పోటీ పరీక్షలకు సంబంధించి జాగ్రఫీ అంశాలను ఎలా అధ్యయనం చేయాలి?
- ఎస్.అనిత, హైదరాబాద్.
Question
పోటీ పరీక్షలకు సంబంధించి జాగ్రఫీ అంశాలను ఎలా అధ్యయనం చేయాలి?
సివిల్స్, గ్రూప్స్, ఇతర పరీక్షలకు సంబంధించి జాగ్రఫీ అంశాలపై పట్టు సాధించాలంటే అట్లాస్‌పై పూర్తిస్థాయి అవగాహన ఉండాలి. దీనివల్ల ప్రపంచ, భారత, రాష్ట్ర భౌగోళిక అంశాల (నదులు, పర్వతాలు, మైదానాలు, అడవులు తదితర)పై ప్రాథమిక నైపుణ్యాలు లభిస్తాయి. ఆ తర్వాత ఆయా పరీక్షల సిలబస్‌లో పొందుపరచిన అంశాలను క్రమపద్ధతిలో అధ్యయనం చేయాలి. జాగ్రఫీలో అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశం సహజ వనరులు, అవి నిక్షిప్తమై ఉన్న ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లోనే అవి ఎందుకు ఎక్కువగా లభిస్తున్నాయనే దాన్ని తెలుసుకోవాలి. ప్రధాన పంటలు, ప్రాంతాలు; జనాభా విస్తరణ, పరిశ్రమలు, రవాణా, ఉష్ణోగ్రత తదితర అంశాలపైనా దృష్టిసారించాలి. విపత్తు నిర్వహణ అంశాలు కూడా ముఖ్యమైనవే. భూకంపాలు, సునామీలు, వరదలు తదితర విపత్తులు, కారణాలు, నిర్వహణ విధానంపై అవగాహన పెంపొందించుకోవాలి. ప్రధాన విపత్తులు, సంభవించిన సంవత్సరాలను కూడా తెలుసుకోవాలి. విపత్తు నిర్వహణ సంస్థలపైనా (ఉదా: ఎన్‌డీఎంఏ) అవగాహన అవసరం. పర్యావరణం, పర్యావరణ కాలుష్యం, కర్బన ఉద్గారాలు, నివారణ చర్యలపైనా పట్టు సాధించాలి. అంతర్జాతీయంగా పర్యావరణ పరిరక్షణ దిశగా పలు దేశాల మధ్య ఒప్పందాలు, ఐక్యరాజ్య సమితి వేదికగా జరిగిన ఒప్పందాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. జాగ్రఫీ, ఎకాలజీలో ప్రశ్న - సమాధానం కోణంలో కాకుండా డిస్క్రిప్టివ్ పద్ధతిలో అధ్యయనం సాగించడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి.