Skip to main content

రష్యాలో క్రిమియా విలీనం-అమెరికా ఆగ్రహం

డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్.
అగ్రరాజ్యాలైన అమెరికా,రష్యాల మధ్య మరో ప్రచ్ఛన్నయుద్ధానికి తెరలేచింది. ఉక్రెయిన్ నుంచి స్వాతంత్య్రం పొందిన క్రిమియాను రష్యాలో విలీనం చేయడం సరికాదంటూ అమెరికా ఆరోపిస్తుంటే... క్రిమియా చేరిక స్వచ్ఛందంగానే సాగిందంటూ రష్యా సమర్థించుకుంటోంది. ఈ విషయంలో ఇరు రాజ్యాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు, పరిణామాలపై విశ్లేషణాత్మక కథనం...

ఉక్రెయిన్ ఉనికి:
జనాభా విషయంలో ఫ్రాన్స్‌తో సమానంగా ఐరోపాలో ప్రముఖ స్థానాన్ని ఉక్రెయిన్ పొందింది. రష్యాతోపాటు నాటో సభ్యదేశాలైన పోలండ్, స్లోవేకియా, హంగరీ, రుమేనియా దేశాల మధ్య ఉన్న ఉక్రెయిన్ భౌగోళికంగా వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిఉంది. 1991లో సోవియెట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్ విడిపోవడం రష్యాలోని రాజకీయ వేత్తలు, సాధారణ పౌరులకు రుచించలేదు. రాజకీయంగా, ఆర్థికపరంగా రష్యాలో ఉక్రెయిన్ ఓ అంతర్భాగంగా వారు భావించారు. కాగా అమెరికాతోపాటు మధ్య, తూర్పు ఐరోపా దేశాలు మాత్రం స్వతంత్ర ఉక్రెయిన్, ఐరోపా పటిష్టతకు దోహదపడుతుందని ఆశిస్తూ వస్తున్నాయి..

ఆరెంజ్ విప్లవం:
1990వ దశకం మధ్య భాగం నుంచి 2004 వరకు ఉక్రెయిన్ రాజకీయాలలో అధ్యక్షుడు లియోనిడ్ కుచ్‌మా (Leonid Kuchma) ప్రధాన పాత్ర పోషించారు. తూర్పు, దక్షిణ ఉక్రెయిన్‌లోని శక్తిమంతమైన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఆయనకు మద్దతుగా నిలిచారు. కుచ్‌మా పరిపాలనా కాలంలో అవినీతి పెరగడంతోపాటు మానవహక్కులకు భంగం వాటిల్లింది. ఉక్రెయిన్‌లో 2004 నాటి అధ్యక్ష ఎన్నికలలో శక్తిమంతమైన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో కూడిన బృందం విక్టర్ యానుకోవిచ్‌కు మద్దతు నిచ్చింది. ముఖ్య ప్రతిపక్ష అభ్యర్థిగా మాజీ ప్రధాని విక్టర్ యుషెంకో నిలిచారు. ఈ ఎన్నికలలో విక్టర్ యానుకోవిచ్ విజయం సాధించినట్లుగా ఉక్రెయిన్ కేంద్ర ఎన్నికల సం ఘం ప్రకటించింది. అయితే విక్టర్ యుషెంకో మద్దతుదారులు ఈ ఎన్నికలలో మోసం జరిగిందని ఆరోపిస్తూ కొన్ని వేలమందితో రోడ్లను దిగ్బంధించారు. పాలనను స్తంభింపజేశారు. ఈ తిరుగుబాటునే ఆరెంజ్ విప్లవంగా అభివర్ణిస్తారు. యుషెంకో మద్దతుదారులు యానుకోవిచ్ ఎన్నికను చెల్లనిదిగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు. వారి విజ్ఞప్తిని పరిశీలించిన సుప్రీంకోర్టు ఆ ఎన్నిక ను చె ల్లనిదిగా ప్రకటించింది. దీంతో డిసెంబర్ 26న జరిగిన రీ ఓటింగ్‌లో యుషెంకో ఉక్రెయిన్ అధ్యక్షుడి గా ఎన్నికయ్యారు. అనంతరం 2010 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలలో యానుకోవిచ్ అధ్యక్షుడయ్యారు. ఈ ఎన్నిక ప్రాంతీయ విభేదాలకు దారితీసింది. తూర్పు, దక్షిణ ఉక్రెయిన్‌లో రష్యన్ భాష మాట్లాడే ప్రాంతాలు యానుకోవిచ్‌కు మద్దతివ్వగా, మధ్య, పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతాలు టైమోషెంకోకు మద్దతుగా నిలిచాయి. మానవహక్కుల పరిరక్షణలో వైఫల్యంతోపాటు తీవ్ర అవినీతి అంశాల కారణంగా యానుకోవిచ్ ప్రభుత్వం విమర్శలకు గురైంది.

రాజకీయ పరిణామాలు:
2013 నవంబర్‌లో రష్యా ఒత్తిడితో యూరోపియన్ యూనియన్ అసోసియేషన్ ఒప్పందంపై సంతకం చేయడానికి తొలినుంచీ అంగీకరించిన ఉక్రెయిన్, చివరి నిమిషంలో నిరాకరించింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు వెల్లువెత్తాయి. ఈ నిరసన తీవ్రత ఆరెంజ్ విప్లవం కాలంలో జరిగిన దానికంటే తీవ్రరూపం దాల్చింది. పోలీసు అధికారుల దాడుల్లో వందమందికి పైగా ఆందోళనకారులు మరణించారు. విధులపట్ల బాధ్యతా రాహిత్యం కారణంగా 2014 ఫిబ్రవరి 22న యానుకోవిచ్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి పార్లమెంట్ తప్పించింది. అదేరోజు టైమోషెంకో జైలు నుంచి విడుదలయ్యారు. టైమోషెంకోకు ప్రధాన అనుచరుడైన అలెగ్జాండర్ తుర్చియనేవ్ పార్లమెంట్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. కొత్తగా అధ్యక్ష ఎన్నికలు జరిగే వరకు ఆయన తాత్కాలిక అధ్యక్షులుగా వ్యవహరించారు. మే 25, 2014న అధ్యక్ష ఎన్నికలు జరపడానికి నిర్ణయించారు. 2004లో రూపొందించిన ఉక్రెయిన్ రాజ్యాంగంలోనిProvisionsను అదే విధంగా ఉంచడంతోపాటు తన అధ్యక్ష స్థానాన్ని పటిష్ట పరచుకోవడానికి యానుకోవిచ్ ప్రతిపాదించిన మార్పులను పూర్తిగా తొలగించాలని పార్లమెంట్ తీర్మానించింది. ఫిబ్రవరి 27, 2014 ఫాదర్‌లాండ్ (Father land) పార్టీ నాయకులు, మాజీ ప్రధాన మంత్రి అయిన Arseniy yatsenyuk నాయకత్వంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి ఉక్రెయిన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది.

ఉక్రెయిన్ ఆర్థిక స్థితి:
వ్యూహాత్మక ప్రాంతంగా సారవంతమైన భూములు కలిగి ఉన్న ఉక్రెయిన్ ఐరోపాలోని ఇతర దేశాల కంటే వెనుకబడిన పేద దేశం. 2011లో ఉక్రెయిన్ తలసరి స్థూల దేశీయోత్పత్తి యూరోపియన్ యూనియన్ సగటులో 21 శాతం, 2010లో తలసరి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 979 డాలర్లుగా ఉంది. రష్యా తలసరి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో పోల్చినప్పుడు ఉక్రెయిన్ తలసరి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సగం కన్నా తక్కువగానూ, పోలండ్‌తో పోల్చినప్పుడు 1/4 వంతుగానూ ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఉక్రెయిన్ ఆర్థిక ప్రగతిపై తీవ్ర ప్రభావం చూపింది. ఉక్రెయిన్ వాస్తవిక జీడీపీ 2009లో 15.1 శాతం తగ్గింది. ఈ స్థితి నుంచి వెంటనే కోలుకొని 2010లో 4.2 శాతం, 2011లో 5.2 శాతం వృద్ధిని ఉక్రెయిన్ సాధించింది. కానీ 2012లో వృద్ధి 0.2 శాతంగానే నమోదయింది. రష్యా, యూరోపియన్ యూనియన్‌లో వృద్ధి మందగించడమే దీనికి ప్రధాన కారణం. 2013లో ఉక్రెయిన్ వాస్తవిక జీడీపీ వృద్ధి కేవలం 1 శాతంగానే నమోదయింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా, రష్యాలు ఉక్రెయిన్‌ను సంక్షోభం నుంచి తప్పించడానికి కొన్ని చర్యలు చేపట్టాయి. ఉక్రెయిన్‌లో సంస్కరణల అమలుకు వీలుగా అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) 2010లో 15.15 బిలియన్ డాలర్ల రుణాన్ని ఇవ్వడానికి అంగీకరించింది. రెండు దశలుగా రుణాన్ని మంజూరు చేసినప్పటికీ అదనంగా ఇంకొంత మొత్తాన్ని రుణంగా ఇవ్వడానికి ఐఎంఎఫ్ నిరాకరించింది. ఐఎంఎఫ్ సూచించిన విధంగా స్వదేశీ వినియోగదారులకు సంబంధించి ఇంధన ధరలు పెంచడంతోపాటు కరెన్సీ మూల్యహీనీకరణ లాంటి విధానాలను ఉక్రెయిన్ చేపట్టడానికి నిరాకరించింది. ఈ కారణాల రీత్యా అదనపు రుణాన్ని మంజూరు చేయడానికి ఐఎంఎఫ్ నిరాకరించింది. చైనా, రష్యా నుంచి రుణాలను పొందడంతోపాటు ఉక్రెయిన్ పెద్ద మొత్తంలో రుణాన్ని యూరోబాండ్ మార్కెట్, స్వదేశీ రుణ మార్కెట్ నుంచి సమీకరించుకొంది. నవంబర్ 2013 నాటికి ఉక్రెయిన్ విదేశీ మారక నిల్వలు అడుగంటిన పరిస్థితుల్లో 2014లో రుణాల చెల్లింపులో క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. అమెరికా సంక్షోభం, ఉక్రెయిన్ ఆర్థిక విధానాలపై విశ్వాసం సన్నగిల్లిన నేపథ్యంలో 2013 ఏడాది మధ్య భాగంలో యూరో బాండ్ మార్కెట్ నుంచి అదనపు రుణం సమీకరించే విషయంలో ఉక్రెయిన్ విఫలమైంది. ఈ స్థితిని రష్యా తనకు అనుకూలంగా మార్చుకుంది. ప్రోత్సాహకరమైన (సరళమైన) వడ్డీరేటుతో 15 బిలియన్ డాలర్ల ఉక్రెయిన్ బాండ్ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. 2013 డిసెంబర్ చివర్లో 3 బిలియన్ డాలర్ల విలువైన ఉక్రెయిన్ బాండ్లను కొనుగోలు చేసింది. ఫిబ్రవరి 2014లో యానుకోవిచ్ పాలన అంతమైన తర్వాత బాండ్ల కొనుగోలును రష్యా నిలిపివేసింది. ఉక్రెయిన్‌లో రాజకీయ సంక్షోభం దేశ ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. సంక్షోభం ప్రారంభమైన 2013 నవంబర్ 21 నుంచి 2014 ఫిబ్రవరి వరకు ఉక్రెయిన్ కరెన్సీ విలువ 30 శాతం మేర క్షీణించింది.

ఉక్రెయిన్ విదేశీ విధానం:
1991లో స్వాతంత్య్రం పొందిన తరువాత ఉక్రెయిన్ రాజకీయ శక్తుల మధ్య పెరిగిన వివాదాల కారణంగా విదేశీ విధానంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నాటో, యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం కోసం చేసిన ప్రయత్నాలు తక్కువ. దీంతోపాటు ఆయా సంస్థల ప్రమాణాలను పాటించడానికి ఉక్రెయిన్ ఎలాంటి కృషి చేయ లేద ని చెప్పాలి. రాయితీ ధర వద్ద రష్యా నుంచి శక్తివనరులు పొందే విషయంలో రష్యాతో దగ్గర సంబంధాలు ఏర్పరచుకోగలమని ఉక్రెయిన్ మాట ఇచ్చినప్పటికీ, ఒప్పందాల విషయంలో ఉల్లంఘనలు ఇరుదేశాల మధ్య సంబంధాలను దెబ్బతీశాయి. యూరోపియన్ యూనియన్‌కు అసోసియేషన్ ఒప్పందంపై చివరి నిమిషంలో సంతకం చేయడానికి యానుకోవిచ్ నిరాకరించాడు. ఫలితంగా సంక్షోభపరిస్థితులు ఏర్పడి చివరికి ఆయన పాలనకు తెరపడింది. ఉక్రెయిన్ నూతన ప్రభుత్వం విదేశీ విధానం ప్రాధాన్యతలో భాగంగా అంతర్జాతీయ మద్దతు కూడగట్టడంతోపాటు ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతల పెంపునకు చర్యలు ప్రధాన అంశాలుగా నిలిచాయి. కొత్త ప్రభుత్వాన్ని రష్యా గుర్తించని పరిస్థితులు ఉక్రెయిన్‌కు ఇబ్బందిగా పరిణమించాయి. ఎనర్జీ కొరకు ఉక్రెయిన్ రష్యాపై అధికంగా ఆధారపడింది. ఉక్రెయిన్‌లో 80 శాతం శక్తి వినియోగం రష్యా నుంచి దిగుమతుల ద్వారా జరుగుతున్నది. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ సహజ వాయు పైప్‌లైన్ స్టోరేజీ సౌకర్యాలపై పట్టు సాధించాలని రష్యా ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నం విఫలమయింది.

కిమియా అంశం - రష్యా దృక్పథం:
రష్యాకు అత్యంత కీలకమైన సైనిక, నావికా స్థావరం క్రిమి యా. రష్యా-ఉక్రెయిన్ విభజన ఒప్పందంలో భాగంగా రష్యా 25,000 ట్రూప్స్, 24 ఆర్టిలరీ సిస్టమ్స్, 132 ఆర్‌‌మడ్ వాహనాలు, 22 మిలటరీ విమానాలను క్రిమియా స్థావరంగా వినియోగించుకోవడానికి ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 2042 వరకు రష్యన్ బ్లాక్ సీ ఫ్లీట్ క్రిమియాలో ఉండడానికి అనుమతిస్తారు. ఉక్రెయిన్ వాటర్, రేడియో ఫ్రీక్వెన్సీస్‌ను వినియోగించుకొన్నందుకు రష్యా ఏటా ఉక్రెయిన్‌కు ఇచ్చిన మొత్తం రుణంలో 97.75 మిలియన్ డాలర్ల రుణాన్ని రైట్ ఆఫ్ చేస్తుంది. రష్యాకు నల్లసముద్రం ద్వారా పశ్చిమానికి ఉన్న ఏకైక నావికా మార్గం క్రిమియా. క్రిమియా రష్యాలో అంతర్భాగంగా ఉండాలని 95 శాతంై పైగా ఓటర్లు రిఫరెండంలో అభిప్రాయపడ్డారు. చారిత్రాత్మకంగా, సాంస్కృతికంగా, మతపరంగా రష్యా, ఉక్రెయిన్, బెలారస్‌ల మధ్య సంబంధం విడదీయలేనిదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అభిప్రాయం. క్రిమియాలో మైనారిటీలపై వివక్షను పుతిన్ ఖండించారు. సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నం సమయంలో క్రిమియాను వదులుకోవడం మాస్కో చేసిన అతిపెద్ద తప్పుగా పుతిన్ అభివర్ణించారు.

కిమియాకు స్వాతంత్య్రం -రష్యాలో విలీనం:
ఉక్రెయిన్‌లో కొంత కాలంగా కొనసాగుతున్న సంక్షుభిత పరిణామాల నేపథ్యంలో స్వయం ప్రతిపత్తిగల క్రిమియా తాను ఉక్రెయిన్‌లోనే కొనసాగాలా? లేదా రష్యాలో విలీనమవ్వాలా అనే అంశంపై 2014 మార్చి 16న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ఓటర్లలో 96.8 శాతం మంది రష్యాలో విలీనమవ్వడమే మేలని తీర్పు చెప్పినట్లు రెఫరెండం ఎన్నికల కమిషన్ చైర్మన్ మిఖాయిల్ మలిషేవ్ ప్రకటించారు. ఉక్రెయిన్‌లో భాగంగా ఉన్న క్రిమియా ఉక్రెయిన్ నుంచి 2014 మార్చి 17న స్వాతంత్య్రం ప్రకటించుకొంది. 2014 మార్చి 30 నుంచి తమ ప్రాంతం మాస్కో కాలమానానికి మారుతుందని క్రిమియా స్థానిక ప్రధానమంత్రి సెర్గీ ఆక్సియోనోవ్ పేర్కొన్నారు. ఈ ద్వీపకల్పంలోని ఉక్రెయిన్ ప్రభుత్వ ఆస్తులను జాతీయం చేస్తున్నట్లు ప్రకటించింది. క్రిమియాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ దేశాలన్నింటికీ క్రిమియా రిపబ్లిక్ విజ్ఞప్తి చేసింది. రిపబ్లిక్ ఆఫ్ క్రిమియాను పొరుగునే ఉన్న రష్యా సమాఖ్యలో సభ్య దేశంగా చేర్చుకోవాలని క్రిమియా కోరింది అనే తీర్మానాన్ని క్రిమియా ప్రాంతీయ పార్లమెంట్ ఆమోదించింది. రష్యాలో క్రిమియాను విలీనం చేసే ఒప్పందంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2014 మార్చి 18న సంతకం చేశారు. దీంతో రష్యా సమాఖ్యలో క్రిమియా చేరినట్లయింది. 18వ శతాబ్దం నుంచి రష్యాలో భాగంగా ఉన్న క్రిమియాను 1954లో నాటి సోవియెట్ నేత నికితా కృశ్చేవ్ ఉక్రెయిన్‌కు బదిలీ చేశారు. నాటి నుంచి క్రిమియాలో మెజారిటీ ప్రజలుగా ఉన్న రష్యా జాతీయులు క్రిమియాను రష్యాలో విలీనం చేయాలని కోరుకుంటున్నారని పుతిన్ తెలిపారు.

రష్యా వైఖరిపై వ్యతిరేకత:
ఉక్రెయిన్ నుంచి రెఫరెండం ద్వారా స్వాతంత్య్రం పొందిన న క్రిమియాను రష్యా తన సమాఖ్యలోకి చేర్చుకోవడంపై అమెరికా, ఫ్రాన్‌‌స అసంతృప్తి వెళ్లగక్కాయి. క్రిమియాలో నిర్వహించిన రిఫరెండంను తాము గుర్తించడం లేదని అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు. ఉక్రెయిన్ భూభాగంలో రష్యా సైన్యం కొనసాగినంత కాలం రష్యాతో దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఉండదని ఆయన తేల్చి చెప్పా రు. ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతపై దాడిగా రష్యా చర్యలను ఒబామా ఖండించారు. రష్యా తన సైన్యాన్ని ఉక్రెయిన్ నుంచి ఉపసంహరించుకోని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశా రు. ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామిక దేశాల కూటమైన జి-8 నుంచి రష్యాను సస్పెండ్ చేస్తున్నట్లు కూటమిలోని మిగిలిన 7 దేశాలైన అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్‌లు ప్రకటించాయి. నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో 2014, మార్చి 25న జరిగిన అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించాయి. రష్యాలోని సోచిలో జూన్‌లో జరగనున్న జి-8 సదస్సు వేదికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.. పలు రూపాల్లో రష్యా మెడలు వంచే ప్రయత్నాలకు ఒడిగట్టాయి. రష్యాకు అన్ని రకాల పౌర సహకారాల్ని రద్దు చేసేందుకు నాటో విదేశాంగమంత్రులు 2014 ఏప్రిల్ 1న నిర్ణయించాయి. క్రిమియాను రష్యా తనలో విలీనం చేయడం చట్టవిరుద్ధమని తప్పుబట్టారు.

తాజాగా డొనెస్క్:
ఇప్పటికే ఉక్రెయిన్ నుంచి విడిపోయిన క్రిమియా రష్యాలో చేరడంపై నిప్పులు చెరుగుతున్న అమెరికా,ఫ్రాన్స్‌లు రష్యా ఆధిపత్యానికి ఎలా అడ్డుకట్టవేయాలా? అని ఆలోచిస్తున్న తరుణంలో తాజాగా మరో తలనొప్పి వ్యవహారం ఎదురైంది. తూర్పు ఉక్రెయిన్ నగరం డొనెస్క్, లుగాంస్క్ ఫ్రావిన్స్‌లలో రష్యా అనుకూల కార్యకర్తలు 2014 ఏప్రిల్ 7న ఉక్రెయిన్ నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. డొనెస్క్ లోని ప్రాంతీయ ప్రభుత్వ ప్రధాన కార్యాలయాన్ని నిరసనకారులు స్వాధీనం చేసుకున్నారు. పీపుల్స్ కౌన్సిల్ ఆఫ్ డొనెస్క్‌ను ఏర్పాటు చేసి ఉక్రెయిన్ నుంచి విడిపోతున్నట్లు 2014మే 11న ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఉక్రెయిన్‌లోని 4.6 కోట్ల జనాభాలో ఈ రెండు ఫ్రావిన్స్‌లలో 70లక్షల మం ది ఉన్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రజాభిప్రాయం సేకరించి రష్యాలో చేర్చేందుకు పీపుల్స్ కౌన్సిల్ నిర్ణయించడం లాంటి పరిణామాలు అగ్రరాజ్యాలకు మింగుడుపడడం లేదు. ఇలా క్రిమియా చేరికపై కారాలు, మిరియాలు నూరుతున్న జి-8 దేశాధినేతలకు పుండుమీద కారం చల్లేలా డొనెస్క్ రూపంలో ఎదురైంది. క్రిమియాతో మొదలై డొనెస్క్, లుగాంస్క్ వరకు సాగిన విలీన పరంపర భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాలి.
Published date : 15 May 2014 05:12PM

Photo Stories