Skip to main content

ఉద్యోగ నియామక పరీక్షలకు ప్రిపరేషన్‌లో అనుసరించాల్సిన విధానాలేమిటి?

- వి.సుశీల, ఆర్.రవికుమార్, హైదరాబాద్.
Question
ఉద్యోగ నియామక పరీక్షలకు ప్రిపరేషన్‌లో అనుసరించాల్సిన విధానాలేమిటి?
ఉద్యోగ నియామక పరీక్షలకు ఖాళీలతో సంబంధం లేకుండా పోటీ లక్షల్లోనే ఉంటుందనేది నిస్సందేహం. అయితే ఎంత పోటీ ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. సందిగ్ధత వీడి, సన్నద్ధత దిశగా నడవాలని సూచిస్తున్నారు. పరీక్ష ఏదైనా ఔత్సాహికులు ముందుగా ప్రిపరేషన్‌కు మానసికంగా సిద్ధమవాలి. ఒత్తిడి అనే మాటకు తావివ్వకూడదు. పోటీ లక్షల్లో ఉన్నా పోస్ట్ సాధించాలనే గట్టి సంకల్పం, విజయం సాధించగలమనే నిండైన ఆత్మవిశ్వాసం అవసరం. అప్పుడే ఎలాంటి ఆటంకాలు ఎదురైనా, వాటిని అధిగమించగలరు. సంకల్ప బలంతో విజయం దిశగా దూసుకెళ్లగలరు.
  • అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ప్రధానం. సమయ పాలన విషయంలో కొందరు 'వారం ఆధారిత' విధానాన్ని అనుసరిస్తారు. ఒక వారంలో ఒక సబ్జెక్టు, మరో వారం మరో సబ్జెక్టును చదువుతారు. ఇది విజయానికి సరైన ప్రణాళిక కాదు. పేపర్ల వారీగా సిలబస్‌ను విశ్లేషించుకొని, రోజూ అన్ని సబ్జెక్టులు చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. అప్పుడే అన్ని అంశాల మధ్య సమతుల్యత సాధ్యమవుతుంది. అంతకుముందు చదివిన అంశాలను రివిజన్ చేసేందుకు రోజూ కొంత సమయం కేటాయించాలి.
  • చదివిన అంశాలను గుర్తుంచుకునేందుకు చక్కటి మార్గం షార్ట్ నోట్స్ రూపకల్పన. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు అందులోని ముఖ్యాంశాలను పాయింట్లుగా, లేదా తమకు అనుకూలమైన రీతిలో (చార్ట్‌లు, గ్రాఫ్‌లు వంటివి) షార్ట్‌నోట్స్ రూపొందించుకోవాలి. చదివిన అంశాలను ఇతరులతో చర్చించటం కూడా మెమరీ పరంగా బాగా ఉపయోగపడే విధానం.
  • సొంత నోట్స్ రూపొందించుకోవడం విజయంలో కీలకపాత్ర పోషిస్తుంది. నోట్స్ రూపకల్పనలో శాస్త్రీయ విధానాన్ని అనుసరించాలి. చదివిన ప్రతి అంశాన్నీ నోట్స్‌లో పొందుపరిస్తే సమయం వృథా అవుతుంది. గణాంకాలు, సంవత్సరాలు, నివేదికలు-సిఫార్సులు వంటి ముఖ్యాంశాలను మాత్రమే రాసుకోవాలి. క్విక్ రివిజన్‌కు ఉపయోగపడేలా నోట్స్ రూపొందించుకోవాలి.
  • అసలు చదువుతున్న అంశాల్లో ఏవి ముఖ్యమైనవనే సందేహం కలుగుతుంటుంది. గత ప్రశ్నపత్రాలను పరిశీలించటం వల్ల ఏ అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయో తెలుస్తుంది. ప్రశ్న అడిగే విధానంపైనా అవగాహన ఏర్పడుతుంది. సమకాలీన ప్రాధాన్యం ఉన్న అంశాలు ముఖ్యమైనవి. సీనియర్ ఫ్యాకల్టీ, గత విజేతల సూచనల మేరకు ప్రామాణిక మెటీరియల్‌ను ఎంపిక చేసుకోవాలి.
  • ప్రతి అంశాన్నీ ఆస్వాదిస్తూ చదవాలి. చదవటాన్ని, సబ్జెక్టు అధ్యయనాన్ని హాబీగా మార్చుకోవాలి. ఒక అంశాన్ని చదువుతుంటే దానికి సంబంధించిన మరో కొత్త అంశాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలి. అప్పుడే చదివిన అంశాలు బాగా గుర్తుంటాయి.

Photo Stories