Skip to main content

ఆర్టికల్ 370 పూర్వాపరాలు

ప్రకృతి అందాలకు తలమానికమైన జమ్మూకశ్మీర్ స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి వివాదాలకు కూడా అంతే నిలయమైంది.
భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని స్వతంత్రప్రతిపత్తి ఒక్క జమ్మూకశ్మీర్‌కు మాత్రమే ఎందుకు ఉంది? దాని నేపధ్యం ఏమిటి? ఆర్టికల్ 370 అంటే ఏమిటి? దానిని ఎందుకు కేంద్రప్రభుత్వం రద్దు చే సింది? జమ్మూకశ్మీర్ పునర్విభజన ఫలితంగా జరిగే మార్పులేమిటో క్షుణ్ణంగా పరిశీలిద్దాం!

స్వాతంత్య్రానంతర పరిస్థితులు:
1947ఆగస్ట్ 15న భారత్, పాక్ స్వాతంత్య్రం పొందాయి. నాడు శ్రీనగర్‌ను ఆక్రమించేందుకు పాకిస్తాన్ కుట్రపన్నగా భారత్ సాయం కోరిన జమ్మూకశ్మీర్ చివరి రాజు రాజా హరిసింగ్ కొన్ని షరతులు, ఒప్పందాలకు లోబడి 1948 అక్టోబర్ 27న కశ్మీర్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారు. భారత్ కుట్రను తిప్పికొట్టి, జమ్మూకశ్మీర్ ప్రధానిగా హేక్‌అబ్దుల్లాను (1949) నియమించింది. రాజప్రతినిధిగా హరిసింగ్ కుమారుడు కరణ్‌సింగ్ ఉన్నారు.1949 అక్టోబర్ 17న కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగసభ రాజ్యాంగంలో 370 ఆధికరణను చేర్చింది. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని శాశ్వతంగా ఉంచాలని, తాత్కాలిక పద్ధతుల్లో హక్కులు ఇవ్వకూడదన్న అబ్దుల్లా వాదనను అప్పట్లో కేంద్రం పట్టించుకోలేదు.1952లో జరిగిన ఢిల్లీ ఒప్పందంతో రాజరికం రద్దయింది. 1954లో 35ఏ నిబంధన జరిగింది. 1956లో జమ్మూకశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగానికి ఆమోదం లభించింది. చివరికి 370 అధికరణం ద్వారా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి లభించింది. అయితే ఈ ప్రత్యేకప్రతిపత్తిని రాజ్యాంగంలోని 368(1) అధికరణం ద్వారా సవరించే వెసులుబాటును కూడా రాజ్యాంగం కల్పించింది.

ఆర్టికల్ 370 రూపకర్త...
ఒకప్పటి మద్రాస్ రాష్ట్రానికి చెందిన గోపాలస్వామి అయ్యంగార్ ఈ ఆర్టికల్ 370కు ప్రధాన రూపకర్త. బ్రిటిష్ కాలంలో సివిల్ సర్వీస్ అధికారిగా వృత్తిజీవితం మొదలుపెట్టి, 1937-43 కాలంలో జమ్మూకశ్మీర్ సంస్థానానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. 1947 అక్టోబర్‌లో కేంద్రంలో జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంలో ఈయన కేంద్రమంత్రిగా పనిచేశారు. జమ్మూకశ్మీర్ వ్యవహారాలు ఈయనే చూసుకునేవారు. ఈయన సారథ్యంలోని బృందం 1948, 1952లో కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తింది.

ఆర్టికల్ 370 అంటే..
భారత రాజ్యాంగంలోని 21వ భాగంలో ఉన్న ఆర్టికల్ 370 ద్వారా జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి లభిస్తోంది. ఆ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక అధికారాలూ, రాజ్యాంగం, జెండా అమల్లో ఉన్నారుు. ఇవన్నీ తాత్కాలిక ప్రాతిపదికన లభిస్తాయన్న నిబంధన కూడా ఉంది. ఈ ఆర్టికల్ ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, కమ్యూనికేషన్ల రంగాలపై మాత్రమే భారత ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నారుు. వాటికి సంబంధించిన చట్టాలు మాత్రమే కశ్మీర్‌లో అమలు చేయగలదు. మిగిలిన రంగాల్లో ఏం చేయాలన్నా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కశ్మీర్ ప్రజల పౌరసత్వం, ఆస్తి హక్కులు, ప్రాథమిక హక్కులు వంటి వాటికి సంబంధించి ప్రత్యేక రాజ్యాంగం అమల్లో ఉంటుంది. ఫలితంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని కశ్మీర్‌లో విధించే అవకాశం కేంద్రానికి లేదు. విదేశీ దురాక్రమణలు, యుద్ధ పరిస్థితులున్నప్పుడు మాత్రమే అత్యవసర పరిస్థితి విధించే అధికారం కేంద్రానికి ఉంటుంది.

35 (ఏ) అంటే..
కశ్మీర్‌లో శాశ్వత నివాసానికి సంబంధించిందే ఆర్టికల్ 35(ఏ). కశ్మీర్ రాజ్యాంగంలోని దీని ప్రస్తావన ఉంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 కిందకి కూడా వస్తుంది. 1954లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సూచనల మేరకు బాబూ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా దీనిని రాజ్యాంగంలో పొందుపరిచారు. దీని ప్రకారం భారత్‌లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న పౌరులెవరూ జమ్మూకశ్మీర్‌లో భూములు, ఇతర ఆస్తుల్ని కొనుగోలు చేయలేరు. ప్రభుత్వ ఉద్యోగం కూడా చేయడానికి కుదరదు. కశ్మీర్‌లో 1911 సంవత్సరానికి ముందు పుట్టిన వారు, అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నవారే శాశ్వత నివాసులు. వారికి మాత్రమే రాష్ట్రంలో భూములు, స్థిరాస్తుల కొనుగోలుపై హక్కులు ఉంటారుు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే స్కాలర్‌షిప్‌లు, ఇతరత్రా ప్రయోజనాలు దీర్ఘకాలం కశ్మీర్‌లో నివసిస్తున్న వారికి రాష్ట్రప్రభుత్వం సర్టిఫికేట్లను మంజూరు చేస్తుంది. రాష్ట్ర స్థిర నివాసులు ఎవరో నిర్వచించడం కోసం చట్టాలు చేసే అధికారాన్ని జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఈ 35ఏ ఆర్టికల్ ద్వారా కల్పించింది. 1956లో రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకువచ్చినప్పుడు 35(ఏ) ఆర్టికల్ చేర్చిన తేదీ మే 14, 1954కి పదేళ్ల ముందు కశ్మీర్‌లో స్థిరనివాసం ఉన్నవారందరూ కశ్మీర్‌లో శాశ్వత నివాసులేనని స్పష్టం చేసింది. అరుుతే కశ్మీర్ మహిళలెవరైనా ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తుల్ని వివాహం చేసుకుంటే వారు ఆస్తి హక్కుల్ని కోల్పోతారు. ఈ నిబంధన మహిళా హక్కుల్ని కాలరాస్తోందని ఆ తర్వాత కాలంలో విమర్శలు వెల్లువెత్తి కొందరు కోర్టును ఆశ్రరుుంచారు. 2002 అక్టోబర్‌లో జమ్మూకశ్మీర్ కోర్టు వివాహం చేసుకునే సదరు మహిళకు ఆస్తి హక్కులు ఇచ్చింది కానీ, వారికి పుట్టిన పిల్లలకు ఆస్తి హక్కులేవీ లభించవని స్పష్టం చేసింది.

ఇప్పటి వరకు జమ్మూకశ్మీర్ కోసం జరిగిన నాలుగు యుద్ధాలు:
1. 1947: ఈ యుద్ధాన్ని మొట్టమొదటి కశ్మీర్ యుద్ధమని కూడా పిలుస్తారు. దేశ విభజనకు ముందు అతి పెద్ద సంస్థానంగా ఉన్న జమ్మూ కశ్మీర్ హిందూ మతానికి చెందిన మహారాజా హరిసింగ్ పాలనలో ఉండేది. 1947 దేశ విభజన సమయంలో సంస్థానాల విలీనాన్ని బ్రిటీష్ పాలకులు వారి ఇష్టానికే వదిలిపెట్టారు. భారత్‌లో కలుస్తారా, పాక్‌లో కలుస్తారా ? లేదంటే స్వతంత్రంగా ఉంటారా అన్నది వారే నిర్ణరుుంచుకోవాలని తెలిపారు. రాజా హరిసింగ్ భారత్‌లో ఎక్కడ కలుస్తారోనన్న ఆందోళనతో పాకిస్తాన్ 1947 అక్టోబర్‌లో కశ్మీర్‌పై దండయాత్ర చేసింది. ఇస్లాం ఆదివాసీలు పాక్ ఆర్మీ అండదండ చూసుకొని కశ్మీర్‌పై దాడికి దిగాయి. దీంతో మహారాజా హరిసింగ్ కశ్మీర్ ప్రాంతాన్ని భారత్‌లో కలుపుతానని ప్రకటించి మన దేశ సైనిక సాయాన్ని అభ్యర్థించారు. ఇరు వర్గాల మధ్య పోరు కొన్నాళ్లు సాగింది. కశ్మీర్‌లో అత్యధిక భాగాన్ని పాక్ ఆక్రమించుకుంది. అప్పుడే పాక్ ఆక్రమిత కశ్మీర్, వాస్తవాధీన రేఖ ఏర్పడ్డాయి. చివరికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించాయి. కశ్మీర్ లోయలో రెండింట మూడు వంతుల భాగం భారత్ కిందకి వచ్చాయి. ఇక పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాన్ని ఆజాద్ కశ్మీర్ గిల్జిట్ బల్టిస్తాన్ అని పిలుస్తారు.

2. 1965: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటుకు పాక్ 1965లో భారీ కుట్రకు తెరతీసింది. ఆపరేషన్ గిబ్రాల్టర్ పేరుతో భారత్‌లో మారణహోమం సృష్టించడానికి పన్నాగాలు రచించింది. దీంతో భారత్ పశ్చిమ పాకిస్తాన్‌పై పూర్తి స్థారుు యుద్ధాన్ని ప్రకటించింది. మొత్తం 17 రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో ఇరుపక్షాలకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధికంగా యుద్ధట్యాంకులు వినియోగించింది ఈ యుద్ధంలోనే. దీనినే రెండో కశ్మీర్ యుద్ధం అని కూడా పిలుస్తారు. ఈ యుద్ధంలో కొద్ది రోజులకే పాక్ తోక ముడిచింది. పాకిస్తాన్ మీద భారత్ పైచేయి సాధించింది. అదే సమయంలో అమెరికా, రష్యా దౌత్యపరమైన జోక్యంతో యుద్ధం నిలిచిపోయింది. తాష్కెంట్ డిక్లరేషన్ అమల్లోకి వచ్చింది.

3. 1971: ఈ యుద్ధంలో వాస్తవానికి కశ్మీర్ ప్రమేయం ప్రత్యక్షంగా లేకపోయినా పాక్‌కు అత్యంత నష్టం కలిగించింది, భారత్ కశ్మీర్‌లో తిరిగి కొంత భాగాన్ని ఆక్రమించుకుంది ఈ యుద్ధంతోనే. పశ్చిమ, తూర్పు పాకిస్తాన్‌ల మధ్య సంక్షోభం తలెత్తడంతో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) పాలకుడు షేక్ ముజ్బీర్ రెహ్మాన్‌కు అండగా భారత్ నిలబడింది. బంగ్లాదేశ్ విముక్తి కోసం పాక్‌తో యుద్ధం చేసింది. పాక్ ప్రభుత్వ ఆగడాలు భరించలేని బెంగాలీలు బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరు బాట పట్టారు. వారికి అండగా నిలిచిన భారత్‌పైకి పాకిస్తాన్ యుద్ధానికి దిగింది. ఎన్నో ప్రాంతాలపై దాడులు మొదలు పెట్టింది. భారత్ ఆర్మీ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆ సమయంలోనే పాక్ అధీనంలో ఉన్న కశ్మీర్‌లో 5,795 చదరపు మైళ్ల భాగాన్ని మన సైన్యం కై వసం చేసుకుంది. రెండువారాల పాటు ఉధృతమైన పోరాటం తర్వాత బంగ్లాదేశ్ విముక్తి జరిగింది. ఆ తర్వాత కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందంలో భాగంగా భారత్ కశ్మీర్‌లో తాను సొంతం చేసుకున్న భాగాన్ని పాక్‌కు తిరిగి ఇచ్చేసింది. ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని, కశ్మీర్‌లో శాంతి నెలకొల్పాలనే భారత్ ఆ నిర్ణయం తీసుకుంది.

4. 1999: 1999 మొదట్లో పాకిస్తాన్ దళాలు వాస్తవాధీన రేఖ వెంబడి కశ్మీర్‌లోకి చొచ్చుకువచ్చాయి. కార్గిల్ జిల్లాలో అత్యధిక భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పాక్ చొరబాట్లను అడ్డుకోవడానికి ఈసారి పెద్ద ఎత్తున మిలటరీ చర్యకి భారత్ దిగింది. రెండు నెలల పాటు ఇరు దేశాల మధ్య పోరు సాగింది. పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాలన్నింటినీ భారత్ మిలటరీ తిరిగి తన అధీనంలోకి తెచ్చుకోవడం మొదలు పెట్టింది. పాక్ ఆక్రమించుకున్న ప్రాంతంలో 75 నుంచి 80శాతం వరకు తిరిగి భారత్ అధీనంలోకి వచ్చేశాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ తీవ్రత ఎక్కువైపోతూ ఉండడంతో పాకిస్తాన్‌ను వెనక్కి తగ్గమంటూ అమెరికా దౌత్యపరమైన ఒత్తిడిని పెంచింది. అప్పటికే పాక్ సైనికుల్లో నైతిక స్థైర్యం దెబ్బతింది. 4 వేల మంది వరకు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్థికంగా కూడా ఆ దేశం బలహీనపడిపోయింది. భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న పాక్ యుద్ధాన్ని నిలిపివేసింది. అలా కార్గిల్ యుద్ధంతో భారత్ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.

370 అధికరణం రద్దుకు దారితీసిన అంశాలు..
మొదటి నుంచి కశ్మీర్ సమస్యలకు, వివాదాలకు నిలయంగా మారింది. కశ్మీర్‌లో క్రయవిక్రయాలపై హక్కులు లేకపోవడం, ఉగ్రవాదుల దాడుల కారణంగా శాంతిభద్రతలు అదుపులో లేకపోవడంతో ఇన్నాళ్లూ పెద్ద కార్పొరేట్ కంపెనీలేవీ కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టడానికి సాహసించలేదు. స్థానిక రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో లబ్ధి చేకూరడానికి అనుగుణంగానే వ్యూహాలు రచించాయి. అధికారం ఎక్కువగా స్థానిక ప్రభుత్వం చేతుల్లోనే ఉండిపోవడంతో పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయాయి. మరొకవైపు ఉగ్రదాడులకు స్థావరంగా మారడంతో రద్దు అనివార్యమైంది.

ఆర్టికల్ 370 రద్దు: ఈ ఆర్టికల్‌లో ఉన్న నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిన పనిలేదు. ఆర్టికల్ 370లోని సెక్షన్ 3 ప్రకారం భారత రాష్ట్రపతి ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా కశ్మీర్‌కు ఇచ్చిన స్వతంత్రప్రతిపత్తిని రద్దు చేయడానికి అధికారాలున్నాయి. ఫలానా తేదీ నుంచి 370 రద్దు లేదంటే మార్పులు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వొచ్చు. ఈ నిబంధనతోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పక్కాగా వ్యూహాలు రచించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం 370ని రద్దు చేయాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. కానీ 370లో నిబంధన 3ని చాలా తెలివిగా వినియోగించుకున్న మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ నుంచి తప్పించుకుంది. భారత రాజ్యసభలో ఆగస్ట్ 5, 2019న ఉదయం 11 గంటకు, లోక్‌సభలో 12 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆర్టికల్ 370 రద్దును ప్రకటించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ క్షణాల్లో అనుమతిని తెలుపుతూ గెజిట్ విడుదల చేయడంతో అధికారికంగా 370 అధికరణం రద్దు జరిగింది. 360 రద్దుతో 35ఏ ఆర్టికల్ కూడా రద్దవుతుంది.ఈ ఆర్టికల్ రద్దుతో జమ్మూకశ్మీర్‌లోఢిల్లీ తరహా పాలన కొనసాగుతుంది.

రద్దుకు ముందు..
 • రాజ్యాంగంలోని 21వ భాగంలో పొందుపర్చిన ఆర్టికిల్ 370 ప్రకారం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. జమ్మూ కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు, ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. దేశంలోని మిగతా రాష్ట్రాలకు రాజ్యాంగం ప్రకారం కల్పించే సౌకర్యాలు కశ్మీర్‌కు వర్తింపవు.
 • రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక సమాచార అంశాలు మినహా..పౌరసత్వం, ప్రాపర్టీ ఓనర్షిప్, ప్రాథమిక హక్కులు కశ్మీర్‌కు భిన్నం.
 • రాష్ట్ర ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది
 • రాష్ట్రానికి ప్రత్యేకంగా జెండా ఉంది.
 • ఆర్టికల్ 360 (ఆర్థిక అత్యవసర స్థితి) అమలు చేయలేం.
 • పంచాయతీలకు హక్కులు లేవు
 • శాసనసభ కాలపరిమితి ఆరేళ్లు
 • హిందువులు, సిక్కులు తదితర మైనార్టీలకు రిజర్వేషన్లు లేవు
 • వేరే రాష్ట్రాల వారు ఇక్కడ భూములు, ఆస్తులు కొనడం నిషేధం
 • సమాచారహక్కు చట్టం వర్తించదు
 • వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఇక్కడి మహిళ పెళ్లాడితే ఆమెకున్న స్థానిక పౌరసత్వం, హక్కులు పోతాయి.
 • ఈ చట్టం ప్రకారం కశ్మీర్‌లో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే అధికారం కేంద్రానికి ఉండదు. కేవలం యుద్దం, బాహ్య వత్తిళ్ల వల్ల ఏర్పడే పరిణామాల నేపథ్యంలోనే కశ్మీర్‌లో ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం లేదా రాష్ట్రప్రభుత్వం కోరితేనే కేంద్రం ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉంది.

రద్దు తర్వాత..
కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయి భారత్‌లో అంతర్భాగమవుతుంది. దీనితో కశ్మీర్ ముఖచిత్రం ఎలా మారబోతోందంటే..
 • జమ్మూకశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లఢక్ అసెంబ్లీలేని కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది. కేంద్రానికే ఈ ప్రాంతంపై పూర్తిపట్టు ఉంటుంది.
 • కశ్మీరీ వాసుల ద్వంద్వ పౌరసత్వం రద్దయి ఒకే పౌరసత్వం కిందకు వస్తారు.
 • ఆ రాష్ట్రానికి ప్రత్యేక జెండా కూడా ఉండదు. ఒకే పతాకం.. అది త్రివర్ణమే..జాతీయ పతాకాన్ని అవమానించిన వారు నేరానికి అర్హులు. కశ్మీర్ ప్రజలు సొంత పతాకం కావాలని అనుకుంటే అందుకు పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంటుంది.
 • ఈ ప్రాంతానికి అసెంబ్లీ ఉన్నప్పటికీ ఢిల్లీ, పాండిచ్చేరి తరహాలో శాంతి భద్రతలు, భూముల నిర్వహణ కేంద్రం పరిధిలోనే ఉంటాయి. కేంద్ర హోం శాఖకు విశేష అధికారాలు సంక్రమిస్తాయి.
 • కశ్మీర్ సొంత రాజ్యాంగం రద్దయి..మిగతా రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే.. రాజ్యాంగం అమలౌతుంది
 • పంచాయతీలకు హక్కులు ఉంటాయి
 • శాసనసభ కాలపరిమితి 5 సంవత్సరాలు ఉంటుంది
 • విద్య, ఉపాధి రంగాల్లో కూడా భారతీయులందరికీ అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రిజర్వేషన్లు కూడా అక్కడ విద్యాసంస్థల్లో అమలవుతాయి. పస్తుతం 16 శాతం రిజర్వేషన్లు అమలౌతాయి
 • జమ్మూకశ్మీర్ గవర్నర్ ఇకపై లెష్ట్‌నెంట్ గవర్నర్‌గా వ్యవహరిస్తారు.
 • సమాచారహక్కు చట్టం అమలవుతుంది.
 • భారతీయుడ్నిగానీ, విదేశీయుడ్నిగానీ పెళ్లాడినా స్థానిక హక్కులు పోవు. భారత పౌరసత్వం ఉంటుంది.
 • కశ్మీరీ మహిళ పాకిస్తానీని పెళ్లి చేసుకుంటే మాత్రం కశ్మీర్ పౌరసత్వం రాదు
 • కాగ్‌నిబంధనలు, ఆదేశాలు వర్తింపు
 • భారత పార్లమెంటు చేసే అన్నీ చట్టాలు ఇకపై జమ్మూకశ్మీర్లో కూడా అమలౌతాయి
 • అవసరం అయితే కేంద్రానికి ఎమర్జెన్సీ విధించే అధికారం ఉంటుంది
 • తలక్ చట్టం అమలు అవుతుంది.
 • భారత సుప్రీంకోర్టు ఆదేశాలు జమ్మూకశ్మీర్లో కూడా అమలౌతాయి
 • కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక రణబీర్ పీనల్ కోడ్ (ఆర్‌పీసీ) స్థానంలో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) అమల్లోకి వస్తుంది.
 • జమ్మూ, కశ్మీర్‌తో ఆ ప్రాంతానికి ఎలాంటి సంబంధం ఉండదు. అండమాన్ నికోబార్, లక్షద్వీప్ మాదిరిగానే కేంద్రానికే విశేష అధికారాలు ఇక్కడ ఉంటాయి. కొండప్రాంతాల అభివృద్ధి మండలి కింద పాలన సాగుతుంది. లోక్‌సభ ఎన్నికల సమయంలోనే ఆ ప్రాంత ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోగలరు.
 • ఇంతవరకూ కశ్మీర్‌లో శాశ్వత నివాసులకు మాత్రమే అక్కడ భూములు, స్థిరాస్తుల క్రయవిక్రయాలపై హక్కులు ఉండేవి. ఇకపై దేశంలోని ఏ రాష్ట్రంలో పౌరులైనా కశ్మీర్‌లో భూములు, ఇతర స్థిరాస్తులు కొనుగోలు చేయగలరు. ఇష్టమైన వారు అక్కడ శాశ్వత నివాసం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
ప్రభుత్వ పథకాలన్నిటికీ జమ్మూకశ్మీర్ పౌరులు అర్హులు

భారత స్వాతంత్య్ర పూర్వం నుంచి కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు వరకు పరిణామాలు...
 • 1846: ఆంగ్లేయులకు సిక్కులకు మధ్య జరిగిన మొదటి యుద్ధం దరిమిలా జమ్మూ పాలకుడు రాజా గులాబ్ సింగ్‌కు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి మధ్య కుదిరిన ఒప్పందం (అమృత్‌సర్ ఒప్పందం) మేరకు మార్చి 16న జమ్మూకశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది.
 • 1946, మే: మహారాజుకు వ్యతిరేకంగా షేక్ అబ్దుల్లా క్విట్ కశ్మీర్ ఉద్యమాన్ని ప్రారంభించారు. అరెస్టయిన అబ్దుల్లాను కాపాడేందుకు నెహ్రూ విఫలయత్నం చేశారు.
 • 1946, జులై: బయటివారి ప్రమేయం అవసరం లేకుండా కశ్మీరీలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకుంటారని రాజా హరిసింగ్ ప్రకటించారు.
 • 1947, జూన్3: భారత దేశాన్ని భారత్, పాకిస్తాన్‌లుగా విభజించాలని మౌంట్ బాటెన్ ప్రతిపాదించారు
 • 1947, జూన్19: కశ్మీర్‌ను భారత్‌లోనో లేదా పాకిస్తాన్‌లోనో విలీనం చేసేలా హరిసింగ్‌ను ఒప్పించడం కోసం మౌంట్‌బాటెన్ ఐదు రోజులు కశ్మీర్‌లో ఉన్నారు
 • 1947, జులై: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఆహ్వానం మేరకు రాజా హరిసింగ్ ఢిల్లీ వచ్చి గోపాల్ దాస్‌తో చర్చలు జరిపారు.
 • 1947, జులై 11: కశ్మీర్ స్వతంత్రం కోరుకుంటే పాకిస్తాన్ దానితో స్నేహం చేస్తుందని మహ్మద్ అలీ జిన్నా ప్రకటించారు
 • 1947, ఆగస్టు1: మహాత్మాగాంధీ హరిసింగ్‌ను కలిసి ప్రజాభీష్టం మేరకు విలీనంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.
 • 1947, సెప్టెంబర్22: పాకిస్తాన్‌లో విలీనానికి సానుకూలత తెలుపుతూ ముస్లిం కాన్ఫరెన్‌‌స నిర్ణయం తీసుకుంది.అయితే, భారత్‌లో విలీనం కావాలని మహారాజు నిర్ణయించారని పాకిస్తాన్ టైమ్స్ పేర్కొంది.
 • 1947, అక్టోబర్: భారత్-పాక్ యుద్ధం. పాక్ వాయవ్య రాష్ట్రానికి చెందిన వేల మంది గిరిజనులు కశ్మీర్‌పై, రాజ హరిసింగ్ సైన్యంపై దాడికి దిగారు. హరిసింగ్ భారత్ సహాయం కోరారు. దానికి భారత్ పెట్టిన షరతుకు హరిసింగ్ అంగీకరించారు. ఇరు పక్షాలు విలీన ఒప్పందంపై సంతకం చేశాయి.భారత సైన్యం కశ్మీర్‌ను రక్షించింది. కశ్మీర్ విషయమై జరిగిన మొదటి యుద్ధమిది.
 • 1948: కశ్మీర్ సమస్యను భారత దేశం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ముందుకు తీసుకెళ్లింది.కాల్పుల విరమణ, కశ్మీర్ భవిష్యత్తుపై ప్రజాభిప్రాయ సేకరణ వంటి అంశాలతో తీర్మానం కుదిరింది.
 • 1949, జనవరి1: భారత్,పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగింది. కశ్మీర్‌లో కొంత భాగం పాక్‌కు వెళ్లిపోయింది.
 • 1949: జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో భాగం చేయాలంటూ కశ్మీర్ అసెంబ్లీ ఉద్యమం చేపట్టింది.
 • 1949, జూన్: మమారాజా హరిసింగ్ తన కుమారుడు కరణ్ సింగ్‌ను రాజప్రతినిధిగా నియమించి తాను వైదొలిగారు.
 • 1949, అక్టోబరు 17: కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగసభ రాజ్యంగంలో 370 అధికరణను చేర్చింది.
 • 1951, నవంబర్: రాజా హరిసింగ్ అధికారాలను రద్దు చేస్తూ, శాసన సభను ప్రభుత్వానికి జవాబుదారీ చేస్తూ రాజ్యాంగ సభ చట్టం చేసింది.
 • 1957: జమ్మూకశ్మీర్ భారత్‌లో భాగమని, ఈ విషయమై ప్రజాభిప్రాయ సేకరణ జరిపే ప్రసక్తే లేదని భారత హోం మంత్రి గోవింద్ వల్లభ్ పంత్ స్పష్టం చేశారు.
 • 1965: కశ్మీర్ విషయమై భారత్, పాక్ మళ్లీ తలపడ్డాయి.
 • 1966, జనవరి 10: రష్యా మధ్యవర్తిత్వంలో ఇరు దేశాలు 1965కు ముందున్న స్థానాలకు వెళ్లిపోవాలంటూ రూపొందించిన తాష్కెంట్ ఒప్పందంపై భారత్, పాక్‌లు సంతకాలు చేశాయి.
 • 1989: అఫ్గానిస్తాన్ నుంచి వేలమంది మిలిటెంట్లు కశ్మీర్‌లోకి ప్రవేశించారు. పాకిస్తాన్ వారికి అవసరమైన శిక్షణ, ఆయుధాలు అందజేసింది
 • 1989: కశ్మీర్ నుంచి పెద్ద సంఖ్యలో హిందువులు (కశ్మీరీ పండిట్లు) ఇతర ప్రాంతాలకు వలసపోసాగారు.
 • 1972: భారత్, పాకిస్తాన్‌ల మధ్య సిమ్లా ఒప్పందం కుదిరింది. దీనికి అనుగుణంగా పాక్ ఆక్రమిత కశ్మీర్, కశ్మీర్‌ల మధ్య నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) రూపుదిద్దుకుంది.
 • 1999: పాకిస్తాన్ మద్దతుతో మిలిటెంట్లు కశ్మీర్ సరిహద్దు దాటి కార్గిల్‌లో భారత సైనిక స్థావరాలను చట్టుముట్టారు. పది వారాల పాటు జరిగిన యుద్ధంలో భారత బలగాలను దురాక్రమణదారులను తిప్పికొట్టాయి.
 • 2013, ఫిబ్రవరి: భారత పార్లమెంటుపై దాడి కేసులో జైషే మహ్మద్ నేత అఫ్జల్ గురును ప్రభుత్వం ఉరితీసింది.
 • 2015, మార్చి: భారతీయ జనతాపార్టీ మొదటి సారి కశ్మీర్‌లో పీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
 • 2016: భారత సైనిక స్థావరాలపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది
 • 2019: పుల్వామా వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడిలో40 మంది భారత సైనికులు అమరులయ్యారు.దానికి ప్రతిగా భారత్ పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై మెరుపుదాడులు జరిపింది.
 • 2019, జులై 27: 100 కంపెనీల కేంద్ర బలగాల తరలింపు
 • 2019, జులై 28: 35A రద్దుపై మొదలైన ఊహాగానాలు, ఖండిస్తూ అఖిలపక్ష తీర్మనం
 • 2019, జులై 29: రాష్ట్రంలోని మసీదులు, కమిటీల నుంచి వివరణ కోరిన పోలీసులు
 • 2019, జులై 30: సామాన్యుల్లో యుద్ధ భయం, మార్కెట్లో నిత్యావసరాల కోసం క్యూ
 • 2019, జులై 31: 35A పై అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టిన మెహబూబా ముఫ్తీ
 • 2019, ఆగస్టు 1: 25వేల కేంద్ర బలగాల మెహ రింపు
 • 2019, ఆగస్టు2: ప్రభుత్వం అమర్‌నాథ్ యాత్రను రద్దు చేసింది. యాత్రికులు స్వస్థలాలకు వెళ్లిపోవాలని ఆదేశం.
 • 2019, ఆగస్టు 3: కశ్మీర్‌లోని పర్యాటకులు, యాత్రికులు, ఇతర రాష్ట్రాల విద్యార్థులను స్వస్థలాలకు తరలించారు.
 • 2019, ఆగస్టు 4: మెహబూబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లాలను గృహ నిర్బంధం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితన ఉన్నత భద్రతాధికారులతో చర్చలు జరిపారు.
 • 2019, ఆగస్టు 5: కశ్మీర్‌కు ప్రత్యేక హోదానిస్తున్న 370 అధికరణను కేంద్రం రద్దు చేసింది.
ఆర్టికల్- 371 ఇతర రాష్ట్రాలలో కూడా..
జమ్మూకశ్మీర్కి మాత్రమే కాదు ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఈ తరహా ప్రత్యేక పదుపాయాలతో కూడిన ఆర్టికల్- 371 అమలులో ఉంది. ఆర్టికల్-371ఏ నాగాలాండ్ హక్కులకు సంబంధించింది. నాగా ఆచార చట్టం ప్రకారం పౌర, నేర న్యాయ పాలన నిర్ణయాలకు సంబంధించి, భూ యాజమాన్యం, బదలాయింపునకు సంబంధించి నాగా అసెంబ్లీ ఆమోదించకుండా పార్లమెంట్ చేసే చట్టాలేవీ నాగాలకు వర్తించవు. ఆర్టికల్- 371ఏ లాంటిదే మిజోరాంకు సంబంధించిన ఆర్టికల్- 371జి. అస్సాంకు ఆర్టికల్- 371బి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. ఇక ఆర్టికల్- 371సి మణిపూర్‌కు, ఆర్టికల్-371ఎఫ్ సిక్కింకు, ఆర్టికల్- 371హెచ్ ఆరుణాచల్ ప్రదేశ్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది.

భవిష్యత్ పరిణామాలు..
భారతదేశానికి ఇప్పటివరకు 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండగా.. ఈ పరిణామంతో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్పుచెందుతుంది.పరిపాలనంతా కేంద్రం చేతుల్లోకి రావడం, కశ్మీర్‌కు రాకపోకలపై అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఆ ప్రాంత అభివృద్ధికి మార్గం సుగమమౌతుంది. రాబోయే రోజుల్లో దేశంలో ఇతర ప్రాంతాలతో సంబంధాలు ఏర్పడడం వల్ల సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా కశ్మీర్‌లో అనూహ్య మార్పులు వస్తాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కొన్నాళ్లు హింసాకాండకు తెరతీసినా, పాలన అంతా కేంద్రం గుప్పిట్లోకి రావడం వల్ల ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి అవకాశం ఉంటుంది. కశ్మీర్ లోయలో ఉగ్రవాదానికి ఊతమిస్తున్న వేర్పాటువాదులు, రాళ్ల దాడులతోనే కాలక్షేపం చేసే యువతను దారిలోకి తీసుకువచ్చే అవకాశాలు మెరుగవుతాయి. దీంతో కశ్మీర్‌కు కొత్త పెట్టుబడులు వచ్చి అభివృద్ధి పథంలో పయనించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ముస్లిం మెజార్టీ ఉన్న ఆ ప్రాంతంలో హిందూ జనాభా పెరిగే అవకాశం కూడా ఉంది. శాంతి, భద్రతలకు, జమ్మూకశ్మీర్ ప్రాంత అభివృద్ధికి ఇది ఒక మహత్కర పరిణామంగా దేశ చరిత్రలో నిలిచిపోతుంది.
Published date : 07 Aug 2019 03:13PM

Photo Stories