Skip to main content

వెనిజులా సంక్షోభం-కారణాలు

డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్
ఒపెక్ దేశాల్లో ఆరో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారైన వెనిజులా తీవ్ర సంక్షోభం బారినపడింది. 2005లో అధిక వృద్ధి నమోదు చేసిన ఈ దేశం తదుపరి కాలంలో లోపభూయిష్ట విధానాల కారణంగా సంక్షోభంలో చిక్కుకుంది. అధిక ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ క్షీణత, అధిక ద్రవ్య సరఫరా, ద్రవ్య నిర్వహణ లోపం, చమురు సంక్షోభం, లోప భూయిష్ట వినిమయ రేటు విధానం, అధిక ప్రభుత్వ వ్యయం, అధిక రుణ భారం సంక్షోభానికి ప్రధాన కారణాలు. అయితే ప్రభుత్వ రంగ సామర్థ్యం పెంపునకు చర్యలు తీసుకోవడం, లక్షిత ద్రవ్యోల్బణ విధానం సమర్థ అమలు ద్వారా వెనిజులా సంక్షోభం నుంచి బయటపడేందుకు అవకాశాలు ఉన్నాయి.

వెనిజులా ఎదుర్కొంటున్న సంక్షోభానికి ఆ దేశ ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణంగా నిలిచాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఐక్యరాజ్య సమితి వంటివి ఆహారంతో పాటు ఇతర అంశాల్లో సహాయం చేసేందుకు ముందుకొచ్చినా వెనిజులా అంగీకరించలేదు. వెనిజులా 2016, డిసెంబర్‌లో 100-బొలివర్ నోటును రద్దు చేసి, దాని స్థానంలో నూతన కరెన్సీ ప్రవేశపెట్టింది. నూతన కరెన్సీ బ్యాంకులు, నగదు మెషీన్లకు చేరడానికి అధిక సమయం పట్టడంతో ఆ దేశం నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. అదే సమయంలో బ్లాక్ మార్కెట్ విస్తరణ,అవినీతి పెరగడం వంటి ప్రతికూలతలను చవిచూసింది. వెనిజులా విదేశీ రుణంలో చైనా 1/3వ వంతు వాటా కలిగి ఉంది. గత దశాబ్ద కాలంలో చైనా 65 బిలియన్ డాలర్ల రుణాన్ని వెనిజులాకు అందించింది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో తీసుకున్న రుణానికి ప్రతిగా చైనాకు అధిక మొత్తంలో చమురు ఎగుమతి చేయడంతో వెనిజులా తీవ్ర నష్టం చవిచూసింది. అదే సమయంలో చైనా బాగా లబ్ధి పొందింది. వెనిజులా తన మొత్తం చమురు ఉత్పత్తిలో 1/3వ వంతుకు పైగా చైనాకు ఎగుమతి చేస్తోంది.

వెనిజులా పెట్రోలియం, తయారీ రంగ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. 2017 నాటికి దేశ జనాభా 31 మిలియన్లపైనే. స్థూల దేశీయోత్పత్తి 515.7 బిలియన్ డాలర్లు. గత ఐదేళ్ల సగటు సాంవత్సరిక వృద్ధి 0.3 శాతం కాగా, 2010 తదుపరి రుణాత్మక వృద్ధి నమోదు చేసింది. 2017లో స్థిర ధరల వద్ద స్థూల దేశీయోత్పత్తి మైనస్ 4.50 శాతంగా నమోదైంది. పెద్దమొత్తంలో ఉన్న చమురు సంపద వెనిజులా ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలకం. యూఎన్‌డీపీ మానవాభివృద్ధి నివేదిక ప్రకారం అధిక మానవాభివృద్ధి సాధించిన దేశాల్లో వెనిజులా ఒకటి. 2000వ దశకానికి ముందు అనేక దేశాలు వెనిజులా సామ్యవాద వ్యవస్థ ప్రగతిని ప్రశంసించాయి. సామ్యవాద వ్యవస్థ పనితీరు.. ప్రపంచీకరణ యుగంలో మార్కెట్ ఆధారిత వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. చమురు ఉత్పత్తికి సంబంధించి ఒపెక్ దేశాల్లో వెనిజులా ఆరోస్థానం పొందింది. 1950-1980 మధ్యకాలంలో స్థిరమైన వృద్ధి నమోదుచేసి వలసలను ఆకర్షించింది. వెనిజులా తయారీ రంగం వాటా స్థూల దేశీయోత్పత్తిలో (సుమారు)15 శాతంగా, వ్యవసాయ రంగం వాటా 3 శాతానికి పైగా నమోదవుతోంది. వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక అంశాల్లో వెనిజులా స్వయం సమృద్ధి సాధించింది. వెనిజులా ఆహార ఉత్పత్తుల దిగుమతుల్లో అమెరికా వాటా 1/3వ వంతు కాగా, వెనిజులాకు సంబంధించి అమెరికా అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంది. వెనిజులాలో 2013 నాటికి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజలు 28.35 శాతం కాగా, 2015లో వీరిని 70 శాతంగా అంచనా వేశారు.

సంక్షోభ పరిణామ క్రమం
2016, ఆగస్టు నాటికి ఫార్మా దిగుమతులకు సంబంధించి 3.5 బిలియన్ డాలర్లు, ఆహార ఉత్పత్తుల దిగుమతులకు సంబంధించి 2 బిలియన్ డాలర్లు, ఎయిర్‌లైన్‌‌స కంపెనీల బకాయిలను వెనిజులా ప్రభుత్వం చెల్లించలేక పోయింది. 1970వ దశకం తదుపరి కాలంలో చమురు ధరలు పది రెట్లు పెరిగినా, 2016లో తలసరి స్థూల దేశీయోత్పత్తి రెండు శాతం క్షీణించింది. 1997 సంవత్సరం తదుపరి చమురు ఉత్పత్తి తగ్గింది. 2015, 2016 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థలో వృద్ధి పడిపోయింది. ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితిని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ పరిణామాల ఫలితంగా వెనిజులా ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణాన్ని చవిచూసింది.

హ్యూగో ఛావెజ్, నికోలస్ మదురోలపాలనలో సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అయిన వెనిజులాలో జాతీయోత్పత్తి క్షీణించి ద్రవ్యోల్బణం పెరిగింది. సంక్షోభం తీవ్రమైన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడైన మదురో 2016, ఆగస్టు-సెప్టెంబర్ మధ్యకాలంలో 60 రోజులపాటు ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించారు. అధిక ద్రవ్యోల్బణం, జాతీయ కరెన్సీ విలువ క్షీణత, అధిక ద్రవ్య సరఫరా వంటి వాటి కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం తీవ్రమైంది.

చమురు ధరల పతనం, హాస్పిటల్స్ తగ్గడం, ఆహార సరఫరాలో క్షీణత, మందుల కొరత కారణంగా వెనిజులా ప్రభుత్వ ఆర్థిక నమూనా విఫలమైంది. దేశంలో 85 శాతం ప్రజలకు మందుల కొరత ఏర్పడింది. మాంసం, చేపలు, పండ్లు, పంచదార, బ్రెడ్ వంటి రోజువారీ అవసరాలను తీర్చలేని పరిస్థితి నెలకొంది. 2016 ఆగస్ట్‌లో 1,50,000 మంది ప్రజలు ఆహారం, మందుల కొనుగోలుకు కొలంబియా వెళ్లారు. దీన్నిబట్టి ఆ దేశ పరిస్థితేంటో అర్థమవుతోంది.

అంతర్జాతీయ సంస్థల సహాయాన్ని తీసుకుంటే ప్రభుత్వం విఫలమైందనే భావన ప్రజల్లో ఏర్పడుతుందనే తమ సహాయాన్ని వెనిజులా ప్రభుత్వం తిరస్కరించిందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అధికారులు వెల్లడించారు. దీర్ఘకాల ఆర్థిక నిర్వహణ లోపం కారణంగా 2015 డిసెంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్షం 2/3 వంతు మెజారిటీ సాధించింది. న్యాయ వ్యవస్థ, ఇతర కీలక సంస్థలపై నియంత్రణ ఉన్న మదురో ఉద్వాసనా ప్రయత్నాలను సైతం ఎదుర్కోవాల్సి వచ్చింది. సాధ్యమైనంత తొందరగా మదురోను అధికారం నుంచి తొలగించేందుకు రెఫరెండం నిర్వహణ లేదా రాజ్యాంగ సవరణకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి.

ద్రవ్యోల్బణం-ద్రవ్య నిర్వహణ లోపం
వెనిజులా ఆర్థిక సంక్షోభానికి హైపర్ ద్రవ్యోల్బణాన్ని ముఖ్య కారణంగా పేర్కొనొచ్చు. అనధికారిక అంచనాల ప్రకారం 2015 రెండో అర్ధభాగంలో ద్రవ్యోల్బణం 370 శాతంగా నమోదైంది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2016లో ద్రవ్యోల్బణం 475.80 శాతం కాగా, 2017లో 1660 శాతంగా నమోదైంది. 2014- 2017 మధ్యకాలంలో ప్రపంచంలో అధిక ధరల ద్రవ్యోల్బణం వెనిజులాలో నమోదైంది. ప్రముఖ ఆర్థికవేత్తల అభిప్రాయంలో 2017 చివరి నాటికి ద్రవ్యోల్బణం 905.9 శాతంగా, 2018లో 884.4 శాతంగా ఉండగలదు.

వెనిజులా పాలు, గుడ్లు వంటి ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకోలేని స్థితిని ఎదుర్కొంది. దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటాయి. హైపర్ ద్రవ్యోల్బణం ఎక్కువ నెలలు కొనసాగడంతో ఆర్థిక అస్థిరత ఏర్పడింది. ఆహార కొరత కారణంగా 75 శాతం వెనిజులా ప్రజలు సగటున 8.6 కేజీల బరువు కోల్పోగా, 1/3 వంతు ప్రజలు రోజుకు రెండు కంటే ఎక్కువసార్లు ఆహారం తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆ దేశం అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేసేందుకు కరెన్సీ రద్దు, మనీ లాండరింగ్‌ను అరికట్టేందుకు కొలంబియా, బ్రెజిల్ సరిహద్దులను తాత్కాలికంగా మూసివేయడం వంటి చర్యలు తీసుకుంది.

చమురు సంక్షోభం
ఆయిల్ బూమ్ కాలంలో వెనిజులాలో స్థూల ఆర్థిక చలాంకాల ప్రగతి మెరుగైంది. ఆ దేశ మొత్తం ఎగుమతుల్లో చమురు వాటా 96 శాతంగా ఉంది. 2014 జూన్‌లో బ్యారెల్ చమురు ధర 115 డాలర్లు కాగా, 2016 జూన్ నాటికి 28.36 డాలర్లకు తగ్గింది. ఈ స్థితి ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపించింది. ప్రభుత్వ రాబడిలో చమురు ఎగుమతుల రాబడి వాటా 40 శాతానికి పైగా ఉంది.

ప్రభుత్వ వ్యయ సంక్షోభం
గత పదేళ్లలో సంక్షేమ కార్యక్రమాల అమలుతో ప్రభుత్వ వ్యయం పెరిగింది. 20 ఏళ్ల కాలంలో మొదటిసారిగా ఇంధన ధరలను పెంచి.. మూల్యహినీకరణ విధానాన్ని అవలంబించింది. అమెరికన్ డాలర్‌తో పోల్చితే బొలివర్ విలువలో 37 శాతం క్షీణత ఏర్పడింది. స్థూల దేశీయ పొదుపు 2005లో జీడీపీలో 42.19 శాతం కాగా, 2017లో 10.96 శాతానికి తగ్గింది. నిరుద్యోగితా రేటు 2014లో 6.7 శాతం కాగా, 2017లో 21.37 శాతానికి పెరిగింది. చమురు ధరలు తగ్గడంతో ప్రభుత్వ రాబడి తగ్గి రుణ భారం పెరిగింది. మరోవైపు దిగుమతులకు అనుగుణంగా చెల్లింపులు చేయలేని స్థితిని ఎదుర్కొంది. స్థిర ధరల వద్ద స్థూల దేశీయోత్పత్తి 2005లో 10.32 శాతం కాగా, తదుపరి కాలంలో రుణాత్మక వృద్ధి నమోదైంది.

ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అధిక అవినీతి కారణంగా ప్రభుత్వ రాబడి గణనీయంగా తగ్గింది. వెనిజులా విదేశీ రుణంలో చైనా వాటా 1/3వ వంతుగా ఉంది. దాంతో స్వల్ప ధరల వద్ద అధిక మొత్తంలో చమురును చైనాకు ఎగుమతి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆర్థిక స్వేచ్ఛ సూచీ-2017
ఆర్థిక స్వేచ్ఛ సూచీలో వెనిజులా (179వ స్థానం) వెనుకబాటుకి కారణాలు..
బలహీన ప్రభుత్వ రంగ సంస్థలు, చట్టబద్ధ స్వతంత్రత లేకపోవడం వంటివి వాస్తవిక హక్కులను క్షీణింపచేశాయి. ప్రభుత్వ ఆర్థిక విధానాలు ముఖ్యంగా కరెన్సీ, ధరల నియంత్రణ ఆర్థిక వ్యవస్థలో అవినీతి, బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలు, ప్రభుత్వ అధికారుల- సంఘటిత నేర నెట్‌వర్‌‌క మధ్య సంబంధాల పెరుగుదలకు దారితీశాయి.

వెనిజులాలో గరిష్ట ఆదాయపన్ను, గరిష్ట కార్పొరే ట్ పన్నురేటు 34 శాతంగా ఉంది. స్వదేశీ ఆదా యంలో మొత్తం పన్ను భారం 20.9 శాతం కాగా, మూడేళ్లలో ప్రభుత్వ వ్యయం స్థూల దేశీయోత్పత్తిలో 40.2 శాతంగా నమోదైంది. వెనిజులా ఆర్థిక వ్యవస్థలో అధికారుల జోక్యం ఉత్పాదకత వృద్ధి, నియంత్రణా సామర్థ్యం క్షీణతకు కారణమైంది. శ్రామిక మార్కెట్ నియంత్రణ స్థిరంగా ఉండటంతో ఉపాధి కల్పన క్షీణించింది. ప్రభుత్వ విధానాలు విదేశీ పెట్టుబడి, ప్రభుత్వ రంగ సంస్థలను నిరుత్సాహపరిచేవిగా ఉన్నాయి. ప్రభుత్వ జోక్యం కారణంగా విత్త వ్యవస్థలో అనిశ్చితి ఏర్పడింది.
Published date : 20 Nov 2017 05:12PM

Photo Stories