Skip to main content

ప్రపంచ పోటీతత్వ సూచీ (2016-17)

వృద్ధి రేటు క్షీణత, కొనసాగుతున్న ప్రాంతీయ రాజకీయ సంక్షోభం (Geopolitical turmoil), విత్త మార్కెట్‌లో అనిశ్చితి, వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో అధిక రుణ స్థాయి తదితర పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ పోటీతత్వ నివేదిక (2016-17) వెలువడింది. ప్రపంచ జీడీపీ వృద్ధి 2010లో 4.4 శాతం కాగా 2015లో 2.5 శాతానికి తగ్గింది. గత రెండేళ్ల కాలంలో వృద్ధి రేటులో క్షీణత... ఉత్పాదకతలో తగ్గుదలను, పెట్టుబడి రేటులో దీర్ఘకాలిక తగ్గుదలను స్పష్టపరుస్తుంది. భవిష్యత్తు వృద్ధి పురోగతిని దీర్ఘకాలిక ధోరణులు ఆటంకపరుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక వ్యవస్థలు ఉత్పాదక వృద్ధిలో క్షీణత, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కోశ విధానం రాజకీయ, సైద్ధాంతిక (ideological) అవరోధాలను ఎదుర్కొంది. దీంతో దీర్ఘకాల స్తబ్ధత నెలకొంది. పురోగతి సాధించే క్రమంలో అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలకు ద్రవ్య విధానం ముఖ్య సాధనంగా నిలిచింది. స్వల్ప కాలంలో వృద్ధి స్థిరత్వాన్ని సాధించే విషయంలో ద్రవ్య విధానం విజయం సాధించింది. భవిష్యత్తులో అధిక వృద్ధి సాధనకు పంపిణీ వైపు సంస్కరణలు ఉండాలని నివేదిక పేర్కొంది. ఉత్పాదక రంగాలను పటిష్టపరచడానికి ఆయా రంగాలపై పెట్టుబడులను పెంచి పోటీతత్వాన్ని పెంపొందించాలని కూడా సూచించింది.

ప్రపంచ పోటీ తత్వ సూచికలు
ఎ) సాధారణ అవసరాల ఉప సూచికలు
-సంస్థలు
- అవస్థాపనా సౌకర్యాలు
- స్థూల ఆర్థిక వాతావరణం
- ఆరోగ్యం, ప్రాథమిక విద్య

బి) సామర్థ్యాన్ని పెంపొందించే ఉప సూచికలు
- ఉన్నత విద్య, శిక్షణ
- వస్తు మార్కెట్ సామర్థ్యం
- శ్రామిక మార్కెట్ సామర్థ్యం
- విత్త మార్కెట్ అభివృద్ధి
- సాంకేతిక పరిజ్ఞానం అందుబాటు
- మార్కెట్ పరిమాణం

సి) నవకల్పన, ఆధునికీకరణ కారకాల ఉప సూచికలు
- వ్యాపార ఆధునికీకరణ
- నవకల్పనలు

భారతదేశంలో గత పదేళ్లలో పోటీతత్వం
భారతదేశ తలసరి స్థూల దేశీయోత్పత్తి (పి.పి.పి. రూపంలో) 2007, 2016 మధ్య రెట్టింపైందని నివేదిక పేర్కొంది. ఈ కాలంలో తలసరి స్థూల దేశీయోత్పత్తి 3587 డాలర్ల నుంచి 6599 డాలర్లకు పెరిగింది. 2008 సంక్షోభం తర్వాత వృద్ధిరేటు తగ్గి, 2012-13లో అధిక క్షీణత ఏర్పడింది. ఈ అనుభవాల నేపథ్యంలో భారతదేశం తన విధానాలను పునఃపరిశీలించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.దీంతోపాటు పోటీతత్వాన్ని పెంపొందించుకోవడానికి వివిధ రంగాల్లో అవసరమైన సంస్కరణలను అమలు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో 2014లో వృద్ధి పురోగమించి, 2015లో చైనా వృద్ధిరేటును భారత్ అధిగమించింది. తద్వారా భారత్ అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా రూపుదిద్దుకుంది. 2007-14 మధ్య భారత పోటీతత్వ స్కోరులో స్తంభన ఏర్పడింది. 2007-08లో పోటీతత్వ సూచీలో 48వ స్థానంలో ఉన్న భారత్ 2016-17లో 39వ స్థానం పొందింది. పోటీతత్వ సూచీలో భారత్ మెరుగవడానికి గల కారణాలను నివేదిక కింది విధంగా విశ్లేషించింది.
 • గత శతాబ్ద కాలంలో ఆరోగ్యం, ప్రాథమిక విద్య మెరుగవడం.
 • గత దశాబ్దంలో అధిక కాలం అవస్థాపనా సౌకర్యాల మెరుగుదల తక్కువగా ఉన్నా 2014 తర్వాత పరిస్థితి మారింది. ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెరిగాయి. ప్రైవేటు వనరులను ఆకర్షించడానికి అనుమతులను వేగవంతం చేయడం తదితరాల వల్ల అవస్థాపనా సౌకర్యాలు మెరుగయ్యాయి.
 • అధిక పాలన కుంభకోణాల (governance scandals) కారణంగా 2014 వరకు సంస్థాగత వాతావరణం క్షీణించింది. ప్రభుత్వం, ప్రభుత్వ పాలనపై వ్యాపారవేత్తల్లో నమ్మకం సన్నగిల్లింది. కానీ, 2014 తర్వాత ఈ ధోరణిలో మార్పు వచ్చింది.
 • స్థూల ఆర్థిక చలాంకాల్లో 2014 తర్వాత ప్రగతి అధికంగా ఉండటం.
 • వస్తుధరల్లో తగ్గుదల కారణంగా ద్రవ్యోల్బణాన్ని 5 శాతానికి పరిమితం చేయడం.
 • 2007-2016 మధ్య భారత్ పోటీతత్వ స్కోరు 0.19 పాయింట్లు పెరిగింది. దీనికి ప్రధాన కారణం.. అవస్థాపనా సౌకర్యాలు, ఆరోగ్యం, ప్రాథమిక విద్యలో ప్రగతి అధికమవడమే.
 • ఆయుఃప్రమాణం పదేళ్ల క్రితం 62 సంవత్సరాలు కాగా ప్రస్తుతం 68కి పెరిగింది.
 • ప్రాథమిక విద్యను అందుకున్నవారి శాతం 88.8 నుంచి 93.1కు పెరిగింది.
 • స్థూల ఆర్థిక వాతావరణంలో భారత్ అధిక ప్రగతిని (+0.34) నమోదు చేసుకుంది.
 • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కృషి కారణంగా భారత విత్త మార్కెట్‌లో పారదర్శకత పెరిగింది. భారతీయ బ్యాంకులు బ్యాలెన్స్ షీట్లలో వెల్లడించని, అధిక మొత్తంలో ఉన్న రికవరీకాని రుణాలపై ఆర్‌బీఐ దృష్టి సారించింది.
 • అయితే ఉన్నత విద్య, శిక్షణలో ప్రగతి లేదు.
 • భారత్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సాంకేతిక పరిజ్ఞానం అందుబాటు (Technological Readiness). డిజిటల్ ఇండియా లాంటి కార్యక్రమాలు రానున్న కాలంలో అధిక ప్రగతికి కారణమవుతాయి.
 • ఆయుఃప్రమాణం భారత్‌లో పెరిగినా ప్రపంచ ప్రమాణాలతో పోల్చితే తక్కువగా ఉంది. ప్రపంచంలో ఆయుఃప్రమాణం పరంగా భారత్ స్థానం 106.
 • వస్తు, సేవల పన్నుకు సంబంధించి దీర్ఘకాల సమస్య అయిన పన్ను రేట్ల వ్యత్యాసాలపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం కారణంగా వస్తు మార్కెట్ సమర్థత క్షీణించింది.
 • ప్రపంచ పోటీతత్వ సూచీలో మెరుగైన ఫలితాలను సాధించిన ఆర్థిక వ్యవస్థలుగా భారత్, అల్బేనియా, జమైకాలు నిలిచాయి. ఈ సూచీకి సంబంధించి 2015-16లో భారత్ స్థానం 55 కాగా 2016-17లో 39గా నమోదు కావడం ఆర్థిక వ్యవస్థలో మెరుగుపడిన పోటీతత్వాన్ని సూచిస్తుంది. ఇదే కాలానికి సంబంధించి అల్బేనియా తన స్థానాన్ని 93 నుంచి 80కు, జమైకా 86 నుంచి 75కు మెరుగుపరచుకున్నాయి.
భారత్‌లో వ్యాపార నిర్వహణ (డూయింగ్ బిజినెస్) విషయంలో ఎదురవుతున్న మొదటి ఐదు సమస్యాత్మక కారకాలను నివేదిక కింది విధంగా పేర్కొంది. అవి...
- పన్ను నియంత్రణ
- అవినీతి
- పన్నురేట్లు
- దయనీయ ప్రజారోగ్య పరిస్థితులు (Poor Public Health)
- ద్రవ్యోల్బణం

కొన్ని ఉప రంగాల్లో భారత్ స్థానం

ఉప రంగం

స్థానం

మార్కెట్ పరిమాణం 3
నవ కల్పనలు 29
వ్యాపార ఆధునికీకరణ 35
విత్త మార్కెట్ అభివృద్ధి 38
సంస్థలు 42
జీ-20 దేశాల్లో అధిక జీడీపీ వృద్ధిని భారత్ కలిగి ఉందని, అభిలషణీయ ద్రవ్య, కోశ విధానాలు, అదేవిధంగా అల్ప చమురు ధరల కారణంగా భారత్‌లో జీడీపీ వృద్ధి వేగవంతమై ఆర్థిక వ్యవస్థ స్థితి మెరుగవుతుందని నివేదిక పేర్కొంది. ఇటీవలి సంస్కరణలు.. ప్రభుత్వ రంగ సంస్థలను మెరుగుపరచడం, విదేశీ పెట్టుబడులు, విదేశీ వాణిజ్యాన్ని సరళతరం చేయడం, విత్త వ్యవస్థలో పారదర్శకత పెంపుపై దృష్టి కేంద్రీకరించాయని నివేదిక అభిప్రాయపడింది. శ్రామిక మార్కెట్‌పై భారత్ దృష్టి కేంద్రీకరించాల్సిన ఆవశ్యకతను నివేదిక వెలిబుచ్చింది. శ్రామిక మార్కెట్‌లో కఠిన నియంత్రణలు, కేంద్రీకృత వేతన నిర్ణయం, మిలియన్ల మంది భద్రత లేని అసంఘటిత రంగంలో శ్రామికులుగా ఉండటం లాంటి అంశాలపై, ముఖ్యంగా తయారీ రంగానికి సంబంధించిన శ్రామిక మార్కెట్ సంబంధిత అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని నివేదిక పేర్కొంది.
భారత్‌లో విత్త నియంత్రణలు, విలువ ఆధారిత పన్ను రేట్లలో వ్యత్యాసం కారణంగా స్వదేశీ మార్కెట్‌లో సమర్థత కొరవడింది. విత్త రంగ, ప్రభుత్వ రంగ సంస్థల్లో రికవరీ కాని రుణాలు పెరుగుతున్నందువల్ల స్వదేశీ మార్కెట్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని నివేదిక పేర్కొంది. అవస్థాపనా సౌకర్యాల కొరత, ఐసీటీ (Information and Communication Technology) వినియోగంలో ఎదురవుతున్న సమస్యలను నివారించాలి. ఈ క్రమంలో అవస్థాపనా సౌకర్యాల కల్పన, ఐసీటీపై పెట్టుబడులు పెంచాల్సిన ఆవశ్యకతను నివేదిక వెలిబుచ్చింది.

దక్షిణాసియాలో ఆర్థిక వృద్ధి
దక్షిణాసియా ప్రాంతంలోని అనేక ఆర్థిక వ్యవస్థల్లో పోటీతత్వం మెరుగుపడింది. దక్షిణాసియా ధనాత్మక ఆర్థికవృద్ధిని నమోదు చేసుకోవడంతోపాటు గత 20 ఏళ్ల కాలంలో మొదటిసారిగా 2016లో చైనాను అధిగమించి అధిక వృద్ధి సాధించే అవకాశాలున్నాయని నివేదిక పేర్కొంది. గత దశాబ్ద కాలంగా ఆరోగ్యం, ప్రాథమిక విద్య, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధిపై ఉప ఖండం దృష్టిసారించింది. ఆరోగ్యం, ప్రాథమిక విద్య; అవస్థాపనా సౌకర్యాలకు సంబంధించి దక్షిణాసియా సగటు స్కోరు వరుసగా 0.5, 0.3 పెరిగింది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతోపాటు ఇరుగు పొరుగున ఉన్న చిన్న దేశాలైన నేపాల్, భూటాన్, శ్రీలంకలు ఈ ఉప ఖండంలో ఉన్నాయి.
2007 తర్వాతి కాలంలో పోటీతత్వం పెంపునకు అవసరమైన కారకాల విషయంలో ఈ ప్రాంతంలో అధిక, అత్యల్ప ప్రగతి పథంలో ఉన్న దేశాల మధ్య వ్యత్యాసం పెరిగింది. పాకిస్థాన్‌లో దిగజారుతున్న పరిస్థితులు దీనికి కారణం. అవస్థాపనా సౌకర్యాల నాణ్యత ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంకల్లో మెరుగుపడగా నేపాల్‌లో నిలకడగా ఉండి, పాకిస్థాన్‌లో క్షీణించింది. ఉప ఖండంలోని ఆర్థిక వ్యవస్థల్లో పాకిస్థాన్ మాత్రమే స్థూల ఆర్థిక వాతావరణం, ఆరోగ్యం, ప్రాథమిక విద్య స్థాయిలో తన స్థితిని మెరుగుపరచుకోవడంలో విఫలమైందని నివేదిక పేర్కొంది. దక్షిణాసియా ప్రాంతం మొత్తంలో విత్త మార్కెట్‌లో ప్రగతి చాలా తక్కువగా ఉంది. బంగ్లాదేశ్, శ్రీలంకల్లో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటుకు సంబంధించి పరిస్థితి మెరుగుపడింది.

ప్రపంచ పోటీతత్వ సూచీలో వివిధ దేశాల స్థానాలు
దేశం స్కోరు(2016-17) 2015-16లో స్థానం 2016-17లో స్థానం
స్విట్జర్లాండ్ 5.81 1 1
సింగపూర్ 5.72 2 2
అమెరికా 5.70 3 3
నెదర్లాండ్‌‌స 5.57 5 4
జర్మనీ 5.57 4 5
చైనా 4.95 28 28
ఇండియా 4.52 55 39
శ్రీలంక 4.19 68 71
పాకిస్తాన్ 3.49 126 122
చాద్ 2.95 139 136
యెమెన్ 2.74 - 138
డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్
Published date : 24 May 2017 12:25PM

Photo Stories