Skip to main content

మదర్ ఇండెక్స్- 2015

డా॥తమ్మా కోటిరెడ్డి,ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్.
‘నేటి బాలలే రేపటి పౌరులు’.. అయితే నేడు అనేక కారణాల వల్ల భారతదేశంలో అప్పుడే పుట్టిన నవజాత శిశువుల నుంచి 5 సంవత్సరాలు కూడా నిండకుండా చనిపోతున్న వారి సంఖ్య తగ్గింపులో మెరుగుపడుతున్నాం అని భావిస్తున్నా.. సమస్య పూర్తిగా అంతం కాలేదు. ప్రసూతి, శిశు మరణాల రేటులో ఇంకా వెనుకే ఉన్నాం. సేవ్ ది చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వే వెల్లడించిన వాస్తవాలు భారతదేశంలోని మహిళలు, పిల్లల స్థితిగతులను తెలిపాయి. ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై పునఃసమీక్షించుకునేలా చేస్తున్నాయి.

వార్షిక మదర్ నివేదిక (Annual Mother's Index)ను మహిళల, పిల్లల ఆరోగ్యం, విద్యావకాశాలు (Education-al attainment), ఆర్థిక శ్రేయస్సు (Economic wellbeing), రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని సూచీలుగా ఉపయోగిస్తూ తాజా నివేదిక రూపొందించారు. నగరాల్లోని ధనిక, పేద వర్గాల ప్రజల ఆరోగ్య అసమానతలపై ఈ నివేదిక దృష్టి సారించింది. అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల్లో ధనిక పట్టణ పిల్లల్లోని (Urban Children) మరణాలతో పోల్చితే పేద పట్టణ పిల్లల్లోని మరణాలు రెట్టింపుగా ఉండడం గమనించవచ్చు. కొన్ని దేశాల్లో ఈ స్థితి 3-5 రెట్లుగా ఉంది. మొత్తం 179 దేశాల్లో మహిళల స్థితిగతులు, ఇబ్బందులను తెలుసుకునేందుకు ఈ నివేదిక ఉపకరిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో పిల్లల బాగోగులను చూసుకునే తల్లుల సంఖ్య పెరుగుతోందని ఈ నివేదిక పేర్కొంది. ప్రపంచ జనాభాలో సగం నగరాల్లో నివసిస్తుండగా, ఆయా ప్రాంతాల్లో పిల్లల మరణాల్లోనూ పెరుగుదల నమోదైంది. ఒకవైపు సంపద, ఆరోగ్యవంతులైన జనాభాకు.. మరోవైపు పేద, ఉపాంత కుటుంబాలకు నగరాలు కేంద్రాలుగా నిలుస్తున్నాయని నివేదిక అభిప్రాయపడింది.

మదర్స్ ఇండెక్స్
ప్రపంచంలోని మహిళల స్థితిగతులను అంచనా వేస్తూ అమెరికాలోని ‘సేవ్ ది చిల్డ్రన్’ అనే స్వచ్ఛంద సంస్థ తన వార్షిక నివేదికను ’ది అర్బన్ డిసడ్వాంటేజ్’ పేరుతో రూపొందించింది. 179 దేశాలకు ర్యాంకులు ఇస్తూ మదర్స్ ఇండెక్స్‌ను సూచీల సహాయంతో రూపొందించింది. తల్లి ఆరోగ్యం, వారి పిల్లల శ్రేయస్సు, విద్యా, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను సూచీలుగా ఉపయోగిస్తూ నివేదికను రూపొందించారు. ఈ నివేదిక ద్వారా మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన దేశాలు..
 • నార్వే
 • ఫిన్‌లాండ్
 • ఐస్‌లాండ్
 • డెన్మార్క్
 • స్వీడెన్
ఈ నివేదికలో చిట్టచివరి స్థానాన్ని సోమాలియా(179) పొందింది. భారతదేశం 140వ స్థానంలో ఉంది. పట్టణ ప్రాంతాల్లోని ధనిక, పేద పిల్లల్లో మనుగడ రేటు విభజన అధికంగా ఉన్న పది దేశాల్లో భారతదేశం ఒకటి. శిశు మరణాల రేటు తగ్గింపులో మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ.. ప్రస్తుతం ఏడాదికి 7,60,000 మంది అప్పుడే పుట్టిన పిల్లలు మరణిస్తున్నారని కేంద్ర మంత్రి నజ్మా హెప్తుల్లా పేర్కొన్నారు. వీటిలో అనేక మరణాలు నివారించగలిగినవే కావడం శోచనీయం. ఈ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం భారతదేశంలో 1.3 మిలియన్ల 5 సంవత్సరాల్లోపు పిల్లలు మరణిస్తున్నారు.

మురికివాడల్లో పెరుగుతున్న జనాభా
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 1/3వ వంతు పట్టణ ప్రాంత జనాభా మురికివాడల్లో నివసిస్తున్నారు. 2020 నాటికి ఆయా దేశాల్లో మురికివాడల్లో నివసించే జనాభా ఒక బిలియన్ ఉండగలదని అంచనా. మురికివాడల్లో జనాభా అధికంగా ఉండడంతో పాటు సరైన నాణ్యత లేని గృహాలు, పారిశుద్ధ్య సౌకర్యాలు తక్కువగా ఉండడం, పేదరికం లాంటి లక్షణాలు ఉన్నాయి. పరిమాణంలో బేధాలున్నప్పటికీ.. అన్ని దేశాల్లోని మురికివాడల్లో మౌలిక సదుపాయాల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. సబ్ సహారా ఆఫ్రికా దేశాల్లోని 62 శాతం నగర మురికివాడల్లో నివసిస్తుండగా ఉత్తర అమెరికాల్లోని పట్టణ జనాభాలో 13 శాతం నివసిస్తున్నారు. పశ్చిమాసియాలో 25, దక్షిణాసియాలో 35 శాతం నగర జనాభా మురికివాడల్లో నివసిస్తున్నారు. భారతదేశంలో 29 శాతం పట్టణ జనాభా మురికివాడల్లో నివసిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

భారతదేశంలో పట్టణ ధనిక జనాభాతో పోల్చితే 5 సంవత్సరాలు కూడా నిండకుండా మరణించే పిల్లల సంఖ్య.. పట్టణ పేద జనాభాలో 3.2 రెట్లు అధికమని నివేదిక అభిప్రాయపడింది. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అధిక శాతం పట్టణ జనాభా మురికివాడల్లో నివసిస్తున్న కారణంగా ‘పట్టణ పిల్లల మరణాల రేటు’ అధికంగా ఉంది. పదకొండు దేశాల్లోని పట్టణ జనాభాలో 2/3వ వంతు మురికివాడల్లో నివసిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

ప్రాంతాల మధ్య అసమానతలు
 • పశ్చిమ, సెంట్రల్ ఆఫ్రికాలో ప్రెగ్నెన్సీ, బిడ్డకు జన్మనిచ్చే సమయాల్లో.. ప్రతి 30 మంది మహిళల్లో ఒకరు మరణిస్తుండగా, దక్షిణాసియాలో ప్రతి 190 మంది మహిళల్లో ఒకరు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి నాలుగు వేల మహిళల్లో ఒకరు మరణిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
 • ఇతర ప్రాంతాల పిల్లలతో పోల్చినపుడు ఆఫ్రికన్ పిల్లల్లో ప్రతికూలతలు ఎక్కువ. ప్రతి 12 మందిలో ఒకరు 5 సంవత్సరాల్లోపు మరణిస్తున్నారని నివేదిక పేర్కొంది. 2013లో 32 లక్షల మంది ఆఫ్రికన్ పిల్లలు 5 సంవత్సరాలు కూడా నిండకుండా మరణించినట్లు అంచనా. ప్రపంచంలోని మొత్తం 30 శాతం పిల్లల మరణాలు పశ్చిమ, సెంట్రల్ ఆఫ్రికాలోనే సంభవించాయి. ఆయా దేశాల ఆర్థిక వనరుల కొరతే అధిక జనాభా మరణ రేటుకు కారణంగా భావించవచ్చు.
 • బురుండి, మాలావి, సోమాలియాలు ప్రపంచంలోనే అత్యంత పేద దేశాలు. ఆయా దేశాల తలసరి స్థూల జాతీయోత్పత్తి 3 వేల డాలర్ల కన్నా తక్కువ. మరోవైపు నార్వే, స్విట్జర్లాండ్‌ల తలసరి జాతీయోత్పత్తి 90 వేల డాలర్లు.
 • ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పాఠశాలలో 19 సంవత్సరాలకు పైగా సగటున విద్యనభ్యసిస్తుండగా, నైజర్‌లో ప్రాథమిక విద్యను అక్కడి పిల్లలు కేవలం అయిదున్నర సంవత్సరాలు చదవగలుగుతున్నారు. సోమాలియాలో 2.2 సంవత్సరాలు మాత్రమే సగటున పిల్లలు పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు. ఎరిట్రియాలో నాలుగు సంవత్సరాలు మాత్రమే విద్యనభ్యసిస్తున్నారు.
 • మైక్రోనేషియా, ఖతర్, టాంగాలలో పార్లమెంట్‌లో మహిళా సభ్యులు లేరు. కువైట్, సోమాలియాతో పోల్చితే బొలీవియా, రువాండా పార్లమెంట్‌లలోని మొత్తం సభ్యుల్లో మహిళల సంఖ్య సగానికి పైగా ఉందని నివేదిక పేర్కొంది.
కైరో, మనీలా, కంపాలలో ఆరోగ్య సంరక్షణ
 • కైరోలో జాతీయ ఆరోగ్య వ్యవస్థలో సంస్కరణలు, ప్రత్యేక కార్యక్రమాలు, పౌర సమాజ సంఘాలు చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా పిల్లల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆ దేశంలో 5 ఏళ్ల లోపు పిల్లల మరణాల రేటు 2000 సంవత్సరంతో పోల్చితే 2014లో 55 శాతం తగ్గింది. ఈజిప్టు ఆరోగ్య, జనాభా మంత్రిత్వ శాఖ పేద ప్రజలకు ఉచితంగా/ సబ్సిడీల ద్వారా ఆరోగ్య సేవలను అందించింది. కైరోలో 99 శాతం ప్రజలకు మంత్రిత్వ శాఖ మీజిల్స్ వ్యాక్సిన్ అందించింది. పట్టణ ప్రాంతంలో పేద, ధనిక అనే భేదం లేకుండా అందరికీ శుభ్రమైన తాగునీరు సరఫరాచేసింది. పటిష్టమైన వ్యాధి నిరోధక చర్యలను ఈజిప్ట్ అమలు పరచింది. కైరోలో స్వచ్ఛంద సంస్థలు నగర వ్యాప్తంగా పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాయి. కుటుంబ నియంత్రణ, పౌష్టికాహారం, ప్రసూతి సంరక్షణ, వ్యాధుల నివారణ, ఆరోగ్య సంరక్షణపై ప్రజలను చైతన్య పరిచే కీలక అంశాల్లో ఈజిప్ట్ ఆరోగ్య శాఖ స్థానిక, అంతర్జాతీయ పౌర సమాజాల్లో భాగస్వామిగా ఉంది.
 • మెరుగైన ఆరోగ్య సేవలు, తల్లులు, పిల్లల కోసం ప్రత్యే కార్యక్రమాలు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలు, ఆరోగ్య కార్యకర్తల సహకారం, నిర్మాణాత్మక సంస్కరణలు, ఆరోగ్య సంరక్షణలో నవ కల్పనల ద్వారా ప్రసూతి, శిశు ఆరోగ్య సంరక్షణలో మనీలా మంచి ఫలితాలు సాధించింది. రాజధాని ప్రాంతంలో సాధించిన ఈ ప్రగతిలో కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ అందించిన తోడ్పాటు కీలకమైంది.
 • జనాభా అధికంగా ఉన్నప్పటికీ శిశు సంరక్షణలో కంపాలా ఎంతో ప్రగతి సాధించింది. 2006లో శిశు మరణాల రేటు ప్రతి 1000 జననాలకు 94 ఉంటే 2011 నాటికి అవి 65కు తగ్గాయి. అదే సమయంలో వివిధ ప్రాంతాల్లో జనాభా వృద్ధి రేటు 4 శాతంగా నమోదైంది. పేద ప్రజలకు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించడంలో విజయం సాధించింది. కమ్యూనిటీ రేడియో, విలేజ్ హెల్త్ టీంల ద్వారా సమాచారాన్ని అందించటం. అన్ని డివిజన్‌లలో ఆరోగ్య బృందాలను అందుబాటులో ఉంచడం. పారిశుద్ధ్య లోపంతో వచ్చే వ్యాధుల ( డయేరియా, టైఫాయిడ్, కలరా )పై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో శిశు మరణాల రేటు తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో మీజిల్స్, మలేరియాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ ప్రతి ఇంటికి ఆరోగ్య కార్యకర్తలను పంపి ఆరోగ్య రక్షణ అందించటంలో విజయవంతమైంది.

అమెరికా వెనకబాటుకు కారణాలు
అమెరికా 2015 మదర్ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో 33వ స్థానాన్ని పొందింది. ఆర్థిక, విద్యా రంగాల్లో వరుసగా 9, 16 స్థానాల్లో నిలిచినప్పటికీ మిగిలిన అంశాల్లో వెనుకబడి ఉంది. ప్రసూతి ఆరోగ్యంలో 61, రాజకీయ స్థితిలో 89 స్థానాల్లో నిలిచింది. పిల్లల రక్షణలో అమెరికా 42వ స్థానంలో ఉంది.
 • ఆస్ట్రేలియా,పోలండ్, బెలారస్ వంటి దేశాలతో పోల్చితే గర్భ సంబంధిత కారణాలతో మరణించే స్త్రీల సంఖ్య అమెరికాలో పది రెట్లు ఎక్కువ. అక్కడ ప్రతి వెయ్యి జననాలకి 5 సంవత్సరాల లోపు పిల్లల్లో మరణాల సంఖ్య 69గా ఉంది. అమెరికాతో పాటు బోస్నియా, హెర్జ్‌గోవినా, సెర్బియా, మెసిడోనియా, స్లొవేకియాల్లో ఇదే సంఖ్యలో శిశు మరణాలు సంభవిస్తున్నాయి.
 • అమెరికా కాంగ్రెస్‌లోని మొత్తం సభ్యుల్లో కేవలం 20 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. ఈ విషయంలో అమెరికా కంటే ప్రపంచంలోని 50 శాతం దేశాలు ముందున్నాయి. స్వీడన్, ఫిన్‌లాండ్ దేశాల పార్లమెంటు సీట్లలో మహిళల వాటా శాతాలు వరుసగా 43, 44గా ఉన్నాయి.

నివేదిక సూచించిన మార్గాలు
అనేక దేశాలు అనుభవిస్తున్న సమస్యలను అధిగమిస్తూ ర్యాంకింగ్‌ను మెరుగుపరచుకునేందుకు నివేదిక కొన్ని మార్గాలను సూచించింది.

ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ: పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లోని ప్రజలందరికి ఆరోగ్య రక్షణ కల్పించాలంటే.. ముందుగా ఆరోగ్య వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేయాలి. ఆరోగ్య రంగంపై కేటాయింపులు, ఖర్చులు పెంచాలి. పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఆరోగ్య రంగంపై పెట్టుబడులు పెరగడంతో.. ఆరోగ్య సేవలు ధనిక వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నైరోబి, కెన్యాలలో అధిక శాతం స్త్రీలు సరైన ప్రమాణాలు, అనుమతులు లేని ఆస్పత్రుల్లో శిశువులకు జన్మనిస్తున్నారు. పిల్లలందర్నీ పాఠశాలల్లో చేర్పించడం, 2015 నాటికి శిశు, ప్రసూతి మరణాల రేటును గణనీయంగా తగ్గించడంపై చాలా దేశాలు దృష్టి సారించాయి. జనాభా అధికంగా ఉన్నప్పటికీ పిల్లల ఆరోగ్య ప్రమాణాలను పెంచే విషయంలో కైరో, మనీలా, కంపాలా, అడిస్ అబాబా, గ్వాటెమాలా సిటీలు విజయం సాధించాయి. అక్కడ అమలు చేసిన కార్యక్రమాలు ఇతర దేశాలు పరిశీలించి వాటి అమలుకు చర్యలు తీసుకోవాలి. జాతీయ మానవ వనరుల ప్రణాళికల్లో పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను పటిష్ట పరచే చర్యలు అవసరం. పట్టణ పేదలు నివసించే మురికివాడలపై మరింత దృష్టి పెట్టాలి.

అధిక ఆర్థిక వృద్ధిపై దృష్టి: ఆదాయ అసమానతలు, సాపేక్ష పేదరిక నిర్మూలనకు చర్యలు తీసుకోవడం ద్వారా అందరికి సమాన అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించాలి. దేశాలు అధిక ఆర్థిక వృద్ధిని సాధించినప్పుడు ఆరోగ్యం, విద్యా రంగాలపై తగిన వనరులను వెచ్చించగలుగుతాయి. తద్వారా ఆయా దేశాల్లో పిల్లలు, మహిళల సంరక్షణ మెరుగవుతుంది. పిల్లలకు సంబంధించి సాంఘిక భద్రతా వ్యవస్థను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవడం అవసరం.
Published date : 15 May 2015 05:41PM

Photo Stories