Skip to main content

ప్రపంచ నవకల్పన సూచీ-2017

డా॥తమ్మా కోటిరెడ్డి,పొఫెసర్ ఐబీఎస్, హైదరాబాద్
నవకల్పన సామర్థ్యం, సక్సెస్ ఆధారంగా ప్రపంచ నవకల్పన సూచీ వివిధ దేశాలకు సాంవత్సరిక ర్యాంకులు ప్రకటించింది. అనేక సంస్థల భాగస్వామ్యంతో కార్నెల్ యూనివర్శిటీ, ఇన్‌సీడ్, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌లు సంయుక్తంగా ఈ సూచీని ప్రచురిస్తున్నాయి.

అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్ యూనియన్, ప్రపంచ బ్యాంకు, వరల్డ్ ఎకనమిక్ ఫోరం వంటి సంస్థల నుంచి సేకరించిన గణాంకాల ఆధారంగా ప్రపంచ నవకల్పన సూచీని రూపొందిస్తున్నారు. తొలిసారి 2007లో ఇన్‌సీడ్, వరల్డ్ బిజినెస్‌లు ఈ సూచీని రూపొందించాయి. నవకల్పన స్థాయి ఆధారంగా దేశాలను పోల్చేందుకు కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ అధికారులకు ఈ సూచీ ఉపయోగపడుతుంది. ఇన్నోవేషన్ ఇన్ పుట్ ఇండెక్స్, ఇన్నోవేషన్ ఔట్‌పుట్ ఇండెక్స్ అనే రెండు ఉపసూచికల సాధారణ సగటు స్కోరు ఆధారంగా ప్రపంచ నవకల్పన సూచీని రూపొందిస్తారు.

ఏఏ వ్యవస్థల్లో..
127 దేశాల నవకల్పనల ప్రగతిని 81 సూచికల ఆధారంగా ప్రపంచ నవకల్పన సూచీ-2017లో పొందుపర్చారు. ఈ సూచికలు రాజకీయ వాతావరణం, విద్య, అవస్థాపన, తదితరాలను తెలుపుతాయి. ప్రపంచ నవకల్పన సూచీ-2017 వ్యవసాయం, ఆహార వ్యవస్థల్లోని నవకల్పనలపై దృష్టి సారించింది. రాబోయే దశాబ్దాల్లో వ్యవసాయం, ఆహార రంగానికి ప్రపంచ వ్యాప్తంగా అధిక డిమాండ్ ఉండనుంది. పరిమితంగా ఉన్న సహజ వనరుల వినియోగానికి పోటీ పెరిగి.. ఆ ప్రభావం వాతావరణ మార్పులకు దారితీయనుంది. వ్యవసాయ, ఆహార రంగాల్లో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను పెంచాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ఉత్పాదకతలో వృద్ధి సాధనకు నవకల్పన అవసరం. నవకల్పన కేవలం అభివృద్ధి చెందిన దేశాలకు, అధిక సాంకేతికతతో కూడిన రంగాలకు మాత్రమే పరిమితం కాదు.

ప్రపంచ వ్యాప్తంగా నవకల్పన ఆర్థిక వ్యవస్థలో అనేక రంగాలపై ప్రభావం చూపుతోంది. వ్యవసాయ, ఆహార రంగాల్లో నవకల్పనల ద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు, పెరుగుతున్న జనాభాకు అవసరమైన సంతులిత పౌష్టికాహారం అందించడంపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాలి. నూతన వ్యవసాయ సాంకేతికత, నవకల్పనలు వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను మెరుగుపరుస్తాయి. కొన్నేళ్లుగా వ్యవసాయ నవకల్పనల వేగం పెరిగింది. జెనెటిక్స్, నానో, బయోటెక్నాలజీలు అధిక దిగుబడులకు ఆధారాలుగా, పోషక స్థాయి అధికంగా ఉండే విధంగా తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయి.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ వ్యవసాయం ప్రారంభమైంది. ఇది భవిష్యత్‌లో మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నవకల్పనలైన సెన్సార్‌‌స, డ్రోన్‌‌స, రోబోటిక్స్, రిమోట్ సెన్సింగ్, భౌగోళిక సమాచార వ్యవస్థలు డిజిటల్ వ్యవసాయ వ్యాప్తికి తోడ్పడ్డాయి. అయితే గతంలో జరిగిన వ్యవసాయ నవకల్పనల ద్వారా సబ్ సహార ఆఫ్రికా దేశాలు ఇప్పటికీ లబ్ధి పొందలేదు.
  • ఆహార, వ్యవసాయ వాల్యూ చైన్‌లో నవకల్పనల వేగవంతానికి ప్రభుత్వాల కృషి అవసరం. ఎలాంటి జాతీయ నవకల్పన వ్యూహమైనా వ్యవసాయం, ఆహార రంగాల భాగస్వామ్యం తప్పనిసరి. అయితే ఇప్పటికీ జాతీయ నవకల్పన వ్యూహంలో వ్యవసాయం, ఆహార రంగాల భాగస్వామ్యం తక్కువగానే కనిపిస్తోంది.
  • మార్కెట్ వైఫల్యాలను నివారించేందుకు విధాన నిర్ణేతలు వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల్లో నవకల్పనల వేగవంతానికి తగిన నిధులు అందించాల్సిన అవసరం ఉంది.
  • అభివృద్ధి చెందుతున్న దేశాలు.. స్వదేశీ పరిశోధన, అభివృద్ధిపై దృష్టి సారించాలి. లభ్యమయ్యే వనరుల ఆధారంగా పరిశోధనా రంగంలో ప్రాధాన్యతలను నిర్ణయించుకోవాలి. సాంకేతిక బదిలీని వేగవంతం చేసేందుకు యూనివర్సిటీ- పరిశ్రమ మధ్య అనుసంధానం ఉండాలి. వాణిజ్య వ్యవసాయ కార్యకలాపాల నుంచి నవకల్పనల డిమాండ్ కోసం రైతులకు తగిన మద్దతు అవసరం. దాని కోసం కింది చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
  1. రైతులకు తగిన సమాచారం అందించడం తోపాటు వాల్యూ చైన్‌లోని ముఖ్య శ్రామికులు తగిన నైపుణ్యత కలిగి ఉన్నారా? లేదా? అని నిర్ధారించుకోవాలి.
  2. డిజిటల్ టెక్నాలజీ, నూతన సర్వీస్ ప్లాట్‌ఫాంలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చి తద్వారా వారిలో సాధికారతను పెంపొందించాలి. ఈ చర్య వ్యవసాయ రంగ అభివృద్ధిపై ధనాత్మక ప్రభావం చూపుతుంది.
  3. వ్యవసాయ రంగంలో ఉద్యమిత్వ ఆవశ్యకతను గుర్తించడంతోపాటు ఉద్యమిత్వం, వెంచర్ కాపిటల్ పెంపునకు తగిన విధానాలను రూపొందించాలి.
  4. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన సాధనాలను వ్యవసాయ రంగంలో వినియోగించే విధంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు చొరవ చూపాలి.
  5. వ్యవసాయ రంగంలో జాతీయ చట్టబద్ధ, నియంత్రణ వ్యవస్థను మెరుగుపరచాలి. నియంత్రణలను సడలించి.. బ్యూరోక్రసీని తగ్గించాలి.

వివిధ దేశాల స్థితి
  • ప్రపంచ నవకల్పన సూచీ 2017లో స్విట్జర్లాండ్ ప్రథమ స్థానం పొందగా స్వీడన్ రెండో స్థానంలో, నెదర్లాండ్‌‌స మూడో స్థానంలో, అమెరికా నాలుగో స్థానంలో, యూకే ఐదోస్థానంలో నిలిచాయి. చైనా 22వ స్థానం పొందింది.
  • నవకల్పన, ఆర్థికాభివృద్ధి విషయంలో 21వ శతాబ్దంలో ఆసియాలో ప్రగతి అధికంగా ఉంది. 1980వ దశకంలో ఆసియా టైగర్లుగా పేరొందిన హాంకాంగ్, సింగపూర్, ది రిపబ్లిక్ ఆఫ్ కొరియా, కొంత వరకు మలేసియాలు తమ నవకల్పనల అజెండాను అభివృద్ధి పరచుకున్నాయి.
  • సూచీలో శ్రీలంక 90వ స్థానం, నేపాల్ 109వస్థానం, పాకిస్తాన్ 113వ స్థానం, బంగ్లాదేశ్ 114వ స్థానం పొందాయి.


సూచీల్లో భారత్..

  • ప్రపంచ నవకల్పన సూచీ 2017లో భారతదేశం 60వ స్థానం పొందింది. 2016లో 66వ స్థానం పొందిన భారత్.. 2017లో తన స్థానాన్ని మెరుగుపరచుకుంది. కొన్ని ముఖ్య రంగాల్లో సాధించిన ప్రగతే దీనికి కారణం. అవస్థాపన, నాలెడ్‌‌జ, టెక్నాలజీ అవుట్‌పుట్స్, క్రియేటివ్ అవుట్‌పుట్స్ వంటి రంగాల్లో భారత్ తన ప్రగతిని మెరుగుపరచుకుంది.
  • కొన్ని సూచికల విషయంలో అల్ప - మధ్య స్థాయి, ఎగువ - మధ్య స్థాయి ఆదాయ దేశాల సగటు కంటే భారత్ ముందంజలో ఉంది. శాస్త్రీయ ప్రచురణల నాణ్యత, ఉన్నత, మధ్య స్థాయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, బిజిసెస్ ఎంటర్‌ప్రెజైస్‌లో పరిశోధన, సైన్‌‌స ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్లు, క్లస్టర్ అభివృద్ధి స్థూల, మూలధన కల్పన, గ్లోబల్ రీసెర్‌‌చ డెవలప్‌మెంట్ కంపెనీలు, ప్రతి శ్రామికునికి సంబంధించిన కొనుగోలు శక్తి సామ్యం ఆధారంగా జీడీపీ వృద్ధిరేటు వంటి అంశాల్లో భారత్ ముందంజలో ఉంది.
  • ప్రభుత్వ ఆన్‌లైన్ సర్వీసులు, ఈ- పార్టిసిపేషన్, లాజిస్టిక్ ప్రగతి, ఇండస్ట్రియల్ డిజైన్, హైటెక్ దిగుమతులు వంటి సూచికల విషయంలో భారత్ తన స్థితిని మెరుగుపరచుకుంది.
  • బిజినెస్ ఎన్విరాన్‌మెంట్‌కు సంబంధించిన సూచికల విషయంలో తన ప్రగతిని మెరుగుపరచుకునే సామర్థ్యం భారత్‌కు ఉందని నివేదిక పేర్కొంది. భారతదేశంలో ప్రస్తుత అభివృద్ధి స్థాయి, ప్రపంచ నవకల్పనలో భారత్ తన వాటాను పెంపొందించుకోవడం వంటి అంశాలను నివేదిక ప్రస్తావించింది.
  • భారతదేశంలో పరిశోధన, అభివృద్ధి రంగంలో నిమగ్నమైన అనేక సంస్థలు పేటెంట్ హక్కులు పొందడంలో, హై టెక్నాలజీ, ఎగుమతుల విషయంలో చురుగ్గా ఉన్నాయని నివేదిక పేర్కొంది.
  • పెట్టుబడి, తృతీయ స్థాయి విద్య, యూనివర్సిటీలు, ప్రచురణల్లో ప్రగతి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సర్వీసుల ఎగుమతులు, ఇన్నోవేషన్ క్లస్టర్ల ఏర్పాటు వంటి అంశాల విషయంలో భారత ప్రగతి కొనసాగుతోందని నివేదిక వెల్లడించింది.
  • భారతదేశంలో నవకల్పనలకు అనుకూల వాతావరణం ఏర్పరిచే విషయంలో పబ్లిక్ పాలసీ ప్రధాన పాత్ర పోషించింది. నవకల్పనలపై హైలెవల్ టాస్క్‌ఫోర్‌‌స ఏర్పాటుతో పాటు, నవకల్పన విధానం వంటివి నవ కల్పన సూచికల్లో ప్రగతికి కారణమయ్యాయి.
  • నివేదిక భారత జనాభాను 1,326.8 మిలియన్లుగా, స్థూల దేశీయోత్పత్తిని 2,251 బిలియన్ డాలర్లుగా, కొనుగోలు శక్తిసామ్యం ఆధారంగా తలసరి స్థూల దేశీయోత్పత్తిని 6,161.6 డాలర్లుగా, ఆదాయ గ్రూపు పరంగా భారత్‌ను లోవర్ మిడిల్ ఇన్‌కం దేశంగా పేర్కొంది.
  • 127 దేశాలతో రూపొందించిన ప్రపంచ నవకల్పన సూచీ-2017లో భారత్ 60వ స్థానం పొందగా, ముఖ్య సూచికలైన ఇన్నోవేషన్ అవుట్‌పుట్ సబ్ ఇండెక్స్‌లో 58వ స్థానం, ఇన్నోవేషన్ ఇన్‌పుట్ సబ్ ఇండెక్స్‌లో 66వ స్థానం, నవకల్పనల సామర్థ్య నిష్పత్తిలో 53వ స్థానం పొందింది. సూచికల విషయంలో భారత్‌లోని ప్రగతి వల్ల ఇరుగు పొరుగు దేశాలు సైతం లబ్ధిపొందాయని నివేదిక పేర్కొంది.
  • దిగువ మధ్యతరగతి దేశమైన భారత్‌లో 2011 నుంచి నవకల్పనలు పెరిగాయని నివేదిక పేర్కొంది. ఆదాయ గ్రూపు పరంగా భారత్‌తో ఇతర దిగువ మధ్యతరగతి దేశాలైన వియత్నాం, కెన్యాలను 2011 తర్వాత కాలంలో నవకల్పనలు సాధించిన దేశాలుగా నివేదిక పేర్కొంది. ఇదే ఆదాయ గ్రూపులో ఉన్న అర్మేనియా, ఉక్రెయిన్‌లు 2012 నుంచి నవకల్పనలు సాధించాయని నివేదిక అభిప్రాయపడింది.

జీఐఐ ర్యాంకులు:

ర్యాంకు

దేశం

స్కోరు (0-100)

1

స్విట్జర్లాండ్

67.69

2

స్వీడన్

63.82

3

నెదర్లాండ్స్

63.36

4

యూఎస్‌ఏ

61.40

5

యూకే

60.89

22

చైనా

52.54

60

భారత్

35.47

90

శ్రీలంక

29.85

113

పాకిస్థాన్

23.80

114

బంగ్లాదేశ్

23.72

127 (చివరి)

యెమెన్

15.64

Published date : 29 Jun 2017 05:43PM

Photo Stories