Skip to main content

మాల్దీవుల్లో మళ్లీ పాత పాలనే

-ప్రేమ విఘ్నేశ్వర రావు .కె, పోటీ పరీక్షల విశ్లేషకులు.
నియంతృత్వ నీడలో కొత్త ప్రభుత్వం
2013 నవంబర్ 17న అబ్దుల్లా యమీన్ మాల్దీవుల ఆరో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రోగ్రెస్సివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (PPM – PROGRESSIVE PARTY OF MALDIVES) పార్టీ అభ్యర్థి అయిన అబ్దుల్లా యమీన్ 2013 నవంబర్ 16న జరిగిన రెండో విడత అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. పోలైన దాదాపు 2.18 లక్షల ఓట్లలో 51.39 శాతం ఓట్లను దక్కించుకొని మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ (MDP-MALDIVIAN DEMOCRATIC PARTY) కి చెందిన మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ పై గెలుపొందాడు. నషీద్ కు 48.61 శాతం ఓట్లు లభించాయి. నూతన అధ్యక్ష ఎన్నికలు పూర్తి కావటంతో దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది.


వివాదాస్పద అధికార మార్పిడిలో భాగంగా 2012 ఫిబ్రవరిలో నషీద్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ప్రతిపక్షాల ఆందోళనలు, అనంతరం పోలీసులు, సైన్యం తిరుగుబాటు నేపథ్యంలో నషీద్ రాజీనామా చేయాల్సి వచ్చింది. బలవంతంగా తనను రాజీనామా చేయించారని నషీద్ ఆరోపించారు.

అబ్దుల్లా యమీన్ ఆర్థికవేత్త. మూడు దశాబ్దాల పాటు మాల్దీవుల్లో నిరంకుశ పాలన కొనసాగించి 2008లో జరిగిన ప్రజాస్వామిక ఎన్నికల్లో నషీద్ చేతుల్లో ఓటమి పాలైన గయూమ్ కు యమీన్ సమీప బంధువు. 2008 ఎన్నికల్లో గయూమ్ కు వ్యతిరేకంగా నషీద్ కు మద్దతు తెలిపిన అత్యధిక రాజకీయ పార్టీలు ప్రస్తుత ఎన్నికల్లో PPM కి మద్దతునిచ్చాయి. పాలనలో ఆటంకాలు సృష్టిస్తాయన్న కారణంతో 2013 ఎన్నికల్లో నషీద్ ఈ కూటములను పక్కన పెట్టారు.

తొలి విడత ఎన్నికల్లో నషీద్ 46.93 శాతం ఓట్లు దక్కించుకున్నారు. దీంతో రెండో విడతలో గెలుపునకు సరిపడే మరో మూడు శాతం ఓట్లతో పాటు ఒక అదనపు శాతం (సుమారుగా 6000 ఓట్లు మాత్రమే) నషీద్ సాధించగలరని సర్వత్రా అంచనా వేశారు. తొలి విడతలో కేవలం 29.72 శాతం ఓట్లు సాధించిన యమీన్ తర్వాతి విడతలో 23.34 శాతం ఓట్లు సాధించి మూడో స్థానంలో ఉన్న టైకూన్ ఖాసీం ఇబ్రహీం మద్దతుతో గెలుపొందారు.

ఓటర్ల జాబితాల్లో లోపాల కారణంగా సెప్టెంబర్ నెలలో నిర్వహించిన మొదటి రౌండ్ ఎన్నికలను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఎన్నికల ప్రక్రియ జఠిలంగా మారింది. రద్దుచేసిన ఆ తొలి విడత ఎన్నికలను 2013 నవంబర్ 9న మరోసారి నిర్వహించారు. రెండో విడత ఎన్నికలను మరుసటి రోజే నిర్వహించాలి. కానీ వెనువెంటనే ఎన్నికలను నిర్వహించడం సరి కాదని సుప్రీంకోర్టు రెండో విడతను వాయిదా వేసింది. చివరికి రెండో విడత ఎన్నికలను నవంబర్ 16న నిర్వహించారు.

మాల్దీవుల ఎన్నికలు – సమీక్ష ( Review on Elections in Maldives )
మాల్దీవుల్లో మళ్లీ పాత పాలనే మొదలైంది. వివాదాస్పద పరిస్థితుల నేపథ్యంలో జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో అబ్దుల్లా యమీన్ ఎన్నిక అనేక కోణాల్లో చర్చనీయాంశమవుతోంది. మాల్దీవుల మాజీ అధ్యక్షుడు గయూమ్‌కు దగ్గరి బంధువైన యమీన్ ఈ వివాదాస్పద ఎన్నికల్లో ఏ దశలోనూ మెజార్టీ ఓట్లను గెలుచుకోలేదు. ప్రతి రౌండ్‌లోనూ రెండో వరుసలోనే నిలుస్తూ రావడం, అంతిమంగా ఆయనే ఎన్నిక కావడం అనేక కోణాల్లో సందేహాలను రేకెత్తించిది.

దేశంలో ఇస్లాం మతానికి తానే పరిరక్షకుడినంటూ యమీన్ చేసిన విస్తృత ప్రచారం, ప్రత్యర్థి ఖాసీం ఇబ్రహీం మద్దతును చూరగొనేందుకు ఆయన చేసిన ప్రయత్నం అంతిమంగా అధ్యక్ష పీఠాన్ని అధిరోహింపజేసింది. ఎప్పుడైతే ప్రత్యర్థి పార్టీని తనవైపు తిప్పుకోగలిగాడో అప్పుడే పరిస్థితులు యమీన్‌కు అనుకూలంగా మారిపోయాయి. అయితే ఆయన ఎన్నిక అంతా సజావుగా, నిష్పక్షపాతంగా జరిగిందని చెప్పడానికి ఎంత మాత్రం వీల్లేదు. అనేక సందర్భాల్లో న్యాయస్థానాల జోక్యం, అభ్యర్థులిద్దరికీ ఓట్ల పరంగా పెద్దగా తేడా లేకపోవడంతో రెండోసారి ఎన్నిక జరగడం వంటి అంశాలు అంతిమంగా యమీన్‌కు పట్టం కట్టాయనే చెప్పాలి. మాల్దీవుల న్యాయస్థానాల జోక్యం, నిర్ణయాలు మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్‌ను అధ్యక్ష పదవికి దూరం చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

రెండోసారి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో యమీన్ అత్యధిక శాతం ఓట్లను గెలుచుకొని ఉండవచ్చేమో గానీ, ఆయన ఎన్నిక నిజమైన ప్రజాస్వామ్య విలువలకు, ప్రజాస్వామ్య విధానానికి అద్దం పట్టిందా లేదా అన్నది ఇప్పట్లో తేలే విషయం కాదు.

ఐదేళ్ల క్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గయూమ్‌ను ఓడించి పదవిని దక్కించుకున్న ఘనత నషీద్‌ది. అది మాల్దీవుల్లో జరిగిన తొలి ప్రజాస్వామ్య ఎన్నిక కావడంతో ఆయన విజయానికి ఎనలేని ప్రాచుర్యం చేకూరింది. దాదాపు మూడు దశాబ్దాల గయూమ్ పాలనకు చరమగీతం పాడిన ఘనుడిగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వ్యక్తిగా నషీద్ అన్ని దేశాల మద్ధతు చూరగొన్నారు. అధ్యక్ష పదవి అయితే దక్కింది గానీ దేశంలోని అన్ని వ్యవస్థల్లో వేళ్లూనుకు పోయిన గయూమ్ విధేయులను మాత్రం నషీద్ ఏమీ చేయలేకపోయారు. అడుగడుగునా నషీద్ ప్రయత్నాలకు గయూమ్ విధేయుల నుంచి అవరోధం కలుగుతూనే వచ్చింది.

అధ్యక్ష ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగినప్పటికీ మాల్దీవుల ప్రజలు మాత్రం ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలనను అనుభవించలేకపోయారు. గయూమ్ పాలన నాటి పరిపాలనా అవశేషాలు ప్రజాస్వామ్యానికి గుదిబండగా మారాయి. ఏ దశలోనూ నషీద్‌కు సహకరించకుండా ఈ నియంతృత్వ శక్తులు అవకాశం కోసం ఎదురుచూసి అంతిమంగా నషీద్ పదవికే ఎసరు పెట్టాయి. గత ఏడాది మొదట్లో జరిగిన పరిణామాలు ఇందుకు ప్రబల నిదర్శనాలు.

అప్పటి నుంచి తాజా ఎన్నికల వరకూ ఈ నిరంకుశ శక్తులు ఏదో విధంగా తమ ఉనికిని చాటుకుంటూనే వచ్చాయి. ఇప్పుడు యమీన్ ఎన్నిక కావడంతో దేశంలో గయూమ్ పాలననాటి పరిస్థితులు మరింతగా బలపడే అవకాశం ఏర్పడింది. నిజానికి రెండోసారి జరిగిన పోటాపోటీ అధ్యక్ష ఎన్నికల్లో నషీద్ ఓడిపోవడం వెనుక కూడా ఈ శక్తుల హస్తం ఉందన్న వాదననూ కాదనలేం.

ఎన్నిక ఎలా జరిగినా కోర్టుల జోక్యంతోనే ఫలితం వెలువడింది కాబట్టి నషీద్ అధ్యక్ష ఎన్నికల్లో తన పరాజయాన్ని హుందాగానే అంగీకరించారు. నషీద్ అభిమతం ఎలా ఉన్నా, చేతికందిన అధ్యక్ష పీఠం తృటిలో చేజారడాన్ని ఆయన మద్దతుదారులు మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు కుమ్మక్కై నషీద్‌కు అధ్యక్ష పదవి దక్కకుండా చేశారన్న వీరి వాదన మాల్దీవుల్లో మరోసారి ఉద్యమాన్ని రగిలించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా నషీద్ సారథ్యంలోనే మరోసారి ప్రజాస్వామ్య ఉద్యమం రగులుకున్నా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

మూడు దశాబ్దాల కింద గయూమ్ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన నాటి మాల్దీవుల పరిస్థితికి నేటి అక్కడి వాతావరణానికి ఏ కోశానా పొంతన లేదు. ఐదేళ్ల కింద తొలిసారిగా ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల్లో నషీద్ అధ్యక్ష పదవిని చేపట్టినప్పుడు దేశంలోని యువత ఆయనకు వంతపాడింది. ఆయన ఆలోచనలు, విధానాలకు జేజేలు పలికింది. కానీ గత ఏడాది నషీద్ పదవీచ్యుతుడు కావడం, తాజా ఎన్నికల్లోనూ అయనకు తగిన న్యాయం జరగక పోవడం మరోసారి ఈ ద్వీపకల్ప దేశంలో అశాంతిని రగిలిస్తుందనడం అతిశయోక్తి కాదు. మాల్దీవుల్ని అన్ని విధాలుగా ప్రజాస్వామ్య బద్ధంగా ముందుకు తీసుకెళ్లాలని యువత ఆశిస్తున్న తరుణంలో మళ్లీ నియంతృత్వ వాసనలు కలిగిన నాయకత్వం పగ్గాలు చేపట్టడం యువతకు ఎంత మాత్రం మింగుడు పడటం లేదు.

మలుపులు తిరిగిన మాల్దీవుల ఎన్నికల కథను కంచికి చేర్చింది మత ఛాందసవాద ఉన్మాదం. మూడో స్థానంలోని అభ్యర్థిగా నిలిచిన మాల్దీవుల కుబేరుడు అబ్దుల్ ఖాసీంకు అవి మద్దతు పలికాయి. రెండో రౌండ్లో మతోన్మాద శక్తులు గయూమ్ సోదరుని వైపు మొగ్గు చూపాయి. ఈ వాయిదాల కాలమంతా పీపీఎమ్ మతోన్మాద ఛాందసవాద శక్తులను బుజ్జగిస్తూనే గడిపింది. మయన్మార్ ‘ప్రజాస్వామ్యా’నికి భిన్నంగా మాల్దీవుల్లో కొత్త మొహంతో పాత నియంత పాలన సాగుతోంది. మాల్దీవుల్లో ఇస్లామిక్ మతోన్మాదం ప్రజాస్వామ్య దేశాలను దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది.

మాల్దీవుల వివరాలు:
జనాభా:
324,000 (యుఎన్, 2012 నివేదిక)
రాజధాని: మాలె
వైశాల్యం: 298 చ.కి.మీ.(115 చదరపు మైళ్లు)
ప్రధాన భాష: ధివేహి
ప్రధాన మతం: ఇస్లాం
జీవిత కాలం: 76 సంవత్సరాలు (పురుషులు), 79 సంవత్సరాలు (స్త్రీలు) (యుఎన్ నివేదిక)
ద్రవ్య యూనిట్ (కరెన్సీ): రుఫియా
ప్రధాన ఎగుమతులు: ఫిష్
హిందూ మహాసముద్రంలో శ్రీలంకకు దక్షిణ పశ్చిమంగా ఉన్న ద్వీపాల సముదాయమే మాల్దీవులు. భారతదేశానికి చెందిన లక్ష దీవులకు మాల్దీవులు దక్షిణంగా ఉన్నాయి. ఇది సంపూర్ణ అక్షరాస్యత, కంప్యూటర్ విద్య కలిగిన సున్నీ ముస్లిం దేశం. భారత ఉపఖండంలో ఉన్న ముస్లిం గణతంత్ర రాజ్యం. ఈ దేశం దాదాపు 1,200 దీవుల సమూహం. ఆ దీవుల్లో అత్యధిక భాగంలో జనసంచారం లేదు. ఈ పగడపు దీవులన్నీ సముద్ర మట్టానికి 1.8 మీటర్ల (ఆరు అడుగులు) కంటే ఎక్కువ ఎత్తులో లేవు. భూతాపం కారణంగా సముద్ర మట్టాలు పెరిగితే దేశం పరిస్థితి ప్రశ్నార్థకమవుతుంది. భూతాప ప్రకోపానికి సముద్ర మట్టాలు పెరగటం వల్ల జలసమాధి కానున్న ద్వీప దేశాల్లో ఇది ముందు వరుసలో ఉంది. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా పర్యాటకంపై ఆధారపడి ఉంది. పర్యాటక మార్కెట్ కోసమే దీవులను అభివృద్ధి చేశారు. దేశ రాజధాని వెలుపల ఉన్నజనసంచారం లేని దీవుల్లోకి బయట వ్యక్తుల్ని పరిమిత పర్యటనలకు మాత్రమే అనుమతిస్తారు. ఈ విధంగా సంప్రదాయ ముస్లిం జాతులపై బయటివారి ప్రభావాన్ని నియంత్రిస్తున్నారు. అక్కడ ఆల్కహాల్ నిషిద్ధం.

మాల్దీవులు-రాజకీయ చరిత్ర
ప్రారంభంలో హిందూ మతాన్ని, అశోకుడి కాలంలో బౌద్ధమతాన్ని ఇక్కడి ప్రజలు ఆదరించినట్లు చరిత్రకారుల అభిప్రాయం. క్రీ.శ. 1153లో మాల్దీవుల్లో ఇస్లాం మతం ప్రారంభమైంది. తర్వాత పోర్చుగీస్, డచ్ ఈ దీవులను ఆక్ర్రమించినా 18వ శతాబ్దం చివర్లో బ్రిటిషు వారి నియంత్రణలోకి వచ్చింది. 1887లో బ్రిటిషర్ల ఆధీనంలోనే ఉంటూ స్థానికంగా తనను తాను పరిపాలించుకునేది. 1932లో తొలి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంది. 1953లో కామన్ వెల్త్ లో భాగంగా ఉంటూ తనను తాను రిపబ్లిక్ గా ప్రకటించుకుంది. దేశాధ్యక్షుడిగా సుల్తాన్ (రాచరిక వ్యవస్థ) ఉంటూ వచ్చాడు. 1965లో కామన్వెల్త్ నుంచి బయటపడి, పూర్తి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది. 1968లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో సుల్తాన్ ను ప్రజలు తిరస్కరించారు. దాంతో ఇబ్రహిం నాజర్ దేశాధ్యక్షుడిగా రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ పూర్తి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.

పదేళ్ల పాటు పాలించిన అనంతరం నాజర్ తప్పుకోవడంతో మౌమైన్ అబ్దుల్ గయూమ్ దేశాధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1980లలో దేశంలో పర్యాటక రంగం అభివృద్ధికి గయూమ్ కృషి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడింది. 1982లో మాల్దీవులు తిరిగి కామన్ వెల్త్ (ఒకప్పుడు బ్రిటిషర్ల పాలనలో ఉండి తర్వాత స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించిన దేశాల సముదాయం) లో సభ్యదేశంగా చేరింది. 1980లలో గయూమ్ ను పదవీచ్యుతిడిని చేయటానికి మూడు సార్లు విఫల ప్రయత్నాలు జరిగాయి. 1988లో జరిగిన విద్రోహ చర్యలో మాల్దీవుల రాజధాని మాలెలో గయూమ్ పై కొందరు తిరుగుబాటు చేయటంతో ఆయన భారతదేశం సాయాన్ని కోరారు. ఆపదలో ఉన్న గయూమ్ ను రక్షించడానికి భారత్ తన వైమానిక దళాన్ని, నావికా దళాన్ని ఉపయోగించి (OPERATION CACTUS) ఆయనకు సాయపడింది.

1999లో దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. రాజకీయ పార్టీలకు గుర్తింపు లేకపోవడంతో పార్లమెంటు (మజిలిస్)లోని 40 సీట్లలో మెజారిటీ స్థానాలకు గయూమ్ ను సమర్థించే ఇండిపెండెంట్లే ఎన్నికయ్యారు. డిసెంబర్ 26, 2004న హిందూ మహా సముద్రంలో ఏర్పడ్డ సునామీ తాకిడికి 9 ద్వీపాలు మినహాయించి మిగతా ద్వీపాలన్నీ ఘోరంగా దెబ్బతిని దాదాపు 40 లక్షల డాలర్ల మేర ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లింది. ఇది మాల్దీవుల జీడీపీలో 62 శాతం. సునామీ దెబ్బ నుంచి తేరుకుంటుండగానే 2005లో రాజకీయ పక్షాలను గుర్తించాలనీ, బహుళపార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. దాంతో దేశంలో బహుళ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టడానికి అధ్యక్షుడు గయూమ్ తో పాటు పార్లమెంటు కూడా ఆమోదాన్ని తెలిపింది.

2006లో గయూమ్ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటానికి ఒక ముసాయిదా ప్రణాళికను రూపొందించి అమలు చేయటం ప్రారంభించారు. మానవ హక్కులు, వ్యక్తి స్వేచ్ఛ, స్వతంత్ర్య న్యాయ వ్యవస్థ, బహుళ రాజకీయ పార్టీల గుర్తింపు మొదలైనవి అందులోని ముఖ్యాంశాలు.

2008 ఆగస్టులో పార్లమెంటు ఆమోదించిన ఈ ముసాయిదా ప్రణాళిక ద్వారా దేశంలో శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల హక్కులు, అధికారాల నిర్వచనంతో పాటు స్వయం ప్రతిపత్తితో పనిచేసే ప్రణాళికకు ఆమోదముద్ర పడింది. ఈ కొత్త రాజ్యాంగంలోనే అన్ని రాజకీయ పార్టీలను గుర్తించి వాటిని రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనేటట్లు పొందుపరిచారు. అందులో భాగంగానే అక్టోబర్ 2008 లో బహుళపార్టీ ప్రజాస్వామ్యం ఆధారంగా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించడానికి ముందు రాజకీయ పార్టీలపై అధికారిక నిషేధం లేకపోయినా అబ్దుల్ గయూమ్ అనుయాయులు ప్రతిపక్షాలను ఎదగనివ్వలేదనే విమర్శ ఉంది. కొత్త రాజ్యాంగం, 2008 అధ్యక్ష ఎన్నికలు మాల్దీవులను పూర్తిస్థాయి ప్రజాస్వామిక దేశంగా రూపొందించడంలో దోహదం చేశాయి. అయితే తర్వాత జరిగిన పరిణామాలు (నషీద్ తొలగింపు, 2013 అధ్యక్ష ఎన్నికలు) మాల్దీవుల ప్రజాస్వామ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయనే సంకేతాలనందిస్తున్నాయి.

భారతదేశ వైఖరి
తాజా ఎన్నికల్లో అబ్దుల్లా యమీన్ విజయాన్ని భారత్ స్వాగతించింది. ఎన్నికల ప్రచారంలో భారత్ తో సత్సంబంధాలకు బహిరంగంగా మద్దతు తెలిపిన నషీద్ అభ్యర్థిత్వానికి భారత్ మొగ్గు చూపినట్లు భావించారు. ఎన్నికలకు ముందు ఒక కేసులో అరెస్టు అవుతారనే సందర్భంలో నషీద్ మాలెలోని భారత హైకమిషన్ (రాయబార కార్యాలయం)లో ఆశ్రయం పొందారు.

మాల్దీవుల ఎయిర్ పోర్టు అభివృద్ధి ప్రాజెక్టు నుంచి GMR ను తొలగించిన తర్వాతి పరిణామాలు, PPMతో పాటు అనేక ఇతర రాజకీయ పార్టీలను భారత్ కు వ్యతిరేకంగా మారేట్లు చేసింది. మాల్దీవుల నుంచి భారతీయ ఎయిర్ పోర్టు ఆపరేటర్ ను వెళ్లగొట్టాలని బహిరంగంగా గొంతు చించుకున్న మహ్మద్ జమీల్ మాల్దీవుల నూతన ఉపాధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేశారు.

మాల్దీవులు – భారత్ సంబంధాలు: (India – Maldives relations)
మాల్దీవులతో భారత్‌కు మొదటి నుంచీ సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. గయూమ్ హయాం లో పెద్దగా అనుబంధం బలపడకపోయినా ఐదేళ్ల క్రితం నషీద్ ఎన్నికైనప్పుడు మాత్రం బలమైన బంధానికి ఆస్కారం ఏర్పడింది. తాజా ఎన్నికల్లో నషీద్ ఓటమి భారత్‌కు కొంత విస్మయాన్నే కలిగించింది. భారత నాయకత్వం పట్ల, ఇక్కడి ప్రజాస్వామ్య విలువల పట్ల ఎంతో గౌరవ భావం కలిగిన నషీద్ అదే స్ఫూర్తితో మాల్దీవుల్ని ముందుకు తీసుకెళ్లాలని భావించారు. భారత్ ప్రయోజనాల దృష్ట్యా మాల్దీవుల్లో రాజకీయ సుస్థిరత ఎంతో కీలకం. భారత్‌కు వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ఈ హిందూ మహాసముద్ర ద్వీపకల్పంలో ఏ మాత్రం రాజకీయ అస్థిరత నెలకొన్నా అది ఉగ్రవాదులకు కేంద్రంగా మారుతుందన్న హెచ్చరికలను విస్మరించడానికి వీల్లేదు. యమీన్‌కు ముందు అధ్యక్ష పదవిని చేపట్టిన వహీద్ సమయంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు అంత సజావుగా సాగలేదు. ఒకదాని తర్వాత ఒకటిగా అనేక వివాదాలు చోటుచేసుకోవడంతో దౌత్యపరమైన ఇబ్బందులూ తలెత్తాయి.

ముఖ్యంగా భారత్‌కు అనుకూలంగా ఉన్న దేశాలను తనవైపు తిప్పుకునేందుకు నిరంతరం ప్రయత్నించే చైనా మాల్దీవుల పరిస్థితిని నిరంతరం గమనిస్తూనే ఉంటుంది. వహీద్ హయాంలో భారత్‌తో కంటే చైనాతో మైత్రీ బంధమే తమకు అన్ని విధాలుగా ఉపకరిస్తుందన్న సంకేతాలను మాల్దీవుల పాలకులు అందించారు. ఇప్పుడు గెలుస్తాడనుకున్న నషీద్ ఓడిపోవడంతో కొత్త అధ్యక్షుడు యమీన్ కదలికలను లోతుగా గమనించాల్సిన అవసరం భారత్‌కు మరింత ఏర్పడింది. అధ్యక్ష పదవిలో ఎవరున్నాఇరు దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ, ద్వైపాక్షిక సంబంధాలు అత్యంత కీలకం అవుతాయి. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని మాల్దీవులతో కొత్త స్నేహం కోసం గట్టి ప్రయత్నం చేయడం భారత్‌కు వ్యూహాత్మక అవసరం.

Published date : 22 Feb 2014 01:08PM

Photo Stories