Skip to main content

జింబాబ్వేలో ముగాబేకు మళ్లీ పట్టం - వెంటాడుతోన్న సంక్షోభం

ఏడోసారి ముగాబేదే విజయం:
2013 జూలై 31న జరిగిన జింబాబ్వే అధ్యక్ష ఎన్నికల్లో రాబర్ట్ గాబ్రియెల్ ముగాబే ఆ దేశానికి ఏడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పార్లమెంటరీ ఎన్నికల్లో ఆయన పార్టీ Zimbabwe African National Union – Patriotic Front (ZANU-PF) మూడింట రెండు వంతుల మెజారిటీతో ఘన విజయం సాధించింది. పార్లమెంటులో మొత్తం 210 స్థానాలకు గాను ముగాబే పార్టీకి 160 స్థానాలు దక్కాయి. ప్రతిపక్ష Movement for Democratic Change-Tsvangirai (MDC-T) పార్టీ కేవలం 49 స్థానాలతో ఓటమి పాలైంది. ఒక్క మాసింగ్రో ప్రావిన్స్ లోనే దానికి 26 స్థానాలు దక్కాయి. మిగిలిన అన్ని చోట్లా ZANU-PF గెలిచింది. ముగాబేకు మొత్తం 61 శాతం ఓట్లు వచ్చాయి. ప్రతి పక్షనేత MDC-T పార్టీ నాయకుడు అయిన మోర్గాన్ స్వంగిరాయ్ కి 39.9 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి.

ఎన్నికల నేపథ్యం:
2008లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో స్వంగిరాయ్ కి మెజారిటీ లభించింది. దాంతో జింబాబ్వే రాజధాని హరారేలో తీవ్ర హింసాకాండ చెలరేగింది. భద్రతా దళాలు విరుచుకుపడి కాల్పులు జరపడంతో 200 మంది మరణించారు. అప్పుడు పొరుగు దేశాలు జోక్యం చేసుకొని ఇరుపక్షాలకు రాజీ కుదిర్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేలా చేశాయి. దాంతో ముగాబే దేశాధ్యక్షుడిగా, స్వంగిరాయ్ ప్రధాన మంత్రిగా అధికారం చేపట్టారు. ఐదేళ్ల పాటు సంకీర్ణ పాలన కొనసాగింది. తర్వాత 2013 ఆరంభంలో దేశంలోని మూడు ప్రధాన పార్టీలైన ZANU-PF, MDC-T, MDCలు కలిసి అంతర్జాతీయ రాజకీయ ఒప్పందంలో భాగంగా ముగ్గురు కమిషనర్లను ఎన్నుకొని వారి నేతృత్వంలో జింబాబ్వే ఎన్నికల కమిషన్ ను ఏర్పాటు చేశాయి. ఆఫ్రికన్ యూనియన్, సౌతాఫ్రికా డెవలప్ మెంట్ కమ్యునిటీల నుంచి ఎన్నికల పరిశీలకులు హాజరయ్యారు. ZANU-PFను వ్యతిరేకించే దేశాలు తమ ప్రతినిధులను ఆహ్వానించలేదని విమర్శించాయి. ఇదిలా ఉంటే ఈ ఎన్నికలు జూలై 31న నిర్వహించాలని మొదటి సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే ఎన్నికలను వాయిదా వేయాలని MDC-T కోరింది. అందుకు ముగాబే అంగీకరించినా సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. 31న ఎన్నికలు ఆపడానికి ఎలాంటి కారణాలూ లేవంటూ ఆ రోజే జరపాలని ఆదేశించింది. ఆ ప్రకారమే జూలై 31నే ఎన్నికలు జరిగాయి. ఆగస్టు 4 నాటికి ఫలితాలు వెలువడ్డాయి.

ఆరోపణలు - ప్రత్యారోపణలు:
జింబాబ్వే ప్రధాన మంత్రి, ప్రతిపక్ష ఎండిసి-టీ పార్టీ నాయకుడు అయిన స్వంగిరాయ్, ఆయన పార్టీ ప్రతినిధులు ఈ ఎన్నికలు కుట్రపూరితంగా జరిగాయని, అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఎన్నికల అక్రమాల జాబితాను రుజువులతో సహా ఆఫ్రికన్ యూనియన్ (AU) కు, దక్షిణాఫ్రికా డెవలప్ మెంట్ కమ్యునిటీకి ఇచ్చేందుకు సిద్ధమని (SADC), వారు జోక్యం చేసుకొని రాజ్యాంగ, రాజకీయ, ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని తప్పించాలని స్వంగిరాయ్ కోరారు. అయితే ఎన్నికల్లో అవకతవకల వల్ల ఫలితాలేమీ పెద్దగా ప్రభావితం కాలేదని ఎయు, ఎస్ఏడీసీలు ప్రకటించాయి. 2008 నాటి ఎన్నికలు మాదిరిగా ఈసారి హింసాకాండ, రక్తపాతం జరగలేదు కాబట్టి ఇవి న్యాయబద్ధంగా జరిగాయని అనుకుంటున్నారని ఎండీసీ-టీ పార్టీ వాపోయింది. బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల విదేశాంగ మంత్రులు ఈ ఎన్నికలపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగాయని జింబాబ్వే మీడియా స్పష్టం చేసింది.

పాశ్చాత్య దేశాల ప్రతిస్పందన –ముగాబే పార్టీ ఖండన:
జింబాబ్వేపై ప్రస్తుతం బ్రిటన్, యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాల ఆంక్షలు ఉన్నాయి. జింబాబ్వేలో గత 33 ఏళ్లుగా కొనసాగుతున్న ముగాబే పాలనలో కొన్ని విధానాలు, నియంత్రణలు, నిరంకుశ ధోరణలను పాశ్చాత్య దేశాలు వ్యతిరేకించి ఆంక్షలు విధించాయి. పాశ్చాత్య దేశాలు జింబాబ్వేలో ఎండీసీ–టీ పార్టీ నెగ్గాలని ఆశించాయి. వీటి నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం తాజా ఎన్నికలపై తీవ్ర ఆరోపణలు కూడా చేసింది. ఎన్నికల ప్రక్రియలోనే లోపాలున్నాయనీ, ఈ ఫలితాలు ప్రజల విశ్వజనీన వ్యక్తీకరణ కాదనీ ఆరోపించింది. జాను-పీఎఫ్ పార్టీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలన్నింటినీ తీవ్రంగా ఖండించింది. ఈ విజయం చరిత్రాత్మకమైందనీ, శ్వేత జాతీయుల ఆధీనంలోని సంస్థలు మానవ హక్కుల దుర్వినియోగం చేస్తున్నాయన్న తమ వాదన సరైందేననీ ఆ పార్టీ పేర్కొంది. బ్రిటన్ ప్రభుత్వంతో చర్చలకు తమ పార్టీకి వ్యతిరేకత లేదని బ్రిటన్ మాజీ ప్రధానులైన బ్లెయిర్, బ్రౌన్ లే తమతో చర్చలను వ్యతిరేకించారని కూడా ఆ పార్టీ పేర్కొంది. గతంలో ఇరాక్ కు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాలు విరుచుకుపడ్డట్లే ప్రస్తుతం జింబాబ్వేకు వ్యతిరేకంగా శక్తులను కూడగట్టే పనిలో పడ్డాయని ముగాబే వ్యాఖ్యానించారు. ఇటీవలే బ్రిటన్-జింబాబ్వే మంత్రులు రాకపోకలపై ఆంక్షలను సడలించడంతో 15 ఏళ్ల తర్వాత జింబాబ్వేకు చెందిన విదేశీ మంత్రి బ్రిటన్ లో పర్యటించారు. అక్కడ బ్రిటన్ లో ఆఫ్రికా వ్యవహారాల మంత్రితో సమావేశమయ్యారు. తాజా ఎన్నికల తర్వాత ఆ మంత్రి జింబాబ్వే ఆర్థిక సంక్షోభానికి జాను-పిఎఫ్ కారణమంటూ ఈయూ, బ్రిటన్, అమెరికాలు ఆంక్షలు విధించడాన్ని ఖండించారు. ఇవి ఐక్యరాజ్య సమితి విధించిన ఆంక్షలు కావనీ, తమ భూముల్ని ఆక్రమించాలని శ్వేత జాతీయులు చేస్తున్నవనీ ఆరోపించారు. కానీ మళ్లీ బ్రిటన్-జింబాబ్వేల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పునరుద్ధరించబడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎన్నికల అనంతర హామీలు:
జింబాబ్వే అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామంటూ ముగాబే పార్టీ జాను-పీఎఫ్ పునరుద్ఘాటించింది. ప్రభుత్వ విధానాలన్నింటినీ దేశ ప్రజలకు అనుకూలంగా మారుస్తామని పేర్కొంది. పెద్ద ప్రైవేటు కంపెనీల్లో 51 శాతం నల్లజాతీయులైన జింబాబ్వే వారి చేతుల్లోనే ఉండేలా చేస్తామని ప్రకటించింది. ఇలాంటి జాతీయ కార్యక్రమాల ద్వారా ఆర్థిక రంగం మెరుగవుతుందనీ 2000వ సంవత్సరంలో జరిపిన భూ పంపిణీ కార్యక్రమాల మాదిరిగానే ఇప్పుడూ అమలు చేస్తామనీ జానూ-పీఎఫ్ అంటోంది. కానీ జాతీయతా కార్యక్రమాల వల్ల పెట్టుబడులు బయటికి వెళ్లిపోతాయనీ, తద్వారా పెట్టుబడుల సంక్షోభం తలెత్తుతుందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. అలా జరగదనీ, జింబాబ్వేలో ఖనిజ నిల్వలు, ఉన్నత విద్యావంతులైన పనివారు భారీగా ఉన్నందున పెట్టుబడులు ఎక్కడికీ పోవనీ జాను-పీఎఫ్ వాదిస్తోంది. తమ మానిఫెస్టోను పూర్తిగా అమలు చేస్తామనీ, జాతీయత, సాధికారత, అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యాలు సాధిస్తామనీ అంటోంది. అందుకోసం ఆంక్షలు ఎత్తివేయాలనీ పశ్చిమదేశాలను కోరుతోంది.

33 ఏళ్ల రాబర్ట్ ముగాబే పాలన – సమీక్ష
1924లో జన్మించిన రాబర్ట్ గాబ్రియెల్ ముగాబే ఉపాధ్యాయ శిక్షణ పొందారు. 1960వ దశాబ్దంలో జింబాబ్వే ఆఫ్రికన్ యూనియన్ (ZANU) పార్టీకి సెక్రటరీ జనరల్ అయ్యారు. జింబాబ్వేను అప్పట్లో రొడీషియా అని పిలిచేవారు. దాన్ని పాలిస్తున్న ఇయాన్ స్మిత్ శ్వేత జాతీయ మైనారిటీ ప్రభుత్వంపై జాను పార్టీ ఉద్యమం నడిపింది. అందుకు గాను 1964-74 మధ్య కాలంలో ముగాబేను రొడీషియా ప్రభుత్వం నిర్బంధించడంతో పదేళ్ల పాటు రాజకీయ ఖైదీగా ఉన్నారు. 1975లో విడుదలై పొరుగునే ఉన్న మొజాంబిక్ కు వెళ్లిపోయి సరిహద్దుల్లోని స్థావరాల్లోంచి రొడీషియాలో నల్ల జాతీయుల బుష్ వార్ (గెరిల్లా యుద్ధం)ను సమర్థించి సాయపడ్డారు. 1979లో శ్వేత జాతీయుల మైనారిటీ ప్రభుత్వాన్ని గద్దె దింపిన సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి జింబాబ్వే జాతీయ నాయకుడిగా ఆఫ్రికా అంతటా పేరు తెచ్చుకున్నారు. 1980లో స్వాతంత్ర్యానంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ విజయం సాధించడంతో తొలిసారిగా జింబాబ్వే ప్రధాని అయ్యారు. తర్వాత దేశంలో నల్లవారు, తెల్లవారు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చి దౌత్యవేత్తగా ప్రసిద్ధికెక్కారు. ఆర్థిక రంగంలో కూడా అభివృద్ధికి కృషి చేశారు. తొలి దశాబ్ద పాలనలో జింబాబ్వే జాతీయ విముక్తి నేతగా, ప్రజాస్వామ్యం తెచ్చిన నాయకుడిగా ప్రసిద్ధికెక్కడమే కాకుండా ఆహారం, విద్య, వైద్య రంగాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. జింబాబ్వేలో 99 శాతం అక్షరాస్యత సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అక్షరాస్యతలో ఆఫ్రికాలో అగ్రస్థానం ఆ దేశానిదే. దక్షిణాఫ్రికా ప్రాంత ధాన్యాగారంగా కూడా జింబాబ్వే అప్పట్లో విలసిల్లింది.

1980వ దశాబ్దంలోనే జింబాబ్వేలో శ్వేతజాతి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన రెండు వర్గాలు ZANU, ZAPU ఒకే కూటమిగా మార్పుచెందాయి. 1983లో జాపు నాయకుడు జుషువా నికేమోను ముగాబే మంత్రి పదవి నుంచి తొలగించారు. తర్వాత ఆయన మద్దతుదార్లందర్నీ సైన్యం ద్వారా అణగదొక్కారు. తర్వాత 1988లో మళ్లీ ఇద్దరూ కలిసి ZANU-PFను ఏర్పరిచారు. నికోమో దేశానికి ఉపాధ్యక్షుడిగా, ముగాబే అధ్యక్షుడిగా పాలన సాగించారు.

జింబాబ్వేలో శ్వేత జాతీయుల జనాభా 1 శాతం కాగా వ్యవసాయ భూముల్లో 70 శాతం తెల్లవారి ఆధిపత్యంలోనే ఉంటూ వచ్చాయి. దాంతో ముగాబే జాతీయతా కార్యక్రమాల పేరిట 2000వ సంవత్సరంలో భూముల పున:పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్వేత జాతి వ్యవసాయదారుల నుంచి భూములు లాక్కొని వాటిని నల్లవారికి పంచారు. కానీ అందులో పలు అక్రమాలు జరిగాయి. తర్వాతి కాలంలో దేశంలోని నగరాల్లో మురికివాడలను పూర్తిగా నిర్మూలించారు. ఈ కార్యక్రమాల ద్వారా దేశంలో సామాజిక అశాంతి, నిరసనలు పెరగడమే కాకుండా అంతర్జాతీయంగా ముగాబేపై వ్యతిరేకత వెల్లువెత్తింది. సైనిక పాలన, నిరంకుశత్వం ఆరోపణలతో ఈయూ, బ్రిటన్, అమెరికా ఆంక్షలు విధించాయి. ముగాబే, ఆయన మద్దతుదార్లు తమ దేశాల్లో పర్యటించడం, ప్రయాణించడాలపై 2002-08 మధ్యకాలంలో నిషేధం విధించాయి. వారి ఆస్తులను స్తంభింపజేశాయి. 2008లో స్వంగిరాయ్ ఆ దేశ ప్రధాని అయిన తర్వాత ఈ ఆంక్షలు తగ్గాయి. అయినా దాదాపు గత పదేళ్లకు పైగా జింబాబ్వే ఆర్థిక వ్యవస్థ దారుణంగా దిగజారుతూ వస్తోంది. ఒకప్పుడు ధాన్యాగారంగా విలసిల్లిన ఆ దేశం ప్రస్తుతం ఆకలి చావులతో మలమల మాడుతోంది. వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు పెరగడం, నీరు భారీగా ఆవిరై జలవనరులు తగ్గడం వంటి సహజ పరిణామాలతో పాటు అస్తవ్యస్త ఆర్థిక విధానాలు, అవినీతి, బంధుప్రీతి వంటి సమస్యలతో ముగాబే పాలన దేశాన్ని మరింత దిగజారుస్తోంది. వీటి నేపథ్యంలోనే 2000వ సంవత్సరంలో ఒకసారి 2008 సంవత్సరంలో ఒకసారి ముగాబే దేశ పాలన దాదాపు కోల్పోయినంత పని జరిగింది. కానీ సైన్యం, భద్రతా దళాలు తన చెప్పుచేతల్లో ఉండటంతో ముగాబే నెగ్గుకురాగలిగారు. తాజాగా 2013 ఎన్నికల్లో మళ్లీ ఘన విజయం సొంతం చేసుకోవడంతో ఆయన విమర్శకులు, ప్రతిపక్షాలు, పాశ్చాత్య దేశాలు ఎన్నికల్లో అక్రమాలు, రిగ్గింగ్ జరిగాయంటూ గగ్గోలెత్తుతున్నాయి.

రాబర్ట్ ముగాబేపై విమర్శలు:
  1. ముగాబే దేశంలో జాతుల మధ్య వనరుల పంపిణీ ఎలా జరగాలో అనే అంశం మీదే ఎంత సేపూ దృష్టి సారించారు గానీ ఉన్న సంపదను పెంచడం ఎలా అనే దానిపై దృష్టి కేంద్రీకరించలేదని విమర్శలున్నాయి.
  2. ముగాబేకు ఆధునిక ఆర్థిక విధానాల గురించి కొంచెం కూడా తెలియదనీ, వాటిని వ్యతిరేకించడం వల్లే దేశ ఆర్థిక వ్యవస్థను దిగజార్చారని ఆరోపణలున్నాయి.
  3. 1960వ దశాబ్దం నాటి ఆఫ్రికా స్వాతంత్ర్య వాదాన్నీ సాంప్రదాయవాదాన్నే ఇంకా ఆయన అనుసరిస్తున్నారు.
  4. బలమైన నిరంకుశ పాలనే దేశానికి మంచిదని ముగాబే భావన. ఆయన ప్రతిపక్షాలను సహించరు.
  5. పెట్టుబడిదారీ, పశ్చిమ దేశాల పట్ల ఆయనకు తీవ్ర అనుమానాలు సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నాయి.
  6. ఎన్నికల్లో హింసాకాండకు దిగుతారనీ, ప్రతిపక్షాలను తీవ్రంగా అణచివేస్తారనీ ఆరోపణలున్నాయి.
  7. కేవలం మొట్టమొదటి ఎన్నికల్లోనే జాతీయ హీరోగా అత్యధిక మెజారిటీతో సక్రమంగా నెగ్గారనీ, మిగిలినవన్నీ కండబలంతోనే నెగ్గుతున్నారనీ ఆయన వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు.
  8. సందేహాలెన్నో: తాజాగా 2013లో అధ్యక్ష పదవిపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా దేశాధ్యక్షుడు ఐదేళ్లే పదవిలో ఉండాలని ( అంతకు ముందు ఆ పదవీ కాలం పదేళ్లు), రెండు పదవీకాలాలు పూర్తవగానే తప్పుకోవాలనీ (ముగాబే తాజాగా ఏడోసారి నెగ్గారు) ప్రజలు ఓటేశారు. అధ్యక్షుడి అధికారాలు తగ్గించాలనీ, రాజ్యాంగ కోర్టు, రాష్ట్రాలకు శాసన సభలు ఏర్పాటు చేయాలని కూడా ప్రజలు ఓటేశారు. కానీ వీటిని ముగాబే పార్టీ పాలనలో అమలు చేస్తారా అనేది సందేహాస్పదమే.
జింబాబ్వే సంక్షోభం - పూర్వరంగం:
దక్షణాఫ్రికా ప్రాంతంలో జాంబెజీ, లింపోపో నదుల మధ్య జింబాబ్వే నెలకొని ఉంది. హరారే రాజధానిగా ఉన్న ఈ దేశ జనాభా 13 మిలియన్లు (ఐక్యరాజ్యసమితి, 2012 నివేదిక ప్రకారం). జింబాబ్వే ప్రాంతంలో క్రీ.శ. 1200-1600 శతాబ్దాల మధ్య మోనోమొటాపా సామ్రాజ్యం విలసిల్లి క్షీణించింది. ప్రస్తుత దక్షిణాఫ్రికా దేశ ప్రాంతానికి బోయర్లు 1830 వ దశకంలో వలస వచ్చారు. మటాబలెలాండ్ ప్రాంతంలో స్థిరపడ్డారు. తర్వాత యూరప్ దేశాల నుంచి వేటగాళ్లు, వ్యాపారులు, మిషనరీలు పెద్దఎత్తున తరలి వచ్చారు. వారిలో సెసిల్ జాన్ రోడెస్ ఒకరు. 1889లో రోడెస్ కు చెందిన బ్రిటిష్ సౌత్ ఆఫ్రికా కంపెనీ (BSA) ఆ ప్రాంతాన్ని వలస ప్రాంతంగా మార్చడానికి బ్రిటిష్ ప్రభుత్వ అనుమతి తీసుకుంది. తర్వాత ఆ ప్రాంతమే దక్షిణ రొడీషియా అయింది. తెల్లవారు భారీగా తరలి వచ్చి స్థిరపడ్డారు. వారు స్థిరపడిన ప్రాంతం తర్వాత కాలంలో హరారే (రాజధాని) అయింది. 1922లో బీఎస్ఏ కంపెనీ పాలన అంతమై శ్వేత జాతి మైనారిటీల పాలన మొదలైంది. శ్వేతజాతి మైనారిటీల ప్రభుత్వం నల్ల జాతివారికి భూమిపై హక్కులు దక్కుకుండా నియంత్రించి చట్టాలు తేవడంతో వారంతా కార్మికులుగా మారిపోయారు. 1930-60 మధ్య వలస పాలనపై నల్లజాతివారి వ్యతిరేకత భారీగా పెరిగింది. అదే తరుణంలో జింబాబ్వే ఆఫ్రికన్ పీపుల్స్ యూనియన్ (ZAPU), జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ (ZANU) వర్గాలు ఏర్పడ్డాయి. 1953లో బ్రిటన్ సెంట్రల్ ఆఫ్రికన్ ఫెడరేషన్ ను ఏర్పాటు చేసింది. దక్షిణ రోడీషియా (జింబాబ్వే), ఉత్తర రోడీషియా (జాంబియా), న్యాసాలాండ్ (మలావీ)లుగా ఆ ప్రాంతాన్ని విభజించింది. 1963లో అవి విడిపోయి జాంబియా, మలావిలు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి. జింబాబ్వేకు ప్రధాని అయిన ఇయాన్ స్మిత్ తమ దేశానికి కూడా స్వాతంత్ర్యం కావాలని బ్రిటన్ ను కోరాడు. ఇవ్వకపోవడంతో 1965లో స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. కానీ అంతర్జాతీయంగా దాన్ని వ్యతిరేకించి బ్రిటన్, సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. అంతేకాకుండా శ్వేత జాతి మైనారిటీల పాలన కొనసాగడంతో దాన్ని వ్యతిరేకిస్తూ నల్ల జాతీయులు గెరిల్లా యుద్ధం, విప్లవాలను సాగించారు. 1979లో బ్రిటన్ లో ఇరు పక్షాల మధ్య రాజీ కుదిరింది. కొత్త రాజ్యాంగం ఏర్పాటైంది. అప్పటి నుంచి దాని పేరు జింబాబ్వే అయ్యింది. 1980లో తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికలు జరిగి జాను పార్టీ నెగ్గడంతో ముగాబే దేశ ప్రధాని అయ్యారు. దాంతో 1980లోనే జింబాబ్వేకు స్వాతంత్ర్యం వచ్చినట్లు భావిస్తారు. 2005లో జరిగిన రాజ్యాంగ సవరణల ప్రకారం జింబాబ్వే సెనెట్ ను ఎగువ సభగా జాతీయ అసెంబ్లీని దిగువ సభగా గుర్తించారు.

వలస పాలనకు, శ్వేత జాత్యహంకార ప్రధాని అయిన ఇయాన్ స్మిత్ విధానాలకు వ్యతిరేకంగా 1960వ దశాబ్దం నుంచీ గెరిల్లా పోరాటం జరిగింది. అందులో కీలక పాత్ర పోషించిన ముగాబే వాస్తవానికి గాంధీ, మండేలాల సరసన నిలవాల్సిన నేత. అయినా తర్వాతి కాలంలో అధికార దాహం, అశ్రిత పక్షపాతాలతో వ్యక్తిగతంగానే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా దిగజార్చారు. దాంతో పాశ్చాత్య దేశాల్లో అప్రతిష్టపాలై ఆంక్షలకు గురయ్యారు. 1990వ దశాబ్దం దాకా జింబాబ్వే విస్తృత జలవనరులతో వ్యవసాయం ప్రధాన వనరుగా విలసిల్లింది. తర్వాత వాతావరణ మార్పుల వల్ల జలవనరులు క్షీణించడం మొదలైంది. ముగాబే దానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేక పోయారు. దాంతో పాటు దేశంలో ఖనిజ వనరులైన బంగారం, ప్లాటినం, వజ్రాలు, బొగ్గు, ముడి ఇనుము తదితరాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ అవన్నీ దాదాపుగా 10 శాతం మంది సంపన్నుల చేతిల్లోనే ఉండిపోవడంతో ప్రస్తుతం జింబాబ్వే 85 శాతం పేదరికం, 90 శాతం నిరుద్యోగంతో నిరుపేద దేశంగా అల్లాడుతోంది. ప్రభుత్వ సంపద అంతా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం కావడం వల్ల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమయింది. సంపన్నుల ప్రయోజనాల మేరకే ప్రభుత్వం పని చేస్తుండం వల్ల దేశ ఖనిజ సంపద అంతా విదేశాలకు తరలిపోతోంది. 2013 జనవరిలో జింబాబ్వే దేశం నుంచి 200 కోట్ల డాలర్ల విలువైన వజ్రాలు ఎగుమతి అయ్యాయి. ఇటువంటి ఎగుమతులకు ప్రభుత్వం అనుమతించడం వల్ల ప్రైవేటు వ్యక్తులు దేశ సంపదను కొల్లగొట్టడానికి దారులు తెరిచినట్లు అయ్యిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

2008లో జింబాబ్వేలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తడం వల్ల ఆ దేశ ద్రవ్యోల్బణం 23 కోట్ల శాతానికి పెరిగిపోయింది. కరెన్సీకి ఏ మాత్రం విలువ లేకుండా పోవడంతో ప్రభుత్వం కరెన్సీని రద్దు చేసింది. అమెరికా డాలర్, ఇరుగు పొరుగు దేశాల కరెన్సీ మీదే జింబాబ్వే దేశ ఆర్థిక వ్యవహారాలు నడుస్తున్నాయంటే దాని ఆర్థిక వ్యవస్థ ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. జింబాబ్వే పరిస్థితి ఇలా దిగజారడానికి కారణం ముగాబే వ్యవసాయ, తదితర సంస్కరణలేనని విమర్శకులు అంటున్నారు. దేశంలో ఒక్క శాతం జనాభా గల శ్వేత జాతీయుల చేతుల్లోంచి భూముల్ని లాక్కొని నల్ల జాతీయులకు పంచాలని ముగాబే సంకల్పించారు. ఇందుకోసం బ్రిటన్ సాయంతో ఇష్టపడ్డ అమ్మకందార్లు, ఇష్టపడ్డ కొనుగోలు దార్లు అనే పథకాన్ని ప్రారంభించారు. దీని కింద భూములను కొని పేద రైతులకు ఇవ్వాలని ఆశించారు. కానీ అది నాసిరకం భూములకు భారీ ధరలు చెల్లించే కుంభకోణంగా మార్పు చెందింది. బ్రిటన్ పెత్తనం, తప్పుడు విధానాలు, ముగాబే అనుచరుల అవినీతి వీటన్నింటి కారణంగా ఆ సంస్కరణల కార్యక్రమం విఫలమైంది. తర్వాత బ్రిటన్ ను వ్యతిరేకించి తానే స్వయంగా ఆర్థిక వ్యవస్థను బలపరచుకోవాలని ముగాబే ప్రయత్నించారు. 2000వ సంవత్సరంలో 1500 మంది శ్వేత జాతీయుల నుంచి భారీ ఎత్తున వ్యవసాయ క్షేత్రాలను స్వాధీనం చేసుకొని పేద రైతులకు, నల్లవారికి పంచాలని ఆశించారు. మళ్లీ వీటిలో చాలా భాగం దేశీయ భూస్వాములు, సైన్యాధికారులు, ప్రభుత్వ నేతల వశమయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. కానీ లక్షకు పైగా రైతుల పునరావాసం కూడా జరిగింది. అయితే భూ పంపిణీ తర్వాత వ్యవసాయ అభివృద్ధి జరగాల్సి ఉండగా, దాన్ని నిర్లక్ష్యం చేయడంతో మార్కెట్ శక్తులు విజృంభించాయి.

మరోపక్క ఆధారిత పంటల పద్ధతి ఉన్న భూముల్లో జీవనాధార వ్యవసాయం ప్రవేశించింది. వీటి కారణంగా వ్యవసాయోత్పత్తి, ఎగుమతులు తగ్గిపోయాయి. ప్రధాన పంట మొక్క జొన్న ఎక్కువ పండుతున్నా గిట్టుబాటు ధర లభించడం లేదు. దాంతో పాటు జాంబియా వంటి విదేశీ పెట్టుబడిదారుల కోసం మొక్కజొన్న ఎగుమతులు కూడా జరగడంతో రైతులు మరింత దెబ్బతింటున్నారు. 2012 వరకు జింబాబ్వేలో కోటికి పైగా ఆకలి చావులు నమోదయ్యాయని అంచనా. మరోపక్క 2009లో గనులపై యాజమాన్యం స్థానికులకే చెందేలా ప్రభుత్వం తీసుకున్న చర్య అక్రమ గనుల తవ్వకానికీ, నీటి వనరుల కాలుష్యానికి కారణమైంది. 2012లో ముగాబే ఆర్థిక వ్యవస్థ కొంత చక్కబరిచినా ప్రస్తుతం మొక్కజొన్న పంట దేశాన్ని కుదిపేస్తోంది. ప్రధాన ఆహారమైన ఈ పంట అక్కడ అత్యధికంగా పండుతున్నా రాజకీయాల కోసం దిగుమతులు చేసుకోవడం లాభసాటిగా భావించి పౌర, సైనికాధికారులు అవినీతికి విచ్చలవిడిగా పాల్పడుతున్నారు. మంచివాటిని దెబ్బతిన్నవిగా చెప్పి తక్కువ ధరలకు అమ్మి తిరిగి వాటినే సేకరణ పేరిట అధిక ధరలకు కొంటూ కుంభకోణాలు జరిపి లాభపడుతున్నారు. ఈ సంక్షోభాల నుంచి జింబాబ్వేను గట్టెక్కించడమే ముగాబే ముందున్న అతి పెద్ద సవాలు.

ప్రేమ విఘ్నేశ్వర్ రావు కె.
Published date : 10 Oct 2013 04:29PM

Photo Stories