ప్రపంచ ఆకలి సూచీ-2016
118 దేశాల గణాంకాలతో జాబితా
ఈ సూచీని రూపొందించడానికి 131 దేశాల్లో అధ్యయనం జరపినా 118 దేశాల గణాంకాలు మాత్రమే లభ్యమయ్యాయి. బ్రెజిల్, అర్జెంటీనాలు జీహెచ్‌ఐ (గ్లోబల్ హంగర్ ఇండెక్స్) స్కోరును 5లోపు పరిమితం చేసుకోవడం ద్వారా ఆకలిని తగ్గించడంలో అభివృద్ధి చెందుతున్న దేశాల పరంగా ప్రముఖ స్థానాన్ని పొందాయి. చాద్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లు వరుసగా 44.3, 46.1 స్కోరును సాధించి పేలవ ప్రదర్శన కనబర్చాయి. 2000 తర్వాత 20 దేశాలు ముఖ్యంగా రువాండా, కంబోడియా, మయన్మార్‌లు తమ స్కోరును 50 శాతానికి తగ్గించుకోవడంలో విజయవంతమయ్యాయని నివేదిక పేర్కొంది. ఆరేళ్ల కాలంలో భారత్ ప్రపంచంలో అధిక జనాభా గల దేశంగా అవతరించగలదు. మొత్తంగా 1.4 బిలియన్ భారతీయులు ఆరోగ్యకరమైన, సౌకర్యవంతమైన జీవనాన్ని గడపడానికి తగిన పౌష్టికాహారాన్ని అందించాల్సి ఉంటుంది. భారత్ అధిక ప్రగతిని సాధిస్తున్నా రాబోయే కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని దక్షిణాసియా IFPRI (International Food Policy Research Institute) డెరైక్టర్ పి.కె.జోషి అభిప్రాయపడ్డారు.
ప్రపంచ ఆకలి సూచీ - భారత్
భారత్‌లో 15.2 శాతం జనాభా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు నివేదిక అంచనా వేసింది. ఆహార పరిమాణం, నాణ్యత పరంగా వీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదేళ్లలోపు పిల్లల్లో ఎత్తుకు తగిన బరువు లేనివారు 15.1 శాతం కాగా, వయసుకు తగిన ఎత్తు లేనివారు 38.7 శాతం. ఐదేళ్ల లోపు శిశుమరణాల రేటు 4.8 శాతంగా నివేదిక పేర్కొంది.
1992లో ప్రపంచ ఆకలి సూచీని 96 దేశాలకు సంబంధించి రూపొందించగా భారత్ 76వ స్థానంలో (46.4 స్కోర్‌తో) నిలిచింది. 2000లో - 36.2, 2008లో - 36, 2016లో - 28.5 స్కోరు(97వ ర్యాంకు)ను భారత్ పొందింది. దీన్నిబట్టి చూస్తే భారత్‌లో ఆకలితో బాధపడే వారి సంఖ్య తగ్గినా, ఇతర దేశాలతో పోల్చినప్పుడు ఆకలి స్థాయిలను తగ్గించడంలో వెనుకబడిందని చెప్పొచ్చు.
సూచీల్లో భారత్
పపంచంలోనే అతిపెద్ద పిల్లల పౌష్టికాహార కార్యక్రమాలు రెండింటిని భారత్ అమలు చేస్తున్నా, ఆకలి సమస్యను పరిష్కరించడంలో విజయవంతం కాలేకపోయింది. ఆరేళ్లలోపు పిల్లలకు ICDS (Integrated Child Development Sevices) కార్యక్రమం, 14 ఏళ్ల వయసు వరకు పాఠశాలలకు హాజరవుతున్న పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. 15 ఏళ్ల క్రితంతో పోల్చితే ప్రస్తుతం ఈ సూచీ (జీహెచ్‌ఐ)కి సంబంధించి భారత్ స్థానం దిగజారింది. 2000 లో బంగ్లాదేశ్ ఈ సూచీలో 84వ స్థానాన్ని, 38.5 స్కోరు సాధించి భారత్ కంటే దిగువస్థాయిలో ఉంది. అయితే 2016లో బంగ్లాదేశ్ 90వ స్థానాన్ని, 27.1 స్కోరు సాధించి భారత్‌తో పోల్చితే ఈ సూచీలో తన స్థితిని మెరుగుపర్చుకుంది. ఈ సూచీకి సంబంధించి ఆసియాలో ఉత్తర కొరియా (98), పాకిస్తాన్ (107), అఫ్గానిస్తాన్ (111)ల కంటే భారత్ తన స్థితిని మెరుగుపర్చుకోగలిగింది.
ఉపసూచికల్లో భారత్ ప్రగతి
మొత్తం జనాభాలో పౌష్టికాహార లోపంలో బాధపడుతున్న ప్రజల సంఖ్య 1991-93లో 22.2 శాతం కాగా, 2014-16లో 15.2 శాతానికి తగ్గింది. ఎత్తుకు తగిన బరువు లేని 5 ఏళ్లలోపు పిల్లలు 1990-94లో 22 శాతం కాగా, 2011-15లో 15.1 శాతానికి తగ్గింది. వయసుకు తగిన ఎత్తు లేని 5 ఏళ్ల లోపు పిల్లలు 1990-94లో 61.9 శాతం కాగా, 2011-15 లో 38.7 శాతానికి తగ్గింది. ఐదేళ్ల లోపు శిశుమరణాలు 1992లో 11.9 శాతం కాగా 2015లో 4.8 శాతానికి తగ్గాయి.
జీరో హంగర్ లక్ష్యం నెరవేరాలంటే..
భారత్‌లో జీరో హంగర్ సాధనకు... వృద్ధి, ఉపాధి, ఆదాయ స్థాయిలను పెంచడానికి సమష్టి పెట్టుబడులను అధికం చేయడంపై భారత్ దృష్టి కేంద్రీకరించాలి. 2030 నాటికి జీరో హంగర్ లక్ష్యాన్ని సాధించాలంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగ పెట్టుబడులు పెంచాలి. పెట్టుబడుల పెరుగుదల వల్ల అధిక ఉత్పాదకతతో కూడిన సుస్థిర, సమ్మిళిత ఆహార వ్యవస్థకు ప్రోత్సాహం లభిస్తుంది. పేదరికం, ఆకలి విషవలయాలను నిర్మూలించడానికి సామాజిక భద్రతా పథకాల విస్తృత అమలుపై దృష్టి సారించాలి. అలాగే విద్య, ఆరోగ్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, గృహవసతిపై ప్రభుత్వరంగ పెట్టుబడులు పెంచాలి.
ప్రపంచ ఆకలి సూచీ స్కోర్లు
దేశం | ర్యాంకు (2016) | 1992 | 2000 | 2008 | 2016 |
అర్జెంటీనా | 1 | 5.8 | 5.3 | < 5 | <5 |
ఇరాన్ | 23 | 17.5 | 13.7 | 8.8 | 6.7 |
చైనా | 29 | 26.4 | 15.9 | 11.5 | 7.7 |
నైజీరియా | 84 | 49.5 | 40.9 | 33.6 | 25.5 |
బంగ్లాదేశ్ | 90 | 52.4 | 38.5 | 32.4 | 27.1 |
ఇండియా | 97 | 46.4 | 36.2 | 36 | 28.5 |
ప్రపంచ ఆకలి సూచీ- 2016, భారత్ - పొరుగు దేశాల స్థితి
దేశం | ర్యాంకు | జీహెచ్‌ఐ స్కోరు | పౌష్టికాహార లోపంతో ఇబ్బందిపడే వారి శాతం | 5 సం॥వయోవర్గంలో వయసుకు తగిన ఎత్తు పెరగనివారు (% పరంగా) |
చైనా | 29 | 7.7 | 8.8 | 8.1 |
నేపాల్ | 72 | 21.9 | 7.8 | 37.4 |
మయన్మార్ | 75 | 22 | 14.2 | 31.0 |
శ్రీలంక | 84 | 25.5 | 22 | 14.7 |
బంగ్లాదేశ్ | 90 | 27.1 | 16.4 | 36.4 |
ఇండియా | 97 | 28.5 | 15.2 | 38.7 |
పాకిస్తాన్ | 107 | 33.4 | 22 | 45 |
1. పురోగతి...
ఆకలి, పౌష్టికాహారలోపంతో బాధపడే ప్రజల సంఖ్యను తగ్గించడంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు మంచి పురోగతి సాధించినట్లు ప్రపంచ ఆకలి సూచీ - 2016 ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఆయా అంశాలపై దృష్టి సారించడం ద్వారా 2030 నాటికి జీరో హంగర్ లక్ష్యాన్ని సాధించడానికి దేశాలు ప్రయత్నించాలని నివేదిక పేర్కొంది. సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యం-2లో ఆహార భద్రత, పౌష్టికాహారాన్ని మెరుగుపర్చడం, సుస్థిర వ్యవసాయం లాంటి అంశాలు పేర్కొన్నారు. వీటిని మెరుగుపర్చడం ద్వారా సాంఘిక న్యాయ సాధన, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రజారోగ్యం, శ్రేయస్సు పెరుగుదల నెరవేరతాయి. మిలీనియం వృద్ధి లక్ష్యమైన, దీర్ఘకాలంగా ఆకలితో బాధపడుతున్న ప్రజల శాతాన్ని సగానికి తగ్గించుకోవడంలో 129 దేశాల్లో 73 సఫలీకృతమయ్యాయి. దీర్ఘకాలంగా ఆకలితో అలమటిస్తున్న ప్రజల సంఖ్య 210 మిలియన్లకు తగ్గింది. అయితే ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 800 మిలియన్ల ప్రజలకు సరిపడా ఆహారం లభించడంలేదు. సుస్థిర ఆర్థికాభివృద్ధి - 2030 అజెండా లక్ష్యసాధనలో వెనుకబడిన దేశాలకు తగిన మార్గదర్శకాలను సూచించింది. ఈ అజెండా 2030 నాటికి అన్ని దేశాల్లో ఆకలి, పౌష్టికాహార లోపాన్ని నివారించి జీరో హంగర్ సాధించడానికి అంకితమయింది.
2. మెరుగ్గా..
ప్రపంచ ఆకలి సూచీని రూపొందించడానికి వినియోగించిన సూచీలను పరిశీలిస్తే 2000 తర్వాత పౌష్టికాహార లోపంతో బాధపడే ప్రజల శాతం 18.5 నుంచి 13.1కి తగ్గింది. ఐదేళ్ల వయోవర్గంలోపు శిశుమరణాల రేటు 2000 లో 8.2 శాతం కాగా 2015లో 4.7 శాతానికి తగ్గింది. వయసుకు (5ఏళ్ల లోపు) తగిన ఎత్తులేని పిల్లల సంఖ్య 2000లో 37.8 శాతం కాగా ప్రస్తుతం 28.1 శాతానికి తగ్గింది. ఎత్తుకు తగిన బరువులేని పిల్లలు 2000లో 9.9 శాతం కాగా ప్రస్తుతం 8.4 శాతానికి తగ్గినట్లు నివేదిక పేర్కొంది.
3. ప్రపంచ ఆకలిసూచీ స్కోర్ నాలుగు సూచికలపై ఆధారపడి ఉంటుంది. అవి..
1) మొత్తం జనాభాలో పౌష్టికాహార లోపంతో ఇబ్బంది పడే ప్రజల నిష్పత్తి. కనీస కేలరీల ఆహారం పొందలేని ప్రజల వాటాను ఇది తెలియజేస్తుంది.
2) Child Wasting (5 ఏళ్ల వయోవర్గంలోపు ఎత్తుకు తగిన బరువు లేని పిల్లలు. ఈ స్థితి పౌష్టికాహార లోపాన్ని సూచిస్తుంది).
3) Child Stunting (వయసుకు తగిన ఎత్తు లేని పిల్లలు. ఈ స్థితి దీర్ఘకాలిక పౌష్టికాహార లోపాన్ని తెలియజేస్తుంది).
4) శిశు మరణాలు: సరిపడా పౌష్టికాహారం లేకపోవడంతో పాటు అనారోగ్యకర వాతావరణాన్ని ఈ స్థితి తెలుపుతుంది.
డా॥తమ్మా కోటిరెడ్డి, పొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్