Skip to main content

భారత్ – చైనా ద్వైపాక్షిక సంబంధాలు

భారత్ ప్రధాని మన్మోహన్ సింగ్ 2013 అక్టోబర్ 22-24 తేదీలలో చైనాలో పర్యటించారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. చైనా ప్రధాని లి కెకియాంగ్ తో భారత ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో అనేక అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. శాంతి, సుస్థిరతల కోసం వ్యూహాత్మక, సహకార భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ సమావేశంలో ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. శాంతియుత సహజీవనానికి సంబంధించిన ఐదు సూత్రాలు (పంచశీల) అనుసరించడం, ఒకదేశంతో రెండో దేశం ఆందోళనలు, ఆంకాంక్షలు విషయంలో పరస్పర గౌరవం, సున్నితత్వం ప్రదర్శించడం వంటి చర్యల వల్ల ఇది సాధించాలని నిర్ణయించాయి.

ఈ పర్యటనలో భారత్ చైనాలు 9 ఒప్పందాలు చేసుకున్నాయి. సరిహద్దు తగాదాల విషయంలో రెండు దేశాలలో ఏదీ అవతలివారిపై మిలిటరీ సామర్ధ్యాలను ప్రయోగించరాదని వాగ్దానం చేయడంతో పాటు అవతలి వారి సరిహద్దు పెట్రోలింగ్ పై నిఘా పెట్టకూడదని ఇరు పక్షాలు అంగీకరించాయి. చైనా ఇండియాతో రక్షణ, సరిహద్దు ఒప్పందాలకే పరిమితం అయింది.

భారత ప్రధాని చైనా అధికారిక పర్యటనలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, (Agreements / MoUs):
  1. సరిహద్దులో శాంతి, సుస్థిరతలకు విశ్వాసాన్ని కల్పించే చర్యల్లో భాగంగా సరిహద్దు రక్షణ సహకారం ఒప్పందం జరిగింది.
  2. తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో భాగంగా నలంద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి సహకారం కోసం ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
  3. రెండు దేశాల గుండా ప్రవహించే నదులపై సహకారం పెంచుకోవడానికి ట్రాన్స్ బోర్డర్ నదుల అవగాహన ఒప్పందం పై ఇరు దేశాలు సంతకం చేశాయి.
  4. రెండు దేశాల మధ్య 2015 వరకు సాంస్కృతిక వినిమయాల కార్యక్రమం (Cultural Exchanges Programme 2013-15) పై అంగీకారం కుదిరింది
  5. రోడ్డు రవాణా, రంగంలో సహకారంపై ఇరుదేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
  6. భారతదేశంలో చైనా విద్యుత్ పరికరాల సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఇరుదేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
  7. ఢిల్లీ - బీజింగ్, బెంగళూరు - చెంగ్డు, కోల్ కత్తా – కన్మింగ్ ల మధ్య సోదరి నగర (sister cities) సంబంధాలు ఏర్పాటుకు ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది.
భారత్ – చైనా దేశాల వ్యూహాత్మక సహకార భాగస్వామ్యం, భవిష్యత్ అభివృద్ధి, దార్శనికతపై ఇరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

సంయుక్త ప్రకటన – ముఖ్యాంశాలు
ఆర్థిక రంగంలో సహకారం:

సహకారం, పరస్పర ప్రయోజనాలు, నూతన ఆర్థిక సంబంధాలనేర్పరచుకోవడానికి ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నాయని అధినేతలు గుర్తించారు. ఇప్పటికే అంగీకరించిన రంగాల్లో ప్రత్యేక ప్రాజెక్టులు, కొత్తగా చేపట్టిన కార్యకలాలపై 2013 నవంబర్ లేదా డిసెంబర్ లో నిర్వహించనున్న వ్యూహాత్మక ఆర్థిక చర్చలు (Strategic Economic Dialogue) ద్వారా నెరవేర్చుకుంటామని నేతలు అభిప్రాయపడ్డారు. ఇది రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంచుకోవాడనికి, వాణిజ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తోడ్పడుతుంది. ఈ లక్ష్యాలను అమలు చేయడానికి ఇరుదేశాలు ఏర్పాటు చేసుకున్న ఎకానామికల్ గ్రూపులు వాటికి ఇచ్చిన ఆదేశాలను సత్వరం అమలు చేస్తాయి. ద్వైపాక్షిక ప్రాంతీయ వాణిజ్య ఒప్పందానికి (Regional Trade Arrangement-RTA) ఉన్న అవకాశాలను పరిశీలించాలని రెండు పక్షాలు అంగీకరించాయి. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం Regional Comprehensive Economic Partnership (RCEP) పై సంప్రదింపుల ద్వారా ఇరు పక్షాలు సమీక్షించనున్నాయి. రెండు దేశాల కంపనీలు క్లస్టర్ పద్ధతి ద్వారా పారిశ్రామిక మండళ్ళు ఏర్పాటు చేసి ఒప్పందాలు చేసుకోవాలనుకుంటున్నాయి. చర్చల ముగింపులో జరిగిన ఆర్థిక ఒప్పందాలు 2013 మే నుంచి ప్రారంభమవుతాయి.

బంగ్లాదేశ్, చైనా, ఇండియా, మయన్మార్ (BCIM) ఆర్థిక కారిడార్ పై అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేయడానికి 2013 మేలో రెండు దేశాల మధ్య ఏర్పడిన అంగీకారాన్ని కొనసాగించనున్నారు. దీనికి కోసం చైనా అధికార బృందం భారత్ లో పర్యటించడం సానుకూల అంశంగా చెప్పవచ్చు. ఆర్థిక కారిడార్ కు సంబంధించిన భావనలు, క్రమ పద్ధతి తదితర అంశాలపై చర్చలు జరుగుతాయి. ఈ ప్రయత్నంపై భారత్, చైనా పరస్పరం చర్చలు కొనసాగించనున్నాయి. బీసీఐఎం ఆర్థిక కారిడార్ (BCIM Economic Corridor) ను రూపొందించడంపై ప్రత్యేక కార్యక్రమాలను అధ్యయనం చేయడానికి 2013 డిసెంబర్ లో మొట్టమొదటి BCIM సంయుక్త అధ్యయన సమూహం(BCIM Joint Study Group) ఆధ్వరంలో సమావేశం నిర్వహించనున్నారు.

సరిహద్దు రక్షణ సహకారం ఒప్పందం:
భారత్- చైనా సరిహద్దు సమస్య పరిష్కారానికి ఏర్పడిన ప్రత్యేక కమిటీ ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని రెండు దేశాల నేతలు ప్రోత్సహించారు. రెండు దేశాలమధ్య సంబంధాలు మెరుగు పడడానికీ, అభివృద్ధికి సరిహద్దులో శాంతి, సుస్థిరతలే ముఖ్యకారణమని రెండు దేశాధినేతలు ఉద్ఘాటించారు. పరస్పర, సమాన భద్రత సూత్రం ప్రాతిపదికగా గతంలో 1993, 1996, 2005 సంవత్సరాల్లో ఒప్పందాలు జరిగాయి. వీటి ఆధారంగా శాంతి నెలకొల్పడానికి సరిహద్దు రక్షణ సహకార ఒప్పందం (Border Defense Cooperation Agreement) జరిగింది. మన్మోహన్ సంతకం చేసిన ఒప్పందాలలో BDCA ముఖ్యమైందిగా కనిపిస్తోంది. సరిహద్దు రక్షణ సహకార ఒప్పందాన్ని (Border Defense Cooperation Agreement) రెండు దేశాల ప్రధానులు బాగా చర్చంచిన తర్వాత మాత్రమే అంగీకరించారు. ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు..
  1. దేశ వాస్తవాధీన రేఖ (Line of Actual Control -LAC) వెంబడి జరిపే పెట్రోలింగ్ పైన నిఘా పెట్టకూడదు లేదా వెంబడించకూడదు (not to tail).
  2. వాస్తవాధీన రేఖకు సంబంధించి అనుమానాలు ఉన్న చోట్ల పరస్పరం వివరణలు కోరాలి. ఇప్పటికే ఏర్పడిన వివిధ యంత్రాంగాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి.
  3. ఏ ఒక్కరు అవతలి పక్షంపై తమ సైనిక సామర్ధ్యాన్ని ప్రయోగించకూడదు. బలప్రయోగం చేయడం గానీ, చేస్తానని బెదిరించడం గానీ చేయకూడదు.
  4. సైనిక రంగంలో ఇరు పక్షాల మధ్య విశ్వాసం నెలకొల్పే చర్యలు తీసుకోవాలి.
  5. ఇరు దేశాల సైన్యాల ప్రధాన కార్యాలయాల మధ్య హాట్ లైన్ నెలకొల్పాలి..
  6. 4000 కి.మీ పొడవున ఉన్న వాస్తవాధీన రేఖ ప్రతి సెక్టార్ లోనూ సరిహద్దు రక్షణ బలగాలు కలిసి మాట్లాడుకోడానికి ప్రదేశాలను (meeting sites) ఏర్పాటు చేయాలి.
గత కొన్ని నెలలుగా లడఖ్ లోని డెప్సాంగ్ లోయలో దౌలత్ బేగ్ ఒల్డి సెక్టార్ లో చైనా సైనికులు చాలాసార్లు చొచ్చుకు వచ్చినట్లు భారత్ ఆరోపించిన నేపధ్యంలో BDCAకు ప్రాధాన్యత ఏర్పడింది. నమ్మకం, విశ్వాసం పెంచడంలో రక్షణ ఎక్చేంజెస్ (పరస్పర వినిమయం), సైనిక విన్యాసాలు ప్రధానమైనవని ఇరు పక్షాలు గుర్తించాయి. 2013 నవంబర్ లో జరగనున్న ఉగ్రవాద వ్యతిరేక విన్యాసాలను పరస్పర అవగాహనతో జరుపుకోవడానికి ఉభయ ప్రభుత్వాలు ఆకాంక్షను వ్యక్తం చేశాయి.

ఇరు దేశాలను దాటి ప్రవహించే నదులపై అంగీకారం:
ఇరు దేశాల సరిహద్దుల గుండా ప్రవహించే నదుల (trans-border rivers) నిర్వహణలో చైనాకి ఉన్న వనరులను, చైనా చేస్తున్న ప్రయత్నాలను భారతదేశం శ్లాఘించింది. సరిహద్దు గుండా ప్రవహించే నదుల విషయంలో సహకరించుకోవడానికి అవగాహన ఒప్పందం చేసుకోవాలని ఇరుదేశాలు స్వాగతించాయి. నిపుణుల స్థాయి యంత్రాంగం (Expert Level Mechanism) ద్వారా వరద, జలవనరుల సమాచారం, వాటి నిబంధనలు, అత్యవసర నిర్వహణపై కలిసి పనిచేయడం, ఉమ్మడి ప్రయోజనాల కోసం అభిప్రాయాలు పంచుకోవడానికి మరింత సహకారాన్ని అందించు కోవాలని ఇరు దేశాలు అంగీకరించాయి.

దేశాంతర సరిహద్దు నదులు (trans-border rivers), సహజ వనరులు, పర్యావరణం పరివాహక దేశాల సామాజిక – ఆర్థిక అభివృద్ధి అత్యంత విలువైన సంపదలుగా ఇరు దేశాలు ఆమోదించాయి. రెండు దేశాలను దాటి ప్రవహించే నదుల విషయంలో సహకారం, పరస్పర విశ్వాసం, కమ్యునికేషన్ లను పెంపొందించడమే కాకుండా, సహకార భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవాలని రెండు పక్షాలు అంగీకరించాయి. భారత్ – చైనాల మధ్య ట్రాన్స్ బోర్డర్ నదులపై నిపుణుల ప్రాధాన్యతను ఇరు పక్షాలు ప్రశంసించాయి. వరద సమయంలో ప్రతీ ఏటా జూన్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు బ్రహ్మపుత్ర నదిలో జల స్థాయి సమాచారాన్ని భారత్ తో పంచుకునేందుకు చైనా అంగీకరించింది. అయితే దీనిని 2014 మే 15 నుంచే అమలు చేసేందుకు చైనా అంగీకరించడంపై భారత్ హర్షం వ్యక్తం చేసింది.

సాంస్కృతిక రంగంలో సహకారం:
సాంస్కృతిక సహకారంలో భాగంగా ప్రజల మధ్య సంబంధాలు, పరస్పరం ఇచ్చి పుచ్చుకునే సదుపాయం ఉండాలి. కళలు, సంస్కృతి, సాంస్కృతిక వారసత్వం, యువజన వ్యవహారాలు, విద్య, క్రీడలు, ప్రసార మాధ్యమం, ప్రచురణలు, మాస్ కమ్యునికేషన్ల రంగాల్లో ఇచ్చిపుచ్చుకునేందుకు 2013-2015 సంవత్సరాల్లో సాంస్కృతిక వినిమయ కార్యక్రమం (Program of Cultural Exchange ) పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమానికి ప్రాథమికంగా పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన పూర్తిచేసిన సోదరి నగర సంబంధాల ద్వారా మద్దత్తునిస్తారు.

2014 సంవత్సరాన్ని స్నేహపూర్వక పరస్పర వినిమయ సంవత్సరం(Year of Friendly Exchanges) గా గుర్తించడంతో పాటు శాంతియుత సహజీవనానికి పంచ సూత్రాలు (పంచశీల) అవసరమని గుర్తించారు. పంచశీల 60వ వార్షికోత్సవం సందర్భంగా సముచితమైన రీతిలో స్మారకోత్సవంపై భారత్, చైనా దేశాలు మయన్మార్ తో చర్చించనున్నాయి.

ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో సంయుక్త సహకారం:
రెండు దేశాల అభివృద్ధిపై గణనీయమైన ప్రభావం చూపించే ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన రాజకీయ, ఆర్థికాంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. వాతావరణ మార్పు, అంతర్జాతీయ ఉగ్రవాదం, ఆహారభద్రత, ఇంధన భద్రత వంటి ప్రపంచ సమస్యలపై ఉమ్మడిగా కృషిచేయడానికి, తగిన అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వ్యవmdmస్థను ఏర్పాటు చేయడానికి రిక్ (రష్యా-ఇండియా-చైనా), బ్రిక్స్(BRICS), జి-20 వంటి బహుళపక్ష వేదికల్లో సహకారం, సమన్వయాలను పటిష్టం చేయాలని రెండు దశాలు అంగీకరించాయి. దేశాల మధ్య పరస్పర ఆందోళనలు, ఆసక్తులకు న్యాయబద్ధమైన విలువను కల్పించడానికి అంగీకరించాయి. వివిధ సమస్యలను క్రమబద్ధంగా ఔచిత్యంతో పరిష్కరించడానికి తగిన యంత్రాలను ఏర్పాటు చేయడానికి, చర్చలు జరపాలని ఇరు పక్షాలు ఆకాంక్షించాయి. చైనా ప్రభుత్వ ఘన స్వాగతం, ఆతిథ్యాన్ని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రశంసించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ చైనా ప్రధాని లి కెకియాంగ్ ను భారతదేశం పర్యటనకు ఆహ్వానించారు.

కొలిక్కి రాని వీసా ఒప్పందం:
వీసా నిబంధనలను పరస్పరం సరళీకరించుకోవడానికి తగిన ఒప్పందం కోసం చైనా ఎదురు చూసింది. కానీ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన ఆర్చరీ క్రీడాకారులకు ‘స్టేపుల్డ్ వీసా’ లు ఇవ్వడం నచ్చని భారత్ అందుకు అవకాశం ఇవ్వలేదు. వీసా నిబంధనలను సరళీకరించడం పైన ఎలాంటి ఒప్పందమూ జరగలేదు. ఇరు దేశాల ప్రజలు స్వేచ్ఛగా పొరుగు దేశాన్ని సందర్శించడానికి వీలుగా వీసా నిబంధనలను సరళతరం చేయాలని గతంలో ఒక అంగీకారానికి వచ్చాయి. మన్మోహన్ పర్యటన సందర్భంగా ఈ అంశంపై తుది ఒప్పందం చేసుకోవాలని చైనా ఆశించింది. అయితే భారత్ అందుకు అవకాశం ఇవ్వలేదు. ఇటీవల చైనాలో జరిగిన ఆర్చరీ పోటీలకు అరుణాచల ప్రదేశ్ రాష్ట్రం నుంచి హాజరయిన ఇద్దరు క్రీడాకారులకు పూర్తి స్ధాయి వీసా కాకుండా ‘స్టేపుల్డ్ వీసా’ ఇవ్వడం దీనికి కారణం.

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కొంత భూభాగం తమదే అని చైనా వాదిస్తోంది. ఈ వాదనకు అనుగుణంగా అరుణాచల ప్రదేశ్ నుంచి వచ్చే ప్రయాణీకులకు పూర్తి స్ధాయి వీసాలు ఇవ్వనవసరం లేదనీ, వారు తమ దేశం వారే కనుక తాత్కాలిక వీసా ఇస్తే సరిపోతుందని చైనా భావిస్తుంది. కానీ అరుణాచల్ ప్రదేశ్ పూర్తిగా తమ భూభాగంగానే ఇండియా పరిగణిస్తున్నందున ఈ స్టేపుల్డ్ వీసా విధానం పట్ల ఇండియా ఆగ్రహంగా ఉంది. ఆర్చరీ క్రీడాకారులకు తాత్కాలిక వీసా ఇవ్వడానికి ప్రతిగా ‘వీసా సరళీకరణ’ ఒప్పందాన్ని ఇండియా వాయిదా వేసుకుంది.

జలవనరుల ఒప్పందం – సమీక్ష:
నీటి ఒప్పందం వల్ల మనకు జరిగే ప్రయోజనం ఏమీ లేదనే చెప్పాలి. ఇప్పటికే జూన్‌ నుంచి అక్టోబర్ వరకు బ్రహ్మపుత్ర వరద నీటి వివరాలను చైనా ఇంతవరకూ మనకు అందచేస్తోంది. ఈ ఒప్పందం వల్ల ఇంకో నెల ముందు నుంచి అంటే మే నుంచి అక్టోబర్ వరకు నీటి వివరాలు మనకు అందుతాయి. బ్రహ్మపుత్రపై చైనా నిర్మిస్తున్న ఆనకట్టల వల్ల మనకు జరిగే నీటి నష్టం ఈ వివరాలను తెలుసుకోవడం వల్ల ఆగిపోదు. నష్టాన్ని నివారించే ఒప్పందం కుదరలేదు.

సరిహద్దు రక్షణ సహకార ఒప్పందం- సమీక్ష
కుదిరిన తొమ్మిది ఒప్పందాలలో ‘సరిహద్దుల రక్షణ సహకార అంగీకారం’ అతి ప్రధానమైనది. సరిహద్దుల ఒప్పందం అంటే ఉభయ దేశాల మధ్య సరిహద్దు సమస్య పరిష్కారం అయిపోయిందని పొరపడకూడదు. అలాగే నదీ జలాలపై కుదిరిన ఒప్పందం కూడ మనకూ చైనాకూ మధ్య నదుల నీటి పంపిణీకి సంబంధించిందని భావించరాదు. సరిహద్దు భద్రతకు సంబంధించిన ఒప్పందం కానీ, జలవనరులపై ఒప్పందం కానీ ఈ సమస్యలను పరిష్కరించలేదు. ఈ ఒప్పందాలు పరిష్కారాలను తాత్కాలికంగా వాయిదా వేశాయి. ఉభయ దేశాల మధ్య ఉన్న సరిహద్దును ఉమ్మడిగా రక్షించాలన్నది సహకారపు ఒప్పందంలోని ప్రధాన అంశం. ఉభయ దేశాల సైనికులు లేదా సరిహద్దు భద్రతా దళాలు సరిహద్దురేఖ వద్ద ఎదురెదురుగా మోహరించే స్థితి ఏర్పడినప్పుడు ఇరు పక్షాలలో ఎవ్వరూ కాల్పులు జరపరాదని ఒప్పందంలో పేర్కొన్నారు. అనేక ఏళ్లుగా భారత-టిబెట్ సరిహద్దు సంరక్షక దళం చైనా సైనికులపై కాల్పులు జరిపిన ఘటన జరగలేదు. అందువల్ల కాల్పులు జరపరాదన్న ఒప్పందానికి మనవైపు నుంచి నిష్ప్రయోజనమే. ఈ ఒప్పందానికి మన ప్రభుత్వం విముఖతను వ్యక్తం చేయలేకపోవడానికి కారణం మనం కాల్పులు జరపడానికి సిద్ధంగా ఉన్నామనే అర్థంలో చైనా ప్రభుత్వం ప్రచారం చేస్తుంది.

చైనా అనేక ఏళ్లుగా నిరంతరం చొరబాట్లు జరుపుతోంది. 1962నాటి దురాక్రమణ తరువాత ఉభయ దేశాల భూభాగాల వాస్తవవాధీన (Actual Control) స్థితిని ఏకపక్షంగా నిర్ధారించింది చైనా ప్రభుత్వమే. అందువల్ల వాస్తవాధీన రేఖ ఏది? అనే విషయమై చైనా దళాలకు స్పష్టమైన అవగాహన ఉంది. కానీ చైనా దళాలు ‘రేఖ’ను దాటి మనవైపునకు చొరబడి వారాల తరబడి నెలల తరబడి తిష్ఠ వేస్తున్నాయి. ఈ చొరబాటు ఘటనలు జరిగినప్పుడల్లా అవగాహనా రాహిత్యం వల్ల మాత్రమే చైనా దళాలు ‘రేఖ’ను దాటి మనవైపునకు చొరబడుతున్నాయని భారత ప్రభుత్వమే చైనా తరఫున స్పష్టీకరణలనిస్తోంది. గత ఏప్రిల్‌లో లడక్‌లోని దీప్‌సింగ్ చరియలలోని ‘రాఖీనల్లా’ వాగు ప్రాంతంలోకి చొరబడిన చైనా సైనికులు 750 చదరపు మీటర్ల మన భూమిని కొత్తగా ఆక్రమించారు. నాలుగు వారాల తరువాత చైనా సైనికులు రేఖను దాటి తమ వైపునకు వెళ్లారు. కానీ ‘మనవైపున’ భూభాగం నుంచి మన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్-ఐటిబిపి కూడా ఉపసంహరించుకోవలసి వచ్చింది. ఇది చైనాకు అప్పుడు లభించిన వ్యూహాత్మక విజయం. సరిహద్దుల ఉమ్మడి రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడానికి మన ప్రభుత్వంపై ఒత్తడి తేవడానికి చైనా ఈ చొరబాటునకు పాల్పడిందని అప్పుడు ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ఇప్పుడు నిజమైంది.

సరిహద్దు అంటే 1962 దురాక్రమణ తరువాత చైనా ఏకపక్షంగా నిర్ధారించిన ‘వాస్తవ అధీన రేఖ’(Line of Actual Control). సరిహద్దు వివాదం పరిష్కారమయ్యే వరకు ఉభయ పక్షాల వారు రేఖను అతిక్రమించరాదని చొరబాట్లు జరపరాదని ఒప్పందం కుదుర్చుకోవడం మనకు కొంత మేలు. దానివల్ల సమస్య పరిష్కారం అయ్యేవరకు చైనీయులు ‘రేఖ’ను మళ్లీ మళ్లీ దాటకుండా నిరోధించవచ్చు. కుదిరిన ఒప్పందం ప్రకారం ఉభయ దేశాలు పరస్పరం దాడులు చేసుకొనడానికి సైన్యాన్ని ఉపయోగించరాదు. వాస్తవ అధీన రేఖ ప్రాంతంలో ఇదివరకే చైనా సైన్యాన్ని వ్యవస్థీకరించింది. సైనికులు, వాహనాలు, అవి ప్రయాణించేలా రోడ్లు సిద్ధమయ్యాయి. మనం రేఖ వద్ద అనుబంధ సాయుధ బలగాలను (ఐటిబిపి తప్ప) సైన్యాలను మోహరించలేదు. చైనాకు దీటుగా ఎప్పటికైనా ‘రేఖ’ వద్ద సైన్యాన్ని వ్యవస్థీకరించే కార్యక్రమానికి ఈ కొత్త ఒప్పందం అవరోధం కానుంది. చైనా వ్యూహాత్మక విజయంలోని ఇది మరో అంశం. ఒక దేశం సైనికులు గస్తీ తిరుగుతుండగా మరో దేశం సైనికులు వారిని అనుసరించ కూడదన్నది కొత్త ఒప్పందంలోని మరో మెలిక. చైనా సైనికులు నిరంతరం ‘రేఖ’ దాటి వచ్చి మనవైపున గస్తీ తిరిగి వెళ్తున్నారు. ఇంత వరకు ‘ఐటిబిపి’ చైనా సైనికులను అనుసరిస్తూ వారు తిరిగి వెళ్లేవరకు నిఘా పెట్టి ఉండేవి. ఇప్పుడు అది జరగకూడదు. 1990 వ దశకం ఆరంభం నుంచి చర్చలు జరుగుతున్నప్పటికీ సరిహద్దు వివాదం పరిష్కారం కాలేదు. ఇటీవలి కాలంలో ఏడాదికోసారి ఒక రోజుపాటు ఈ చర్చలు జరుగుతున్నాయి. అందువల్ల జింగ్‌పెంగ్ అన్నట్టు ఏడాదికో అడుగువేస్తూ వెయ్యిమైళ్లు నడవాలి. సరిహద్దు వివాదం పరిష్కారం కాదు, కాకపోవడంవల్ల చైనా ఆక్రమించిన మన భూమి వారి అధీనంలోనే ఉంటుంది. ఇదీ చైనా వ్యూహం. సరిహద్దు సమస్య పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా పరిష్కరించుకోవాల్సిన సమస్య.

Published date : 19 Nov 2013 06:12PM

Photo Stories