ఆఫ్రికాలో భారత ప్రధాని వ్యూహాత్మక పర్యటన
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన రెండేళ్ల పాలనా కాలంలో 42 దేశాల్లో పర్యటించారు. అనేక అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. ఏ దేశానికి వెళ్లినా ఆయనకు అపూర్వ స్వాగతం లభిస్తోంది. వేదిక ఏదైనా ‘ఉగ్రవాదాన్ని అరికట్టాలనే’ సందేశాన్ని మోదీ ప్రపంచ దేశాల ముందు ఉంచుతున్నారు. దీంతోపాటు ఆయన వివిధ అంశాలకు సంబంధించి అంతర్జాతీయ సమాజ మద్దతును కూడగట్టడంలో సఫలీకృతులయ్యారు. తాజాగా ప్రధాని జరిపిన ఆఫ్రికా పర్యటన కూడా భారత్ ప్రయోజనాలకు ఊతంగా నిలవనుంది.
భారత ప్రధానమంత్రి గత రెండేళ్ల విదేశాంగ విధానాన్ని పరిశీలిస్తే ఉగ్రవాద నిర్మూలన ప్రాధాన్యాంశంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. అదే సమయంలో ఆర్థిక మాంద్య పరిస్థితుల్లోనూ భారత్‌ను గణనీయ శక్తిగా నిలిపేందుకు మోదీ వ్యూహాత్మక విదేశాంగ విధానాన్ని అవలంబిస్తున్నారు. విదేశీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, పొరుగు దేశాలతో మైత్రి, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలకు సంబంధించి.. అరేబియన్, యూరప్, అమెరికా, దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లో మోదీ జరిపిన పర్యటనలు, అనుసరించిన విధానాలు దేశ ప్రతిష్టను పెంచేవిగా ఉన్నాయి. ఈ క్రమంలో అణు సరఫరా దేశాల బృందం(ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వానికి మెజారిటీ దేశాలు భారత్‌కు మద్దతు ప్రకటించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడంలో చాలా వరకు మోదీ విజయవంతమయ్యారు.
విదేశీ పర్యటనలు - ప్రాధాన్యతలు
- ప్రధాని నరేంద్ర మోదీ 51 (యూఎన్‌వో సమావేశాలతో సహా) విదేశీ పర్యటనలు చేశారు. అత్యధికంగా అమెరికాలో నాలుగుసార్లు పర్యటించారు.
- అఫ్గానిస్తాన్, ఫ్రాన్‌స, నేపాల్, రష్యా, సింగపూర్, ఉజ్బెకిస్తాన్‌ల్లో రెండు సార్లు పర్యటించారు.
- నరేంద్ర మోదీ ప్రధానిగా మొట్టమొదటిసారి భూటాన్(2014 జూన్ 16-17)లో పర్యటించారు.
- మోదీ ప్రధానిగా పాల్గొన్న మొదటి అంతర్జాతీయ సదస్సు.. బ్రెజిల్‌లో జరిగిన ఆరో బ్రిక్స్ సదస్సు (జూలై 13-16, 2014)
నరేంద్ర మోదీ తాజాగా ఐదు రోజుల పాటు నాలుగు ఆఫ్రికా దేశాల్లో పర్యటించారు.
- మొజాంబిక్ (జూలై 7)
- దక్షిణాఫ్రికా (జూలై 8-9)
- టాంజానియా (జూలై 10)
- కెన్యా (జూలై 11)
మోదీ ఆఫ్రికా పర్యటనలో కీలకాంశాలు
- ఉగ్రవాదం నిర్మూలన
- ఆహార భద్రత
- ‘భారత్‌లో తయారీ’కి సంబంధించిన పెట్టుబడుల ఆకర్షణ (ఫారన్ ఇన్వెస్టిమెంట్ ఫర్ మేక్ ఇన్ ఇండియా)
- అంతర్జాతీయ భద్రత.
ప్రాధాన్యత 2015 అక్టోబర్‌లో న్యూఢిల్లీలో మూడో భారత్ - ఆఫ్రికా దేశాల సదస్సు జరిగింది. అందులో 41 ఆఫ్రికా దేశాల నుంచి 51 మంది నేతలు పాల్గొన్నారు. పలు కీలక అంశాలపై చర్చించారు. ఆ చర్చలకు కొనసాగింపుగా భారత రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ఏడాది జూన్‌లో ఘనా, ఐవరీకోస్ట్, నమీబియాల్లో; భారత ఉపరాష్ర్టపతి హమీద్ అన్సారీ (మే-జూన్ ) మొరాకో, ట్యూనిషియా దేశాల్లో పర్యటించారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆఫ్రికాలోని నాలుగు తూర్పు తీర దేశాల్లో వ్యూహాత్మక పర్యటన జరిపారు.
- ఈ పర్యటనల్లో భారత సంతతి ప్రజలపై దృష్టి కేంద్రీకరించారు.
- ఆఫ్రికాకు తూర్పున, భారత్‌కు దక్షిణ, పశ్చిమాన ఉన్న హిందూ మహాసముద్రంపై భారత్ దృష్టి పెట్టింది.
- వ్యూహాత్మక, సాంస్కృతిక బంధాలను బలోపేతం చేయడం.
- ఆఫ్రికా ఒక చీకటి ఖండమనేది ఒకప్పటి మాట. నేడు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక వేదికగా ఉంది. దీన్ని భారత్ కూడా గుర్తించింది.
- ఇందులో భాగంగానే మోదీ వ్యూహాత్మకంగా ఆఫ్రికా దేశాల్లో పర్యటించారు.
మొజాంబిక్
- జూలై 7న మొజాంబిక్ రాజధాని మపుటో చేరుకున్న మోదీ ఆ దేశ అధ్యక్షుడు ఫిలిప్ న్యూసితో సమావేశమయ్యారు.
- ఇరుదేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిగాయి.
- మొజాంబిక్‌ను ‘ఆఫ్రికా-ప్రవేశద్వారం’ గా మోదీ అభివర్ణించారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఉగ్రవాదమేనని మోదీ పేర్కొన్నారు.
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి నేరాలకు, ఉగ్రవాదానికి దగ్గరి సంబంధాలున్నాయని, వాటిని నిర్మూలించాలని పిలుపునిచ్చారు.
ఒప్పందాలు
- మొజాంబిక్ నుంచి భారత్‌కు పప్పుధాన్యాల దిగుమతికి సంబంధించి దీర్ఘకాలిక ఒప్పందం (2020-21) కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా మొజాంబిక్ తొలి ఏడాది లక్ష టన్నుల పప్పుధాన్యాలను భారత్‌కు ఎగుమతి చేయనుంది. దీన్ని వచ్చే నాలుగేళ్ల నాటికి రెండింతలు (రెండు లక్షల టన్నులు) పెంచాలని నిర్ణయించారు. దీంతో భారత్ ఎదుర్కొంటున్న పప్పుధాన్యాల కొరత కొంత వరకు తీరనుంది.
- యువజన, క్రీడాంశాలకు సంబంధించి అవగాహనా ఒప్పందం.
- హిందూ మహాసముద్ర నౌకా వాణిజ్యంలో ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లను ఎదుర్కోవడానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.
భారత్ సహాయం
- 30 ‘ఎస్‌యూవీ’ వాహనాలను భారత్ మొజాంబిక్‌కు అందజేసింది. దీంతో ఇంతకుముందు మొజాంబిక్‌కు భారత్ ఇస్తానన్న 45 లక్షల డాలర్ల (రూ. 30 కోట్లు) సహాయం ముట్టినట్లు విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.
- మొజాంబిక్ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా భారత్ ఎయిడ్‌స నివారణ ఔషధాలు, ఇతర అత్యవసర ఔషధాలను విరాళంగా ఇవ్వనుంది.
- ఆ దేశ రక్షణ దళాల సామర్థ్యాన్ని పెంపొందించడానికి సహాయం చేయడంతో పాటు శిక్షణను అందించనుంది.
దక్షిణాఫ్రికా
- ప్రధాని నరేంద్రమోదీ దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా (జూలై 8-9) డర్బన్, జొహన్నెస్‌బర్‌గల్లో పర్యటించారు.
- దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
- అంతర్జాతీయ వేదికలపై, 48 దేశాలు సభ్యులుగా గల ఎన్‌ఎస్‌జీ (న్యూక్లియర్ సప్లయర్‌స గ్రూప్)లో భారత్ సభ్యత్వానికి మద్దతు తెలిపినందుకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
- దక్షిణాఫ్రికా-భారత్ కలిసి ఆయుధాల తయారీకి సిద్ధం కావాలని మోదీ పిలుపునిచ్చారు.
- గనులు, రసాయనాలు, ఔషధాలు, తయారీ, పునరుత్పాదక ఇంధన, సమాచార-సాంకేతిక (ఐటీ) రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేసేందుకు అనేక అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
- చిన్న పరిశ్రమల ఏర్పాటులో దక్షిణాఫ్రికాకు భారత్ తన అనుభవాన్ని అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
- 2017-19 కాలానికి ‘హిందూ మహాసముద్ర తీర దేశాల సంఘం’ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్న దక్షిణాఫ్రికాకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
- భారత్ నేతృత్వంలో ‘పర్యావరణ పరిరక్షణ లక్ష్యం’తో అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలకు దక్షిణాఫ్రికా మద్దతు తెలిపింది.
- ఐబీఎస్‌ఏ, బ్రిక్స్, జీ-20 వంటి వేదికలపై పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
- ఐటీ, కళలు, సంస్కృతి, పర్యాటకం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సంబంధాల విస్తరణకు ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి.
- భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐల) నిబంధనలను ఇటీవలి సవరించిన విషయాన్ని గుర్తు చేస్తూ, భారత్‌కు ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా దక్షిణాఫ్రికా వ్యాపారవేత్తలను మోదీ ఆహ్వానించారు.
టాంజానియా
- జూలై 10న మోదీ టాంజానియాలో పర్యటించారు.
- టాంజానియా అధ్యక్షుడు జాన్ పాంబే జోసెఫ్ మగుఫులితో ఆర్థిక, వాణిజ్య సహకారాలపై చర్చించారు.
- అనంతరం ఇరు దేశాల నేతలు సంయుక్త విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
- అభివృద్ధి ప్రాధాన్యతలను చేరుకోవడంలో ఇరు దేశాల మధ్య సహకారం.
- రక్షణ, భద్రతాపరమైన అంశాలతో పాటు ప్రధానంగా నౌకాయాన రంగంలో భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
భారత్ సహాయం- ఒప్పందాలు
- టాంజానియాకు భారత్ 9.20 కోట్ల డాలర్ల (సుమారు రూ. 616.40 కోట్లు) రుణ సహాయం అందించనుంది.
- టాంజానియాలోని 17 నగరాల్లో నీటి సరఫరా పథకాలకు సంబంధించి మరో ఐదు కోట్ల డాలర్ల (సుమారు రూ.335 కోట్లు) రుణం ఇవ్వడానికి భారత్ అంగీకారం.
- ఆ దేశానికి అవసరమైన ఔషధాలు, వైద్య పరికరాల సరఫరాకు సంసిద్ధత.
- జల వనరుల నిర్వహణ, అభివృద్ధిపై ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందం.
- జాంజిబార్‌లో వృత్తి విద్యా శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం.
- దౌత్య అధికారిక పాస్‌పోర్టులపై టాంజానియా నుంచి భారత్‌కు వచ్చేవారికి వీసా మినహాయింపు
- భారత జాతీయ చిన్న తరహా పరిశ్రమల సంస్థ, టాంజానియా చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థల మధ్య అవగాహన ఒప్పందం(ఎంవోయూ).
ఇతర ప్రాధాన్యత అంశాలు
- వ్యవసాయ, ఆహార భద్రతా రంగాల్లో సహకారాన్ని విస్తృతం చేసుకోవడం.
- సహజ వాయు రంగంలో ఇరు దేశాలు కలిసి పనిచేయడం.
- పరిశ్రమల మధ్య సంబంధాల ద్వారా పెట్టుబడుల్లో భాగస్వామ్యాన్ని పెంచుకోవాలనే నిర్ణయానికి ఇరు దేశాధినేతలు వచ్చారు.
- భారత్ చొరవతో ఏర్పాటైన అంతర్జాతీయ సౌర కూటమిలో కీలక భాగస్వామిగా టాంజానియాకు భారత్ ఆహ్వానం.
- నౌకల రాకపోకలకు ఉపయోగపడే పటాలను ప్రధాని టాంజానియాకు అందించారు.
- సాధ్యమైనంత త్వరగా భారత్‌కు రావాల్సిందిగా టాంజానియా అధ్యక్షుణ్ని మోదీ ఆహ్వానించారు.
కెన్యా
- మోదీ ఐదు రోజుల ఆఫ్రికా దేశాల పర్యటనలో చివరిగా జూలై 11న కెన్యాలో పర్యటించారు.
- కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యట్టాతో భారత ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
ఒప్పందాలు-ఇతర అంశాలు
- రక్షణ, భద్రత, బహుళ పన్ను నివారణ తదితర రంగాల్లో సహకారమే లక్ష్యంగా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి.
- నైరోబి విశ్వవిద్యాలయంలోని గాంధీ గ్రంథాలయానికి 10 లక్షల డాలర్ల విరాళాన్ని మోదీ ప్రకటించారు.
- హిందూ మహాసముద్రంలో సముద్రపు దొంగల బెడద తొలగించి, అందరికీ నౌకా రవాణా స్వేచ్ఛను కల్పించేందుకు కృషి చేయాలని ఆ దేశాన్ని భారత్ కోరింది.