Skip to main content

గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ఎస్సేను ఎలా రాస్తే మంచి మార్కులు లభిస్తాయి?

- ఎం.రాధాకృష్ణ, హైదరాబాద్.
Question
గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ఎస్సేను ఎలా రాస్తే మంచి మార్కులు లభిస్తాయి?
తొలుత ఇచ్చిన ప్రశ్నను రెండుమూడుసార్లు చదివి, దానిపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత ఎస్సే రాయడం ప్రారంభించాలి. ఎస్సేలో చిన్న వాక్యాలు ఉండేలా చూసుకోవాలి. భాష సరళంగా ఉండాలి. ఎదురుగా ఉన్న వ్యక్తితో సంభాషిస్తున్నట్లు రాయాలి. ఇతర పేపర్లతో పోల్చితే ఎస్సే పేపర్‌లో చేతిరాత కీలక పాత్ర పోషిస్తుంది. చాలా విషయాలను వ్యాసంలో ప్రస్తావించాలన్న తాపత్రయంతో గజిబిజిగా రాస్తే ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే ప్రమాదముంది. మీకు ఎంత సమయం అందుబాటులో ఉంటుందో మిగిలిన వారికీ అంతే ఉంటుందన్న విషయం గుర్తించి, నిర్దేశ సమయం, ముందుగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం ఎస్సే రాయాలి. పొంతన లేని కొటేషన్స్, సామెతలు లేకుండా చూసుకోవాలి.
  • ఎస్సేను పేరాగ్రాఫ్‌లుగా రాయాలి. అవసరమైన సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి. ఒక పేరాకు తర్వాతి పేరాకు సంబంధం ఉండేలా చూసుకోవాలి. గణాంకాలను సాధ్యమైనంతవరకు శాతాల్లో చూపేందుకు యత్నించాలి. బాక్స్‌లు, ఫ్లో డయాగ్రమ్స్, పైచార్ట్‌లు వంటి వాటిని అవసరానికి తగ్గట్టు ఉపయోగించాలి.
  • ప్రశ్నలో అడిగిన అంశానికి సంబంధించి వివిధ కోణాలను స్పృశిస్తూ సమాధానం రాయాలి. ఏదో ఒక కోణాన్ని మాత్రమే ప్రస్తావించి వదిలేయకూడదు. ముగింపు ఆశావహ దృక్పథంతో ఉండేలా చూసుకోవాలి.
  • ఎస్సే నిరాశ, నిస్పృహలను ప్రతిబింబించేలా ఉండకూడదు. వివిధ సమస్యల పరిష్కారానికి అభ్యర్థి సూచనలు నిర్మాణాత్మకంగా, ఆచరణాత్మకంగా ఉండాలి. ఎస్సేకు ముగింపు రాసే ముందు అప్పటివరకు రాసిన భాగాన్ని మరోసారి చదవాలి. ప్రారంభ ఎత్తుగడకు, ముగింపునకు మధ్య సంబంధం ఉండేలా చూసుకోవాలి.

Photo Stories