Skip to main content

భారత్ – అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు

ప్రేమ విఘ్నేశ్వర్ రావు కె.
భారత్ – అమెరికా మధ్య సంబంధాలు అనుమానాలతో మొదలైనా పరస్పర విశ్వసనీయతతో బలోపేతం అయ్యాయి. అయితే ఉభయ దేశాల మధ్య సంబంధాలు అంతర్జాతీయంగా అనేక విమర్శలకు కేంద్ర బిందువవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2013 సెప్టెంబర్లో భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య దాదాపు మూడేళ్ల తరువాత జరిగిన ద్వైపాక్షిక భేటీ ఇదే. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలతో పాటు పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. రక్షణ రంగంలో మరింత సహకారానికిగాను సైనిక ఉత్పత్తులను ఉమ్మడిగా తయారు చేయాలనీ, అమెరికా నుంచి భారత్ కు ఉన్నత స్థాయి సాంకేతికతను బదిలీ చేయాలనీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పౌర అణు ఒప్పందంపై కీలక అంగీకారం కుదిరింది. ఈ సమావేశం అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

సంయుక్త ప్రకటన –ప్రధానాంశాలు:
అణు వాణిజ్య ఒప్పందం: అమెరికా, భారత్ ల మధ్య ఐదేళ్ల క్రితం జరిగిన అణు ఒప్పందం ప్రకారం భారత అణు విద్యుత్ సంస్థ ( Nuclear Power Corporation of India Ltd.), అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌస్(Westinghouse) కంపెనీల మధ్య తొలి అణు వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఫలితంగా భారత్ లో ఏపీ -1000 అణు రియాక్టర్ టెక్నాలజీకి లైసెన్సు ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. అయితే గుజరాత్, ఆంధ్రప్రదేశ్ లలో వాణిజ్యపరమైన అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని భారత్ యోచన. దీనికి సంబంధించిన పాలనా పరమైన ఏర్పాట్లు త్వరలో పూర్తి కానున్నాయి. ఒప్పందంలో భాగంగా వెస్టింగ్ హౌస్ తయారు చేసే ఏపీ-1000 న్యూక్లియర్ రియాక్టర్లు ఆరింటిని భారతదేశానికి అందజేస్తుంది. ఈ ఒప్పందం విలువ దాదాపు 1400 కోట్ల డాలర్లు. ఈ అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి అవసరమైన చర్యల్ని వేగవంతం చేయాలని సంబంధిత సంస్థలకు ఉభయ దేశాలు సూచించాయి.

ఉగ్రవాదం (Terrorism):
ఉగ్రవాదంపై పోరులో భాగంగా నిఘా సమాచారాన్ని పరస్పరం అందజేసుకోవడంలో మరింతగా సహకరించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.  హోమ్ ల్యాండ్ సెక్యురిటీ (Home Land Security) సహకారాన్ని విస్తరించాలని నిర్ణయించాయి. ఏ రూపంలో ఉన్నప్పటికీ ఉగ్రవాదాన్ని ఖండించాలని అమెరికా స్పష్టం చేసింది. 2008లో భారత్ పై దాడికి కారణమైన పాకిస్థాన్ ఉగ్రవాదులను శిక్షించాలని డిమాండ్ చేసింది. ఈ దిశగా పాక్ కృషి చేయాలని ఉభయ దేశాలు పిలుపునిచ్చాయి.

పాక్ తో చర్చించేందుకు ఒబామా అంగీకారం: 
మన్మోహన్, ఒబామా మధ్య చర్చల్లో  పాకిస్తాన్ లో ఉగ్రవాదానికి లభిస్తున్న అండదండల(Support) అంశం ప్రస్తావనకు వచ్చింది. పాక్ వైపు నుంచి భారత్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉగ్రవాద దాడుల సమస్యలను మన్మోహన్ సింగ్ వివరించారు. పాక్ ఉగ్రవాద దాడుల ప్రభావం భారత్ పై నిరంతరంగా కొనసాగుతోందని వెల్లడిస్తూ ఇటీవల జమ్మూకాశ్మీర్ లో జరిగిన దాడులను ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదంపై పాక్ తో చర్చిస్తానని ఒబామా భారత ప్రధానికి హామీ ఇచ్చారు.

రక్షణ రంగం:
ఇకపై భారత్, అమెరికా భద్రతాపరమైన ఉమ్మడి అంశాల్లో పరస్పరం సహకరించుకుంటాయి. అంతేకాకుండా అత్యంత సన్నిహిత భాగస్వాములుగా వ్యవహరిస్తాయి. రక్షణ వాణిజ్యం, పరిశోధనా రంగాల్లో ఉమ్మడి అభివృద్ధి, ఉమ్మడి ఉత్పత్తి, రక్షణ సాంకేతిక బదిలీ తదితరాల్లో సహకారం పెంపొందించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. దీనికోసం అనుమతి ప్రక్రియలను మెరుగుపరచడం, సరళీకరించడం వంటి చర్యలను అమెరికా, భారత్ దేశాలు చేపడతాయి. సంవత్సరం లోపు అత్యాధునిక రక్షణ రంగ ప్రాజెక్టులను సంయుక్తంగా చేపట్టే అంశాలను పరిశీలించాలని ఉభయ దేశాలు నిర్ణయించాయి. 2014లో అమెరికా పసిఫిక్ కమాండ్ నిర్వహించే పసిఫిక్ తీర ప్రాంత నావికా విన్యాసాల్లో పాల్గొనాలని భారత్ నిర్ణయించింది.  ఉగ్రవాదం, సైబర్ నేరాలు, అంతరిక్షం, ఆరోగ్య భద్రత తదితర రంగాల్లో 21వ శతాబ్దానికి తగిన విధంగా ఉమ్మడి కృషి చేసేందుకు భద్రతా రంగంలో సహకారాన్ని పెంచుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి.

ద్వైపాక్షిక వాణిజ్యం:
భారత్ – అమెరికాల మధ్య  ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం 10,000 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఈ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని అయిదింతల స్థాయికి పెంచుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. వస్తూత్పత్తి రంగంలో పెట్టుబడులపై ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేయటం ద్వారా వాణిజ్య, పెట్టుబడుల రంగంలో అడ్డంకులను తొలగించాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఆర్థిక వ్యవస్థలో మరిన్ని సంస్కరణలకు చోటు కల్పించటం ద్వారా ఆర్థిక వృద్ధికి భారతదేశం అవకాశం కల్పిస్తుందన్న విశ్వాసాన్ని అమెరికా వ్యక్తపరిచింది. దీనివల్ల ఇరు దేశాల్లోనూ మరింత ఉపాధి కల్పన జరుగుతుందని అమెరికా వెల్లడించింది. ఐటీ రంగంలో సంబంధాలు, పెట్టుబడుల పెంపునకు కృషి చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత రక్షణ, మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికా కంపెనీలకు మన్మోహన్ సింగ్ ఆహ్వానం పలికారు. ఆయా రంగాల్లో దీర్ఘకాలిక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. భారత వృద్ధి అవకాశాలపై, అలాగే ఆర్థిక విధానాల కొనసాగింపులో తమ నిజాయితీపై అమెరికా వ్యాపార వర్గాల్లో వ్యక్తమవుతున్న ఆందోళనలను ఆయన కొట్టిపడేశారు. ఇవి అపోహలతో కూడుకున్నవిగా అభివర్ణించారు. 1991 నుంచి దేశంలో సంస్కరణలకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయని, తత్ఫలితంగా ఆర్థిక విధానాల భావి పురోగమనానికి ఎటువంటి ఢోకా లేదని స్పష్టం చేశారు. భారత్ ను తిరిగి నిలకడతో కూడిన 8-9 శాతం వృద్ధిరేటు బాటలోకి మళ్లించేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని వెల్లడించారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(World Trade Organisation) మంత్రిత్వ స్థాయి చర్చల్లో సత్ఫలితాల కోసం ఉభయ దేశాల అధికారులు కలిసి కృషి చేయాలని తీర్మానించారు.

కాలుష్య రహిత ఇంధన ఉత్పత్తి:
కాలుష్య రహిత ఇంధన ఉత్పత్తికి సంబంధించి 2009లో అమెరికా, భారత్ ల మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరింది.  ఇది భారతదేశంలో లక్షలాది కుటుంబాలకు పరిశుభ్రమైన ఇంధనాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.  ఈ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని భారత్ కోరింది.

వాతావరణ మార్పు:
వాతావరణ మార్పులపై ఉమ్మడి కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఇరు దేశాలు ప్రకటించాయి.  వాతావరణ మార్పులపై ఐక్యారాజ్య సమితి కార్యచట్ర ఒప్పందం కింద జరిగిన ఒప్పందాలన్నింటినీ అమలు చేయడానికి కట్టుబడి ఉన్నట్లు అమెరికా, భారత్ స్పష్టం చేశాయి.

హైడ్రో ఫ్లోరో కార్బన్లపై టాస్క్ ఫోర్స్:
గ్రీన్ హౌస్ వాయువులను నియంత్రించే క్రమంలో  ఆర్థికంగా సాధ్యమైన, సాంకేతికంగా వీలైన ప్రత్యామ్నాయాలకు గల అవకాశలపై చర్చించేందుకు గాను హైడ్రోఫ్లోరో కార్బన్లపై భారత్, అమెరికా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ఉభయదేశాలు నిర్ణయించాయి.

ఎగుమతి నియంత్రణ వ్యవస్థల్లో సభ్యత్వం:
నాలుగు అంతర్జాతీయ ఎగుమతి నియంత్రణ వ్యవస్థల్లో భారత్ కు పూర్తి స్థాయి సభ్యత్వం కల్పించేందుకు మద్దతు ఇవ్వడానికి అమెరికా సుముఖత వ్యక్తం చేసింది. ఈ సభ్యత్వం వల్ల భారత్ కు సాంకేతిక పరిజ్ఞానం బదిలీ సులభమవుతుంది.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు:
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తక్షణం సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని  ఉభయ దేశాలు అంగీకరించాయి. భద్రతా మండలిలో భారతదేశ శాశ్వత సభ్యత్వానికి పూర్తి మద్దతు ఇస్తామని అమెరికా అద్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు.

భారత పౌరులకు గ్లోబల్ ఎంట్రీ:
అమెరికా ప్రవేశపెట్టిన గ్లోబల్ ఎంట్రీ (Global Entry) కార్యక్రమాన్ని భారతదేశ పౌరులకు వర్తింపజేసేందకు అమెరికా అంగీకారం తెలిపింది.  గ్లోబల్ ఎంట్రీ కార్యక్రమం కింద ఆమోదిత దేశాల నుంచి తరచూ అమెరికాను సందర్శించేవారు ఒక ఆన్ లైన్ దరఖాస్తును పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికోసం 100 డాలర్ల మొత్తాన్ని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. పూర్వాపరాలతో కూడిన వివరాలు తెలపాల్సి ఉంటుంది. మౌఖిక పరీక్షలో పాల్గొనడం తప్పనిసరి. వేలి ముద్రలు సమర్పించాలి. ఈ ప్రక్రియ పూర్తయితే ఐదేళ్ల గడువుతో గ్లోబల్ ఎంట్రీ సభ్యత్వం లభిస్తుంది.  ఈ సభ్యత్వం ఉన్నవారు అమెరికాలో సత్వరమే ప్రవేశం కల్పిస్తారు. వీరికి ఇమ్మిగ్రేషన్ సంబంధిత సమస్యలు అంతగా ఉండవు. ఈ పథకం 2008లో ప్రారంభమైంది. గ్లోబల్ ఎంట్రీ పథకం ప్రయోజనాలను ఇప్పటి వరకు బ్రిటన్, జర్మనీ, దక్షిణ కొరియా, ఖతార్ వంటి కొన్ని ఎంపిక చేసిన దేశాలకు మాత్రమే కల్పించింది.

ఆసియా పసిఫిక్ దేశాలతో భాగస్వామ్యం:
ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని దేశాలతో భారత్, అమెరికాలు మరింత భాగస్వామ్యం పెంపొందించుకోవాలని ఆకాంక్షించాయి. ముఖ్యంగా జపాన్, చైనా, ఆసియాన్ దేశాలతో మరింత సన్నిహితం కావాలని అభిలషించాయి.
హిందూ మహా సముద్ర దేశాల మధ్య సంప్రదింపులు: తూర్పు, మధ్య, పశ్చిమాసియా దేశాల మధ్య సంప్రదింపుల యంత్రాంగాల మాదిరిగానే హిందూ మహా సముద్ర తీర ప్రాంత దేశాల మధ్య కూడా సంప్రదింపులు జరగాలనీ, అందులో తీర ప్రాంత రక్షణ, సముద్ర జీవుల, సహజ వనరుల రక్షణ మొదలైనవి భాగం కావాలని ఆకాంక్షించారు.

సంబంధాల బలోపేతం:
రానున్న దశాబ్ద కాలంలో వ్యూహాత్మక భాగస్వామ్యంతో సహా అన్ని ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలోపేతం చేయాలని అమెరికా, భారత్ లు తీర్మానించాయి.  రక్షణ రంగంలో సహకారం, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల పెంపు, ఉన్నత విద్యారంగం, ఇంధన, పర్యావరణ రంగాల్లో సహకారం పెంపునకు ఇరు దేశాలు కట్టుబడి ఉంటాయి. ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు, పారదర్శకత పెంచేందుకు త్వరలో ఉన్నత స్థాయి ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకునే విషయంలో ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి.

భారత్ –అమెరికా మూడో ద్వైపాక్షిక సమావేశం – సమీక్ష:
మూడో శిఖరాగ్ర సమావేశంలో ప్రధానంగా రక్షణ సహకారం పెంపుపై ఎక్కువగా దృష్టి పెట్టారు. 2005 జూన్‌లో ఇరు దేశాల మధ్య రక్షణ చట్రం ఒప్పందం (Defence Framework Agreement) కుదిరింది. ఇరు దేశాల మధ్య సైనిక సహకారం పెరగడానికి ఈ ఒప్పందం ప్రాతిపదిక. మన్మోహన్‌ సింగ్‌ పర్యటనలో రక్షణ సహకారంపై సంయుక్త ప్రకటన జారీ చేశారు. అమెరికా, భారత్‌లు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను పంచుకుంటాయి. తమ సన్నిహిత భాగస్వాములను ఏ విధంగా ఉంచుతాయో అదే విధంగా ఇరు దేశాలూ పరస్పరం ఉంటాయి అనేది ఒప్పందంలో మౌలిక సూత్రం. ఇదే సూత్రం రక్షణ సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, వర్తకం, పరిశోధన, సహ అభివృద్ధి, రక్షణ రంగ పరికరాల సహ ఉత్పత్తి, సేవలకు వర్తిస్తుంది అని కూడా ఒప్పందం పేర్కొంటోంది. అంటే భారతదేశం మరిన్ని ఆయుధాలను అమెరికా నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆయుధాలు, సైనిక పరికరాలను కూడా సంయుక్తంగా ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అమెరికా నుంచి ఆయుధాలు, రక్షణ పరికరాలు కొనుగోలు చేయడాన్ని భారత్‌ పెంచింది. గత కొద్ది సంవత్సరాల్లో భారత్‌ 900 కోట్ల డాలర్ల విలువ చేసే రక్షణ రంగ పరికరాలు, ఆయుధాలను అమెరికా నుంచి కొనుగోలు చేసింది. రక్షణ ఉత్పత్తికి గానూ అమెరికా ఆయుధ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడాన్ని ఇప్పుడు ప్రతిపాదించాయి. ఇందుకుగాను రక్షణ ఉత్పత్తి రంగంలోకి 26 శాతం ఎఫ్‌డిఐని అనుమతించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఒక దాని తరువాత మరోటి ప్రాతిపదికన ఎఫ్‌డిఐ పరిమితిని పెంచాలని కూడా నిర్ణయించారు.
రెండు దశాబ్దాల క్రితం భారత్‌ను సైనిక మిత్రునిగా చేర్చుతూ అమెరికా ప్రణాళికలను రూపొందించింది. వాస్తవానికి భారత్‌ను వ్యూహాత్మక మిత్రపక్షంగా చేసుకునే లక్ష్యంతోనే ఈ ప్రణాళికలు రూపొందించింది. దీనికి బుష్‌ ప్రభుత్వం భారత్‌-అమెరికా అణు ఒప్పందాన్ని తెరపైకి తెచ్చిందని విమర్శకుల వాదన. వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌కు చాలా ప్రముఖమైన స్థానాన్నే కల్పించింది అమెరికా. 2014 లో అమెరికా పసిఫిక్‌ కమాండ్‌ నిర్వహించే పసిఫిక్‌ సముద్రం చుట్టూ ఉన్న ప్రాంతంలో (Rim of Pacific) నావికా విన్యాసాల్లో భారత్‌ పాల్గొంటుందని సంయుక్త ప్రకటన చేసింది. 90 వ దశకం మధ్య నుంచి జరుగుతున్న ఈ నావికా విన్యాసాలు భారత్‌ - అమెరికా సైనిక విన్యాసాలు విస్తరించుకోవడంలో ఒక భాగమని విశ్లేషకుల అభిప్రాయం. అమెరికా భారత్‌తో కలిసి ప్రపంచంలోకెల్లా పెద్ద సంఖ్యలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. అమెరికా, జపాన్‌లతో కలిసి భారత్‌ ఇప్పటికే త్రైపాక్షిక సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఇదంతా ఆసియా ప్రాంతంలో అమెరికా వ్యూహాత్మక కూటమిలోకి భారత్‌ను కూడా లాగాలన్న ఆ దేశ ప్రణాళికలో భాగమేనని అంతర్జాతీయ పరిశీలకుల అభిప్రాయం. పెరిగిన సైనిక రక్షణ సహకారంతో పాటు అమెరికా ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలకు కూడా చోటు కల్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నిపుణులు చెబుతున్నారు. చిల్లర వర్తకంలోకి FDIని అనుమతించేందుకు నిబంధనలను సడలించడం లేదా వెస్టింగ్‌హౌస్‌ ఒప్పందం మాదిరిగా భారత్‌కు అణు రియాక్టర్లను అమెరికా కంపెనీలు విక్రయించేందుకు వీలు కల్పిస్తూ పౌర అణు నష్టపరిహార బాధ్యతల చట్టాన్ని నీరుగార్చడం వంటి వాటి ద్వారా అమెరికా ప్రయోజనాలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపణలున్నాయి. అమెరికా, భారత్‌ వ్యూహాత్మక ప్రయోజనాలు ఒక దానితో ఒకటి పెనవేసుకుపోవడమనేది భవిషత్తు కాలంలో భారత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపొచ్చు. ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులను తీవ్రంగా తగ్గించడం వంటి వాటిని బట్టి భారత్‌ తన స్వీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎలా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. అవి ఐక్యరాజ్యసమితి ఆంక్షలు కావు కాబట్టి ఇరాన్‌పై అమెరికా పెట్టే ఆంక్షలను తాము ఆమోదించేది లేదని చెప్పే సాహసం భారత్‌ చేయలేకపోతోంది. చివరకు సిరియా విషయంలో కూడా అమెరికా ప్రయోజనాలకు అనుగుణమైన వైఖరినే భారత్‌ అవలంబిస్తోంది.  గతేడాది (2012) ఫిబ్రవరిలో భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన పశ్చిమ దేశాల తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం ద్వారా దాన్ని ధృవీకరించింది. ఈ తీర్మానాన్ని రష్యా, చైనాలు వీటో చేశాయి. సిరియా విషయాల్లో అమెరికా ప్రతిపాదిత జోక్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందరూ తీవ్రంగా వ్యతిరేకించడం, రష్యా, ఇతర బ్రిక్‌ దేశాలు తీసుకున్న కఠిన వైఖరి కారణంగా మాత్రమే (G-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా) భారత్‌ సిరియాలో అమెరికా సైనిక జోక్యాన్ని వ్యతిరేకించింది. అమెరికా జాతీయ భద్రతా సంస్థ భారత్‌పై నిఘా, గూఢచర్యానికి పాల్పడిన విషయాన్ని ఒబామాతో జరిగిన సమావేశంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రస్తావించిన దాఖలాలు లేవు. స్నోడెన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నిఘాలో భారత్‌ ప్రధాన లక్ష్యంగా ఉంది. సేకరించిన మొత్తం డేటా పరిమాణాన్ని బట్టి చూస్తే ఐదో స్థానంలో ఉంది. అమెరికాతో పెరుగుతున్న సైనిక సహకారం కీలకమైన రక్షణ, సాయుధ బలగాల వ్యవస్థల్లోకి అమెరికా చొరబాటుకు వీలు కల్పిస్తుందని విమర్శకుల భావన. ఇది భారతదేశ సార్వభౌమాధికారం, స్వతంత్ర విదేశాంగ విధానం, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిపై తీవ్రమైన పర్యవసానాలు కలగజేస్తుంది.

భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలు(Trade Relations) – పరిశీలన:
ఆసియా ఖండంలో అమెరికా వ్యాపారాలకు భారత దేశమే ప్రధాన కేంద్రంగా మారింది. అమెరికా దృష్టిలో భారీ స్థాయిలో వినియోగదారులు ఉన్న మార్కెట్ గా భారత్ గోచరిస్తోంది.  అమెరికాకు చెందిన ప్రైవేటు రంగం సంస్థలు భారత్ లో రాబోయే దశాబ్ద కాలంలో 500 బిలియన్ డాలర్ల  వ్యాపార లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. గత రెండేళ్లలో అమెరికాతో 8 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ కాంట్రాక్టులపై సంతకాలు చేశారు. మరో 5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు సంతకాలకు సిద్ధంగా ఉన్నాయి. ఇరు దేశాల ద్వైపాక్షిక పెట్టుబడుల్లో తగినంత పురోగతి నమోదవుతోంది. అమెరికా పెట్టుబడిదారుల విదేశీ పెట్టుబడులకు అనుకూలమైన మొదటి పది దేశాల జాబితాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న, అనువైన వనరులు గల భారతదేశం కూడా స్థానం సంపాదించింది. అదే విధంగా భారతదేశంలోని పెట్టుబడిదారుల్లో సైతం విదేశీ పెట్టుబడులకు అమెరికా అనువైన దేశమనే విశ్వాసం బలీయంగా ఉంది. అమెరికాలో భారతదేశ పెట్టుబడిదారులు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారు. అమెరికాలో 17 బిలియన్ డాలర్ల విలువైన భారత దేశ కంపెనీల పెట్టుబడులు ఉన్నాయి. ఈ పెట్టుబడుల వల్ల అమెరికాలో 81,000 ఉద్యోగావకాశాలు సృష్టించబడ్డాయి.
అటు అమెరికాలోనూ, ఇటు భారత్ లోనూ పెట్టుబడులు పెరగాలంటే ఇరు దేశాల్లోనూ పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంపొందాలి. ఈ విషయంలో రాజకీయ చొరవ తప్పనిసరి. దీనికి దేశాధినేతల మద్య ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం చాలా అవసరం. దీనితో పాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అంగీకారం కుదిరేందుకు తగిన చర్చలు జరగాలి.  ఇటీవల భారతదేశం ప్రవేశపెట్టిన నూతన వస్తు తయారీ విధానం పట్ల అమెరికా పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈమధ్య కాలంలో పెట్టుబడులు, వాణిజ్య వర్తక లావాదేవీల విషయంలో అమెరికా, భారత్ ల మధ్య సానుకూల పురోగతి నమోదవుతోంది. దీర్ఘ కాలంలో విస్తృతమైన, పటిష్టమైన, ఆర్థిక, వర్తక సంబంధాలు మరింత అభివృద్ధికి మెరుగైన అవకాశాలు మెండుగా ఉన్నాయి.

భారత్ – అమెరికా సంబంధాలు – అణు ఒప్పందం అనంతర పరిణామాలు :
2005లో భారత్ – అమెరికాల మధ్య పౌర అణు ఒప్పందం కుదిరిన తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగా బలపడ్డాయి. ఈ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని భావించారు. అయితే 2008 నాటి ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఇరు దేశాల మధ్య సంబంధాలను బలపడకుండా అడ్డుపడ్డాయి. అటు అమెరికా ఆర్థిక పరిస్థితి దిగజారడం, మాంద్యం ప్రభావం ప్రపంచ దేశాలపై పడటంతో పాటు ఇటు భారత్ తీసుకొచ్చిన అణు పరిహార చట్టం, పాకిస్థాన్ పట్ల అమెరికా అనుకరిస్తున్న మిత్ర వైఖరి వెరసి ఇరు దేశాల మధ్య బంధం బలపడేందుకు అవకాశం కలుగలేదు. దీనికితోడు అమెరికా, భారత్ రెండూ కూడా సంబంధాలను మరింత పటిష్టం చేసుకునే దిశలో ఎటువంటి ప్రయత్నం చేయలేదు.

భారత్ –అమెరికా సంబంధాలు చారిత్రక నేపథ్యం:
భారత్ అమెరికా సంబంధాలు భారత్ - చైనా యుద్ధ కాలం నుంచి మొదలయ్యాయి. అప్పటికి ప్రపంచ దేశాలు సోవియట్ యూనియన్, అమెరికాలలో ఏదో ఒక పక్షం వైపు చేరి ప్రపంచం ద్విధ్రువాలుగా విడిపోయి ఉంది. కానీ భారతదేశం ఏ కూటమిలో చేరకుండా స్వీయ నిర్ణయాధికారం, సార్వభౌమాధికారం ప్రాతిపదిక కలిగిన అలీన విధానం అనుసరిస్తోంది. చైనా దురాక్రమణ సమయంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అలీన విధానానికి భంగం వాటిల్లుతుందని తెలిసి కూడా తప్పనసరి పరిస్థితుల్లో అమెరికా సాయాన్ని అర్థించారు. సామ్యవాద భావజాలం ప్రభావంతో ప్రణాళికలు కొనసాగిస్తున్న భారత్ కు తోడ్పాటునందించేందుకు తొలిదశలో అమెరికా తటపటాయించింది. అయితే కమ్యునిజం (సోవియట్ యూనియన్) ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయటానికి భారత్ కు సాయమందించడానికి అమెరికా ముందుకొచ్చింది. ఆసియాలో కమ్యునిస్టులకు (చైనా) చెక్ పెట్టేందుకు భారత్ ను ఉపయోగించుకోవాలని అమెరికా భావించింది. అందుకే మనదేశం పట్ల కాస్త అపనమ్మకం ఉన్నప్పటికీ స్నేహ హస్తం చాచింది. భారీగా ఆయుధాలు సరఫరా చేసింది. దీంతో చైనా వెనక్కి తగ్గింది. తర్వాత భారత్ కరువుతో విలవిల్లాడుతుంటే అమెరికా బియ్యం సరఫరా చేసి తోడ్పాటునందించింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అనంతరం ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి అమెరికా అగ్రరాజ్యంగా ఎదిగింది. ఈ సమయంలో భారత్ పూర్తిగా అమెరికా వైపు మొగ్గుచూపింది. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి.
తొలిదశలో ఇరు దేశాల మధ్య సంబంధాలు అనుమానాలతో మొదలయ్యాయి. క్రమంగా పరస్పర విశ్వాసం ప్రాతిపదికగా కొనసాగుతున్నాయి. ద్విధ్రువ ప్రపంచం నుంచి ఏక ధృవ ప్రపంచ నాటికి భారత్ అమెరికాల మధ్య సంబంధాలు మరింత విస్తృతమయ్యాయి. అయితే ఈ క్రమంలో భారత్ అటు రష్యాకు, ఇటు చైనాకు దూరమవుతూ వస్తోంది. అమెరికాతో సంబంధాలు బలోపేతం చేసుకునే పనిలో స్వీయ ప్రయోజనాలకు, భారత సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 
Published date : 09 Nov 2013 05:46PM

Photo Stories