఏమీ ఉండదు.

సామాజిక ప్రభావ అంచనాతో సంక్లిష్టత: ప్రజోపయోగ, సామాజిక ఆస్తులు, మౌలిక వసతుల విషయంలో సామాజిక ప్రభావాన్ని అంచనా వేసే ప్రయత్నంలో గ్రామ సభలకు ప్రమేయం ఉండాలని చట్టం నిర్దేశిస్తోంది. ఈ ప్రతిపాదన ప్రాజెక్టులకు అనుమతుల మంజూరులో సంక్లిష్ట విధానాలకు కారణమవుతుంది.

ఆర్థిక భారం: మార్కెట్ విలువను బట్టి గ్రామీణ ప్రాంతాల్లో భూయజమానులకు నాలుగు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు అధికంగా పరిహారం చెల్లించాలని చట్టం చెబుతోంది. దీనివల్ల గ్రామీణ భూమి ధర పెరిగిపోయి ప్రాజెక్టు వ్యయం ఎనిమిది రెట్లు అధికమవుతుంది. ఫలితంగా ఇప్పుడున్న ధరల వ్యవస్థ అస్తవ్యవస్తమవుతుంది. దీనికి తోడు సహాయ, పునరావాస బాధ్యతలు తప్పవు.

సూక్ష్మ తరహా పెట్టుబడులకు శరాఘాతం: పట్టణ ప్రాంతాల్లో 50 ఎకరాలు, గ్రామీణ ప్రాంతాల్లో 70 ఎకరాల భూ వసతి అవసరమైన అన్ని ప్రాజెక్టుల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు తప్పనిసరి అని చట్టం నిర్దేశిస్తోంది. అయితే చిన్న ప్రాజెక్టులను చేపట్టే పెట్టుబడిదారులకు ఇది మరింత భారమవుతుంది. ఎందుకుంటే ఇప్పటికే వారు భూసేకరణపై పెద్ద మొత్తం ఖర్చు చేసి ఉంటారు. ఫలితంగా సహాయం, పునరావాస భారం వల్ల ఖర్చు మూడు రెట్లు పెరుగుతుంది.

మినహాయింపులతో బూడిదలో పోసిన పన్నీరే: నూతన భూసేకరణ చట్టాన్ని భారీ భూసేకరణతో కూడుకున్న గనుల చట్టం, బొగ్గు, ఇతర ఖనిజాలు గల ప్రాంతాల భూ సేకరణ చట్టం, భారతీయ రైల్వే చట్టం, జాతీయ రహదారుల చట్టం, తదితర 13 చట్టాలకు వర్తింపజేయకుండా చేశారు. ఈ చట్టాన్ని అతి ఎక్కువ విస్తీర్ణంలో భూ సేకరణ గావించే సందర్భాలకు అమలు చేయకపోతే ప్రజలకు ఒరిగేదేమి ఉండదు. ఇప్పటి వరకూ ప్రభుత్వాలు చేసిన భూ సేకరణలో 95 శాతం భూమిని పైన పేర్కొన్న ఆ 13 చట్టాల ద్వారానే చేశారని నిపుణుల అంచనా. పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా ఎలాంటి మినహాయింపులనూ ఇవ్వొద్దనీ, ఆ 13 చట్టాలను కూడా ఇప్పుడే సవరించేయాలని సిఫార్సు చేసింది. కానీ అమలుకు నోచుకోలేదు ప్రైవేటు ప్రయోజనాలకే: నిజానికి ప్రైవేటు పరిశ్రమలకు, వారి ఇతర కార్యకలాపాలకు ప్రభుత్వం భూమిని సేకరించి ఇవ్వనక్కర్లేదు. పారిశ్రామికవేత్తలు, ప్రైవేటు యాజమాన్యాలు తమకు కావల్సిన భూమిని రైతు నుంచి కొనుక్కోవచ్చు. కానీ ప్రభుత్వం ప్రైవేటు వారికి 'ప్రజా ప్రయోజనం' పేరిట భూమిని సేకరించి కట్టబెట్టాలంటోందని వామపక్షాల విమర్శ.

PPP అంటే ప్రైవేటే: ఈ చట్టంలో పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యం (Public-Private Partnership) తో ఏర్పాటయ్యే వాటికీ ప్రభుత్వమే భూమిని సేకరిస్తానని చెప్పింది. నిజానికి PPP అనేది ప్రైవేటుకు మారుపేరు తప్ప వేరేమీ కాదు. అందుకే పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా ప్రభుత్వం కేవలం సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, రైల్వే లైన్లు వంటి మౌలిక వసతులకు, బడి, ఆసుపత్రి వంటి సామాజిక అవసరాలకు మాత్రమే భూ సేకరణ జరపాలన్న సవరణను సిఫార్సు చేసింది.

పారిశ్రామిక వేత్తలకు నిరుత్సాహం: యువత మహిళలు ఉపాధి అవకాశాల కోసం సతమతమవుతూ దేశంలో మౌలిక సదుపాయాలు, ఉత్పత్తిరంగం నిర్వీర్యమైపోయి ఉన్న ప్రస్తుత తరుణంలో సవాళ్లను స్వీకరించి, పరిశ్రమలు, ఇతర ఆర్థిక సాహసాలు చేసేందుకు ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో ముందుకొచ్చేలా ప్రోత్సాహన్నందించే చట్టాలుండాలి. ప్రస్తుతం భూసేకరణ చట్టం ఆ విధంగా లేదు. పారిశ్రామిక వేత్తలకు ముందరికాళ్లకు బంధం వేస్తూ కోట్లాది యువత ఆశలను నీరుగార్చేలా ఉంది.

లోపాలమయం: ఇప్పుడున్న చట్టంతో పోల్చితే నూతన చట్టం మెరుగ్గా ఉన్నప్పటికీ ఇంకా లోపాలున్నాయి. లోపాల కారణంగా చట్టం లక్ష్యం నెరవేరదు. బలవంతపు భూసేకరణ కొనసాగే ప్రమాదం ఉంది.

ఎలా ఉండాలి ? (Act would be like this)
భారత్ లో పరిమిత భూమి ఉంది. ప్రపంచంలో ఉన్న వ్యవసాయ భూమిలో 11 శాతం(సుమారు 40 కోట్ల ఎకరాలు) మనదేశంలో ఉంది. ప్రత్యేక ఆర్థిక మండళ్ల కోసం ఇప్పటి వరకు సేకరించిన భూమి 2,00,000 ఎకరాలు మాత్రమే. పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధికి కావాల్సిన భూమి అందుబాటులో ఉన్న భూమిలో 1 శాతంలోపు మాత్రమే ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో భూసేకరణ విధానం భూమిని కోల్పోయే రైతులను విజేతలుగా నిలబెడుతూ, పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధి, పట్టణీకరణ, ఆర్థికాభివృద్ధి భూమిని త్వరితంగా అందుబాటులోకి తెచ్చేదిగా ఉండాలి. రైతులకు మార్కెట్ ధర కంటే కూడా కొన్ని రెట్లు ఎక్కువ పరిహారం వచ్చేలా చట్టంలో హామీ ఉండాలి. భూమిని కోల్పోయిన రైతుల పిల్లలకు నైపుణ్యాలు, భూసేకరణ తర్వాత చేపట్టే ఆర్థిక కలాపాల్లో ఉద్యోగావకాశాలను కల్పించాలి. ఒకసారి ఒక ప్రాజెక్టు కోసం భూమిని సేకరించాక దాని విలువ శరవేగంగా పెరుగుతుంది. ఒక్కోసారి 100 రెట్లకు పైగా కూడా పెరగవచ్చు. ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని, ఏ ప్రాజెక్టు కోసమైనా అవసరమైన దానికంటే రెట్టింపు భూమిని సేకరించాలి. అభివృద్ధి చేశాక అందులో సగం భూమిని రైతులకు తిరిగి ఇవ్వాలి. అటువంటి విధానం వల్ల రైతులు పరిహారంతో పాటు అనేక రెట్లు ఎక్కువ విలువ ఉన్న అభివృద్ధి చేసిన భూమిని కూడా పొందగలుగుతారు. నూతన భూసేకరణ చట్టం 2013లో లోపాలు లేకపోలేదు. చట్టంపై అభ్యంతరలూ ఉన్నాయి. అయితే ఉన్నంతలో ఈ చట్టం ప్రజలకు, రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.

భూసేకరణ చట్టం – విహంగ వీక్షణం: (Land Acquisition Act - Aerial view)
భూసేకరణ కొత్త బిల్లు ఆమోదం పొందింది. 118 సంవత్సరాల క్రితం రూపొందించిన భూసేకరణ చట్టం స్థానంలో నూతన చట్టం వచ్చింది. భూసేకరణ వల్ల భూమి కోల్పోయిన వారిని జరిగే అభివృద్ధిలో భాగస్వాములను చేయడం, వారి సామాజిక, ఆర్థిక స్థాయిని మెరుగుపరచడం లక్ష్యంగా రూపొందించిన చారిత్రాత్మక భూసేకరణ బిల్లు 2012కు ఉభయ సభలు ఆమోదించడం, తదుపరి రాష్ట్రపతి సంతకం చేయడంతో బిల్లు చట్టంగా మారింది. ఈ చట్టాన్ని అమలు చేయడానికి నిబంధనలు రూపొందించి ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిష్కరించాక 2014లో గెజిట్‌లో ప్రకటిస్తారు.

పారిశ్రామిక అవసరాల కోసం భూమిని సేకరించేటప్పుడు భూమిని అప్పగించే కుటుంబాలకు న్యాయబద్ధమైన పరిహారం ఇవ్వడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం. ఈ చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని భూమికి మార్కెట్ విలువకన్నా నాలుగు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో మార్కెట్ విలువకు రెండు రెట్లు పరిహారం ఇస్తారు. భూమిని కోల్పోయినా తదుపరి దశలో ఆర్థికంగా, సామాజికంగా వారి హోదా మరింత మెరుగయ్యేందుకు ఇది దోహదపడుతుంది. చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే వ్యవసాయ భూములు, ఎక్కువ పంటలు పండించే భూముల సేకరణ జరగాలని కొత్త చట్టం పేర్కొంటోంది.

నూతన భూసేకరణ చట్టంలోని ముఖ్యాంశాలు పరిశీలిద్దాం.
భూసేకరణ: ( Land Acquisition)
ఎ. సొంతంగా వినియోగించేందుకు, తన ఆధీనంలో ఉంచుకుని నియంత్రించేందుకు, ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రజా ప్రయోజనాల నిమిత్తం భూమిని సేకరిస్తుంది.
బి. ప్రైవేటు కంపెనీల కోసం భూమిని సేకరించదలిస్తే, బాధిత కుటుంబాల్లో కనీసం ఎనభై శాతం కుటుంబాల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి.
సి. ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టుల కోసం భూమిని సేకరించదలిస్తే, కనీసం 70 శాతం బాధిత కుటుంబాల నుండి ముందస్తు అనుమతి అవసరం.
డి. బాధిత కుటుంబాల ముందస్తు అనుమతిని సంబంధిత ప్రభుత్వం నిర్దేశించిన ప్రక్రియకు అనుగుణంగా తీసుకోవాలి.
ఇ. అనుమతిని తీసుకోవడంతో పాటు సామాజిక ప్రభావ విశ్లేషణను చేపట్టాలి.
ఎఫ్. సంబంధిత షెడ్యూల్డ్ ప్రాంతంలో అమలులో ఉన్న భూ బదిలీకి సంబంధించిన చట్టాన్ని ఉల్లంఘించే రీతిలో ఏ షెడ్యూల్డ్ ప్రాంతంలోనూ సేకరణ ద్వారా భూమిని బదిలీ చెయ్యకూడదు. కోర్టు ఆదేశం లేదా తీర్పుకు సంబంధించిన భూములకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.
సామాజిక ప్రభావం, ప్రజా ప్రయోజనం నిర్ధారణ: (Effect on society and its uses to people)
ప్రజా ప్రయోజనాల నిమిత్తం తగిన అధికారాలు గల సంబంధిత పంచాయతీ, మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ ను, గ్రామ స్థాయిలో లేదా వార్డు స్థాయిలో సంప్రదించాలి. వాటితో సంప్రదించి సామాజిక ప్రభావ విశ్లేషణా అధ్యయనాన్ని ఆరు మాసాల్లోగా నిర్వహించాలి. సామాజిక ప్రభావ విశ్లేషణా నివేదికలను నిపుణుల బృందం అధ్యయనం చేయాలి. ఈ నిపుణుల బృందం స్వతంత్ర ప్రతిపత్తి గల బహుళ విభాగాలకు చెందినదై ఉండాలి.
భూసేకరణ విషయంలో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు: (Government action regarding Land Acquisition)
ఎ. ప్రతిపాదిత భూసేకరణ చట్టబద్ధమైన, హేతుబద్ధమైన ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం చూడాలి. గుర్తించిన భూమి ఆ అవసరాలను తీర్చేదిగా ఉండాలి.
బి. నిర్దేశించిన విధంగా లభించబోయే ప్రజా ప్రయోజనాలు సామాజిక వ్యయాలకు దీటుగా, ప్రతికూల సామాజిక ప్రభావాన్ని అధిగమించేదిగా ఉండాలి.
సి. చేపట్టిన ప్రాజెక్టులకు కనీస పరిమాణంలో మాత్రమే భూసేకరణ చెయ్యాలి. ఆ ప్రాంతంలో గతంలో సేకరించిన భూమిలో నిరుపయోగంగా ఉన్న ప్రాంతం ఉండకూడదు. గతంలో సేకరించిన భూమి, నిరుపయోగంగా ఉంటే ప్రతిపాదిత ప్రజా ప్రయోజనాల నిమిత్తం ఆ భూమిని ఉపయోగించాలి. దీనికి సంబంధించిన సిఫార్సులు చెయ్యాలి.
డి. భూసేకరణకు నియమించిన అధికారి ఏదైనా నివేదికను సమర్పిస్తే సంబంధిత ప్రభుత్వం ఆ నివేదికను, సామాజిక విశ్లేషణ అధ్యయనంపై నిపుణుల బృందం సమర్పించిన నివేదికను అధ్యయనం చేసి ప్రభుత్వం భూసేకరణకు సంబంధించి తగిన సిఫార్సులు చెయ్యాలి.
ఇ. నిర్వాసితుల సంఖ్య కనిష్ట స్థాయిలో ఉండేలా, మౌలిక వనరులకు, పర్యావరణానికి కనిష్ట స్థాయిలో మాత్రమే ఇబ్బందులు ఎదురయ్యేలా జాగ్రత్త వహించాలి. ప్రతికూల ప్రభావం కూడా కనిష్ట స్థాయిలో ఉండేలా ప్రభుత్వం చూడాలి.
ఆహార భద్రత పరిరక్షణకు ప్రత్యేక నిబంధన: (Special regulation for Food Safty)
ఎ. బహుళ పంటలు పండించే సేద్యపు భూమిని సాధారణ పరిస్థితుల్లో ఈ చట్టం కింద సేకరించకూడదు. కొన్ని అనివార్య, మినహాయింపు సందర్భాల్లో మాత్రమే అటువంటి భూమిని సేకరించవచ్చు. చివరి ప్రయత్నంగా మాత్రమే బహుళ పంటలు పండించే సేద్యపు భూమిని ప్రభుత్వం సేకరించాలి.
బి. రాష్ట్రంలో లేదా జిల్లాల్లో గల అన్ని ప్రాజెక్టుల నిమిత్తం సేకరించదలబెట్టిన భూమి సంబంధిత ప్రభుత్వం నోటిఫై చేసిన మొత్తం విస్తీర్ణాన్ని అధిగమించకూడదు. రాష్ట్రాలకు ప్రత్యేకించిన పరిస్థితులు, అంశాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ప్రభుత్వం నోటిఫై చేస్తుంది.
సి. బహుళ పంటలు పండించే సేద్యపు భూమిని సేకరిస్తే, అంతే మొత్తం గల సాగుచేసే అవకాశం ఉన్న బంజర భూమిని వ్యవసాయ పనులకు అనుగుణంగా అభివృద్ధి చేసి లేదా సేకరించిన భూమి విలువకు సమానమైన మొత్తాన్ని సంబంధిత ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసి ఆహార భద్రతను పెంపొందించే విధంగా వ్యవసాయానికి పెట్టుబడి పెట్టాలి.

మినహాయింపు: - (Exemption)
పైన పేర్కొన్న నిబంధనలు రైల్వేలు, హైవేలు, ప్రధాన జిల్లా రోడ్లు, సేద్యపు నీటి కాల్వలు, విద్యుత్ లైన్లు మొదలైన ప్రాజెక్టులకు సంబంధించిన అవసరాల నిమిత్తం సేకరించదలచిన భూములకు వర్తించవు.

బాధిత కుటుంబాలకు పునరావాసం, పునర్ నిర్మాణ చర్యలు: (Rehabilitation and reconstruction for effected families)
భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం నియమించిన అధికారి బాధిత కుటుంబాలకు వారి హక్కులకు అనుగుణంగా దిగువ పేర్కొన్న విధంగా పునరావాస, పునర్ నిర్మాణ(Re-settlement) సదుపాయాలు కల్పించాలి.
ఎ. నిరాశ్రయులకు గృహాల కేటాయింపు:
భూసేకరణలో భాగంగా గ్రామాల్లో ఒక ఇల్లు కోల్పోతే, ఇందిరా ఆవాస్ యోజన నిబంధనలకు అనుగుణంగా నిర్మాణమైన ఒక ఇంటిని కేటాయించాలి. కోల్పోయిన ఇల్లు పట్టణాల పరిధిలో ఉంటే, కనీసం 50 చదరపు మీటర్ల ప్లింత్ ఏరియా (గోడలతో సహా ఇల్లు కట్టిన భాగం)కు తగ్గకుండా నిర్మాణమైన ఇంటిని కేటాయించాలి. గృహాన్ని నిర్మించుకోవడానికి అవసరమైన భూమి లేని కుటుంబాలకు, వారు ఆ ప్రాంతంలో నోటిఫికేషన్ జారీ అయిన తేదీకి మూడు సంవత్సరాలకు తక్కువ కాకుండా ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉంటే ఆ కుటుంబాలకు కూడా పైన పేర్కొన్న ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వం, ప్రతిపాదించిన ఇంటిని పట్టణాల్లో నివసిస్తున్న ఒక కుటుంబం తీసుకోవడానికి సుముఖత చూపకపోతే, వారికి గృహ నిర్మాణ నిమిత్తం ఒకేసారి చెల్లించే ఆర్థిక సాయం అందజేయాలి. ఆ సహాయం లక్షన్నర రూపాయలకు తక్కువ కాకుండా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా బాధిత కుటుంబం గృహాన్ని కోల్పోతే, ఆ కోల్పోయిన గృహం విలువకు సమానమైన మొత్తాన్ని నిర్మితమైన ఇంటికి ప్రత్యామ్నాయంగా చెల్లించాలి. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం ఏ ఒక్క బాధిత కుటుంబానికి ఒకటి కంటే ఎక్కువ ఇళ్లకు కేటాయించరాదు.

బి. భూమికి భూమి:
సేద్యపు నీటి ప్రాజెక్టు నిర్మాణ నిమిత్తం భూమిని సేకరిస్తే, ఆ ప్రాంతంలో వ్యవసాయ యోగ్య భూమి ఉండి దానిని ప్రభుత్వ సేకరిస్తే లేదా కోల్పోతే లేదా ఆ సేకరణ ఫలితంగా చిన్న వ్యవసాయదారుడిగా లేదా భూమిలేని కుటుంబంగా మారితే ప్రతి ఒక్క బాధిత కుటుంబంలోని ప్రతి ఒక్క సభ్యుని పేరున ప్రాజెక్టు కమాండ్(ఆయకట్టు) ప్రాంతంలో కనీసం ఒక ఎకరం భూమి కేటాయించాలి. ప్రతి ప్రాజెక్టులో భూమిని కోల్పోయిన షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీలు) లేదా షెడ్యూల్డ్ తెగల(ఎస్టీలు)కు చెందిన కుటుంబాలకు సేకరించిన భూమికి సమానంగా లేదా రెండున్నర ఎకరాల భూమిని (రెండిటిలో ఏది తక్కువైతే అది) కేటాయించాల్సి ఉంటుంది.

సి. అభివృద్ధి చేసిన భూమి కేటాయింపు:
భూమిని పట్టణీకరణ నిమిత్తం సేకరిస్తే, అభివృద్ధి చేసిన భూమిలో 20 శాతం విస్తీర్ణాన్ని రిజర్వ్ చేసిన బాధిత కుటుంబాలకు ఇవ్వాలి. కోల్పోయిన భూమి, సేకరించిన భూమి విలువ, అభివృద్ధి వ్యయం నిష్పత్తిలో ఈ కేటాయింపు జరుగుతుంది. ఈ ప్రతిపాదనను బాధిత కుటుంబాలు ఆమోదిస్తే, నష్ట పరిహారం ప్యాకేజీ నుండి భూమి విలువ, సేకరణ, అభివృద్ధి ఖర్చులో ప్రాతినిధ్య మొత్తాన్ని మినహాయిస్తారు.

డి. వార్షిక భరణం లేదా ఉద్యోగం:
ఈ చట్టం ప్రకారం బాధిత కుటుంబాలు ఈ కింది ప్రత్యామ్నాయాలు పొందేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత ప్రభుత్వంపై ఉంది.

అ. చేపట్టిన ప్రాజెక్టు ద్వారా ఉద్యోగాల కల్పన జరిగితే సంబంధిత రంగంలో నైపుణ్యాన్ని పెంపొందింపచేసేందుకు తగిన రీతిలో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలి. వారికి ఆ సమయంలో అమలులో ఉన్న ఏ ఇతర చట్టం నిర్దేశించిన కనీస వేతనాలకు తగ్గకుండా వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. బాధిత కుటుంబంలో కనీసం ఒక సభ్యుడికి ఈ ప్రాజెక్టులో ఉద్యోగం ఇవ్వాలి. లేదా అవసరమైన అటువంటి ఇతర ప్రాజెక్టులో అవసరాల మేరకు ఉద్యోగం ఇవ్వాలి. (లేదా)
ఆ. బాధిత కుటుంబానికి ఏకకాలంలో onePPPaopsdfjeo (one time) పరిష్కారంగా ఐదు లక్షల రూపాయల చెల్లింపు (లేదా)
ఇ. బాధిత కుటుంబానికి 20 సంవత్సరాల పాటు నెలకు రెండువేల రూపాయలకు తక్కువ కాకుండా వ్యవసాయ కార్మికుల వినియోగదారుల ధరల సూచీకి అనుగుణంగా తగిన వార్షిక భరణం చెల్లించాలి.
ఆర్థికపరమైన సహాయం: (Financial Aid)
ఎ. నిర్వాసిత కుటుంబాలకు జీవన గ్రాంట్ (living grant)
భూసేకరణలో భూమి కోల్పోయిన ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి నెలవారీ జీవన గ్రాంట్ ను నెలకు మూడు వేల రూపాయల మొత్తాన్ని అవార్డు ప్రకటించిన తేదీ నుండి సంవత్సరం పాటు చెల్లించాలి. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూమి కోల్పోయిన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన కుటుంబాలకు రూ.50,000 మొత్తాన్ని చెల్లిస్తారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నిర్వాసిత కుటుంబాలకు అదే తరహాకు చెందిన ప్రాంతంలో భూమిని కేటాయించాలి. ఆ కుటుంబాల ఆర్థిక అవకాశాలు, భాష, సంస్కృతి, గిరిజన తెగల సామాజిక జీవనాన్ని పరిరక్షించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలి.

బి. నిర్వాసిత కుటుంబాల రవాణా వ్యయం:
కుటుంబాన్ని, ఇంట్లో వస్తువులు, పశు సంపద, భవన నిర్మాణ సామాగ్రిని తరలించేందుకు రవాణా ఛార్జీలు నిమిత్తం ప్రతి ఒక్క నిర్వాసిత కుటుంబానికి యాభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఒకేసారి అందించాలి.

సి. పశువుల కొట్టం లేదా చిన్న దుకాణాల వ్యయం:
పశువుల కొట్టం లేదా చిన్న దుకాణం గల ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి ప్రత్యామ్నాయ ప్రాంతంలో దుకాణం తెరిచేందుకు, పశువుల శాలను నిర్మించేందుకు రూ.25,000 కనిష్ట పరిమితి మేరకు సంబంధిత ప్రభుత్వం ఒకేసారి ఆర్థిక సహాయం అందించాలి.

డి. చేతివృత్తుల కార్మికులు, చిన్న వర్తకులు, ఇతరలకు వన్ టైమ్ గ్రాంట్: (one time grant)
వ్యవసాయేతర, వాణిజ్య భూమిని, పారిశ్రామిక, సంస్థాగత కట్టడం గల బాధిత కుటుంబానికి లేదా కళాకారుల లేదా చిన్న వర్తకుల కుటుంబానికి లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారు షెడ్యూల్డ్ ప్రాంతంలో భూసేకరణ కారణంగా నిర్వాసితులైతే వారికి వన్ టైమ్ ఆర్థిక సహాయాన్ని సంబంధిత ప్రభుత్వం చెల్లించాలి. నోటిఫికేషన్ ద్వారా కనీసం రూ.25,000 మొత్తాన్ని చెల్లించాలి.

ఎఫ్. One Time Re-settlement Allowance (ఒకేసారి పునర్ నిర్మాణ భత్యం):
ప్రతి బాధిత కుటుంబానికి ఒన్ టైమ్ రీ- సెటిల్మెంట్ అలవెన్స్ గా రూ.50,000 మొత్తాన్ని మాత్రమే చెల్లించాలని ఈ చట్టం నిర్దేశిస్తోంది.

చేపలు పట్టే హక్కులు:
ఇరిగేషన్ లేదా జల విద్యుత్ ప్రాజెక్టు సందర్భాల్లో ప్రభావిత కుటుంబాలకు రిజర్వాయర్లలో చేపలు పట్టే హక్కులను సంబంధిత ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కల్పించాలి.

పునర్ నిర్మాణ(Re-settlement) ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన:
ప్రతి Re-settlement ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, రోడ్లు, విద్యుచ్ఛక్తి సరఫరా, మంచినీటి సరఫరా, మురుగునీరు, పారిశుద్ధ్య వసతులు, పంచాయతీ ఘర్ లు, అంగన్ వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తపాలా కార్యాలయాలు, ప్రభుత్వ రవాణా సౌకర్యాలు, క్రీడా మైదానాలు మొదలైన మౌలిక సదుపాయాలు కల్పించాలి.

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు:
ఎ. వీలైనంత వరకు షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టరాదు.
బి. సేకరణ జరిగితే చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే జరగాలి.
సి. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఏ భూమినైనా ప్రభుత్వం సేకరిస్తే లేదా స్వాధీనం చేసుకుంటే సంబంధిత గ్రామ సభ లేదా పంచాయతీ లేదా స్వయం ప్రతిపత్తి గల జిల్లా మండలాల ముందస్తు అనుమతి తీసుకోవడం అవసరం. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ కింద షెడ్యూల్డ్ ప్రాంతంలో భూసేకరణతో పాటు వేరు చేసిన ప్రాంతంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
డి. అభివృద్ధి ప్రణాళికలో ప్రత్యామ్నాయ ఇంధనం, పశు దాణా, అటవీయేతర భూముల్లో కలపయేతర అటవీ ఉత్పత్తులను 5 సంవత్సరాలు అభివృద్ధి చేసేందుకు ఒక కార్యక్రమాన్ని అనుసరించాలి.
ఇ. భూసేకరణకు సంబంధించి ప్రాజెక్టు షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రజలు స్వచ్ఛందంగా కాకుండా నిర్వాసితులైతే నిర్దిష్ట రూపంలో అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలి. భూమి హక్కులకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి అసరమైన నిర్దిష్ట వివరాలను అనుసరించాలి. సేకరించిన భూములను ప్రత్యేకంగా విభజించి ఆ ప్రాంతంలో ఆ భూములను షెడ్యూల్డ్ కులాలు, తెగలకు తిరిగి కేటాయించేందుకు ప్రత్యేక పథకం రూపొందించాలి.
ఎఫ్. ప్రభావితులైన షెడ్యూల్డ్ తెగలకు చెందిన కుటుంబాలకు అదే షెడ్యూల్డ్ ప్రాంతంలో పునరావాసం కల్పించాలి. ఆ విధంగా వారు తమ జాతి, భాష సాంస్కృతిక ప్రతిపత్తిని కొనసాగించేందుకు అవకాశం కల్పించాలి.
జి. ప్రభావిత షెడ్యూల్డ్ తెగలు, సంప్రదాయబద్ధంగా అటవీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలు షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి నదిలో లేదా చెరువులో లేదా ప్రభావిత ప్రాంతంలోని డ్యామ్ లోని ఇరిగేషన్ లేదా జల విద్యుత్ ప్రాజెక్టుల్లో, రిజర్వాయర్లలో చేపలు పట్టే హక్కు కల్పించాలి.
హెచ్. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన కుటుంబాలకు జిల్లాకు వెలుపల రీ – సెటిల్ మెంట్ (పునర్ నిర్మాణం) అవకాశాలు కల్పిస్తే వారికి అదనంగా 25 శాతం మేరకు పునరావాసం, రీ – సెటిల్ మెంట్ (పునర్ నిర్మాణ) మొత్తాన్ని చెల్లించాలి. ఒకసారి పరిహారంగా చెల్లించే రూ. 50,000 మొత్తంతో పాటు వారికి ఈ మొత్తాన్ని అదనంగా చెల్లించాలి.

ప్రాజెక్టు స్థాయిలో పునరావాస, పునర్ నిర్మాణ(Rehabilitation and Re-settlement) కమిటీ:
ప్రతిపాదిత భూసేకరణ 100 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే సంబంధిత ప్రభుత్వం కలెక్టర్ అధ్యక్షతన రీ సెటిల్ మెంట్(పునర్ నిర్మాణ), పునరావాస కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ పథకం అమలు పురోగతిని సమీక్షించి మరియు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సభ, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలను సంప్రదించి పథకం అమలు తర్వాత సామాజిక అధ్యయనాన్ని చేపట్టాలి.

పునరావాస, పునర్నిర్మాణ (Re-settlement) జాతీయ పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు:
భూమిని సేకరించేందుకు నియమించిన అధికారి అధ్యక్షతన జాతీయ పర్యవేక్షణా కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధిత శాఖల, విభాగాలకు కమిటీలో ప్రాతినిధ్యం కల్పిస్తారు. సంబంధిత రంగాలకు చెందిన ప్రముఖ నిపుణులకు కూడా ఈ కమిటీలో సభ్యత్వం కల్పిస్తారు. ఈ చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం పునరావాస, రీ – సెటిల్ మెంట్ (పునర్ నిర్మాణ) పథకాలు అమలు జరుగుతున్న తీరును పర్యవేక్షించి, సమీక్షించేందుకు పర్యవేక్షణా, సమీక్షా కమిటీలను నియమించాలి.

భూసేకరణ, పునరావసం, పునర్ నిర్మాణ (Re-settlement) ప్రాధికార సంస్థ నియామకం:
భూసేకరణ, నష్టపరిహారం, పునరావాసం, రీ సెటిల్ మెంట్(పునర్ నిర్మాణం)కు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు ఒకరు లేదా ఎక్కువ మంది అధికారలును నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చెయ్యాలి. ఈ అధికారిని భూసేకరణ, పునావాసం, రీ- సెటిల్ మెంట్(పునర్ నిర్మాణం) అథారిటీ అని వ్యవహరిస్తారు.

ఉపయోగించని భూమి పునర్ వితరణ: (unused lands reallocation to owners)
సేకరించిన భూమి ఐదు సంవత్సరాల్లో ఉపయోగించకపోతే భూమిని సంబంధిత వ్యక్తులకు లేదా కుటుంబాలకు తిరిగి ఇవ్వాలి లేదా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల భూబ్యాంకు (land bank) వెళ్లాలి. ఈ చట్టం కింద సేకరించిన భూమి యాజమాన్యాన్ని, ఆ భూమిపై ఎటువంటి అభివృద్ధి ప్రక్రియ చేపట్టకుండా ప్రతిఫలంపై ఎవరైనా వ్యక్తికి బదిలీ చేస్తే పెరిగిన భూమి విలువలో 40 శాతం మొత్తాన్ని భూసేకరణ జరిపిన వ్యక్తుల వారసులకు సేకరణ విలువ ప్రాతిపదికగా భూమిని సేకరణ చేసిన ఐదు సంవత్సరాల్లోగా చెల్లించాలి. ఈ ప్రయోజనం మొట్టమొదటి విక్రయానికి లేదా బదిలీకి మాత్రమే వర్తిస్తుంది. సేకరణ ప్రక్రియ పూర్తి చేసిన తరువాత జరిగే విక్రయం లేదా బదిలీకి వర్తిస్తుంది.

రాష్ట్ర చట్టసభలకు విశేషాధికారం: (Special powers to state law bodies)
నూతన భూసేకరణ చట్టం నిబంధనల ప్రకారం జరిపిన భూసేకరణ కారణంగా భూమి లేదా ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఈ చట్టం నిర్దేశించిన హక్కులు, ప్రయోజనాల కంటే మరింత ఎక్కువగా హక్కులు, ప్రయోజనాలను కల్పించేందుకు రాష్ట్రాల చట్ట సభలకు అధికారం, విచక్షణ కల్పించారు. అటువంటి సౌలభ్యాన్ని(సదుపాయాలను) నిరోధించటం వంటి నిబంధన భూసేకరణ చట్టంలో లేదు.

బాధిత కుటుంబాలకు స్వేచ్ఛ:
ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మరింత ఎక్కువ ప్రయోజనాన్ని అందించే పునరావాస, పునర్నిర్మాణ (Re-settlement) నష్ట పరిహారాన్ని అందిస్తుంటే, ఆ ప్రయోజనాలను ఆ రాష్ట్రంలో ఎంపిక చేసుకునే అధికారాన్ని, స్వేచ్ఛను నూతన భూసేకరణ చట్టం బాధిత వ్యక్తులు, కుటుంబాలకు కల్పించింది.

భారతదేశంలో భూసేకరణ చట్టం – చరిత్ర: (Land Acquisition Act-Histroy)
ప్లాసీ యుద్ధం (1757)తో మొదలై బ్రిటీష్‌వారు భారత భూభాగాన్ని అంచెలంచెలుగా చేజిక్కించుకున్నారు. ఆ క్రమంలోనే సరుకు రవాణాకు రైల్వే లైన్లు, రోడ్ల నిర్మాణానికి, పాలనాపరమైన అవసరాలకు భూసేకరణ చేపట్టారు. మొదటగా బెంగాల్‌ రెగ్యులేషన్‌ (క్రమబద్ధీకరణ) చట్టాన్ని 1824లో తీసుకువచ్చారు. ఆ తరువాత బొంబాయి చట్టం 1839లోను, మద్రాస్‌లో 1852లోనూ, ఇంకా వివిధ రాష్ట్రాల్లో భూసేకరణ చట్టాలు చేశారు. దేశమంతటికీ వర్తించేలా 1894 భూ సేకరణ చట్టం చేశారు. అది 1899 ఫిబ్రవరి ఒకటవ తేదీన అమలులోకి వచ్చింది. ఈ కేంద్ర చట్టానికి మూలాలు బ్రిటీష్‌ కాలంలో సైతం ఆయా రాష్ట్రాల్లోనివే అని గుర్తించాలి. చట్టానికి తొలి సవరణ (సెక్షన్‌ 5ఎ) బ్రిటీష్‌ కాలంలోనే 1923లో జరిగింది. బలవంతపు భూ సేకరణను ఆనాడే రైతులు ప్రతిఘటించినప్పుడు అభ్యంతరాలు తెలపడానికి భూ యజమానులకు అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేశారు. సహాయ నిరాకరణ ఉద్యమ ప్రభావం వల్ల, కాంగ్రెస్‌ ప్రతినిధులు స్థానిక ప్రభుత్వాల్లో ఉండటం వల్ల ఆ సవరణ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కేంద్ర చట్టానికి 17 సార్లు సవరణలు జరిగాయి. అయితే కీలకమైన సవరణలు 1960వ దశకంలో చేశారు. అప్పటి నుంచి మాత్రమే ప్రైవేటు అవసరాలకు ప్రభుత్వ భూ సేకరణ మొదలయింది.

స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ 2004 వరకూ 2.5 కోట్ల హెక్టార్ల (సుమారు ఆరు కోట్ల ఎకరాలు) భూమిని సేకరించగా ఆరు కోట్ల మందికి పైగా నిర్వాసితులయ్యారని అంచనా. వారిలో గిరిజనులు నలభై శాతం కాగా దళితులు, ఇతర వెనుకబడిన తరగుతులకు చెందినవారు చెరో 20 శాతమని అంచనా. దేశ జనాభాలో గిరిజనులు కేవలం ఎనిమిది శాతం కాగా నిర్వాసితుల్లో మాత్రం వారే 40 శాతం కావడం గమనార్హం. అయితే ఇప్పటి వరకూ నిర్వాసితులైన మొత్తం ప్రజల్లో కేవలం మూడో వంతు మందికి మాత్రమే పునరావాసం కల్పించారని పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక పేర్కొంది. ఇలాంటి దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం అనేక కసరత్తులు చేసి పునరావాస, పునర్నిర్మాణ విధానాన్ని 2007 అక్టోబర్‌ 31న గెజిట్‌లో ప్రచురించింది. విధానానికి చట్టబద్ధత ఉండదు గనక కొత్తగా భూసేకరణ బిల్లునే తెస్తామని ప్రకటించిన సర్కారు 2009 ఫిబ్రవరి 25న లోక్‌సభ ఆమోదం పొందింది. కానీ రాజ్యసభ ఆమోదం పొందకముందే గత (13వ) లోక్‌సభ రద్దు కావడంతో ఆ బిల్లు చెల్లకుండా మురిగిపోయింది. 14వ లోక్‌సభలో 2009లో సవరించిన బిల్లును 2011 సెప్టెంబర్‌ ఏడున లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అది 2013 ఆగస్టు 29న లోక్‌సభ, సెప్టెంబర్‌ 4న రాజ్యసభ ఆమోదం పొందింది. 2004- 05లో కసరత్తు ప్రారంభమైన ఈ పునరావాస విధానం ఆ తరువాత బిల్లు రూపొంది చట్టంగా ఆమోదం పొందడానికి తొమ్మిదేళ్లు పట్టింది.

Published date : 10 Dec 2013 03:02PM

Photo Stories