Skip to main content

హాంకాంగ్ స్వేచ్ఛావాదం... చైనా అగ్రాధిపత్యం

డా॥బి.జె.బి. కృపాదానం, సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ, ఆర్.సి.రెడ్డి స్టడీ సర్కిల్
యావత్ ప్రపంచం ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటోంది. అణచివేత, నిరంకుశ ధోరణి, నియంతృత్వానికి ఎదురొడ్డి నిలుస్తోంది. పరిమితుల్లేని పరిపూర్ణ ప్రజా స్వామ్యం మా హక్కంటూ గొంతెత్తి నినదీస్తోంది. మొన్న అరబ్ ప్రపంచంలో ఈజిప్టు, లిబియా... నిన్నస్కాట్లాండులో స్వేచ్ఛా ఉద్యమం పోటెత్తగా... నేడు హాంకాంగ్‌లో చోటు చేసుకున్న పరిణామాలు వాటికి అద్దం పడుతున్నాయి. 2017 ఎన్నికలను సార్వత్రిక ఓటింగ్ హక్కుతో నిర్వహిస్తామన్న చైనా... మాట తప్పిందంటూ హాంకాంగ్ నిరసన కారులు నినదీస్తుంటే.... తామిచ్చిన మాట ప్రకారమే సార్వత్రిక ఓటింగ్‌ను కల్పిస్తున్నామని చైనా చెబుతోంది. వీరి మాటల్లో ఏది సత్యం... ఏది అసత్యం... చరిత్ర పుటల్లోకి వెళితే...

హాంకాంగ్ సీఈఓ ఎన్నిక
హాంకాంగ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజాస్వామ్య పరిరక్షకుల నిరసన ఉద్యమం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. హాంకాంగ్‌లో 2017లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి బీజింగ్ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో తీసుకున్న నిర్ణయం ప్రకారం హాంకాంగ్ పరిపాలకుడైన ప్రధాన నిర్వాహకుని ఎన్నిక... చైనా ప్రభుత్వం ఖరారు చేసిన అభ్యర్థులలో ఒకరిని హాంకాంగ్ పౌరులు ఎన్నుకోవాలి. దీని ప్రకారం చైనా కమ్యూనిస్టు ప్రభుత్వానికి అనువైన వ్యక్తి మాత్రమే ప్రధాన కార్యనిర్వాహకుడు అవుతాడు.

గొడుగు విప్లవం
హాంకాంగ్‌లో స్వేచ్చావాదం కోసం విద్యార్థుల నాయకత్వంలో అక్టోబరు 4న నిరసన ఉద్యమం ప్రారంభమైంది. ఈ పోరాటంలో రెండు లక్షలకు పైగా నిరసన కారులు పాల్గొన్నారు. విద్యార్థుల నినాదాలతో హాంకాంగ్ ప్రధాన వ్యాపార కూడలి దద్దరిల్లింది. ఈ నిరసన ఉద్యమాన్ని గొడుగు విప్లవం (అంబ్రెల్లా రివల్యూషన్)గా విశ్లేషకులు వర్ణించారు. ప్రదర్శకులలో ఎక్కువ మంది పోలీసు బలగాలు ప్రయోగించే భాష్ప వాయువు నుంచి, తీవ్రంగా కాస్తున్న ఎండ నుంచి రక్షించు కోవడానికి గొడుగుని కవచంగా వాడారు. ఈ ఉద్యమ ప్రభావాన్ని అంచనా వేసేముందు హాంకాంగ్ పుట్టు పూర్వోత్తరాలను సమీక్షించడం సముచితం.

బ్రిటన్ నుంచి చైనాకు
నల్లమందు యుద్ధంలో ఓటమి పాలైన చైనా నుంచి బ్రిటన్ హాంకాంగ్‌ను 1842 ట్రీటీ ఆఫ్ నాన్‌కింగ్ ప్రకారం స్వాధీనం చేసుకుంది. ఈ నగర వైశాల్యం సుమారు 426 చదరపు మైళ్లు. 1898లో చైనా నుంచి బ్రిటన్ 99 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. 1984లో నాటి బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్, చైనా అధినేత డెంగ్ జియావో పింగ్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 1997 జులై 1న మళ్లీ చైనా ఆధీనంలోకి వచ్చింది. బీజింగ్ తాను అనుసరించే ‘ఒకదేశం, రెండు పద్ధతుల సూత్రం‘ ప్రకారం హాంకాంగ్ చట్ట పరంగా, రాజకీయంగా, ఆర్థికంగా 50 ఏళ్లపాటు స్వాధీనతను కొనసాగేట్లు అంగీకరించింది.

1984 ఒప్పందం మేరకు 1997 నాటికి హాంకాంగ్‌లో ప్రాథమిక చట్టం (రాజ్యాంగం) అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం వయోజన ఓటు హక్కు పౌరులందరికీ వర్తిస్తుంది. అయితే హాంకాంగ్ శాసనమండలిలోని 60 స్థానాల్లో 18 స్థానాలకు మాత్రమే ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి. క్రమేణా ప్రత్యక్ష ఎన్నికల విధానం విస్తరించనుంది.

నమ్మిన బంటుకే సీఈఓ పట్టం
1997లో
హాంకాంగ్ నగర పాలకుడిగా పిలిచే ప్రధాన కార్యనిర్వాహకుని పదవికి జరిగిన ఎన్నికలలో చైనా నాయకత్వానికి నమ్మినబంటైన టాంగ్-చి-హ్వా ఎన్నికయ్యాడు. హాంకాంగ్ పాలనా వ్యవహారాలలో చైనా జోక్యం శ్రుతిమించడం, పౌర హక్కులు పరిమితం కావడం లాంటి చర్యలతో టాంగ్ (ప్రధాన కార్యనిర్వాహకుడు) నాయకత్వం బలహీనపడింది. పదవీ కాలం పూర్తికాకుండానే ఆయన 2005లో రాజీనామా చేశాడు. చైనా జాతీయ ప్రజా కాంగ్రెస్ (పార్లమెంట్) నిర్ణయం మేరకు ఆపద్ధర్మ కార్య నిర్వాహకులుగా డోనాల్డ్ త్సాంగ్ నియమితులయ్యారు. ఆయన 2007లో జరిగిన ఎన్నికల్లో 86 శాతం ఓటర్ల మద్దతుతో ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నికలు స్వేచ్ఛా పూరిత వాతావరణంలో జరగలేదు.

2007లో చైనా పార్లమెంటు తీర్మానం ప్రకారం- హాంకాంగ్ ప్రధాన కార్య నిర్వాహకుని పదవికి 2017లో నిర్వహించే ఎన్నికలు వయోజన ఓటు హక్కు ప్రాతిపదికగా జరగాలి. అలాగే 2020లో శాసనమండలికీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 2004, 2008లలో శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో బీజింగ్ అనుకూల రాజకీయ పక్షాలు ఆధిక్యాన్ని పొందాయి. అయితే ఈ ఎన్నికలలో గెలిచినవారికి బీజింగ్‌కు అనుకూలురైన రెండు లక్షల మంది వాణిజ్య, విద్వక్త నియోజకవర్గాల మద్దతు ఉంది.

2010లో ప్రాథమిక చ ట్టానికి సవరణ జరిగింది. ఆమేరకు 2012లో జరిగిన ఎన్నికలలో శాసన మండలికి 10 స్థానాలు పెంచారు. దీంతో శాసన మండలి సభ్యుల సంఖ్య 70కి పెరిగింది. ఇందులో 30 మంది విద్వక్త (ఫంక్షనల్) నియోజకవర్గాల ద్వారా ఎన్నికైతే, 35 మంది ఐదు ప్రాదేశిక నియోజక వర్గాల నుంచి వయోజన ఓటు ప్రాతిపదికపై ఎంపికయ్యారు. మిగిలిన ఐదు స్థానాలకు అభ్యర్థులను జిల్లా కౌన్సిళ్లు (18) నామినేట్ చేస్తాయి. ప్రాథమిక చట్టం శాసన మండలి అధికారాల మీద అనేక పరిమితులు కొన సాగిస్తూనే ఉంది. 2010లో ప్రారంభమైన సంస్కరణలు ప్రధాన కార్యనిర్వాహకుని ఎన్నికలో స్వల్ప మార్పు తీసుకువచ్చింది. అతణ్ని 1200 మంది సభ్యులతో కూడిన ఎన్నికల కమిటీ ఎంపిక చేస్తుంది. 2012 మార్చిలో జరిగిన ఎన్నికల్లో లుంగ్-చున్-టుంగ్ సీఈఓగా ఎన్నికయ్యారు. 2012 సెప్టెంబరులో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో బీజింగ్ అనుకూల పార్టీలు 43 స్థానాలు, ప్రజాస్వామ్య అనుకూల రాజకీయ పక్షాలు 27 స్థానాలు గెలుపొందాయి. దీంతో రాజ్యాంగ సవరణలను ప్రతిఘటించడానికి ప్రతిపక్షాలకు బలం చేకూరింది.

అడ్డంకులు -ఆగ్రహాలు
బీజింగ్ అనుకూల విధానాలను అమలు చేస్తున్న ప్రధాన కార్యనిర్వాహకుడు లుంగ్ వయోజన ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టకుండా వీలైనన్ని అడ్డంకులు సృష్టించారు. 2013లో బీజింగ్ ప్రభుత్వ ప్రతినిథి 2017లో ప్రధాన కార్యనిర్వాహకుని ఎన్నిక బహిరంగ ప్రతిపాదన విధానంలో జరగదని స్పష్టం చేశారు. దీనిబట్టి ఆశించిన మేరకు ఎన్నికల సంస్కరణలు జరగవని తేటతెల్లమైపోయింది.

అలజడికి తక్షణ కారణం
ఇదిలాఉండగా 2014 ఆగస్టు నెలలో చైనా పార్లమెంటు స్థాయీ సంఘం ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన నిర్ణయాలను ప్రకటించింది. దీని ప్రకారం 2017లో జరిగే ఎన్నికల్లో బీజింగ్ అనుకూల కమిటీ ప్రతిపాదించిన అభ్యర్థులే పోటీలో పాల్గొనాలి. వారి మధ్యే పోటీ జరుగుతుంది. పోటీ చేయాలంటే ప్రభుత్వ అనుమతి కావాలి. దీన్ని బట్టి నిజమైన ప్రజాస్వామ్య బద్ధ ఎన్నికలు హాంకాంగ్‌లో జరగవని రూఢీ అవుతోంది. ప్రస్తుత అలజడికి తక్షణ కారణమిదే.

మరో కోణం... ఆర్థిక అసమానతలు
ఈ పరిణామాన్ని ఇంకో కోణంలో విశ్లేషిస్తే... ఆర్థిక సంక్షోభం వల్లే ఇది సంభవించింద ని చెప్పవచ్చు. గతంలో మాదిరి హాంకాంగ్ సాధారణ పౌరులకు అవకాశాలు వడ్డించిన విస్తరి కావు. బిలియనీయర్లు, చైనా కమ్యూనిస్టు నాయకుల గుప్పిట్లో హాంకాంగ్ బందీ అయింది. కేవలం ఏడు మిలియన్ల జనాభాలో 39 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యున్నత తలసరి రేటు. ఇంకో పక్క 20 శాతం ప్రజలు (1.3 మిలియన్లు) దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. ఇదే హాంకాంగ్‌కు అతివృష్టి, అనావృష్టి. హాంకాంగ్ ఆదాయ అసమానత సూచిక (జినికోఫిషియంట్) 2000లో 0.525 అయితే అదిప్పుడు 5.37కి పెరిగింది.

అసంతృప్తికి అసలు కారణం
హాంకాంగ్‌లోని మధ్య తరగతి వర్గం, పట్ట భద్రులైన విద్యార్థులు చైనా నుంచి వచ్చి స్థిరపడిన వలస దారుల నుంచి గట్టిపోటీ ఎదుర్కొవాల్సి వస్తోంది. వీరిని పచ్చదనాన్ని హరించే మిడతల మహమ్మారితో పోలుస్తున్నారు. చైనా నుంచి వచ్చి హాంకాంగ్‌లో బిడ్డలకు జన్మనిస్తున్న తల్లుల పట్ల కూడా వ్యతిరేకతను ఈ రూపంలో ప్రదర్శిస్తున్నారు. హాంకాంగ్ స్థానికులకు చైనీయులు దురాక్రమణ దారులుగా కనిపిస్తున్నారు. చైనా పర్యాటకులను స్థానికులు ద్వేషిస్తున్నారు. దీనికి కారణమూ లేకపోలేదు. చాలామంది చైనీయులు పర్యటనకు వచ్చి అక్కడే స్థిరపడిపోతున్నారు. తమ ఉద్యోగ అవకాశాలను విదేశీయులు తన్నుకుపోతున్నారనే భావన స్థానికుల్లో బాగా నాటుకుపోయింది. ఆ కోపాన్నే ఇప్పుడు ఈ ఉద్యమ రూపంలో ప్రదర్శిస్త్తున్నారు. 50 సంవత్సరాల తర్వాత హాంకాంగ్ చైనాలో ఐక్యం (integration) కావడం చైనాకే లాభమనే భావన స్థానికుల్లో ఉంది. సగటు పౌరుని కంటే పాలకులకే ఇది లాభిస్తుందనే వాదన ఎక్కువ శాతం ప్రజల్లో నెలకొంది.

ఈనాటికీ హాంకాంగ్‌లో విదేశీ పాలన కొనసాగుతుందనే ధోరణి ప్రజల్లో ఉంది. 1997కి పూర్వం బ్రిటన్, ఇప్పుడు చైనా తమపై దోపిడీకి ఒడిగట్టాయనే తీవ్ర అసంతృప్తి ప్రజల్లో రోజురోజుకూ బలపడుతోంది. ప్రస్తుత సంక్షోభానికి తెరదించాలంటే కేవలం నిష్పక్షపాత ఎన్నికలు మాత్రమే పరిష్కారం చూపవు. హాంకాంగ్‌లో తిష్టవేసిన చైనా కమ్యూనిస్టు నాయకులను, బహుళజాతి సంస్థలను, పాలక వర్గాన్ని ప్రతిఘటించాలి. ఆ గమ్యం దిశగా పయనిస్తున్న ప్రస్తుత ఉద్యమం ఏ మేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

చైనా వైఖరేంటి?
హాంకాంగ్ చైనా వ్యతిరేక ఉద్యమాలకు మూల బిందువుగా పని చేస్తుందనే ఆరోపణ ఎప్పట్నుంచో ఉంది. టిబెట్, యూగర్ వంటి అల్పసంఖ్యాక వర్గాల్లో చైనా వ్యతిరేక ధోరణులను కల్పించటంలో హాంకాంగ్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని పాలకవర్గంపు భావన. బీజింగ్, షాంఘై, హ్యూనన్, గ్యుయాంగ్ చే, షెంజెన్ పట్టణాల్లో ఇప్పటికే హాంకాంగ్ ఉద్యమం పట్ల సానుభూతి పరులను నిర్బంధించారు. రేడియో, ఫ్రీ ఏషియా, వాయిస్ అమెరికా లాంటి ప్రసార మాధ్యమాలు ఈ పోరాటానికి విస్తృత ప్రాచుర్యాన్ని స్తున్నాయి.

కమ్యూనిస్టు కోటను కూలగొట్టేందుకే
విదేశీ శక్తుల జోక్యాన్ని విమర్శిస్తూ, ఉద్యమకారుల్లో ఎక్కువ మంది క్రైస్తవులని దానికి కారణం పాశ్చాత్య దేశాల మద్దతు అని ఇంకొందరి ఆరోపణ. చైనా మద్దతు దారుల దృష్టిలో ప్రస్తుత ఉద్యమం రాజకీయ సుస్థిరత, మనుగడకు సవాలు లాంటిది. కాబట్టి ఈ ఉద్యమాన్ని అవసరమైతే బల ప్రయోగం ద్వారా అణచి వేయాలనుకుంటున్నారు. చైనా అగ్ర రాజ్యంగా పరిణామం చెందుతున్న తరుణంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని చైనా కమ్యూనిస్టులు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల కాలంలో కమ్యూనిస్టు పార్టీ పెట్టుబడిదారి వర్గం విసిరే సవాళ్లైన... ప్రజాస్వామ్యం, విశ్వజనీన విలువలు, పౌరసమాజం, మార్కెట్ ఉదారవాదం, ప్రసార మాధ్యమాల స్వయం ప్రతిపత్తి, చారిత్రక తప్పిదాలను విమర్శించడం లాంటి విషయాల్లో జాగ్రత్తపడాలని సభ్యులకు సూచించింది.

ఈ వలయం నుంచి బయట పడేదెలా?
దీని నుంచి బయటపడాలంటే చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్యే మార్గాన్ని అవలంభించవచ్చు. హాంకాంగ్ ఎన్నిక ప్రవృత్తిని సరళం చేసి కమ్యూనిస్టేతరులు కూడా పోటీ చేయటానికి అవకాశం కల్పించాలి. కానీ ఈ వెసులుబాటును ప్రత్యర్థులు తప్పుగా అంచనా వేసి చైనాలో వివిధ ప్రాంతాల్లో తిరుగుబాటు లేవనెత్తేందుకు అవకాశం కల్పించినట్లవుతుంది. ఇది ఏ పరిణామానికి దారితీస్తుందంటే... చైనా అస్థిత్వానికే సవాలు విసర వచ్చు. చైనా ప్రత్యర్థులు దీన్ని ఆసరాగా చేసుకొని మరిన్ని అలజడులు సృష్టించవచ్చు. లేదా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ ఉద్యమాన్ని కర్కశంగా అణచి వేయవచ్చు. ఏ చిన్న తప్పు చేసినా ప్రసార మాధ్యమాలు గోరంత కొండంతలు చేసి చైనా ప్రతిష్టను మంటగలిపే ప్రమాదం ఉంది. దీనిపై చైనా ఎలా స్పందిస్తుందో... హాంకాంగ్ ప్రజల ఆకాంక్షను ఏమేర నెరవేరుస్తుందో... కాలమే నిర్ణయిస్తుంది.
Published date : 17 Oct 2014 05:01PM

Photo Stories