Tribal School: అడవిలో అక్క బడి...పిల్లలు మెచ్చిన ఒడి
తమిళనాడు–కేరళలో సరిహద్దులో ఉండే చిన్నంపతి అనే ట్రైబల్ విలేజికి చెందిన సంతియ ‘కంప్యూటర్ అప్లికేషన్స్’లో డిగ్రీ చేసింది. ఈ అడవి అంచు గ్రామంలో గ్రాడ్యుయేట్ అయిన తొలి అమ్మాయి ఆమె.
తన ఇంటినే..
‘ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు’ అనుకోలేదు సంతియ.
ఎందుకంటే తన వెనకాల చాలామంది ఉన్నారు. వారిని ముందుకు నడిపించాలి. వారు ఉన్నచోటనే ఉండకూడదు...చదువుకోవాలి... వారికి జ్ఞానం తెలియాలి... విస్తృత ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకుంది. అందుకే తన ఇంటినే, పచ్చని ప్రకృతి ఒడినే బడిగా మార్చింది.
బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో వారికి..
నాలుగుగోడలు లేని బడి అది. బ్లాక్‌బోర్డ్‌లేని బడి అది. కాని పిల్లలకు బాగా నచ్చిన బడి! చిన్నంపతి గ్రామంలో ‘చదువు’ అనేది చాలాచిన్న విషయం. చిన్నాచితకా పనులు చేసి పొట్టపోసుకుంటారు జనాలు. బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో వారికి అవసరం లేదు. తెలిసో తెలియకో ఎవరైనా చదువు ప్రస్తావన తెస్తే విసుక్కుంటారు. ‘చదువుకుంటేనే బతుకుతారా? మేము బతకడం లేదా’ అని అంటారు. అయిదో తరగతి వరకు చదవడం అనేది ఆ ఊళ్లో గొప్ప విషయం. అసలే ఆ ఊళ్లో వానకాలం చదువులు. కోవిడ్ దెబ్బతో ‘బడా? అదేమిటి?’ అనుకునే పరిస్థితి వచ్చింది. పిల్లలకు ఆటలే ప్రపంచం అయింది. ఆ అడవిలో ప్రమాదాల బాడిన పడిన పిల్లలు కూడా ఉన్నారు. ఇలా చూస్తూ కూర్చుంటే పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఆలోచించిన సంతియ పరిష్కార మార్గాన్ని ఆలోచించింది.పాఠాలతో కాదు పాటలతో స్వాగతం పలికింది. ‘ఇంకా... ఇంకా’ అని అడిగే వరకు కథలు చెప్పింది. ఆ తరువాత పాఠాలు మొదలయ్యాయి. రోజూ ఠంచనుగా ఆమె దగ్గరికి రావడం మొదలుపెట్టారు. పాటలతో, నవ్వించే మాటలతో మొదలైన బడిలోకి మెల్లిగా పాఠాలు వచ్చేశాయి. మెల్లమెల్లగా వారికి చదువు మీద ఆసక్తి మొదలైంది.
‘నువ్వు ఏమవుతావు?’ అని ఒక పిల్లాడిని అడుగుతుంది.
‘విమానం నడుపుతాను అక్కా’ అంటాడు.
‘నువ్వు ఏమవుతావు’ అని చిన్నిని అడుగుతుంది.
‘టీచరవుతాను అక్కా’ అంటుంది.
‘మీరు ఈ అడవిలోనే ఆటలు ఆడుతూ కూర్చుంటే ఎప్పటికీ కాలేరు. బడికి వెళ్లాలి. రోజూ వెళ్లాలి. బాగా కష్టపడి చదవాలి. విమానం నడిపితే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? టీచరై పాఠాలు చెబితే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా?’ అని వారికి చదువు మీద ప్రేమ, ప్రేరణ పెరిగేలా చేస్తుంది.
ఇదో గొప్ప విజయమే..
సంతియ కృషి వృథా పోలేదు. బడి అంటే ఒకప్పుడు ఉండే భయం పోయింది. తాము కూడా సంతియ అక్కలాగా పెద్ద చదువు చదువుకోవాలనుకుంటున్నారు. పిల్లల్లోనే కాదు, పిల్లల ద్వారా తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు రావడం గొప్ప విషయం. ఇప్పుడు వాళ్లు తమ పిల్లల్ని అయిదవ క్లాసు వరకు మాత్రమే చదివించాలనుకోవడం లేదు. పెద్ద చదువులు చదివించాలనుకుంటున్నారు.
ఇది పెద్ద విజయమే కదా!