Skip to main content

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్‌లో దృష్టిసారించాల్సిన అంశాలు తెలియజేయండి?

- ఎం.ఎన్.రేణుక, హైదరాబాద్.
Question
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్‌లో దృష్టిసారించాల్సిన అంశాలు తెలియజేయండి?
  • సిలబస్‌లోని ప్రతి అంశంపైనా దృష్టిసారించాలి. ఆసక్తి లేదనో.. లేదంటే కష్టంగా ఉందనో కొన్ని అంశాలను వదిలేయడం మంచిది కాదు. యూపీఎస్సీ.. ప్రశ్నపత్రాల రూపకల్పనలో ప్రతి అంశంపైనా దృష్టిసారిస్తుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
  • గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే సమకాలీన అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఎక్కువగా ఉందని అర్థమవుతోంది. సిలబస్‌లోని అంశాలను, వర్తమాన అంశాలతో జోడించి అధ్యయనం చేయడం లాభిస్తుంది.
  • గత రెండేళ్ల ప్రశ్నపత్రాలను చూస్తే ప్రశ్నల స్థాయి పెరిగిందన్న విషయం తెలుస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని బట్టీ పద్ధతికి స్వస్తిచెప్పి, విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి.
  • ఇప్పటి నుంచే ప్రిలిమ్స్ కటాఫ్ ఎంత ఉండొచ్చనే విషయంపై చర్చలు, ఆలోచనలు అనవసరం. ప్రశ్నల కాఠిన్యత, అభ్యర్థుల పెర్‌ఫార్మెన్స్‌పై కటాఫ్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రస్తుతం పట్టించుకోకుండా మొత్తం దృష్టంతా ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌పైనే ఉంచడం మంచిది.
  • మాక్‌టెస్ట్‌లు రాయడాన్ని అలవాటు చేసుకోవాలి. కనీసం 7-10 టెస్ట్‌లు రాయాలి. దీనివల్ల ప్రిపరేషన్‌లో లోటుపాట్లు తెలుస్తాయి. బలహీనంగా ఉన్నామనుకున్న అంశాలపై దృష్టిసారించేందుకు వీలుంటుంది.
  • ప్రిపరేషన్‌కు ఇంటర్నెట్‌ను అవసరం మేరకు ఉపయోగించుకోవాలి. రోజువారీ వార్తల్లో కొత్తగా వచ్చే కాన్సెప్టులపై స్పష్టత కోసం యూట్యూబ్‌లో నిపుణులు అందించే క్లాసులు వినవచ్చు.
  • కొన్ని ప్రముఖ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లు ఆన్‌లైన్ మాక్‌టెస్టులు నిర్వహించి సమాధానాలను విశ్లేషిస్తాయి. ఇవి అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటాయి. ఐఏఎస్ బాబా, ఫోరమ్ ఐఏఎస్ తదితర వెబ్‌సైట్లలో ఉచిత మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. గ్రామీణ విద్యార్థులు, కోచింగ్ తీసుకోలేని వారు వీటిని ఉపయోగించుకోవచ్చు.
  • కరెంట్ అఫైర్స్ కోసం ఏదైనా ఒక కోచింగ్ సంస్థ విడుదల చేసే మ్యాగజైన్ చదవాలి. పీఐబీ అప్‌డేట్స్‌ను సంకలనం చేసి మార్కెట్లో మ్యాగజైన్స్‌గా వస్తున్నాయి. వీటిని చదవడం వల్ల కరెంట్ అఫైర్స్ విభాగానికి సన్నద్ధత లభిస్తుంది. ఇక నిత్యం పేపర్ చదవడం వల్ల సివిల్స్ మెయిన్స్‌లో వ్యాసరూప ప్రశ్నలకు సులువుగా సమాధానాలు రాయొచ్చు.
  • జనరల్ సైన్స్, ఎన్విరాన్‌మెంట్ అంశాలకు రిఫరెన్స్ పుస్తకాలతో పాటు సమకాలీన పరిణామాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఈ విభాగాల నుంచి కరెంట్ అఫైర్స్‌తో అనుసంధానిస్తూ ప్రశ్నలు వస్తున్నాయి.

రిఫరెన్స్ పుస్తకాలు...
  1. ప్రాచీన, మధ్యయుగ చరిత్ర: పాత ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు.
  2. ఆధునిక చరిత్ర: స్పెక్ట్రం.
  3. భారతీయ సంస్కృతి: ఎన్‌సీఈఆర్‌టీ 11వ తరగతి ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్.
  4. ఇండియన్ పాలిటీ: లక్ష్మీకాంత్.
  5. జాగ్రఫీ: ఎన్‌సీఈఆర్‌టీ 9 నుంచి 12వ తరగతి పుస్తకాలు, ఫిజికల్ జాగ్రఫీకి Goh Cheng Leong.
  6. జనరల్ సైన్స్: 8 నుంచి 10వ తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు.
  7. ఇండియన్ ఎకానమీ: 2019 బడ్జెట్, రమేష్‌సింగ్ పుస్తకాలను ఉపయోగించుకోవచ్చు.

Photo Stories