విద్యార్థులు నష్టపోకూడదు - 31లోగా అడ్మిషన్లు ముగించండి...ఎంసెట్ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు వ్యాఖ్య
Sakshi Education
- తెలంగాణ సర్కారు గడువు కోరటం వెనుక ఉద్దేశం వేరేలా కనిపిస్తోంది
- కౌన్సెలింగ్ నుంచి ఏపీ విద్యార్థులను తప్పించాలని చూస్తున్నట్లుగా ఉంది
- 371డీ ప్రకారమే అడ్మిషన్లు జరిగితే ఇక రెండు రాష్ట్రాల ప్రస్తావనెందుకు?..
- తెలంగాణలో వచ్చి సెటిల్ అయిన వారిని లోకల్ కాదంటే ఎలా?
- ఈ నెల 11వ తేదీన సమగ్ర ఉత్తర్వులు వెలువరిస్తామని సుప్రీం వెల్లడి
స్థానికతను ఎలా నిర్వచిస్తారు?
దీనిపై తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది హరీష్‌సాల్వే తన వాదనలు వినిపిస్తూ ‘మా సమస్య ఏంటంటే.. ఒకసారి ప్రక్రియ మొత్తం చూడండి. అడ్మిషన్లు 70:30 నిష్పత్తి ప్రకారం జరుగుతాయి. 70 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో జరుగుతాయి. మిగిలినవి మేనేజ్మెంట్ కోటా సీట్లు. కన్వీనర్ కోటాలో తొలుత 15 శాతం ఓపెన్ మెరిట్ కోటాలో రాష్ట్రవ్యాప్త విద్యార్థులెవరైనా సరే పోటీపడొచ్చు. అలా భర్తీ అయ్యాక మిగిలిన 85 శాతం లోకల్ కేటగిరీకి రిజర్వ్ అయి ఉంటాయి. ఇవి స్థానికులతో భర్తీ చేస్తారు..’ అని వివరించారు. విద్యార్థుల స్థానికతను, పూర్వాపరాలను పరిశీలించేందుకు తమ వద్ద తగినంత మంది సిబ్బంది లేరని.. కాబట్టి కౌన్సెలింగ్ ప్రక్రియకు మరింత గడువు కావాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జస్టిస్ ముఖోపాధ్యాయ జోక్యం చేసుకుంటూ ‘స్థానికతను ఎలా నిర్వచిస్తారు..?’ అని ప్రశ్నించగా.. ‘అది 371డీ చట్టం ప్రకారమే జరుగుతుంది. గతంలో ఉన్న ప్రకారమే..’ అని హరీష్‌సాల్వే వివరించబోయారు.
సెటిలయిన వారిని నాన్‌లోకల్ అంటే ఎలా?
తిరిగి న్యాయమూర్తి కల్పించుకుని ‘మీ ప్రధాన ఉద్దేశం వేరేలా కనిపిస్తోంది.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను కౌన్సెలింగ్ ప్రక్రియ నుంచి ఎలిమినేట్ (తప్పించడం) చేయాలని చూస్తున్నట్టుగా ఉంది. అదే మీ ఉద్దేశంగా కనిపిస్తోంది.. వాస్తవానికి విద్యార్థులకు రాష్ట్ర విభజనతో ఏ రకంగానూ సంబంధం లేదు. దీనిని రాజకీయం చేయకూడదు.. విద్యార్థులకు సమాన అవకాశాలు ఉండాలి.. అది అటువారైనా ఇటువారైనా సరే.. విభజనకు ముందు ఎలా ఉందో అలాగే జరగాలి..’ అని పేర్కొన్నారు. దీనిపై హరీష్‌సాల్వే మాట్లాడుతూ.. ‘అందులో నుంచి మేం ఏమాత్రం పక్కకు పోవడం లేదు. 371డీ ప్రకారమే వెళుతున్నాం..’ అని పేర్కొన్నారు. వెంటనే న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. ‘తెలంగాణలో వచ్చి సెటిల్ అయిన వారిని లోకల్ కాదంటే ఎలా?’ అని ప్రశ్నించారు. అప్పుడు తెలంగాణ న్యాయవాది మాట్లాడుతూ ‘2011 నోటిఫికేషన్ చూడండి.. అందులో ఉన్న నిబంధనల ప్రకారమే మేం ముందుకు వెళుతున్నాం.. మేం అడ్మిషన్ల విషయంలో ఎలాంటి కొత్త నిబంధనలు రూపొందించడం లేదు..’ అని పేర్కొన్నారు. దీంతో జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే జోక్యం చేసుకుంటూ ‘మీరు విద్యార్థులకు పరిమితులు విధిస్తున్నట్టుగా ఉంది.. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నిబంధనల ప్రకారం చేయండి..’ అని పేర్కొన్నారు.
ఇక.. తెలంగాణ - నాన్ తెలంగాణ అంశం ఎక్కడిది?
హరీష్‌సాల్వే వాదనలు వినిపిస్తూ ‘విభజనకు ముందు ఉన్నట్టుగానే అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 371డీ ప్రకారం ఓయూ రీజియన్ పరిధిలో 10 తెలంగాణ జిల్లాలు, ఏయూ రీజియన్ పరిధిలో 9 జిల్లాలు, ఎస్వీయూ రీజియన్ పరిధిలో 4 జిల్లాలు ఉన్నాయి. ఏ రీజియన్ వారు ఆ రీజియన్‌లో దరఖాస్తు చేసుకుంటే లోకల్ అవుతారు. ఒక రీజియన్ విద్యార్థి మరోచోట నాన్ లోకల్ అవుతారు. ఇందులో గందరగోళం ఏమీలేదు. పాత విధానం ప్రకారం నడుచుకుంటాం. కానీ మా సమస్య అది కాదు.. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులకు చదువుకునేందుకు ఆర్థిక సాయం చేయాలనుకుంటోంది. అందుకు ఫాస్ట్ పేరుతో ఒక స్కీమ్ రూపొందించింది. దానికి నిబంధనలు రూపొందించుకునేందుకు కొంత సమయం కావాలి.. అదీ మా సమస్య..’ అని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ ముఖోపాధ్యాయ స్పందిస్తూ ‘మీరు అడ్మిషన్లను 371డీ ప్రకారం ఓయూ, ఎస్వీయూ, ఏయూ రీజియన్ల పద్ధతిలో భర్తీ చేస్తే.. ఇక తెలంగాణ, నాన్ తెలంగాణ అన్న అంశం ఎక్కడ వస్తోంది? ఇక్కడ తెలంగాణ విద్యార్థులు, ఆంధ్ర విద్యార్థులు అన్న ప్రశ్న ఎక్కడ ఉత్పన్నమవుతుంది? ఏ విద్యార్థి ఎక్కడైనా అడ్మిషను పొందవచ్చు కదా? అడ్మిషన్ల ప్రక్రియలో రాజకీయం ఉండకూడదు...’ అని వ్యాఖ్యానించారు.
విద్యార్థులు నష్టపోకూడదు.. అడ్మిషన్లు ముగించండి...
హరీష్ సాల్వే తన వాదనలు వినిపిస్తూ ‘ఫాస్ట్ స్కీమ్ మా విద్యార్థుల కోసం రూపొందించుకుంటున్నాం. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మేమెలా భరిస్తాం..?’ అని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ ముఖోపాధ్యాయ స్పందిస్తూ ‘మేం దాంట్లోకి వెళ్లడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అడ్మిషన్ నిబంధనలు పాటించండి..’ అని పేర్కొన్నారు. జస్టిస్ ఎస్.ఎ.బాబ్దే కూడా ఇంతకుముందు ఉన నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంలో సాల్వే మాట్లాడుతూ ‘ఫాస్ట్ స్కీమ్‌కు సంబంధించి హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది.. ఒకవేళ అవసరమైతే దానిపై మేం మిమ్మల్ని ఆశ్రయిస్తాం..’ అని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ ముఖోపాధ్యాయ మాట్లాడుతూ ‘ఈ ప్రతిష్టంబన ఇలాగే కొనసాగుతుందా..? నేను ఏ రాష్ట్రానికి చెందుతానో నాకే తెలియని పరిస్థితి. నేను బీహార్‌కు వెళితే మీరు జార్ఖండ్‌కు చెందిన వారు అంటారు.. జార్ఖండ్‌కు వెళితే మీరు బీహార్‌కు చెందిన వారు అంటారు! విద్యార్థులు నష్టపోకూడదు... ఆగస్టు 31 కల్లా అడ్మిషన్ల ప్రక్రియ ముగించండి.. ఈ కేసులో తదుపరి సమగ్ర ఉత్తర్వులు ఆగస్టు 11న జారీచేస్తాం... అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించవచ్చు..’ అని పేర్కొన్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన హరీష్‌సాల్వే అంగీకరించారు. ఈ విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నీలంసహానీ, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి హాజరయ్యారు. అడ్మిషన్లకు తెలంగాణ సర్కారు మరింత గడువు కోరటం తదితర అంశాలపై ఈ నెల 11వ తేదీన మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Published date : 04 Aug 2014 03:13PM