Skip to main content

భారత్ - చైనా సంబంధాలు-విశ్లేషణ

ఇటీవలి కాలంలో భారత, చైనా దేశాల మధ్య చెలరేగిన సరిహద్దు వివాదం మన దేశంలో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఇరుపక్షాల చొరవతో తాత్కాలికంగా ఈ వివాదానికి తెరపడింది. కానీ భవిష్యత్‌లో మరిన్ని ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదముంది. యూరప్‌లో ఫ్రాన్‌‌స, బ్రిటన్, జర్మనీల మధ్య వంద సంవత్సరాలు యుద్ధాలు జరిగాయి. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఈ మూడు దేశాలు మిత్రదేశాలయ్యాయి. మరి ఇండియా, చైనా దేశాలు అలాంటి శాంతియుత వాతావరణాన్ని సృష్టించుకోలేవా? జనాభా దృష్ట్యా ప్రపంచంలోని అతి పెద్ద దేశాలైన ఈ రెండు ఘర్షణకు దిగితే ప్రపంచంలో మూడోవంతు జనాభా తల్లడిల్లడమే కాకుండా, ప్రపంచ శాంతికే విఘాతం ఏర్పడుతుంది. 21వ శతాబ్దం ఆసియా శతాబ్దం. ఇండియా, చైనాలు అతిశక్తివంతమైన రాజ్యాలుగా పరిణామం చెందుతాయని మేధావులు, ప్రపంచ నాయకులు ఒక వైపు ఉద్ఘాటిస్తుంటే, ఇటీవల అంతర్జాతీయ నదీజలాల (బ్రహ్మపుత్ర) వినియోగం విషయంలో, వాస్తవాధీనరేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించే విషయంలో చైనా వైఖరిలో హేతుబద్ధత లోపించిందనిపిస్తుంది. ఇది ఇరుదేశాలకు నష్టదాయకమే.

ఒకదేశ విదేశాంగ విధానం చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక, పరిసరాల, నాయకత్వ అంశాల వల్ల ప్రభావితమవుతుంది. 1950 సంవత్సరం నుంచి నేటివరకూ భారత్, చైనా దేశాల మధ్య ఎన్నో ఒడిదుడుకులు సంభవించాయి. వీటికి అంతర్గత, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు కొంతవరకు కారణం. ద్వెపాక్షిక సంబంధాల విశ్లేషణ చేసే ముందు ఇరుదేశాల భౌగోళిక, ఆర్థిక, సామాజిక అంశాలను తులనాత్మకంగా పరిశీలిద్దాం.

ద్వైపాక్షిక సంబంధాలలో ప్రధానఘట్టాలు:
స్వతంత్య్ర భారత తొలి ప్రధానిగా విదేశీ వ్యవహారాల మంత్రిగా జవహర్‌లాల్ నెహ్రూ భారత్-చైనా సంబంధాలకు నాంది పలికారు. స్వాతంత్య్రానికి పూర్వమే 1935లో తాను రచించిన ‘గ్లింప్‌సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ గ్రంథంలో నెహ్రూ ఇండియా, ఇంగ్లండ్ తర్వాత చైనాను అత్యంత ఇష్టమైన దేశంగా ప్రస్తావించారు. 1939లో చైనాలో నెహ్రూ జరిపిన పర్యటన తర్వాత ఇరుదేశాలు మరింత చేరువవ్వాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. తన తర్వాత గ్రంథమైన ‘ద డిస్కవరీ ఆఫ్ ఇండియా’లో ఆసియా ఖండంలోని గొప్ప నాగరిక దేశాలైన చైనా, భారత్‌ల మధ్య సారూప్యాలను వివరించారు.
రెండో ప్రపంచయుద్ధం తర్వాత బహుధృవ (మల్టీపోలార్) ప్రపంచమేర్పడుతుందని అందులో ఇండియా, చైనా కీలకపాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. 1949 లో కమ్యూనిస్టులు చైనాలో అధికారంలోకి వచ్చారు. 1950 లో చైనా టిబెట్‌ను ఆక్రమించినప్పుడు.. ఉపప్రధాని సర్దార్‌వల్లభాయ్ పటేల్, చైనా సామ్రాజ్యవాద విధానాన్ని ఖండిస్తూ, ఆ చర్య భవిష్యత్‌లో భారత ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. 1954లో చైనా ప్రధాని ‘చౌ ఎన్ లై’ భారతదేశాన్ని, నెహ్రూ చైనాను సందర్శించారు. చైనాలో తనకు లభించిన అఖండ స్వాగతానికి నెహ్రూ పులకితులయ్యారు. పటేల్ లాంటి వారు ముందుచూపుతో చేసిన వ్యాఖ్యానాన్ని పట్టించుకోలేదు. అదే సంవత్సరంలో ఇండియా ప్రచురించిన భౌగోళిక పటంలో అక్సాయ్‌చిన్ (వాయవ్య సరిహద్దు మూల) భారత భూభాగంలో అంతర్ భాగంగా చూపించారు.

టిబెట్ వ్యవహారంతో మొదలు:
1956లో చౌ ఎన్ లై భారత్‌ను సందర్శించారు. ఆయనతోపాటు వచ్చిన దలైలామా రహస్యంగా నెహ్రూని కలిసి భారత్‌కు పలాయనం గావిస్తానని, టిబెట్‌లో పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయని చెప్పారు. 1958లో నెహ్రూ టిబెట్‌ను సందర్శించడానికి అనుమతి నిరాకరించడంతో చైనా కుటిల ప్రవర్తన బయటపడింది. అదే సంవత్సరంలో చైనా ప్రచురించిన భౌగోళిక పటంలో భారతదేశానికి చెందిన విశాల భూభాగాన్ని చైనా అంతర్భాగంగా చూపించింది. గ్జింజియాంగ్‌ను టిబెట్‌తో కలుపుతూ వేసిన రోడ్డు భారత భూభాగమైన లడక్ ప్రాంతం నుంచి వెళ్లింది. భారతదేశం ఈ విషయంలో నిరసన తెలిపితే, చౌ ఎన్ లై బ్రిటిష్‌వారు రూపొందించిన ‘మెక్‌మోహన్ రేఖను’ గుర్తించమని జవాబిచ్చారు. ప్రస్తుతం తమ ఆధీనంలో ఉన్న భూభాగపు సరిహద్దుల వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. 1959లో దలైలామా టిబెట్ నుంచి పారిపోయి భారతదేశానికి రావడం, మన ప్రభుత్వం ఆశ్రయమివ్వడం చైనాకు కోపం తెప్పించింది. భారతదేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు దలైలామాను సందర్శించడం, మితవాద రాజకీయపక్షాలు చైనాను విమర్శించడం మొదలైనవి రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టడానికి దారితీసాయి. 1960లో చౌ ఎన్ లై భారతదేశాన్ని సందర్శించినప్పుడు సరిహద్దు వివాదం విషయంలో ఇచ్చిపుచ్చుకొనే ధోరణిని ప్రదర్శించాలని ప్రతిపాదించారు. దాని ప్రకారం తూర్పుభాగం (అరుణాచల్ ప్రాంతం)లో ఇండియా నియంత్రణను చైనా గుర్తించడం, పశ్చిమ భూభాగం (లడక్ ప్రాంతం)లో చైనా ఆధిపత్యాన్ని ఇండియా గుర్తించడం. కానీ, ప్రజాస్వామ్య భారతదేశంలో ఈ రాజీమార్గం ముఖ్యంగా ప్రతిపక్షాలకు నచ్చలేదు.

చైనాను దుయ్యబట్టడంతోపాటు, నెహ్రూని అసమర్థుడని విమర్శించాయి. మీడియా దీనికి ఆజ్యం పోసింది.

కొరవడిన ముందుచూపు:
1962 జూలైలో ఇండియా, చైనా సరిహద్దు బలగాల మధ్య ఘర్షణ తలెత్తింది. పశ్చిమ ప్రాంతంలో మన సాయుధ బలగాలు కొంత ప్రతిఘటించినప్పటికీ, తూర్పుభాగాన చైనా దళాలు తమ పూర్తి ఆధిక్యతను చాటాయి. బ్రహ్మపుత్రా లోయను అధిగమించి, అస్సాంలో తేజ్‌పూర్ పట్టణం వరకూ చైనీయుల సైన్యం పురోగమించింది. కలకత్తా పట్టణానికి దగ్గరగా శత్రుసైన్యం వచ్చింది. ఆశ్చర్యకరంగా నవంబర్ 22న చైనా సైన్యం ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటించి తాము ఆక్రమించిన భూభాగం నుంచి నిష్ర్కమించింది. ఈ సంఘటన నెహ్రూని వ్యక్తిగతంగా దెబ్బతీసింది. భారత ప్రజలు తీరని అవమానంగా భావించారు. అప్పటి నుంచి నేటివరకూ భారతీయులు చైనాను మిత్రద్రోహిగా, సామ్రాజ్యవాదిగా పరిగణిస్తున్నారు. నెహ్రూ ఒప్పుకున్నట్లు ఈ అవమానకర సంఘటనకు కారణం.. భారతీయ సైన్యం తగిన శిక్షణ, ఆయుధాలు లేక చైనీయుల ధాటికి నిలవలేకపోయింది. మన రాజకీయ నాయకత్వంలో ముందుచూపు కొరవడింది. చైనీయులను గుడ్డిగా నమ్మారు.

నెహ్రూ అలీన విధానానికి ప్రాధాన్యతనిస్తూ శాంతి సామరస్యాలతో సరిహద్దు వివాదాల్ని పరిష్కరించుకోవాలని ఆశిస్తే, కమ్యూనిస్ట్ చైనా అలీన విధానాన్ని అపహసిస్తూ, కయ్యానికి కాలుదువ్వింది. బలప్రయోగం ద్వారా చైనా తమ పూర్వ వైభవాన్ని పొందాలని ప్రయత్నించింది. నెహ్రూ చైనా నాయకులను గుడ్డిగా నమ్మడం, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను తప్పుగా అర్థం చేసుకోవడం, అప్పటి రక్షణ శాఖ మంత్రి కృష్ణ మీనన్ సాయుధ బలగాలను ఆధునికీకరణ చేయకుండా తాత్సారం చేయడం 1962లో చైనా చేతిలో భారతదేశం భంగపాటు పొందడానికి కారణాలు.

సరిహద్దు వివాదంపై సంయుక్త సమావేశాలు:
1961లో ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు దాదాపు తెగిపోయాయి. బీజింగ్‌లోని రాయబారిని భారత్ వెనుకకు పిలిచింది. చైనా కూడా తన రాయబారిని ఉపసంహరించుకుంది. మావో చనిపోయిన సంవత్సరం (1976) తిరిగి రాయబార కార్యాలయాలను పునరుద్ధరించారు. డెంగ్ గ్జియోపింగ్ (మావో తదనంతర నాయకుడు) ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి చొరవ తీసుకొన్నారు. అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీని చైనా సందర్శనకు ఆహ్వానించారు. ఆమె దాన్ని తిరస్కరించారు.
తర్వాత ప్రధాని రాజీవ్‌గాంధీకి ఆహ్వానం పంపారు. 1988 డిసెంబర్‌లో రాజీవ్‌గాంధీ చైనాను సందర్శించారు. 30 సంవత్సరాల తర్వాత ఒక ప్రముఖ భారతీయ నాయకుడు చైనా సందర్శించారు.
క్రమేణ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. వాణిజ్యం కూడా వృద్ధి చెందింది. 1988-93 సంవత్సరాల మధ్య కాలంలో సరిహద్దు వివాదానికి సంబంధించి ఆరుసార్లు సంయుక్త సమావేశాలు జరిగాయి. 1993లో భారత ప్రధాని పి.వి.నరసింహరావు, చైనా ప్రధాని లీపెంగ్‌లు సరిహద్దు ఒప్పందం మీద సంతకాలు చేశారు. కానీ 1998లో భారతదేశం జరిపిన అణు పరీక్ష ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం కలిగించింది.

2003 సంవత్సరంలో భారత ప్రధాని అటల్‌బిహారి వాజ్‌పాయి చైనా సందర్శించారు. టిబెట్ చైనాలో అంతర్భాగమేనని ఒప్పుకుంటూ భారత ప్రధాని ఒడంబడిక మీద సంతకం చేశారు. రెండు సంవత్సరాల తర్వాత చైనా ప్రధాని వెన్‌జియాబో భారత్‌ను సందర్శించారు. ఆ సందర్భంగా అనేక వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. 2006లో ప్రాచీన వాణిజ్య మార్గమైన ‘నాథులా’ను తెరిచారు. 2008 లో ప్రస్తుత ప్రధాని మన్మోహన్‌సింగ్ చైనాను సందర్శించారు.

ఇటీవల కాలంలో బ్ర హ్మపుత్రా నదీజలాల వినియోగం పేరుతో చైనా టిబెట్ పీఠభూమిలో భారీఎత్తున ఆనకట్టలు నిర్మించి దిగువ నదీపరీవాహక దేశాలైన ఇండియా, బంగ్లాదేశ్‌లను కలవరపెడుతోంది. 2020 నాటికి భారీ ఎత్తున బ్రహ్మపుత్రా నదీజలాలను చైనా ఉత్తరాది ప్రాంతాలకు తరలించాలని పథకం రూపొందించింది. ఈ ప్రయత్నం పర్యావరణ హానితోపాటు, దిగువ నదీపరివాహక దేశ ప్రజల జీవనోపాధికి గండికొడుతోంది. ఈ చర్య ఇండియా-చైనా సంబంధాలకు విఘాతం కలిగిస్తుంది.

కొద్దిరోజుల క్రితం చైనా సైన్యం లడక్‌లోని డెప్సాంగ్ మైదాన ప్రాంతంలో (దౌలత్ బెగ్ ఒల్డి) చొరబడి 21 రోజులు తిష్టవేసి చివరకు మే 5, 2013న సైనిక దళాలను ఉపసంహరించుకుంది. ఇది తాత్కాలికంగా మన ప్రభుత్వానికి ఊరట కలిగించినప్పటికీ, భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కావనే హామీ ఏమీలేదు. 1993, 1996 సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించి మన భూభాగంలోకి చొరబడుతున్నారంటే భారతదేశపు వాస్తవాధీనరేఖను చైనా గుర్తించడంలేదని తేటతెల్లమవుతోంది. బీజింగ్‌లో అధికారాన్ని చేపట్టిన నూతన నాయకత్వం తమ దేశ మౌళిక ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి ఎలాంటి సాహసానికైనా ఒడిగడుతోందని అర్థమవుతోంది. దక్షిణ, తూర్పు చైనా సముద్ర తీరంలోని దేశాలతో కయ్యానికి దిగడానికి సిద్ధపడుతోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలన్నీ చైనా తొందరపాటు చర్యలను ఆతృతతో గమనిస్తున్నాయి.

భారత్‌ను బలహీన పరచడంపైనే దృష్టి:
తాజా పరిస్థితుల నేపథ్యంలో మనదేశం చైనా పట్ల అనుసరించాల్సిన వైఖరేంటి? నెహ్రూ లాంటి ఆదర్శవాదులు ‘హిందీ- చీనీ భాయి భాయి’ లాంటి నినాదాలతో చైనాను లాలించడానికి ఎంత ప్రయత్నించినా చైనాకు భారతదేశమంటే ఏవగింపు, చిన్నచూపు. చైనా సమగ్ర జాతీయశక్తి (కాంప్రహెన్సివ్ నేషనల్ పవర్) ఇండియా కంటే మూడు, నాలుగు రెట్లెక్కువ. ద్వైపాక్షిక, ప్రాంతీయ, జాతీయ సమస్యల మీద రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదు. దక్షిణాసియాలో భారతదేశ నాయకత్వాన్ని చైనా సహించదు. భారతదేశాన్ని బలహీనపరచాలనే కాంక్షతోనే పాకిస్థాన్‌కు అణు ఆయుధాల తయారీలో సహాయ పడింది. పొరుగునున్న నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక దేశాలతో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ ఇండియాను బలహీనపరుస్తుంది.

ఇటీవల కాలంలో అమెరికా ఇండియాకు దగ్గరకావటం చైనాకు మింగుడుపడడం లేదు. న్యూక్లియర్ ఒప్పందం (అమెరికా-భారత్‌ల మధ్య) చైనాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ‘ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వమివ్వడానికి చైనా అభ్యంతరం చెబుతోంది. ఇండియా అనుసరిస్తున్న ‘లుక్ ఈస్ట్ పాలసీ’ చైనాకు చేదుగుళికలాంటిది. తన పొరుగు దేశాలైన జపాన్, వియత్నాం దేశాలతో దుడుకుగా వ్యవహరించినట్లే, ఇండియా విషయంలో కూడా ప్రవర్తిస్తుంది. ఆర్థికంగా, సైనికంగా అగ్రరాజ్యంగా రూపొందుతూ, అమెరికానే సవాలు చేసే స్థితిలో ఉన్న చైనా, తన పొరుగు దేశమైన ఇండియా ఆర్థిక శక్తిగా ఎదగడాన్ని సహించలేకపోతోంది. వీలైనంతవరకు అణచివేయాలని ప్రయత్నిస్తోంది. మరి ఈ పరిస్థితులలో ఇండియా అనుసరించాల్సిన వ్యూహమేమిటి? ఇండియా తన సైనిక పాటవాన్ని త్వరితగతిన మెరుగుపర్చుకోవాలి. సరిహద్దు ప్రాంతంలో మౌలిక సదుపాయాలు (రోడ్లు, సమాచార వ్యవస్థ) పటిష్టం చేయాలి. ఆర్థిక ప్రగతి సాధించాలి. సంక్షోభం తలెత్తినప్పుడు స్పందన ధీటుగా ఉండాలి. ‘‘ముల్లును ముల్లుతోనే తీయాలనే’’ సామెతను సార్థకం చేస్తూ, చైనాకు వ్యతిరేక శక్తులతో అమెరికా, జపాన్, కొరియా లాంటి దేశాలతో వ్యూహాత్మక (స్ట్రాటిజిక్) ఒప్పందాలు కుదుర్చుకోవాలి.

కారకాలు భారతదేశం చైనా
1. భూభాగం 3,287,240 కి.మీ. 9,640,821 కి.మీ.
2. జనాభా 1,241,491,960 1,339,724,852
(2011 జనాభా గణాంకాలు) (2010 జనాభా గణాంకాలు)
3. జనసాంద్రత 382 ప్రతి కి.మీ. 139.6 ప్రతి కి.మీ.
4. జాతీయస్థూల ఉత్పత్తి (జీడీపీ) 1.96 ట్రిలియన్ డాలర్లు 7.298 ట్రిలియన్ డాలర్లు
5. తలసరి ఆదాయం 1,389 యూఎస్ డాలర్లు 5,413 యూఎస్ డాలర్లు
6. మానవ ప్రగతి సూచిక (హెచ్‌డిఐ) 0.547 (మీడియం) 0.669 (మీడియం)
7. సేద్యపు భూమి 1.79 మిలియన్ స్క్వేర్ కి.మీ. 1.49 మిలియన్ స్క్వేర్ కి.మీ.
8. మాగాణి 0.61 మిలియన్ స్క్వేర్ కి.మీ. 0.53 మిలియన్ స్క్వేర్ కి.మీ.
9. మొత్తం భూభాగంలో నీటి శాతం 9.5 శాతం 2.8 శాతం
10. ప్రభుత్వ అప్పు 62 శాతం జీడీపీ 29 శాతం జీడీపీ
11. రక్షణ ఖర్చు 46.8 బిలియన్ యూఎస్ 140 బిలియన్ యూఎస్
డాలర్లు (1.83 శాతం జీడీపీ) డాలర్లు(1.3శాతం జీడీపీ)
Published date : 18 May 2013 04:18PM

Photo Stories