ULFA: ‘అల్ఫా’ సాయుధ పోరాటం.. సరికొత్త అధ్యాయం ఇదే..!
అస్సామ్‌లోని పేరుబడ్డ తీవ్రవాద సంస్థ ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సామ్’ (అల్ఫా)లోని ఒక వర్గం హింసామార్గం విడిచిపెట్టి, ప్రజాస్వామ్య పంథాలోకి రానున్నట్టు డిసెంబర్ 29న ప్రకటించింది. అల్ఫా వర్గానికీ, కేంద్ర, అస్సామ్ సర్కార్లకూ మధ్య ఈ తాజా త్రైపాక్షిక పరిష్కార ఒప్పందం (ఎంఓఎస్) స్వాగతించాల్సిన విషయం.
ఈశాన్యంలో శాంతి స్థాపన నిమిత్తం కుదుర్చుకుంటూ వచ్చిన ఒప్పందాల వరుసలో ఇది తాజాది. చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజనీ, దీంతో అస్సామ్‌లో హింసాకాండకు పూర్తిగా తెర పడుతుందనీ కేంద్ర హోమ్ మంత్రి అమితమైన ఆశాభావం ప్రకటించారు. అయితే, ఇప్పటి దాకా కుదుర్చుకున్న అనేక ఒప్పందాల ఫలితాలు మిశ్రమంగానే మిగిలాయి. అందుకే, ఈ కొత్త ఒప్పందం కూడా కేవలం మరో పత్రంగా మిగులుతుందా..? లేక శాంతిసాధనలో చరిత్రాత్మకం కాగలుగుతుందా అన్నది పలువురి అనుమానం.
‘సార్వభౌమాధికార’ అస్సామ్‌ను కోరుతూ 1979లో ‘అల్ఫా’ సాయుధ పోరాటం ప్రారంభించింది. అలా 44 ఏళ్ళుగా రగులుతున్న కుంపటిని తాజా ఒప్పందం చల్లారుస్తుందని ఆశ. 1985లో అస్సామ్ ఒప్పందం తర్వాత కూడా అక్కడి గ్రామీణ ప్రజల్లో అసంతృప్తిని రగిలించడంలో అల్ఫా సఫలమైంది. కిడ్నాపింగ్‌లు, దోపిడీలు, హత్యలు, బాంబు పేలుళ్ళతో ఒక దశలో అల్ఫా అట్టుడికించింది. దాంతో, ప్రభుత్వం 1990లో అల్ఫాను నిషేధించింది. కర్కశమైన ‘సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం’ (ఏఎఫ్‌ఎస్‌పీఏ)ను తీసుకురావాల్సి వచ్చింది.
Health Diseases: 2023లో మెరుగైన ఐదు వ్యాధులు.. 2024లో జాగ్రత్తలు!
‘అల్ఫా’ ఉచ్చదశలో వెలిగిపోతున్న రోజుల్లో దాని చేతులు అస్సామ్ మొదలు దక్షిణాసియా దాకా విస్తరించాయి. మయన్మార్, భూటాన్‌లలో అల్ఫా శిబిరాలు, బంగ్లాదేశ్‌లో ఆ సంస్థ నేతలు, శ్రీలంక–పాకిస్తాన్‌లలో శిక్షకులున్న రోజులవి. అయితే, పరిస్థితులు మారాయి. శ్రీలంకలో ఎల్టీటీఈ పతనం, భూటాన్ గడ్డపై శిబిరాల్ని మూయించాల్సిందిగా ఆ దేశంపై ఒత్తిడి రావడం, అలాగే భారత్‌తో మైత్రి పాటించే షేక్ హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక శక్తులను సహించక పోవడం, అల్ఫాలోని వర్గపోరు, భారత సర్కార్ ఉక్కుపాదం మోపడం.. ఇవన్నీ కొన్నేళ్ళుగా అల్ఫాను బలహీనపరిచాయి.
వలస కార్మికులనూ, సామాన్య నిరుపేదలనూ లక్ష్యంగా చేసుకొని సాగించిన హింస సైతం రైతాంగంలో అల్ఫా పలుకుబడిని పలుచన చేసింది. నిజానికి, గతంలో పలు సందర్భాల్లో అల్ఫాతో శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఆ మాటకొస్తే శాంతిప్రక్రియ 2009లోనే మొదలైంది. చర్చల అను కూల వర్గంతో 2011లోనే సంప్రతింపులు ఆరంభమయ్యాయి. సంస్థ బలహీనమయ్యేసరికి సార్వ భౌమాధికార డిమాండ్‌ను అల్ఫా పక్కనబెట్టక తప్పలేదు.
స్థానిక ప్రజల ప్రయోజనాల పరిరక్షణ చాలనే విధంగా వ్యవహరించి, గౌరవప్రదంగా బయటపడేందుకు ప్రయత్నించింది. వెరసి, పుష్కర కాలం తర్వాత చర్చలు ఫలించాయి. పరిష్కార ఒప్పందం కుదిరింది. అయితే, అల్ఫా సంస్థాపకుల్లో ఒకరైన అప్పటి ‘కమాండర్–ఇన్–ఛీఫ్’ పరేశ్ బారువా శాంతి చర్చలను వ్యతిరేకిస్తూ 2012లోనే ‘అల్ఫా ఇండిపెండెంట్’ (అల్ఫా–ఐ)గా వేరుకుంపటి పెట్టుకున్నారు. అరబింద రాజ్‌ఖోవా సారథ్యంలోని వర్గమే తప్ప సైద్ధాంతికంగా కరడుగట్టిన ఈ ‘అల్ఫా–ఐ’ వర్గం ఒప్పందంలో భాగం కాలేదు.
అది ఒక లోటే. అలాగని, కుదిరిన ఒప్పందాన్ని తీసిపారేయలేం. వేర్పాటువాదం ప్రబలడంతో ఒకప్పుడు గణనీయంగా నష్టపోయిన రాష్ట్రం తాజా ఒప్పందంతో మళ్ళీ అభివృద్ధి పథంలో పయనించ గలుగుతుంది. కేంద్ర ఆర్థిక సహాయంతో అభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతమవుతాయి. ఈ ఒప్పందం పుణ్యమా అని ఈ ఈశాన్య రాష్ట్రంలో సాంఘిక – సాంస్కృతిక అశాంతికి కూడా తెరపడుతుందని మరో ఆశ. ఎందుకంటే, అక్రమ వలసల మొదలు స్థానిక తెగల వారికి భూ హక్కుల వరకు పలు అంశాల పరిష్కారం గురించి తాజా త్రైపాక్షిక ఒప్పందం ప్రస్తావిస్తోంది.
Periodic Labour Force Survey Annual Report: మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటులో భారీ పెరిగుదల
ఆ ఆశ నెరవేరితే అంతకన్నా కావాల్సింది లేదు. నిజానికి, అస్సామ్‌లో చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలకై ‘ఏఎఫ్‌ఎస్‌పీఏ’ కింద సాయుధ బలగాలకు అపరిమితమైన అధికారాలను ప్రభుత్వం ఎన్నడో కట్టబెట్టింది. అల్ఫా దూకుడు మునుపటితో పోలిస్తే తగ్గడం, అలాగే అనేక విమర్శల అనంతరం గత రెండేళ్ళలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆ చట్టాన్ని ఉపసంహరించారు. ఇప్పుడిక మిగతా ప్రాంతాల్లో సైతం ఈ అమానవీయ చట్టాన్ని ఎత్తివేసే దిశగా అస్సామ్ సర్కార్ అడుగులు వేయాలి.
తాజా ఒప్పందంతో తీవ్రవాదానికి పూర్తిగా తెర పడిందని తొందరపడడానికి లేదు. అతివాద ‘అల్ఫా–ఐ’ వర్గం నేత బారువా ఇప్పటికీ చైనా–మయన్మార్ సరిహద్దులో గుర్తుతెలియని చోట దాగున్నారు. కొన్నేళ్ళుగా కొత్త చేరికలు లేక ఆయన వర్గం గణనీయంగా బలహీనపడినప్పటికీ, ఆ వర్గపు వ్యవహారం ఇంకా తేలనందున కేంద్ర, అస్సామ్ ప్రభుత్వాలు ఆచితూచి అడుగేయాల్సి ఉంది. కాక పోతే... ఒకపక్క రష్యా – ఉక్రెయిన్‌లు, మరోపక్క గాజాలో ఇజ్రాయెల్ – పాలస్తీనాల మధ్య యుద్ధా లతో రోజూ వార్తలను వేడెక్కించిన గడచిన 2023 ఎట్టకేలకు ఒక శాంతి ఒప్పందంతో ముగియడం ఒకింత ఊరట.
ఒప్పందాన్ని సఫలం చేయడం ప్రభుత్వ, అల్ఫా వర్గాల ముందున్న సవాలు. అల్ఫా మాట అటుంచి, దీర్ఘకాల వేర్పాటువాదం అనంతరం ఈశాన్యంలో సుస్థిరంగా శాంతి వెల్లివిరియాలంటే ప్రభుత్వం ముందుగా అక్కడి ప్రతి పౌరుడూ జనజీవన స్రవంతిలో భాగమయ్యేలా చూడాలి. రైతాంగ జీవనప్రమాణాల్ని మెరుగుపరచాలి. వేర్పాటువాదం వైపు ఆకర్షితులు కాకుండా జాగ్రత్త పడాలి. అందుకీ ఒప్పందం దోహదపడితేనే ఇన్నేళ్ళ సంప్రతింపుల శ్రమకు అర్థం, పరమార్థం!
India Economy: ఐదు ట్రిలియన్ ఎకానమీతో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్