Skip to main content

ప్రపంచ శాంతికి పక్కలో బల్లెం... ఐఎస్‌ఐఎస్

డా॥బి.జె.బి. కృపాదానం, సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ, ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్.
కొన్నేళ్లుగా అంతర్జాతీయ తీవ్రవాదానికి అల్‌ఖైదానే చిరునామా. కానీ ఇప్పుడా స్థానాన్ని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్) ఆక్రమించి, ప్రపంచ శాంతికి పక్కలోబల్లెంలా మారింది. అనతికాలంలోనే ఇంతటి గుర్తింపు పొందడానికి ప్రధాన కారణం... ఐఎస్‌ఐఎస్ సాగిస్తున్న దారుణ మారణ కాండలే. అల్‌ఖైదా పిల్లవేరుగా పుట్టుకొచ్చిన ఈ భూతం ప్రస్తుతం ఇరాక్, సిరియాలకే పరిమితం కాలేదు. ప్రపంచాన్నే ఇస్లామిక్ స్టేట్‌గా మార్చాలనే లక్ష్యంతో నెత్తుటి కాండకు తెగబడుతోంది.

2014, జూన్ 29... పవిత్ర రంజాన్ (రమాజన్) నెలలోని మొదటి రోజు. అల్లా స్మరణలతో విశ్వశాంతి ఘోష ఓవైపు వినిపిస్తుండగా... మరోవైపు ఇస్లామిక్ రాజ్య అవతరణ ప్రకటన ప్రపంచాన్ని తుళ్లిపడేలా చేసింది. 423 మైళ్లకు విస్తరించిన ఈ కలీఫత్ (caliphate) అబూ బాకర్ ఆల్ బాగ్దాది నాయకత్వాన ఏర్పడింది. ప్రస్తుతానికి సిరియా, ఇరాక్‌లకే పరిమితమైనప్పటికీ దీనిమూలాలు 1999 నుంచి జోర్డాన్, అఫ్గానిస్థాన్‌లో ఉన్నాయి. బిన్‌లాడెన్ ప్రోద్బలంతో అల్‌ఖైదా ఇన్ ఇరాక్‌గా ఆరంభమైన ఈ వ్యవస్థ క్రమేణా బలీయమైన శక్తిగా రూపొందింది. సిరియా, ఇరాక్ సరిహద్దులతో కూడిన కొంత ప్రాంతాన్ని తమ రాజ్యంగా ప్రకటించుకొంది. గత 15 ఏళ్లలో వ్యవస్థాపరంగా అనేక మార్పులను సంతరించుకొని, ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో ఏకంగా ఇస్లామిక్ స్టేట్‌గా ఉనికిని చాటుకుంటోంది. అల్‌ఖైదా లాంటి తోటి ఉగ్రవాద సంస్థల కంటే బలమైన వ్యూహంతో గట్టెక్కింది. దీని సైనిక బలం 31,000 మంది. వీరిలో సుమారు 25 వేల మంది పూర్తికాల విశ్వసనీయులు. నిరంతర పోరాట స్పృహతో ఈ బలగాలు ఓవైపు ఉగ్రవాదులుగా, మరోవైపు సైన్యంగా పనిచేస్తాయి. అతివాద భావ జాలంతో స్థానికుల్లో ప్రజా స్వామ్యంపై గూడుకట్టుకున్న అసంతృప్తిని తమకు అనుగుణంగా మార్చుకొని, ఇరాక్, సిరియా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేక వైఖరికి బీజం వేసి, అవసరమైతే ప్రజల్ని బెదిరించి తమ వైపు తిప్పుకున్నారు. వీరు గెరిల్లా పోరాటంలో సిద్ధ హస్తులు. జాతీయ సైన్యాల్ని, ఇతర వేర్పాటు వాదుల్ని ఓడించడంలో వీరికి వీరే సాటి.

షియాలు వర్సెస్ సున్నీలు
షియాలు అధిక సంఖ్యలో ఉన్న ఉత్తర ఇరాక్‌లో అల్ప సంఖ్యాకులైన సున్నీల తిరుగుబాటుతో ఇస్లామిక్ రాజ్య అవతరణకు బీజం పడిందని చెప్పవచ్చు. ఇరాక్ అధినేత షియా తెగకు చెందినవాడు. అతడు సున్నీల న్యాయబద్ధమైన నిరసనలను నిరంకుశంగా అణచివేశాడు. అలాగే సిరియా అధ్యక్షుడు బషర్ అసాద్ (ఆల్‌వైట్ తెగ) తన పాలనకు వ్యతిరేకంగా ప్రారంభమైన తిరుగుబాటుదారుల్లో కలవరం సృష్టించడానికి వ్యూహాత్మకంగా సున్నీలపై దాడిని ప్రోత్సహించాడు. సౌదీ అరేబియా, అమెరికాలు పరోక్షంగా జీహాదీలకు మద్దతునివ్వడం లాంటి చర్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. మొత్తానికి ఇరాక్, సిరియా దేశాల్లోని సున్నీల్లో ఏర్పడిన అభద్రతాభావం ఈ అతివాద వ్యవస్థ ఏర్పాటుకు ప్రధాన కారణమయింది. దీని ప్రధాన శత్రువు షియా తెగకు చెందినవారు, క్రైస్తవులు.

రెండొందల ఏళ్ల కిందట సౌదీ అరేబియాలో ప్రారంభమైన వాహబిజం ఇస్లామిక్ రాజ్య అజెండా అని చెప్పవచ్చు. వాహబిజపు పునఃసృష్టి (reinvention) ఇస్లామిక్ రాజ్యం. 1970లో సంభవించిన ఇరాన్ విప్లవం వాహబిజపు ఉనికిని ప్రశ్నార్థకం చేసింది. ఇరాన్‌లో షియాలు రాజ్యాధికారాన్ని చేపట్టడం, మధ్య ప్రాచ్య దేశాల్లోని సున్నీలకు మింగుడు పడలేదు. బోకొహరం, ఆల్ షహాబ్, అల్ ఖైదా, తాలిబాన్, ఇప్పటి ఐఎస్‌ఐఎస్... ఇవన్నీ వాహబిజపు వ్యక్తీకరణలు (manifestations).

పాముకు పాలుపోసినట్లు
ఈ ఉగ్రవాదం అనే విషసర్పానికి పాలుపోసి పెంచింది సౌదీ, ఖతార్ ప్రభుత్వాలు. అయితే చివరికి ఆయా ప్రభుత్వాల మనుగడనే ప్రశ్నించే స్థాయికి ఇది ఎదుగుతుందని ఊహించలేదు. ఇస్లామిక్ రాజ్యం కేవలం ఇరాక్, సిరియాలను మాత్రమే బలహీన పరచడం లేదు. పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికాలను సైతం కబళిస్తుందా? అనే అనుమానం తలెత్తుతోంది. ఐరోపా, అమెరికాలపై దీని ప్రబావమేంటి? దక్షిణాసియా, ముఖ్యంగా భారతదేశంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?

ఆకర్షితులవుతున్న యువకులు
మొన్నటికి మొన్న మెహదీ మస్‌రూర్ బిశ్వాస్ (బెంగళూరు) అనే వ్యక్తి ట్విట్టర్ (సామాజిక మాధ్యమం) ద్వారా సామాజిక ఇస్లామిక్ రాజ్య అనుకూల సమాచారాన్ని పంపడం మన భద్రతా వ్యవస్థల్ని ఆందోళనకు గురిచేసింది. అలాగే సిడ్నీలో కొందర్ని బందీలుగా చేసిన వ్యక్తి ఇస్లామిక్ రాజ్య పతాక నమూనాను కలిగి ఉండటం కలకలం రేపింది. కాగా 2015, జనవరి 16న హైదరాబాద్‌లోని బజార్‌ఘట్‌కు చెందిన సల్మాన్ మొహి యుద్దీన్ (32) అనే వ్యక్తి ఐఎస్‌ఐఎస్‌లో శిక్షణ పొందేందుకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న విషయం మున్ముందు మన భద్రత వ్యవస్థ ఏమేర జాగురూకతతో వ్యవహరించాలో స్పష్టం చేస్తోంది.

ఇలా ప్రపంచ వ్యాప్తంగా కొందరు యువతీ యువకులు దీనిపట్ల ఆకర్షితులవడానికి సామాజిక, మనస్తత్వ శాస్త్రవేత్తలు భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. జీహాదీలు పేద, మధ్య, సంపన్న తరగతి నుంచి వస్తున్నారు. ప్రధానంగా అరబ్, ఆసియా దేశాల ముస్లిం యువత దీనివైపు వెళుతున్నారు. పాశ్చాత్య దేశాలకు వలస వచ్చిన అరబ్‌లు, ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఇటీవల ఇస్లామ్ మతంలోకి మారిన వారు కొందరున్నారు. 20వ శతాబ్దం చివరి అంకంలో ఈజిప్టు, అల్జీరియా దేశాల్లో చెలరేగిన హింసాకాండకు కారకులు ఇస్లామిక్ అతివాదులు. పేదరికంలో మగ్గుతున్న యువత మసీదుల్లోని ఇమామ్‌ల బోధనలకు ప్రేరేపితులై ఇస్లాం మత భావాల పరిరక్షణకు ఉద్యమిస్తున్నారని మేధావుల అభిప్రాయం. ఇస్లామేతరుల్ని హింసించడానికి వెనుకాడటం లేదు. కేవలం పేదరికం, వివక్ష యువతని ఉద్రేకానికి పురిగొల్పుతున్నాయి. అయితే 2001, సెప్టెంబరు 11న న్యూయార్క్‌లో జరిగిన విధ్వంసకాండ సౌదీ అరేబియాకు చెందిన మధ్య తరగతి, సంపన్న వర్గాలవారి కుట్ర. పైగా ఈ దాడిలో పాల్గొన్నవారు మత ఛాందసులు కారు. అంటే కేవలం పేదరికం, వివక్షలే అతివాద ధోరణికి కారణమని చెప్పడం సమంజసం కాదు.

విశ్లేషకుల మాట
ఉన్నత విద్య కోసం అమెరికా విశ్వవిద్యాలయంలో ప్రవేశించిన సౌదీ యువత తమ దేశాన్ని అమెరికా దోచుకుంటుందని, ఇస్లామ్ మతస్థులు వివక్షకు గురవుతున్నారని భావించింది. అందుకు ప్రతీకారంగా 2001, సెప్టెంబర్ 11 దురాగతానికి ఒడిగట్టారు. 2005 జూలైలో లండన్‌లో జరిగిన విధ్వంస కాండలో దక్షిణాసియా, ఆఫ్రికా ఖండాలకు చెందిన యువత పాల్గొంది. వీరంతా మధ్య తరగతికి చెందిన వారు. అలాగే పాశ్చాత్య సంస్కృతికి బాగా ప్రభావితులైనవారు. వీరికి మత రాజకీయ విషయాలపై అంత ఆసక్తి లేదు. కానీ బ్రిటిష్ దేశస్థుల జాత్యహంకార వైఖరి, విదేశీ సంతతి వివక్షకు గురవడం మొదలైన అంశాలు వీరిలో అసహనాన్ని కలిగించాయని విశ్లేషించారు. యువత జీహాద్ వైపు మళ్లడానికి సామాజిక, రాజకీయ పరిస్థితులు చాలా వరకు కారణం. పాకిస్థాన్, గల్ఫ్, పశ్చిమాసియా దేశాలు, ప్రసార మాధ్య మాలు, విద్యాలయాలు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇస్లామ్ మనుగడకు ఎలా ప్రతిబంధకాలో గోరంతలు కొండంతలు చేస్తున్నాయి. యువతలో ముస్లిమేతర దేశాలపట్ల వ్యతిరేక ధోరణిని కలిగిస్తున్నాయి. దీనికి మతఛాందస వాదులు ఆజ్యం పోస్తున్నారు. ఈ దేశాల్లోని ప్రభుత్వాలు తమ అవినీతి, అసమర్థతను కప్పిపుచ్చుకోడానికి ఇస్లామ్ ప్రమాదంలో ఉందంటూ సామాన్య ప్రజానీకం దృష్టిని మళ్లించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఇలా యువతలో గూడుకట్టుకొన్న అసంతృప్తి బహిర్గత మవుతుంది.

పోరాటపంథాకు పలు కారణాలు
పాశ్చాత్య దేశాల్లో నివసిస్తున్న రెండో తరానికి చెందిన ముస్లిమ్ యువత జీహాదీ వైపు ఆకర్షితులవడానికి మరో కారణం.. పరాయీకరణ (alienation). ప్రారంభంలో పాశ్చాత్య సంస్కృతి వైపు ఆకర్షితులైన యువత పాశ్చాత్యుల జాత్యహంకార ధోరణి, వివక్షతో విసుగుచెంది, తమ పూర్వ సంస్కృతి (ప్రాచ్య ఇస్లామిక్) పట్ల ఆకర్షితులవుతున్నారు. అలాంటి వారికి జీహాద్ మంచి అనుభూతిని కల్పిస్తుంది. తమను చులకనగా చూస్తున్నవారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆకాంక్ష బలీయమవుతుంది. అది అతివాద ధోరణికి దారితీస్తుంది. దీంతో ఏళ్ల తరబడి బందీలుగా ఉంటోన్న తమ సోదరులను విడిపించుకోవాలని, భర్త చనిపోయిన స్త్రీలకు, అనాథలకు జరుగుతున్న అన్యాయానికి బదులు తీర్చుకోవాలని, అందుకు నిరంతర పోరాటం (Endless Struggle) కొనసాగించాలనుకుంటారు. ఉగ్రవాదుల ఆత్మీయ పిలుపునకు స్పందిస్తూ ఇస్లామ్‌కు అంతిమ విజయం లభిస్తుందని, దాన్ని నిజం చేయడానికి ప్రతి ముస్లిమ్ అవసరమైతే ఆత్మార్పణ చేయాలని భావిస్తారు. అలా తాము నమ్మిన ఆశయాల్ని అమలు చేయడానికి, అమరవీరులు కావడానికి వెనకాడరు.

ఉగ్రవాదులకు రాజ్యంతో ముఖాముఖీ తలపడటానికి తగిన సాయుధ బలం లేదు. అందువల్ల ఆత్మాహుతి దాడులు (Suicide attacks)ను ప్రత్యామ్నాయ మార్గంగా ఎంచుకుంటారు. ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన సామాజిక మాధ్యమాలైన పేస్‌బుక్, ట్విట్టర్ లాంటివి విధ్వంసక సంఘటనలకు కావాల్సినంత ప్రచారాన్నిస్తున్నాయి. ఆత్మాహుతికి పాల్పడేవారికి ఆధ్యాత్మిక చింతన కంటే ఒక మంచి లక్ష్యానికి తమ ప్రాణాన్ని అర్పిస్తున్నామనే పారవశ్యపు భావన ఎక్కువగా ఉంటుంది. ఇస్లామిక్ రాజ్య సైనికుల విజయపరంపరలు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దాని మద్దతుదారులకు మరింత ఉత్తేజాన్నిస్తు న్నాయి. హింస, అమరత్వం ద్వారా విముక్తి లభిస్తుందనే యువతను అటువైపు ఆకర్షిస్తోంది. అసమర్థ పాలన, అవినీతి పరులైన నాయకులు ప్రభుత్వాల్ని తమ గుప్పెట్లో పెట్టుకోవడం జీహాదికి మరింత ఉద్దీపిస్తున్నాయి.

దానవులా.. మానవులా
ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇస్లామిక్ స్టేట్ దళాలు సాగిస్తున్న వికృతచేష్టలు మనం మానవులమా? రాక్షసులమా? అనే రీతిలో గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. అనతికాలంలో ఐఎస్‌ఐఎస్ ప్రపంచానికి పరిచయం కావడానికి కారణం ఇలాంటి దారుణాలను ఒడిగట్టడమే. వాటిలో కొన్ని...
  • ఇరాక్‌లో వైమానిక దాడులు ఆపకపోతే పరిస్థితి మరింత భయానకంగా ఉంటుంద ని హెచ్చరిస్తూ ఇద్దరు అమెరికా జర్నలిస్టుల గొంతులు కోసిన వీడియోను అమెరికా అధ్యక్షునికి పంపిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద కర్కశ శైలితో ప్రపంచం ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనైంది.
  • ఇరాక్‌లోని అన్బర్‌లో 322 మంది ఇరాకి అల్ బు నిమ్ ్రఅనే సున్నీ తెగ ప్రజలను ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు ఊచకోత కోసిన ఘటన మానవీయ కోణానికే మాయనిమచ్చ. అల్ బు నిమ్ర్ తెగ ప్రజలు నివశించే ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఈ నరమేధానికి ఒడిగట్టారు. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలే అధికం. 2014 జూన్ ప్రాంతంలో ఉత్తర ఇరాక్‌లో హింసను ప్రారంభించిన ఐఎస్‌ఐఎస్ మిలిటెంట్లు, అన్బర్ ప్రాంతంలో జరిపిన ఈ మారణహోమంతో అతిపెద్ద రక్తపాతాన్ని సృష్టించారు.
మూకుమ్మడి దాడే సరైన మందు
ఇస్లామిక్ రాజ్యం ఊహించని రీతిలో తన ప్రభావాన్ని ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపుతోంది. సైనిక, మత, రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాల్లో అలజడి రేపుతోంది.

ఇరాక్‌లో అనిశ్చితి వాతావరణాన్ని సృష్టించడంలోను, సిరియాలో అసాద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతిపక్షాల మధ్య అనైక్యతను రాజేయడంలోనూ ఇస్లామిక్ స్టేట్ విజయం సాధించింది. దీని వ్యాప్తిని అరికట్టాలంటే దీర్ఘకాలిక వ్యూహం అవసరం. రాజకీయంగా, దౌత్యపరం గా, ఆర్థిక, మత పరంగా అణచివేత కార్యాచరణకు పూనుకోవాలి. ఇందుకు స్థానికుల చొరవ చాలా అవసరం. అలాగే సిరియా ప్రభుత్వానికి రష్యా, ఇరాన్ దేశాల సైనిక సహాయాన్ని నిలిపివేయడంలో పాశ్చాత్యదేశాలు కృతకృత్యులు కావాలి. శాంతియుత విధానాలతో సిరియా రాజధాని డెమాస్కస్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం నెలకొల్పడానికి అనుకూల పరిస్థితులు కల్పించాలి. ఇరాక్ ప్రభుత్వానికి అమెరికా షరతులతో కూడిన సాయాన్ని అందించాలి. ఇరాక్ అధ్యక్షునికి షియా వర్గపు సైనిక మద్దతు తగ్గించేలా చూడాలి. ఇరాక్‌లోని సున్నీ తెగలు, కుర్దీష్ ఉద్యమకారుల మద్దతును కూడగట్టి ఇస్లామిక్ రాజ్య పునాదులను పెకిలించడానికి సంకల్పంచాలి. ఇప్పటికే జర్మనీ ఇస్లామిక్ స్టేట్ తరపున ప్రచార సామాగ్రిని పంపిణీ చేయడం, చిహ్నాలను ప్రదర్శించడంతోపాటు అన్ని కార్యకలాపాల్ని నిషేధించింది.

అక్రమ చమురు ఉత్పత్తి, దాని అమ్మకాలు ఇస్లామిక్ రాజ్య ఆదాయ వనరులు. రవాణా, ఇతర ప్రాథమిక వనరులను ధ్వంసం చేయడం ద్వారా దాని ఆదాయ మార్గాలకు గండికొట్టవచ్చు. అంతర్జాతీయంగా ఆంక్షలు విధించడం ద్వారా ఇస్లామిక్ రాజ్య ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయవచ్చు. ఈ వ్యూహాల్ని ప్రస్తుతం పాక్షికంగా ఉన్నట్లు కాకుండా పూర్తి స్థాయిలో చేపట్టాలి. ఇస్లామిక్ రాజ్యాన్ని నైతికంగా బలహీన పరచాలంటే ఆ రాజ్య నాయకత్వాన్ని అంతమొందిం చాలి. సామాజిక మాధ్యమాల ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరకుండా చూడాలి. ఇస్లామిక్ రాజ్య అనుబంధ ఖాతాల్ని సామాజిక మాధ్యమం నుంచి తొలగించాలి. అవే మాధ్యమాల ద్వారా తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ఉద్ధృతం చేయాలి. ఇరాక్, సిరియాలో వీలైనంత తొందరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేలా చేయాలి. లేదంటే మత మౌఢ్యం రూపంలో ఇస్లామిక్ స్టేట్ అనే ఉగ్రవాద పెద్దపులి ప్రపంచ మనుగడకే ప్రాణాంతకంగా మారే ప్రమాదం పొంచి ఉంది.

ప్రపంచ తీవ్రవాద సూచీ
ప్రపంచ తీవ్రవాద సూచీ (గ్లోబల్ టైజం ఇండెక్స్) ప్రకారం... 162 దేశాలు ఈ ఉగ్రభూతం నీడలో నలిగిపోతున్నాయి. దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థలు ప్రధానంగా నాలుగు. వాటిలో 1. తాలిబన్ 2. బోకోహరమ్ 3. ఐఎస్‌ఐఎస్ 4. అల్ ఖైదా . వీటి బారినపడే 162 దేశాల జాబితాలో భారత్ ఆరో స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో ఇరాక్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ ఉన్నాయని నివేదిక తెలిపింది.
Published date : 22 Jan 2015 04:17PM

Photo Stories