Skip to main content

భారతదేశం- పేదరికం, అంచనాలు..

డా॥తమ్మా కోటిరెడ్డి,ప్రొఫెసర్,ఐబీఎస్ హైదరాబాద్.
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో పేదరికం, ఆర్థిక అసమానతలు ప్రధాన సమస్యలుగా నిలిచాయి. భారత్‌లో పెరుగుతున్న జనాభా, నిరుద్యోగం.. పేదరికం, ఆర్థిక అసమానతలు అధికం కావడానికి కారణమయ్యాయి. స్వాతంత్య్రానంతరం 1950 తర్వాతి కాలంలో ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు పేదరిక సమస్య నిర్మూలనకు అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అది ఇప్పటికీ పరిష్కృతం కాని సమస్యగానే మిగిలిపోయింది. ఆహార సబ్సిడీ విధానం, బలహీన వర్గాలకు సంస్థాగత రుణాలను అందించడం, వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం పెంపు, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల విధానం, విద్యా ప్రమాణాల పెంపుతో పాటు పలు కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం అమలు చేసింది. అయినా పేదరికం సమస్య తీవ్రత తగ్గలేదు.

గత రెండు దశాబ్దాలుగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిలో గణనీయమైన పెరుగుదల సంభవించినప్పటికీ ఆ వృద్ధి ఫలాలు.. వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతాల మధ్య సమానంగా పంపిణీ కానందువల్ల దేశంలో ఆదాయ, ప్రాంతీయ అసమానతలు పెరిగాయి. 1998 నుంచి 2008 మధ్య కాలంలో బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో నమోదైన వృద్ధి కంటే గుజరాత్, హర్యానా, గోవాల్లో అధిక వృద్ధి చోటుచేసుకుంది. ఇదే కాలంలో గ్రామీణ బీహార్, ఒడిశాలలో పేదరిక సమస్య తీవ్రమైంది. సరళీకరణ విధానాల అమలు కాలంలో వ్యవసాయ ఆదాయాలు క్షీణించాయి. తలసరి ఆహార ధాన్యాల లభ్యతలోనూ తగ్గుదల సంభవించింది. వ్యవసాయేతర ఉపాధి స్తంభించింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ కార్యకలాపాలకు పేదరిక అంచనాలు ఆధారాలవుతాయి.

స్వాతంత్య్రానికి ముందు అంచనాలు
మొదట దాదాబాయ్ నౌరోజీ తాను రచించిన "Poverty and Un British Rule in India" అనే గ్రంథంలో పేదరిక అంచనాలను పొందుపరిచారు. 1867-68 ధరల వద్ద దారిద్య్ర రేఖను నిర్ణయించేందుకు సంవత్సర తలసరి వినియోగం రూ.16 నుంచి రూ.35 వరకు తీసుకున్నారు. దారిద్య్ర రేఖను నిర్ణయించేందుకు నౌరోజీ.. బియ్యం, పప్పు, మాంసం, కూరగాయలు, నెయ్యి, వంటనూనె, ఉప్పు వంటి వస్తువులపై చేసే వ్యయాన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు. 1938లో నేషనల్ ప్లానింగ్ కమిటీ.. పౌష్టికాహారాన్ని దృష్టిలో ఉంచుకొని కనీస జీవన వ్యయం ఆధారంగా దారిద్య్ర రేఖను రూపొందించింది. తలసరి వినియోగ వ్యయం నెలకు రూ.15 నుంచి రూ.20 వరకు తీసుకొని దారిద్య్ర రేఖను అంచనా వేసింది. 1944లో బాంబే ప్లాన్.. సాంవత్సరిక తలసరి వినియోగ వ్యయాన్ని రూ.75గా దారిద్య్ర రేఖ అంచనాకు సూచించింది.

స్వాతంత్య్రానంతరం అంచనాలు
India పేదరిక అంచనాలకు ప్రణాళికా సంఘం 1962లో వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో తలసరి వినియోగ వ్యయం నెలకు రూ.20గాను, పట్టణ ప్రాంతాల్లో రూ.25గాను తీసుకొని పేదరిక అంచనాలను రూపొందించింది. దండేకర్, రథ్ 1971లో నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్) దత్తాంశం ఆధారంగా పేదరిక అంచనాలు రూపొందించారు. పేదరిక అంచనాలకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు తీసుకునే కనీస కేలరీల ఆహారం 2,250 కేలరీలు ప్రాతిపదికగా పేదరిక అంచనాలను రూపొందించారు. 1970ల్లో ఓజా, బర్ధన్, మిన్‌హాస్, అహ్లూవాలియా చేపట్టిన అధ్యయనాల ద్వారా పేదరిక నిర్మూలనలో ఆర్థికాభివృద్ధి విఫలమైందని తెలుస్తోంది. ప్రణాళికా సంఘం 1979లో పేదరిక అంచనాలకు అలఘ్ (Alagh) కమిటీని ఏర్పాటు చేసింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో 2,400 కేలరీలు, పట్టణ ప్రాంతాల్లో 2,100 కేలరీలు ఆహారం ప్రాతిపదికన పేదరిక అంచనాలు రూపొందించింది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో తలసరి వినియోగ వ్యయం నెలకు రూ.49గాను, పట్టణ ప్రాంతాల్లో రూ.56.70గాను తీసుకొని పేదరిక అంచనాలను రూపొందించింది.

2004-05, 2009-10 అంచనాలు
కొందరు నిపుణులు సూచించిన విధానం ప్రకారం ప్రణాళికా సంఘం వివిధ కాలాల్లో పేదరికాన్ని అంచనా వేసింది. 2005, డిసెంబర్‌లో ప్రణాళికా సంఘం.. సురేష్ డి.టెండూల్కర్ అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను 2009, డిసెంబర్‌లో సమర్పించింది. ఇది 2004-05కు సంబంధించి పేదరిక నిష్పత్తిని అంచనా వేసింది. పేదరికం అంచనాకు టెండూల్కర్ అవలంబించిన పద్ధతిని పోలిక (comparision) కోసం 1993-94లో పేదరిక నిష్పత్తిని కొలిచేందుకు ఉపయోగించారు. కుటుంబ వినియోగ వ్యయానికి సంబంధించి శాంపిల్ సర్వే 2009-10లో నిర్వహించారు. టెండూల్కర్ కమిటీ సూచించిన మెథడాలజీ ఆధారంగా 2009-10లో ప్రణాళికా సంఘం పేదరిక అంచనాలను రూపొందించింది. మిక్స్‌డ్ రిఫరెన్స్ పీరియడ్ ఆధారంగా టెండూల్కర్ సూచించిన పద్ధతి ప్రకారం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిష్పత్తికి సంబంధించి ఈ కింది విషయాలను గమనించవచ్చు.

  • 1993-94లో గ్రామీణ పేదరికం 50.1 శాతం. కాగా అది 2004-05లో 41.8 శాతానికి, 2011-12లో 25.7 శాతానికి తగ్గింది. 1993-94 నుంచి 2004-05 మధ్య కాలంలో గ్రామీణ పేదరికంలో సగటు సాంవత్సరిక తగ్గుదల 0.75 శాతం. కాగా, 2004-05 నుంచి 2011-12 మధ్య కాలంలో ఈ తగ్గుదల 2.32 శాతంగా నమోదైంది.
  • 1993-94లో పట్టణ పేదరికం 31.8 శాతం కాగా అది 2004-05లో 25.7 శాతానికి, 2011-12లో 13.7 శాతానికి తగ్గింది. 1993-94 నుంచి 2004-05 మధ్య కాలంలో పట్టణ పేదరికంలో సగటు సాంవత్సరిక తగ్గుదల 0.55 శాతం కాగా 2004-05 నుంచి 2011-12 మధ్య కాలంలో 1.69 శాతం పెరిగింది.
  • 1993-94 తర్వాత కాలంలో పేదరిక నిష్పత్తిలో తగ్గుదలను గమనించవచ్చు. 1993-94లో దేశంలో 45.3 శాతం మంది ప్రజలు దారిద్య్ర రేఖ దిగువున నివసించగా తదుపరి కాలంలో అంటే 2004-05లో 37.2 శాతానికి, 2011-12లో 21.9 శాతానికి తగ్గింది.
  • 1993-94 నుంచి 2004-05 మధ్య కాలంలో దేశంలో పేదరిక రేఖ దిగువన నివసించే జనాభా సగటు సాంవత్సరిక తగ్గుదల 0.74 శాతంగా నమోదుకాగా, తదుపరి కాలంలో అంటే 2004-05 నుంచి 2011-12 మధ్య తగ్గుదల 2.18 శాతంగా నమోదైంది.
2011-12 అంచనాలు
India
  • నేషనల్ శాంపిల్ సర్వే 68వ రౌండ్‌లో భాగంగా కుటుంబ వినియోగ వ్యయానికి సంబంధించి నిర్వహించిన శాంపిల్ సర్వే ఆధారంగా ప్రణాళికా సంఘం దేశంలో పేదరికాన్ని అంచనా వేసింది. 2009-10తో పోల్చినప్పుడు 2011-12లో పేదరికంలో తగ్గుదలను గమనించవచ్చు. 2004-05, 2011-12 మధ్య కాలంలో వాస్తవిక నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో పెరుగుదల ఎక్కువ కాగా పెరిగిన వ్యయం అన్ని వర్గాల ప్రజల మధ్య సమంగా పంపిణీ కావడాన్ని గమనించవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మధ్య వినియోగ వ్యయ పంపిణీలో సమానత ఎక్కువగా ఉంది.
  • 2011-12లో గ్రామీణ ప్రాంతాల్లో 25.7 శాతం, పట్టణ ప్రాంతాల్లో 13.7 శాతం ప్రజలు దారిద్య్ర రేఖ దిగువన నివసిస్తుండగా దేశం మొత్తంమీద 21.9 శాతం ప్రజలు పేదరికంలో ఉన్నారు.
  • 1993-94లో గ్రామీణ ప్రాంతాల్లో 50.1 శాతం, పట్టణ ప్రాంతాల్లో 31.8 శాతం ప్రజలు పేదరిక రేఖ దిగువన ఉండగా, దేశం మొత్తంమీద 45.3 శాతం ప్రజలు పేదలు. టెండూల్కర్ పేదరిక రేఖను నిర్ణయించడానికి సూచించిన మెథడాలజీ ప్రకారం 2004-05లో 40.70 కోట్ల మంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువున నివసిస్తుండగా, 2011-12లో వీరి సంఖ్య 27 కోట్లకు తగ్గింది. మొత్తంమీద ఏడు సంవత్సరాల కాలంలో పేదరిక రేఖ దిగువవన నివసించే జనాభాలో 13.70 కోట్ల మేర తగ్గుదల సంభవించింది.
  • 1993-94 నుంచి 2004-05 మధ్య కాలంలో పేదరిక నిష్పత్తి సాంవత్సరిక తగ్గుదల 0.74 శాతంగా నమోదైంది. 2004-05 నుంచి 2011-12 మధ్య కాలంలో పేదరిక నిష్పత్తి సగటున 2.18 శాతానికి తగ్గింది.
  • 2011-12లో పేదరిక అంచనాలకు టెండూల్కర్ కమిటీ సూచించిన విధానం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో తలసరి వినియోగ వ్యయం నెలకు రూ.816, పట్టణ ప్రాంతాల్లో రూ.1,000గా తీసుకున్నారు. ఐదుగురు సభ్యులున్న ఒక కుటుంబ తలసరి వినియోగ వ్యయం నెలకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,080 గాను, పట్టణ ప్రాంతాల్లో రూ.5 వేలుగా ప్రతిపాదించారు.
  • 2011-12లో రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక దారిద్య్ర రేఖను రూపొందించేందుకు నెలకు సంబంధించిన తలసరి వినియోగ వ్యయం సమాచారాన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు విడివిడిగా రాష్ట్రాల వారీగా రూపొందించారు. మిక్స్‌డ్ రిఫరెన్స్ పీరియడ్ వినియోగ పంపిణీ ఆధారంగా రాష్ట్రాలకు సంబంధించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదరికాన్ని అంచనా వేస్తారు.
  • వినియోగ పంపిణీ ఆధారంగా 2011-12లో తలసరి వినియోగ వ్యయం పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి నాగాలాండ్‌లో అధికంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పేదరిక రేఖ 2011-12కు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో తలసరి వినియోగ వ్యయం నెలకు రూ.860 కాగా, పట్టణ ప్రాంతాల్లో రూ.1,009.
  • 2011-12లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఛత్తీస్‌గఢ్‌లో (44.61 శాతం) ఎక్కువగా నమోదైంది. తర్వాతి స్థానాల్లో జార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్‌లు నిలిచాయి. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం గోవాలో తక్కువ (6.81 శాతం)గా నమోదైంది. తర్వాతి స్థానాల్లో పంజాబ్ (7.66 శాతం), కేరళ (9.14 శాతం), సిక్కిం (9.85 శాతం) నిలిచాయి.
  • 2011-12లో పట్టణ ప్రాంతాల్లో పేదరికం మణిపూర్ (32.59 శాతం)లో ఎక్కువకాగా, తదుపరి స్థానాల్లో బీహార్ (31.23 శాతం) నిలిచింది. పట్టణ ప్రాంతాల్లో పేదరికం సిక్కిం (3.66 శాతం)లో అతి తక్కువ నమోదుకాగా తర్వాతి స్థానాల్లో గోవా (4.09 శాతం), హిమాచల్‌ప్రదేశ్ (4.33 శాతం), కేరళ (4.97 శాతం) నిలిచాయి.
  • 2011-12 ప్రణాళిక సంఘం అంచనాల ప్రకారం పేదరిక జనాభా శాతం ఛత్తీస్‌గఢ్‌లో (39.93 శాతం) ఎక్కువ కాగా తదుపరి స్థానాల్లో జార్ఖండ్ (36.96 శాతం), మణిపూర్ (36.89 శాతం), అరుణాచల్ ప్రదేశ్ (34.67 శాతం), బీహార్ (33.74 శాతం), ఒడిశా (32.59 శాతం) నిలిచాయి. అతి తక్కువ పేదరికం గోవాలో (5.09 శాతం) నమోదుకాగా తదు పరి స్థానాల్లో కేరళ (7.05 శాతం), హిమాచల్‌ప్రదేశ్ (8.06 శాతం), సిక్కిం (8.19 శాతం).
  • 2004-05 నుంచి 2011-12 మధ్యకాలంలో ప్రభుత్వ అభివృద్ధి వ్యయంలో పెరుగుదల ఏర్పడింది. 2004-05లో మొత్తం ప్రభుత్వ వ్యయంలో అభివృద్ధి వ్యయం 38 శాతం కాగా 2011-12లో 45 శాతంగా నమోదైంది.
  • 2004-05 నుంచి 2011-12 మధ్య కాలంలో దేశంలో వృద్ధికి అనుపాతంగా ఉపాధి పెరగలేదు. వృద్ధిలో పెరుగుదల అధిక పన్నుల రాబడికి దారితీసినందువల్ల ప్రభుత్వం అనేక సాంఘిక కార్యక్రమాలపై వ్యయాన్ని పెంచింది. ఉపాధి హామీ పథకం అమలు వల్ల ముఖ్యంగా గ్రామీణ పేదరికంలో తగ్గదల సంభవించింది.
1993-94
గ్రామీణ ప్రాంత పేదరికం: 50.1 శాతం
పట్టణ ప్రాంత పేదరికం: 31.8 శాతం
మొత్తం: 45.3 శాతం

2004-05
గ్రామీణ పేదరికం: 41.8 శాతం
పట్టణ పేదరికం: 25.7 శాతం
మొత్తం: 37.2 శాతం

2011-12
గ్రామీణ పేదరికం: 25.7 శాతం
పట్టణ పేదరికం: 13.7 శాతం
మొత్తం: 21.9 శాతం

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరికం: 10.96 శాతం (61.80 లక్షలు)
పట్టణ పేదరిక జనాభా: 5.81శాతం(16.98 లక్షలు)
మొత్తం పేదలు: 9.20 శాతం (78.78 లక్షలు)
Published date : 18 Oct 2013 10:49AM

Photo Stories