Skip to main content

Wildlife: అంతరించిపోయిన వన్యప్రాణుల్ని పునరుద్ధరించే దిశగా.. నమీబియా నుంచి కునో నేషనల్‌కు చేరుకున్న చిరుతలు

ఏడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత చీతాల మెరుపు కదలికల్ని చూడబోతున్నాం. అంతరించిపోయిన వన్యప్రాణుల్ని పునరుద్ధరించే ప్రాజెక్టులో భాగంగా నమీబియా నుంచి ఎనిమిది చీతాలను భారత్‌కు తీసుకువస్తున్నారు.
First look of Cheetahs arriving from Namibia at Kuno National
First look of Cheetahs arriving from Namibia at Kuno National

  ప్రధాని మోదీ తన పుట్టిన రోజైన శనివారం మధ్యప్రదేశ్‌లోని కునో–పాల్‌పూర్‌ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోకి  చీతాలను విడుదల చేస్తారు. రెండు నుంచి ఆరేళ్ల మధ్య వయసున్న మూడు మగ, అయిదు ఆడ చీతాలను తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. నమీబియా రాజధాని విండ్‌హెక్‌ నుంచి శుక్రవారం రాత్రి ప్రత్యేక విమానం బయల్దేరి రాజస్తాన్‌లోని జైపూర్‌కి శనివారం ఉదయం చేరుకుంటుంది. అక్కడ్నుంచి హెలికాప్టర్‌లో మధ్యప్రదేశ్‌ కునో నేషనల్‌ పార్క్‌కి తరలిస్తారు. వీటిని తీసుకురావడానికి బీ747 జంబో జెట్‌కు మార్పులు చేశారు.  దీని ముందు భాగంలో చీతా బొమ్మను పెయింట్‌ చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

Also read:   Summer Effect: 122 ఏళ్ల గరిష్ట ఉష్ణోగ్రతలు.. ఎండలు తగ్గేదేలే..

చీతాల క్షేమమే లక్ష్యంగా  
ప్రయాణంలో చీతాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. విమానాల్లో ప్రయాణించేటప్పుడు జంతువులకి కడుపులో తిప్పడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే వాటికి ఆహారం ఇవ్వకుండా ఖాళీ కడుపుతో తీసుకువస్తారు. విమానంలో చీతాలను ఉంచడానికి 114సెం.మీ గీ8సెం.మీ గీ84సెం.మీ బోనుల్ని ఏర్పాటు చేశారు. ప్రయాణంలో చీతాల బాగోగుల్ని చూడడానికి ముగ్గురు సంరక్షకులు వెంట ఉంటారు. వన్యప్రాణుల్ని ఖండాంతరాలకు తరలించాల్సి వస్తే ప్రయాణానికి ముందు తర్వాత నెల రోజులు క్వారంటైన్‌లో ఉంచాలి. ఆ నిబంధనలకనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ చెప్పారు. కునో జాతీయ పార్కులో చీతాలను ఉంచడానికి భారీ ఎన్‌క్లోజర్‌ను ఏర్పాటు చేశారు. చీతాల నుంచి ఎలాంటి వ్యాధులు సంక్రమించకుండా ఇప్పటికే వాటికి వ్యాక్సిన్‌లు ఇచ్చారు. క్వారంటైన్‌ సమయం పూర్తయ్యాక కొత్త వాతావరణానికి చీతాలు అలవాటు పడడం కోసం కొన్నాళ్లు అవి స్వేచ్ఛగా విహరించడానికి వీలుగా వదిలేస్తారు. అందుకే కునో నేషనల్‌ పార్కు చుట్టుపక్కల ఉన్న 24 గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయించి ఇతర ప్రాంతాలకు తరలించారు.  నమీబియాలో వాతావరణానికి దగ్గరగా కునో పార్క్‌ ఉంటుంది. అందుకే అక్కడే వాటిని ఉంచాలని నిర్ణయించారు.

Also read: ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్టు ఎత్తు ఎంత?         

దశాబ్దాల ప్రయత్నాలు ఫలించిన వేళ 

  • భారత్‌లో చివరిసారిగా 1948లో చీతా కనిపించింది. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌గా పిలుస్తున్న కొరియ ప్రాంతంలో వేటగాళ్ల చేతిలో ఆఖరి చీతా బలైంది. 1952లో కేంద్రం అంతరించిపోయిన వన్యప్రాణుల జాబితాలో చీతాలను చేరుస్తూ ప్రకటన చేసింది 
  • ఆసియా, ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా కనిపించే చీతాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 7,500 మాత్రమే ఉన్నాయి.  
  • 1960 నుంచి చీతాలను మళ్లీ దేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. తొలుత ఆసియన్‌ చీతాలను తీసుకురావడానికి ఇరాన్‌తో సంప్రదింపులు జరిపారు. అయితే ఆ దేశంలో కూడా వాటి సంఖ్య తక్కువగా ఉండడంతో వాటిని ఇవ్వడానికి అక్కడ ప్రభుత్వం నిరాకరించింది 
  • 2009లో నాటి పర్యావరణ మంత్రి జైరామ్‌ రమేష్‌ ఆఫ్రికన్‌ చీతాలను తీసుకురావడానికి ప్రాజెక్టుని ప్రారంభించారు.  
  • 2020లో సుప్రీం కోర్టు ఈ ప్రాజెక్టుకు అంగీకారం తెలిపింది. చీతాలను తెచ్చేందుకు నమీబియా, దక్షిణాఫ్రికాతో కేంద్రం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.  
  • అయిదేళ్లలో 50 చీతాలు తీసుకురావడానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది 
  • తొలిదశగా నమీబియాకి చెందిన చీతా కన్జర్వేషన్‌ ఫౌండేషన్‌ (సీసీఎఫ్‌) ఎనిమిది చీతాలు తీసుకువస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలు రానున్నాయి. 

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

Also read: ప్రపంచ భౌగోళిక అంశాలు

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 16 Sep 2022 05:32PM

Photo Stories