Skip to main content

బాలలు – నేరాలు (బాల నేరస్థులు)

ప్రేమ విఘ్నేశ్వర రావు కె.
ప్రస్తుత సమాజంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా నేరస్తులుగా మారే వారి సంఖ్యా పెరిగిపోతోంది. సమాజం పట్ల సరైన అవగాహన లేకపోవడం, విద్యా బుద్దులు నేర్పించడంలో తల్లి దండ్రులు, గురువులు విఫలం చెందడం, మానసిక పరిపక్వత లేకపోవడం, సమాచార ప్రసార సాధనాల జోరు, పాశ్చాత్య పోకడలు, పూట గడవడానికి సహకరించని ఆర్థికి దుస్థితి.. వెరసి బాలలు నేరస్తులుగా మారడానికి దోహదం చేస్తున్నాయి. ఒకసారి అలవాటు పడిన వారు సరైన మందలింపు లేకపోవడంతో అదే అదునుగా తీసుకొని పదే పదే నేరాలకు పాల్పడుతున్నారు. చినికి చినికి గాలివాన అయినట్లు చిన్న చిన్న నేరాలు చేస్తూ పెద్ద నేరాలు సైతం చేయడానికి వెనుకాడటం లేదు. బంగారు భవిషత్తుతో భావి భారతాన్ని నిర్మించాల్సిన బాలలు నేరస్తులుగా మారడం చూస్తుంటే రాబోయే తరాల భవిషత్ ప్రశ్నార్థకంగా మారుతోంది.

ఉదాహరణకు 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో నిర్భయ అనే ఫిజియోథెరపిస్టుపై సామూహిక అత్యాచారం జరిగిన కేసులో ఒక 17 ఏళ్ల కుర్రాడు దోషి అని జువనైల్ బోర్డు నిర్ధారించింది. ఆ రోజు నిర్భయ మీద అనేక పర్యాయాలు అత్యాచారం జరపడమే కాకుండా ఆమె పొత్తి కడుపులోకి ఇనుప కడ్డీని గుచ్చి, పేగుల్ని బయటకు లాగి, ఆ తర్వాత ఆమెను బస్సులోంచి బయటికి విసిరేయడంలో తన సహచరులకు సహాయం చేశాడు కూడా. ఆ తర్వాత అత్యాచారానికి, చిత్రహింసలకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా బస్సు లోపలి భాగాన్ని శుభ్రంగా కడిగేశాడు. ఈ సంఘటన చూస్తుంటే అతను సాంకేతికంగా బాలుడే అయినప్పటికీ మొదటి నుంచి చివరి వరకూ ఓ కరుడు కట్టిన నేరస్థుడిలా వ్యవహరించాడన్నది స్పష్టమవుతుంది.

విద్యా బుద్దులు, సంస్కారం నేర్పి పిల్లలను ప్రయోజకులను చేయడం తల్లితండ్రులు, గురువుల కర్తవ్యం. అలాంటప్పుడు ఏ విద్యార్థి అయినా తప్పుదోవ పడుతుంటే వారిని మందలించి సరైన దారిలో పెడుతుంటారు తల్లితండ్రులు, ఉపాధ్యాయులు. ఉమామహేశ్వరి అనే టీచర్ కూడా అదే చేశారు. తన విద్యార్థిని ప్రయోజకుడిని చేయాలనుకున్నారు. తరగతిలో అల్లరి చేసే ఇర్ఫాన్ ను మందలించారు. సరిగా చదువుకోమని చెప్పారు. దానికి ఇర్ఫాన్ టీచర్ పై ద్వేషం పెంచుకున్నాడు. కత్తితో ఉమామహేశ్వరి గొంతుకోసి హత్య చేశాడు. ఈ ఘటన చెన్నైలోని సెయింట్ మేరీస్ హై స్కూల్లో చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల పిల్లవాడు హత్య చేశాడు.

పై రెండు ఉదాహరణలను బట్టి బాలల నేరాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి ఉదంతాలు రోజు రోజుకూ విస్తరిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో జరుగుతున్న నేరాలను పరిశీలిస్తే 16 నుంచి 18 ఏళ్ల పిల్లలు ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నారనే విషయం తెలుస్తోంది. ఇది ప్రమాదానికి సంకేతం. ప్రస్తుతం దేశంలో Teenage Crime పెరుగుతోంది. అత్యాచారం, హత్య, నిర్బంధించటం, బెదిరించటం వంటి నేరాలను ఈ వయసు పిల్లలే ఎక్కువగా చేస్తున్నారు. కరుడు గట్టిన నేరగాళ్లతో పోటీపడుతున్నారు.

ఆందోళన కలిగిస్తున్న బాలల నేర ప్రవృత్తి:
జాతీయ నేర దర్యాప్తు సంస్థ లెక్కల ప్రకారం టీనేజ్ లో నేరాలు 188 శాతం పెరిగాయి. దొంగతనాలు, దోపిడీలు 200శాతం పెరిగాయి. ఆడ పిల్లలను కిడ్నాప్ చేయడం ఆరువందల శాతం పెరిగింది. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక వీధుల్లో పెరిగే అనాధ బాలలు నేరాలకు బానిసలవుతారని అందరూ అనుకుంటారు. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే నేరాలు చేసే వారిలో అలాంటి ఆనాధలు 10 శాతం లోపే ఉన్నారు. తల్లిదండ్రుల వద్ద కాకుండా చుట్టాల వద్ద పెరిగే వారు 90 శాతం మంది నేరాలకు పాల్పడుతున్నారు.

నిజానికి సమాజంలో అతి వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇది వరకు సగటున 20 ఏళ్లు పైబడిన వాళ్లు చేసే నేరాలు ఇప్పుడు 13 ఏళ్ల లోపు వారు సైతం అవలీలగా చేస్తున్నట్టు నేర చరిత్రలు నిర్ధారిస్తున్నాయి. జాతీయ నేర గణాంక సంస్థ (National Crime Records Bureau) అందజేసిన వివరాల ప్రకారం 2001 – 2012 మధ్య ఇతర నేరాల్లో టీనేజ్ యువకులు పాల్గొనడం బాగా తక్కువే కానీ, అత్యాచారాల విషయంలో మాత్రం పెద్దవారి కంటే అనేక రెట్లు ముందున్నారు. 2001లో బాల నేరస్థులు పాల్పడిన అత్యాచారాల సంఖ్య 399 కాగా, 2010 నాటికి అది 858కి పెరిగింది. 2011 నాటికి అది 1149కి కూడా చేరుకుంది. పురుషుల కంటే బాలలు చేస్తున్న అత్యాచారాలు మరీ క్రూరంగా, వికృతంగా ఉంటున్నాయి. ఇది ఆందోళన కలిగిస్తున్న పరిణామం.

కారణాలు అనేకం:

1. దారిద్ర్యం, నిరక్షరాస్యత (Poverty, Illiteracy):

బాలల్లో నేర పూరిత ప్రక్రియ ప్రారంభం కావడానికి సమాజంలోని వ్యక్తులే కారణమనేది నిష్ఠుర సత్యం. దీంతో పాటు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కూడా అందుకు దోహదం చేస్తున్నాయి. పేదరికం, ఆకలి, పెరిగే వాతావరణం వారిని చిన్నతనంలోనే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పురికొల్పేలా చేస్తున్నాయి. పెరుగుతున్న బాలల నేరప్రవృత్తికి ఆకలి, పేదరికం ముఖ్య కారణాలు. నేరాలు చేసే వారిలో 60 శాతం మంది పేద కుటుంబాలకు చెందిన వారు. అలాగే 57 శాతం మంది చదువు లేనివారు అని NCRB గణాంకాలు చెబుతున్నాయి. అంటే నిరక్షరాస్యత, దారిద్ర్యం అనే రెండు అంశాలు ప్రధానంగా బాలల నేరాలకు కారణాలుగా మారాయి. దేశంలోని మురికివాడల్లో నివసించే కుటుంబాలలోని బాలలు ఈ కారణంగానే కుటుంబానికి దూరమై, ఆకలి చల్లార్చుకునేందుకు బిక్షాటనతో మొదలుపెట్టి, చెత్త సేకరణ నుంచి క్రమేణా చిరు దొంగతనాలకూ, చివరకు పెద్దనేరాలకు పాల్పడుతున్నారు. బస్తీ, గల్లీల్లో తిరిగే పిల్లలకు సరైన చదువు, శిక్షణ లేదు. చెడు స్నేహాల ప్రభావంతో నేరాలకు పాల్పడుతున్నారు. హత్యలు, అత్యాచారాలు చేస్తున్నారు. ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే నేరాలు చేసే వారిలో 22శాతం మళ్లీ మళ్లీ నేరాలు చేస్తున్నారు. ఇలాంటి వారు పూర్తిస్థాయి నేరగాళ్లుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.

2. టెక్నాలజీ దుర్వినియోగం (Misuse of Technology):
ప్రస్తుత సమాజంలో పిల్లలు నేరాలు చేయడం ఎక్కువవ్వడానికి మరో ప్రధాన కారణం సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం. సినిమాలు, ఇంటర్నెట్ ప్రభావంతో పిల్లలు నేరాలు ఎలా చేయాలో తెలుసుకోవడం తేలికైంది. శరవేగంతో మారుతున్న టెక్నాలజీలో కంప్యూటర్లు, ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. దీంతో పిల్లలకు ఎక్కడెక్కడి సమాచారం ఇట్టే తెలిసిపోతోంది. టీవీ, ఇంటర్నెట్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇవన్నీ పిల్లలకు కొట్టిన పిండే. వీటి గురించి తల్లిదండ్రులకు కనీస అవగాహన ఉండట్లేదు. కొత్త టెక్నాలజీతో మంచి, చెడూ రెండూ ఉంటాయి. మంచిని ఉపయోగించుకొని ముందుకు వెళ్లేవారు కొందరు. చెడు గ్రహించి నేరాలకు పాల్పడేవారు మరికొందరు. మంచి కంటే చెడు త్వరగా వస్తుందంటారు. చదువు రాకపోయినా ఇంటర్నెట్ లో అశ్లీల చిత్రాలు చూడటం, సెల్ ఫోన్ లో నీలి చిత్రాలు పెట్టడం ఇవి యుక్త వయస్సు పిల్లలకు చాలా తేలికగా వస్తున్నాయి. మరోవైపు ఈ అశ్లీల చిత్రాలు ప్రతీచోటా సులభంగా లభ్యమవుతున్నాయి. వీటి ద్వారా కూడా కొంత మంది పిల్లలు పెడదోవ పడుతున్నారు. ముఖ్యంగా యుక్త వయస్సు పిల్లల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

3. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం:
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు పిల్లలకు సరైన క్రమశిక్షణ (Discipline) లభించేది. తాతయ్యలు, అమ్మమ్మలు, పెద్దనాన్నలు, చిన్నాన్నలు, అక్కలు, చెల్లెళ్లు, అన్నయ్యలు, పిన్ని, పెద్దమ్మలు, మావయ్యలు, అత్తయ్యలు ఇలా ఎంతో మంది కలిసి ఉండే ఉమ్మడి కుటుంబంలో బాలలకు మంచి విలువలు నేర్పించేవారు. ఏది మంచి ఏది చెడు అని విడమరిచి అనుభవపూర్వకంగా చెప్పేవారు. పిల్లలు తప్పుదోవ పట్టకుండా అన్ని విధాలా కాచుక్కూర్చునేవారు. కానీ నేడు ఏక కుటుంబాల (Nuclear Family) వల్ల ఇటువంటి పర్యవేక్షణ, క్రమశిక్షణ కొరవడ్డాయి. తల్లిదండ్రులు ఉద్యోగాలు, విధుల్లో పడిపోయి పిల్లల కదలికల్ని పసిగట్టలేకపోతున్నారు. దీంతో పిల్లలకు అతి స్వేచ్ఛ లభించి పెడదోవ పడుతున్నారు.

బాలల నేర ప్రవృత్తి – నియంత్రణ:
ఐక్యరాజ్య సమితి 1959లో విడుదల చేసిన విశ్వజనీన బాలల హక్కుల ప్రకటన ప్రపంచ బాలలకు మనం అందించాల్సిన రక్షణ, న్యాయవర్తనల విలువలకు హామీ ఇవ్వాలని సూచించింది. 1985నాటి బీజింగ్ నియమావళి బాలలపై పెచ్చరిల్లుతున్న నేరాలను పటిష్ఠంగా ఎదుర్కోవటానికి, దారితప్పిన బాలలకు సమగ్ర న్యాయాన్ని అందజేయడానికీ తగిన కనీస ప్రమాణ సూచికలను రూపొందించాలని తేల్చిచెప్పింది.

భారత్‌లో 1850లో అప్రెంటీస్ చట్టం (Apprentice Act)తో మొదలైన బాలల సంక్షేమ శాసనాలు 1960 నాటి బాలల చట్టం దాకా కుంటి నడకతోనే అమలయ్యాయి. ఈ నేపథ్యంలో షీలాబర్న్సే కేసులో సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా ఏకీకృత విధి విధానాలతో విధివంచిత బాలల పోషణ, రక్షణ, ప్రధాన సమాజ స్రవంతిలో భాగస్వామికాగల దిశలో పునరావాసం అనే మహత్తర లక్ష్యంతో 2000 సంవత్సరంలో రూపొందించిన జువైనల్ జస్టిస్ చట్టం (Juvenile Justice (Care And Protection Of Children) Act, 2000) ప్రస్తుతం అమలులో వుంది. ఈ చట్టం ద్వారా 18 ఏళ్ళలోపు బాల బాలికలకు, ముఖ్యంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన బాలలకు సంస్కరణా గృహాలు, ప్రవర్తనా పరిశీలన గృహాలు ఏర్పాటు చేయడం, వారికి సరైన విద్యాబుద్ధులు నేర్పటం ద్వారా వారి వికాసానికి తోడ్పడటం వంటి నిర్మాణాత్మక కృషి జరుగుతుందని సమాజం ఆకాంక్షించింది.

ఐక్యరాజ్యసమితి మార్గదర్శక సూత్రాలు:
బాల నేరస్థులకు భౌతికంగా గానీ, మానసికంగా గానీ పరిణతి ఉండదనీ, తమ నేరాలకు బాధ్యత వహించడం కూడా చేతకాదనీ, వారు పూర్తిగా ఎదిగిన వారు కానందువల్ల, వారికి పునరావాసం కల్పించడం అనివార్యమనీ ఐక్యరాజ్య సమితి పేర్కొంది. అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లండ్ దేశాలతో సహా ప్రపంచంలో దాదాపు ప్రతి దేశమూ ఈ మార్గదర్శక సూత్రాలనే అనుసరించడం ప్రారంభించాయి. దేశంలో 18 ఏళ్ల లోపు నేరస్థులను ఇతర పెద్ద నేరస్థులతో సమానంగా చూడకూడదని భారత్ కూడా భావించి, వాళ్లకు పునరావాసం కల్పించడంతో పాటు, వారికి సలహాలివ్వడం, కౌన్సెలింగ్ చేయడం, మందలించడం, జరిమానాలు విధించడం వంటివి చేస్తోంది. అంతేకాక వారిక గరిష్ఠంగా మూడేళ్లకు మించి శిక్ష విధించడం లేదు.

బాల నేరస్థుల చట్టం (జువనైల్ జస్టిస్ యాక్ట్):
జువనైల్ అంటే బాలుడైతే 16 సంవత్సరాలలోపు, బాలికైతే 18 సంవత్సరాల లోపు ఉన్న బాల నేరస్థులని అర్థం. నిర్భాగ్య బాల నేరస్థులకు ఆప్యాయత (Affection), రక్షణ (Security), చికిత్స (aid), వికాసం (Development), పునరావాసం (Rehabilitation) చేకూర్చడం ఈ చట్టం లక్ష్యం. ఇది కేవలం బాల నేరస్థుల చట్టం అని సాధారణ అభిప్రాయం. కాని బాలలపై జరిపే అన్యాయాల్ని, అకృత్యాల్ని కూడా ఈ చట్టం పరిగణనలోకి తీసుకొని న్యాయం చేకూరుస్తుంది.

బాల నేరస్థుల చట్టంలో ముఖ్యాంశాలు:
1. సెక్షన్ 3 ప్రకారం జువనైల్ పైన విచారణ ప్రారంభమైనప్పుడు గాని, విచారణ నడుస్తున్నప్పుడుగాని, అతడు లేదా ఆమె బాలనేరస్థులని ముద్ర వేయరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ బాలుడినీ బాలికనూ జైల్లో పెట్టడం, లేదా పోలీసు కస్టడీలో ఉంచకుండా చట్టం కాపాడుతుంది.

2. సెక్షన్ 4 ప్రకారం, ప్రభుత్వం, నిర్భాగ్య బాల నేరస్థుల కోసం జువనైల్ సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసింది. ఆ బోర్డు మేజిస్ట్రేట్ల అధికారంతో పనిచేస్తుంది.

3. సెక్షన్ 5 కింద, నేరం చేసిన బాలల కోసం ప్రభుత్వం జువనైల్ కోర్టుల్ని నెలకొల్పుతుంది. అటువంటి ప్రతి కోర్టుకు వేతనం లేకుండా గౌరవార్థంగా పనిచేసే ఇద్దరు సంఘ సేవకులను నియమిస్తారు. సంక్షేమ బోర్డుగాని, జువనైల్ కోర్టుగాని లేని ప్రాంతాల్లో ఈ చట్టం ద్వారా సంక్రమిచే అధికారాలను ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మేజిస్ట్రేటు కోర్టుకు తక్కువగాని ఏ కోర్టు అయినా కలిగి ఉంటుంది.

4. వివిధ రకాల బాల నేరస్థులకు ఆదరణ, రక్షణ, వికాసం, పునరావాసం చేకూర్చడానికి అవసరమైన యంత్రాంగాన్ని, మౌలిక సదుపాయాల్ని చట్టం వివిధ సెక్షన్ల కింద తేటతెల్లం తేసింది. 9 - 11 సెక్షన్ల ప్రకారం బాల నేరస్థుల కోసం జువనైల్ హోమ్స్, ప్రత్యేక సంరక్షణాలయాలు, శిక్షణ సదనాలు ఏర్పాటు చేయవచ్చు.

5. సెక్షన్ 13 కింద, ఎవరైనా పోలీసు అధికారి తానుగా అభాగ్య బాలనేరస్థుడి బాధ్యత తీసుకొని జువనైల్ సంక్షేమ బోర్డు ముందు ఉంచవచ్చు. లేదంటే కనీసం బోర్డుకు అటువంటి బాలనేరస్థుడి సమాచారం అందజేయవచ్చు. పోలీసు అధికారి నివేదిక అందిన వెంటనే సంక్షేమ బోర్డు ఆ బిడ్డను హాజరు పర్చాల్సిందిగా తల్లిదండ్రుల్నో, సంరక్షకుడినో హెచ్చరించి విచారణ జరుపుతుంది.

6. జువనైల్ కోర్టు విచారణకు సంబంధించినంతవరకు ప్రక్రియ పధ్ధతి నేర శిక్షాస్మృతిలో ఉన్నట్టే ఇక్కడా ఉంటుంది. సెక్షన్ 18 ప్రకారం, జామీను ఇవ్వదగిన, జామీను ఇవ్వరాని నేరాలు చేసినట్లుగా ఆరోపణలకు గురైన బాల నేరస్తులందరినీ జామీను మీద పూచీదారు ఉన్నా లేకున్నా విడుదల చేయవచ్చు.

7. ఎవరైనా ఒక బాల నేరస్థుడిని విడుదల చేస్తే క్రిమినల్స్ తో చేరిపోయే అవకాశం ఉండవచ్చుననో, నైతిక ప్రమాదానికి గురి కావచ్చుననో, లేదా అతని/ఆమె విడుదల న్యాయపరమైన లక్ష్యానికే భంగకరంగా పరిణమించవచ్చుననో కోర్టు భావించని పక్షంలో జామీను మీద, జామీను లేకుండాను విడుదల సాధ్యం.

8. విడుదల కాకపోయినట్లయితే, బాలనేరస్థుల్ని శిక్షణ సదనానికి (Observation Home) పంపించవచ్చు. విచారణ జరిపిన అనంతరం, కోర్టు బాలనేరస్థుడిని /నేరస్థురాలిని మందలించి విడుదలకు ఆదేశించవచ్చు. లేదా ప్రొబేషన్ పైనా విడుదల చేయించవచ్చు. లేదా బాలనేరస్థుడి వయస్సు 14 సంవత్సరాలు బాల నేరస్తురాలి వయస్సు 16 సంవత్సరాలు పైన ఉంటే ప్రత్యేక సదనానికి (Special Home) పంపవచ్చు.

9. నేరం చేసిన ఏ బాల, బాలికలకూ మరణశిక్ష విధించరాదు. కారాగార శిక్ష విధించరాదు. 14 సంవత్సరాలు నిండిన బాల నేరస్థుడి విషయంలో అయితే అతడు చేసిన నేరం తీవ్రమైందని కోర్టు భావించినప్పుడు అతడిని క్షేమకరమైన కస్టడీలో ఉంచాలని ఆదేశిస్తుంది.

10. వయోజనుడైన నేరస్థుడినీ, బాలనేరస్థుడినీ కలిపి, సంయుక్త విచారణ జరపరాదు. నేరం చేసినట్లుగా విచారణలో నిర్దారణ అయిన బాల నేరస్థుడు/నేరస్థురాలు నేర నిర్ణయం ద్వారా కలిగే అనర్హత (Disqualification) కు గురి కాబోరు.

11. జువనైల్ సంక్షేమ బోర్డు, లేదా జువనైల్ కోర్టు పరశీలక సదనం ఆవరణలోనే సమావేశమవుతుంది. కార్యకలాపాలు చాలా మామూలుగా ఉంటాయి. సెక్షన్ 27 ప్రకారం, బోర్డుగాని జువెనైల్ కోర్టుగాని వీలైనంత వరకూ సాధారణ న్యాయస్థానాలకు భిన్నంగా వేరే వేళల్లో సమావేశమవుతుంది. కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

12. సెక్షన్ 28 ప్రకారం, కోర్టు అనుమతిస్తేనే తప్ప న్యాయవాదిగాని మరెవరైనాగాని విచారణ సమయంలో హాజరయ్యే వీలులేదు.

13. సెక్షన్ 36 ప్రకారం బోర్డు-కోర్టు విచారణ క్రమంలో ఏ బాలనేరస్థుడి వివరాలూ బహిరంగం కారాదు.

చట్టం అమలుతీరు:
రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటయిన ఈ చట్టం అమలు నిరాశనే మిగిల్చింది. చట్టం నిర్దేశించిన లక్ష్యాల సాధనలో భాగస్వామి కావాల్సిన సమాజం కేవలం ప్రేక్షక పాత్ర పోషించడం విచారకరం. జువైనల్ జస్టిస్ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి బాల్యం విలువలు క్షీణిస్తున్నాయనడానికి సర్కారు గణాంకాలే సాక్ష్యం.

పునరావాస కేంద్రాల దుస్థితి:
దేశంలో ప్రస్తుతం బాల నేరస్థుల కోసం 815 శిక్షా పునరావాస కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇందులో ఉన్న బాల నేరస్థుల సంఖ్య 35 వేలు మాత్రమే. కానీ దేశంలోని బాల నేరస్థుల సంఖ్య సుమారు 17 లక్షలని అంచనా. అంతర్జాతీయ స్థాయి మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా ఈ కేంద్రాలు పనిచేయడం లేదు. ఇవి పునరావాసానికి పనికి రావు. శిక్షలకూ పనికిరావు. దురదృష్టవశాత్తు ప్రస్తుత వ్యవస్థ బాల నేరస్థుల్ని సంస్కరించే విధంగా లేదు. వారికి కల్పిస్తున్న పునరావాసమే కాదు, వారికి వేస్తున్న శిక్షలు కూడా వారిలో ఎటువంటి మార్పూ తేవడం లేదు. వారు భవిష్యత్తులో నేరస్థులుగా కొనసాగకుండా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు కూడా ఏమీ లేవు.

జస్టిస్ వర్మ కమిటీ సూచనలు:
అన్ని రకాల లైంగిక నేరాలకు పెంపొందించే కేంద్రాలుగా బాల నేరస్థుల గృహాలు ఉంటున్నాయి. బాల నేరస్థుల చట్టం ఊహించిన విధంగా బాలనేరస్థుల గృహాలను నిర్వహించాలి. ఈ గృహాలను నిర్వహించడానికి ఒక పని యంత్రాంగం రూపొందించాలి. తప్పిపోయిన పిల్లల పట్ల ఉదాసీనంగా వ్వవహరిస్తున్న ప్రభుత్వాలు వైఖరి మార్చుకోవాలి. మైనర్ పిల్లలను రవాణా చెయ్యడం తీవ్ర నేరంగా పరిగణించాలి. మహిళలు, పిల్లలు పట్ల వివక్ష పాటించరాదన్న స్పృహ విద్యావిధానంలో కల్పించాలి.

బాలనేరస్థుల వయోపరిమితిపై సుప్రీం :
బాల నేరస్థుల చట్టంలో మార్పులను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బాలనేరస్థుల వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు కుదించాలంటూ పెట్టుకున్న పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. జువైనల్ చట్టంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్న సుప్రీంకోర్టు ఆ చట్టంలో ఉన్న నిబంధనలను సమర్థించింది. పద్దెనిమిదేళ్ల కంటె తక్కువ వయసున్న నేరస్థులను జువనైల్‌ హోంలోనే ఉంచాలని, వారి విచారణను జువైనల్ బోర్డు చూసుకుంటుందని స్పష్టం చేసింది. డిసెంబర్ 16 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో మైనర్ బాలుడు నిందితుడిగా ఉండడంతో బాలనేరస్థుల వయోపరిమితిని తగ్గించాలని దాఖలైన పిల్ ను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

సవరణ తక్షణావసరం:
బాలల నేరాలను దృష్టిలో పెట్టుకొని జువనైల్ జస్టిస్ చట్టంలో కీలకమైన సవరణ తీసుకురావాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐక్యరాజ్యసమితి రూపొందించిన మార్గదర్శక సూత్రాలను ఒకప్పుడు యథాతథంగా అమలు చేసిన దేశాలన్నీ ఇప్పుడు తమ బాల నేరస్థుల చట్టాలను 50 శాతానికి పైగా సవరించాయి. అందుకు కారణం అత్యాచారాలు జరిపేవారిలో బాలల సంఖ్య దాదాపు ప్రతి ఏటా ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతుండడమే. ఈ దేశాలు బాల నేరస్థులకు పునరావాసాన్ని మాత్రం యుథాతథంగా కొనసాగిస్తూ శిక్షలను మాత్రం మరింత కఠినం చేశాయి.

విదేశాలు – అనుభవాలు
అమెరికా, ఇంగ్లండ్ తదితర దేశాల్లో ఈ శతాబ్దం ప్రారంభం నుంచి బాలల నేరాల సంఖ్య అనేక వందల రెట్లు పెరిగిపోతోంది. ఈ ధోరణిని చూసిన అనేక దేశాలు కొన్ని నేరాలను బాల న్యాయస్థానాల పరిధిలోనే ఉంచి, అత్యాచారం, హత్య, చిత్రహింసలు వంటి నేరాలను మాత్రం పెద్దల న్యాయస్థానాల పరిధిలోకి తీసుకువెళ్లి, బాల నేరస్థుల విషయంలో కఠినాతికఠినంగా వ్యవహరిస్తున్నాయి. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో 13 లేక 15 ఏళ్ల లోపు బాలలు హేయమైన నేరానికి పాల్పడినప్పుడు, ఆ శిక్షను విచారించే పరిధిని తాత్కాలికంగా బాల నేరస్థుల న్యాయస్థానాల నుంచి తప్పించడం జరుగుతోంది. అంటే బాలల అత్యాచారానికి, హత్యకు, కిడ్నాప్ వంటి నేరాలకు పాల్పడినప్పుడు దాన్ని పెద్దల న్యాయస్థానాల్లోనే విచారించాల్సి ఉంటుంది. ఈ కేసును పెద్దల కోర్టుకు బదిలీ చేయాలని బాల నేరస్థుల కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరాల్సి ఉంటుంది. వెంటనే ఆ కేసును పెద్దల కోర్టుకు తరలిస్తారు. అమెరికాలోని ఇండియానా, సౌత్ డకోటా, వెర్మాంట్ రాష్ట్రాలలో 10 ఏళ్ల పిల్లల నేరాలను కూడా పెద్లల కోర్టుకు తరలించిన సందర్భాలున్నాయి.

ఇంగ్లండ్ లో అయితే 18 ఏళ్ల లోపు బాల నేరస్థుల్ని విచారించడానికి యువజన న్యాయస్థానాలను ఏర్పాటు చేశారు. పదేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలను ఇక్కడే విచారిస్తారు. ఇక్కడ కూడా నేరాలను బట్టి ఏ కోర్టులో విచారించాలన్నది నిర్ధారణ అవుతుంది. కేసును బట్టి దాన్ని యువజన కోర్టులోనే ఉంచాలా లేదా క్రౌన్ కోర్టు (సెషన్స్ కోర్టు లాంటిది)కు తరలించాలా అన్నది నిర్ణయిస్తారు. ముఖ్యంగా అత్యాచారానికి సంబంధించిన ప్రతి కేసూ, పెద్దలు చేసినా సరే బాలలు చేసినా సరే దానిపై తప్పనిసరిగా పెద్దల కోర్టులోనే విచారణ జరుగుతుంది. అంతేకాక, 18 ఏళ్ల లోపు యువకుడు పెద్దవాళ్లతో కలిసి నేరానికి పాల్పడినప్పుడు అతని మీద ఖచ్చితంగా పెద్దల కోర్టులోనే విచారణ జరుగుతుంది. పెద్దవాళ్లకు శిక్ష పడిన స్థాయిలోనే ఈ టీనేజ్ యువకుడికి కూడా శిక్ష పడుతుంది.

చైనాలో కూడా బాల నేరస్థుల చట్టంలో అనేక మార్పులు జరిగాయి. ఓ యువకుడు ఏ వయసులో ఎటువంటి నేరం చేయగలడన్నది బీజింగ్ సూత్రాలలో ప్రధానాంశంగా మారింది. 13 ఏళ్లలోపు పిల్లలు కొన్ని రకాల నేరాలే చేయగలరు. 14 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలు కొన్ని నేరాలు చేయడానికి అవకాశం ఉంది. దాని ప్రకారమే చైనా బాల నేరస్థుల కేసుల్ని పరిశీలించి, వర్గీకరించడం జరుగుతోంది.

బాల నేరస్థులకూ కఠిన శిక్షలు:
అంతర్జాతీయంగా ఉన్న న్యాయ నిబంధనలను అతిక్రమించడానికి భారత్ చాలాకాలం సంశయిస్తూ వచ్చింది. అయితే 16 నుంచి 18 ఏళ్ల లోపు యువకులు అత్యాచారానికి పాల్పడినా, కిడ్నాప్ చేసినా, యువతులను అమానుషంగా వేధించినా కఠిన శిక్షలు విధించాల్సిన అవసరముందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇటువంటి నేరాలను జువనైల్ జస్టిస్ బోర్డు పరిధి నుంచి తప్పించి పెద్దల కోర్టులోనే విచారించాలని, శిక్షను కూడా మరింత కఠినతరం చేయాలని వారు కోరుతున్నారు. బాల నేరస్థుల్ని సంస్కరించడం అనేది న్యాయపరంగా, సామాజిక పరంగా ఒక ముఖ్యమైన అంశమే అయినప్పటికీ మహిళలు, యువతులపై అత్యాచారాలకు, హత్యలకు పాల్పడడం వంటివి జరిగినప్పుడు మాత్రం బాల నేరస్థుల్ని పెద్దలుగానే పరిగణించాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా చట్టాలను సవరించి, భవిష్యత్తులో ఇటువంటి నేరాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

పేదరికం, నిరక్షరాస్యత నిర్మూలన:
ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం, విద్యాహక్కు చట్టం వంటివి అమలు చేస్తున్నప్పటికీ అనేక మంది బాలలు మధ్యలోనే చదువును ఆపేస్తున్నారు. కారణం మధ్యాహ్న భోజన పథకం అమలు సక్రమంగా లేకపోవడం (బీహార్ లో మధ్యాహ్న భోజన విషాదం ఉదంతం దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు.) ఒక కారణమైతే విద్యాహక్కు చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయకపోవడం మరో కారణం. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులే కరువయ్యాయి. విద్యాబోధన కూడా బాలలకు ఆసక్తి కలిగించేలా కొనసాగట్లేదు. దీంతో బాలలు మధ్యలోనే చదువును ఆపేస్తున్నారు. ఇటువంటి లోపాలను సరిచేయాలి.

కౌన్సెలింగ్:
టీనేజ్ వయసులో వారికి గైడెన్స్ , కౌన్సెలింగ్ చాలా అవసరం. అందుకోసం ప్రతి స్కూల్, కాలేజీలో కౌన్సెలింగ్ నిర్వహించాలి. అయితే ఈ కౌన్సెలింగ్ అన్నది విద్యార్థులకే గాకుండా తల్లిదండ్రులకు కూడా అవసరం. పిల్లలకు వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించాలన్నది చాలా మందికి తెలియదు. ఎవరైనా స్టూడెంట్ గొడవ చేస్తే పాఠశాల లేదా కళాశాల యాజమాన్యం TC ఇచ్చి పంపించేసి చేతులు కడిగేసుకుంటుంది. కానీ దాంతో సమస్య సమసిపోదు. మరోచోట పుడుతుంది. ట్రబుల్ షూటర్స్ ను గుర్తించాలి. కౌన్సెలింగ్ ఇవ్వాలి. ఈ విషయంలో తల్లిదండ్రులను కూడా బాధ్యులను చేయాలి. తల్లిదండ్రులు పిల్లల గురించి పట్టించుకోవాలి. సరైన చదువు, శిక్షణ ఇప్పించాలి. ఇది వారి కనీస బాధ్యత. పిల్లలను గాలికి వదిలేయడం వల్ల వారికే గాకుండా సమాజానికి కూడా నష్టం జరుగుతుంది. పిల్లలు నేరాలు చేస్తే తల్లిదండ్రులను కూడా బాధ్యులను చేయాలి. పిల్లలకు మార్గనిర్దేశం చేయడానికి అన్ని స్కూళ్లలో కౌన్సెలింగ్ కేంద్రాలను పాలకులు ఏర్పాటు చేయాలి. సమస్యలను ఎదుర్కొంటున్న పిల్లలకు, వారి తల్లిదండ్రులకు పిల్లల మానసిక నిపుణుడితో కౌన్సెలింగ్ ఇప్పించాలి. చదువు లేకుండా అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలకు, వాళ్ల పేరెంట్స్ కు కౌన్సెలింగ్ తప్పనిసరిగా ఇవ్వాలి.

ముగింపు:
భావి భారత పౌరులుగా ఎదిగి ఉన్నత స్థానాలకు చేరుకోవాల్సిన బాలలు పేవ్‌మెంట్లు, ప్లాట్‌ఫారాలు, బస్తీలు గల్లీలలో నిర్భాగ్య నికృష్ట జీవనం గడుపుతూ, నిరాదరణకు గురైన వీధి బాలలుగానో, నేర పూరిత బాలలుగానో మారడం ప్రభుత్వాలకు, సమాజానికి తీరని తలవంపులు తెచ్చే పరిణామం. దేశ భవిష్యత్తుకు ఇదో ప్రమాదకర పరిణామం. చట్టాలు, శిక్ష అనేవి నేరం జరిగాక రంగంలోకి వస్తాయి. అసలు నేరం జరగకుండా చేస్తే అది ఇంకా ఉత్తమం.
Published date : 16 Nov 2013 04:54PM

Photo Stories