Skip to main content

ఉప్పెనలా వలస సంక్షోభం

భవిష్యత్తు మీద ఆశతో మాతృదేశాన్ని వదిలి వెళ్తూ.. మార్గమధ్యంలో ముఠాల బారిన పడి మరణిస్తూ.. అన్నింటినీ తప్పించుకొని విదేశీ గడ్డపై అడుగిడినా.. అక్కడా బతికే పరిస్థితులు లేకపోవడం ఒకవైపు.. అతలాకుతలమైన ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం వంటి సమస్యలతో సతమతమవుతున్న ఐరోపా మరోవైపు.. అంతర్జాతీయ సమాజం మొత్తం మానవీయ కోణంతో వారిని అక్కున చేర్చుకోవాలని చేస్తున్న నినాదాలు ఇంకోవైపు... ఈ నేపథ్యంలో వలస సంక్షోభంపై ఫోకస్..
మంచి అవకాశాలు, వాణిజ్య కార్యకలాపాల కోసం ఒక ప్రాంతం నుంచి అభివృద్ధి చెందిన మరో ప్రాంతానికి లేదా సహజ వనరులు విస్తృతంగా లభిస్తున్న ప్రాంతాలకో ప్రజలు వలస వెళ్లడం సహజమే. అయితే ఈ మధ్య కాలంలో పరిస్థితులు మారిపోయాయి. తమ ప్రాణాలు కాపాడుకోడానికి, భవిష్యత్తు తరాలకు మంచి జీవితాన్ని అందించాలనే తపనతో మధ్య ప్రాచ్య, తూర్పు ఆఫ్రికన్ దేశాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఐఎస్‌ఐస్ ఉగ్రవాద సంస్థ విజృంభణ, రాజ్య వ్యవస్థ కుప్పకూలిపోవడం వంటి సంఘటనలు ఆయా దేశాల్లో వెల్లువెత్తాయి.

వలసలకు కారణాలు
రెండు కోట్లా 30 లక్షల మంది జనాభా ఉన్న సిరియాలో 2011లో అంతర్యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి 90 లక్షల మంది సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారని సరిహద్దు గస్తీ సంస్థ ‘ఫ్రాంటెక్స్’ అంచనా వేసింది. ఐరోపా దేశాలకు వస్తున్న వలసదారుల్లో సిరియా నుంచే ఎక్కువ మంది ఉంటున్నారని తెలిపింది. ఇరాక్‌లోని అమెరికా దళాలు వెనక్కి వెళ్లినప్పటి నుంచి ఉగ్రవాద ఆత్మాహుతి దాడులు పెరిగి శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. లిబియాలో నియంత గడాఫీ మరణం తర్వాత అక్కడి రాజ్యవ్యవస్థ కుప్పకూలింది. సూడాన్, ఎరిట్రియా వంటి ఆఫ్రికన్ దేశాల్లో శాంతిభద్రతలు క్షీణించి ప్రజాజీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. మరోవైపు ఐఎస్‌ఐఎస్ రోజురోజుకూ బలపడి మధ్యప్రాచ్య దేశాలకు సరికొత్త సవాళ్లను విసురుతోంది. ఇంతటి దుర్భరమైన పరిస్థితుల్లో అక్కడి ప్రజలు పశ్చిమాఫ్రికా, పశ్చిమ మధ్యధరా సముద్రం, పశ్చిమ బాల్కన్ సముద్ర మార్గాల ద్వారా సురక్షిత ప్రాంతాల వైపు వెళ్తున్నారు.

శరణార్థుల దైన్యం
మార్గమధ్యంలో ఉన్న నిఘా వర్గాల నుంచి తప్పించుకోవాలని కారు ఇంజన్లో పడుకొని, ఊపిరి సలపని పరిస్థితుల్లో ప్రయాణించడం; ఒక రిఫ్రిజరేటర్ వ్యానులో సుమారు 70 మందికి పైగా జనాలు ప్రయాణిస్తూ ఊపిరాడక చనిపోవడం; హంగరీ దేశం ఏర్పాటు చేసిన ముళ్ల కంచెలకు అంటుకున్న వస్త్రాలు.. ఆయా దేశల్లోని శరణార్థుల దైన్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. గ్రీస్ దేశానికి శరణార్థులుగా వెళ్తున్న ఒక కుటుంబంలోని మూడేళ్ల బాలుని శవం టర్కీ తీరానికి కొట్టుకొచ్చిన దృశ్యం ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది.

అక్రమ రవాణా ముఠాల విజృంభణ
మొత్తం వలస దరఖాస్తుల్లో జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్వీడన్ దేశాలకు 2/3 వంతు వస్తున్నాయి. ఇక అక్రమంగా ఈ దేశాల్లోకి వస్తున్న వారి సంఖ్య ఎక్కువే. అక్రమంగా దేశాల్లోకి ప్రవేశిస్తున్నవారి వల్ల తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఆయా దేశాలు తెలిపాయి. శరణార్థులంతా అక్రమ రవాణా ముఠాలకు వేలాది డాలర్లు చెల్లించి మోసపోతున్నారు. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తామని వీరి నుంచి డబ్బు తీసుకొని చివరకు తుపాకీతో బెదిరించి నాటుపడవల మీద ఎక్కించి అక్రమంగా తరలిస్తున్నాయి. అంతర్జాతీయ నేరాల్లో నిష్ణాతులైన ఈ ముఠాలు మారణాయుధాలతో చాలా పకడ్బందీగా పనిచేస్తూ సైన్యాలకు కూడా సవాళ్లు విసురుతున్నాయి. వీరు వలసదారులపై దాడులకుపాల్పడుతున్నారు.

వలసల నిరోధంలో ఐరోపా దేశాలు
వీటన్నిటినీ తప్పించుకొని ఐరోపా దేశాల్లోకి వెళ్తే వీరిని అక్కున చేర్చుకోకపోగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ వలసలను నియంత్రించడానికి పలు దేశాలు వివిధ ప్రయత్నాలు చేశాయి. రోడ్డు, రైలు మార్గాల మూసివేత; పలు రైళ్లను చాలా రోజులు రద్దు చేయటం; కఠినమైన సరిహద్దు తనిఖీ విభాగం ఏర్పాటుచేయడం వంటి ప్రయత్నాలు చేశాయి. సెర్బియా నుంచి తమ దేశంలోకి రాకుండా హంగరీ ఇటీవలే 175 కిలోమీటర్ల సరిహద్దును ముళ్లకంచెలతో మూసివేసింది. 1989లో బెర్లిన్ గోడలు కూలిన తర్వాత ఐరోపా దేశాల్లో ఇలాంటి ముళ్లకంచెలు, గోడలు ఏర్పాటవటం ఇదే మొదటిసారి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత భారీ సంఖ్యలో శరణార్థులు ఐరోపా దేశాలకు రావటం కూడా ఇదే ప్రథమం.

ఒప్పందాల ఉల్లంఘన
స్కెంజన్ ఒప్పందం(1985) ప్రకారం మొత్తం ఐరోపాలోని 28 దేశాల్లో సరిహద్దు ఆంక్షలు నిషేధించి ఉమ్మడి వీసా విధానం తీసుకువచ్చారు. ఇందువల్ల యూరప్‌లో ఒక దేశంలో అడుగుపెడితే మిగిలిన దేశాలకు వెళ్లడం తేలికైంది. అందుకే శరణార్థులు ముందుగా ఇటలీ, గ్రీసు దేశాలకు చేరుతున్నారు. గ్రీసు నుంచి భూభాగం ద్వారా మాసిడోనియా వంటి దేశాల ద్వారా జర్మనీ, స్పెయిన్ తదితర దేశాలకు చేరుతున్నారు. డబ్లిన్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒక దేశానికి శరణార్థిగా దరఖాస్తు చేసుకుంటే.. ఆ దేశం మొదట మౌలిక సౌకర్యాలతోపాటు ఆరునెలల్లోపు ఉద్యోగం కల్పించాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా కారణంతో ఆ వ్యక్తికి ఉద్యోగం కల్పించలేకపోతే వారు కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే జర్మనీ, చెక్ రిపబ్లిక్ డబ్లిన్ ఒప్పందాన్ని నిలిపేశాయి. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్‌లు శరణార్థులను అన్ని దేశాలు సమానంగా పంచుకునేటట్లు ఒక ప్రతిపాదనను తెరమీదకు తీసుకొస్తున్నాయి. ఐరోపా దేశంలో సరిహద్దు ఆంక్షలు లేని కారణంగానే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని చాలా మంది అభిప్రాయం.

వివిధ అంచనాలు
సిరియాలో నియంతృత్వ ప్రభుత్వం 2,40,000 మందిని హతమార్చిందని సరిహద్దు గస్తీ సంస్థ ‘ఫ్రాంటెక్స్’ ఒక నివేదికలో వెల్లడించింది. అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) అంచనాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లో 5 పడవల్లో సుమారు 2000 మందికి పైగా శరణార్థులు మధ్యధరా సముద్రంలో మునిగిపోయారు. దాదాపు 1900 మంది శరణార్థులు చనిపోయారు. 2000 నుంచి 2014 వరకు దాదాపు 22 వేల మంది మరణించడం లేదా అదృశ్యమయ్యారని ఐఓఎం తెలిపింది. ఇటీవల కాలంలో దాదాపుగా 3072 మంది చనిపోయారని ఆ సంస్థ వెల్లడించింది. ఐరోపా స్టాటిస్టిక్ సంస్థ యూరోస్టాట్ ప్రకారం ఇప్పటి వరకు 6,26,000 మందికి పైగా యూరప్‌లో శరణార్థిగా ఉండడానికి దరఖాస్తు చేసుకున్నారు.

నాణేనికి మరోవైపు
గ్రీసులో ఆర్థిక సంక్షోభం; బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలలో నిరుద్యోగ సమస్య; మొత్తం యూరోపియన్ దేశాల్లో నానాటికీ తగ్గుతున్న ఆర్థిక వృద్ధి; ఇలాంటి సమస్యలతో సతమతమవుతుంటే.. శరణార్థుల రూపంలో సంక్షోభం రావడం ఆయా దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రతీరోజూ లక్షల్లో వస్తున్న శరణార్థులకు ఆశ్రయం కల్పించడం ఏ దేశానికైనా భారమే. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ కనీసం 3 లక్షల మంది ఐరోపాకు శరణార్థులుగా వెళ్లారని అంచనా. వీరిలో అక్రమ మార్గాల్లో వస్తున్నవారే ఎక్కువ. సంపన్న దేశాలుగా పేరొందిన ఐరోపా దేశాలు కొత్తగా వచ్చిన ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నాయి.

శరణార్థులను తిరస్కరించడానికి గల కారణాలు
 • ఐరోపా దేశాల సంస్కృతి, నాగరికత, అస్థిత్వం దెబ్బతింటాయని చాలా దేశాలు వలసవాదులను చేర్చుకోవడానికి ఒప్పుకోవటం లేదు.
 • ఐరోపా ఖండంలోని దేశాలు చిన్న వైశాల్యం, జనాభా కలిగినవి. తమ దేశాల్లో ఉన్న వనరులను అత్యంత జాగరూకతతో ఉపయోగించుకొని సుసంపన్నమైన దేశాలుగా మారాయి. ఇప్పుడు అదనంగా లక్షల సంఖ్యలో జనాభా చేరితే తిండి, బట్టలు, నివాస సదుపాయం, ఉపాధి తదితరాలను సమకూర్చడం కష్టమవుతోందని వాదిస్తున్నాయి.
 • మధ్యధరా సముద్రం మీదుగా శరణార్థులు మొదటగా ఇటలీ, గ్రీసు లాంటి దేశాలకు చేరుతున్నారు. ఇప్పటికే గ్రీసు దేశం రుణ సంక్షోభంలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతోంది. ఇక ఈ వలసలు ఆ దేశానికి ఇబ్బందికరంగా మారాయి.
 • యూరోపియన్ యూనియన్‌లోని 28 సభ్యదేశాల మధ్య ఆర్థిక అసమానతలు, అంతరాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల కాలంలో దీని తీవ్రత మరీ ఎక్కువైంది. ఉదాహరణకు స్పెయిన్‌లో ప్రతి నలుగురు వయోజనుల్లో ఒకరు నిరుద్యోగిగా ఉన్నారు. తమ దేశ ప్రజలకే పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించలేని స్థితిలో ఆ దేశం ఉన్నప్పుడు లక్షల్లో వస్తున్న శరణార్థులకు మెరుగైన జీవితాన్ని, ఉపాధి ఎలా అందించగలదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
 • ఫ్రాన్స్‌లో వ్యంగ్య చిత్రకారుడు చార్లెస్ హెబ్డోపై ఉగ్రవాదులు చేసిన దాడుల్లాంటివి పునరావృతం కావచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తూ హంగరి లాంటి దేశాలు వారిని అనుమతించడానికి భయపడుతున్నాయి.
 • ఎక్కువ సంఖ్యలో వస్తున్న వలసవాదులను అవకాశంగా తీసుకొని ఐఎస్‌ఐఎస్ లాంటి ఉగ్రవాద సంస్థలు తమ దేశాలపై దాడులు, కార్యకలాపాలు సాగించే అవకాశాలు ఉన్నాయని ఈ యూరప్ దేశాలు పేర్కొంటున్నాయి.
 • ప్రస్తుతం శరణార్థుల సంక్షోభం ఆయా దేశాల్లో రాజకీయ భేదాభిప్రాయలకు తెరతీసింది. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలు శరణార్థులను సమానంగా పంచుకోవాలనే ప్రతిపాదనను తీసుకొచ్చాయి. అయితే అన్ని దేశాలను ఒకే తాటిన కట్టడం సరికాదని మిగిలిన దేశాలు తోసిపుచ్చుతున్నాయి.

చేపట్టాల్సిన చర్యలు
 • ఆయా దేశాల్లో శాంతి, అంతర్గత భద్రత స్థాపనకు నాటో లాంటి సైనిక దళాలను ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగం ఉపయోగించాలి.
 • ఉగ్రవాదంపై ఇప్పటివరకు అంతర్జాతీయంగా ఏకగ్రీవ తీర్మానం /ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక వంటివి లేవు. ప్రతి దేశం ఏదో ఒక సమయంలో ఉగ్రవాదం బారినపడినవే కావడంతో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో ఐఎస్‌ఐఎస్ వంటి సంస్థలపై ఉక్కుపాదం మోపాలి.
 • అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా, బ్రిటన్, జపాన్ లాంటి దేశాలు ముందుకొచ్చి సిరియా, ఇరాక్ లాంటి దేశాలతో ఆర్థిక, రాజకీయ, ద్వైపాక్షిక, బహుపాక్షిక చర్చలు జరిపి శాంతి స్థాపనకు కృషిచేయాలి.
 • ప్రతి యూరప్ దేశం నిర్దిష్ట సంఖ్యలో శరణార్థులను అనుమతించేలా కోటా విధానాన్ని అమలు చేయాలి.

తక్షణ రక్షణ చర్యలు అవసరం
ఐక్యరాజ్య సమితిలోని శరణార్థుల విభాగం.. ఉమ్మడి విధానం ద్వారా కనీసం 2 లక్షల మంది శరణార్థులను తీసుకోవాలని, ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి యూరప్ దేశాలు పూర్తి శక్తియుక్తులతో ముందుకురావాలని పిలుపునిచ్చింది. జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ కూడా శరణార్థుల కోసం ఐరోపా దేశాలన్నీ ఈ విషయంపై చర్చించి తక్షణమే చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

రెండు కోట్ల 30 లక్షల మంది జనాభా ఉన్న సిరియాలో 2011లో అంతర్యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి 90 లక్షల మంది సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారని సరిహద్దు గస్తీ సంస్థ ‘ఫ్రాంటెక్స్’ అంచనా వేసింది. ఐరోపా దేశాలకు వస్తున్న వలసదారుల్లో సిరియా నుంచే ఎక్కువ మంది ఉంటున్నారని తెలిపింది.

అంతర్జాతీయ వలసల సంస్థ
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన వలస సమస్యల పరిష్కారం కోసం ఈ సంస్థ ఏర్పడింది.
 • స్థాపన: 1951
 • ప్రధాన కార్యాలయం: జెనీవా (స్విట్జర్లాండ్)
 • అధికార భాషలు: ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్
 • సభ్యదేశాలు: 157 (2014)
 • డెరైక్టర్ జనరల్: విలియం లాసి స్వింగ్

విధులు:
 • అంతర్జాతీయంగా వలస సహాయం అవసరమైన వ్యక్తుల కోసం సురక్షిత, నమ్మకమైన, సౌకర్యవంతమైన సేవలు అందించడం.
 • వలసల నిర్వహణపై పెరుగుతున్న సవాళ్లను తీర్చడంలో సహాయం.
 • జాతీయ సామర్థ్యాలను నిర్మించడం, వలస విషయాలపై, అంతర్జాతీయ, ప్రాంతీయ, ద్వైపాక్షిక సహాయం సులభతరం చేయడం.
Published date : 19 Sep 2015 12:13PM

Photo Stories