Skip to main content

విద్యార్థుల చేరికలు తగ్గుతున్నాయ్..!

సాక్షి, అమరావతి: దేశంలో ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల్లో విద్యార్థుల చేరికల శాతం క్రమేణా తగ్గిపోతోంది.
ఉన్నత విద్యారంగంలో చేరికలు, ప్రమాణాలు పెరగాల్సి ఉన్నా దీనికి భిన్నంగా ప్రవేశాలు తగ్గిపోతున్నట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉన్నత విద్య వ్యయం పెరిగిపోతుండటం, ఉద్యోగావకాశాలు లేకపోవడంతో ఉన్నతవిద్య పట్ల యువతలో నిరాసక్తత పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. ఎక్కువ మంది యువత తాము చదివిన కోర్సుకు తగ్గ ఉద్యోగాలు లేకపోవడంతో సంబంధం లేని ఉద్యోగాలు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నత విద్యలో చేరికలు తగ్గిపోతున్నాయని పేర్కొంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్నత విద్యా సంస్థలు అత్యధికంగానే ఉన్నా చేరికలు మాత్రం ఆ స్థాయిలో లేవని వెల్లడిస్తున్నారు. కాగా, ప్రవేశాలు తక్కువగా ఉంటుండటంతో కళాశాలల యాజమాన్యాలు కోర్సులకు స్వస్తి పలుకుతున్నాయి. లేదంటే ఏకంగా కళాశాలలనే మూసేస్తున్నాయి.

వెంటాడుతున్న ఫీజుల భారం...
ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులను భారీ స్థాయిలో ఉంటున్న ఫీజులు భయపెడుతున్నాయి. ప్రవేశపరీక్షలు రాయడానికి ఫీజు రూ.వేయి నుంచి 2 వేలకు ఉంటుండడం, పరీక్షల సన్నద్ధత తదితరాలకు ఒక్కో విద్యార్థి ఎంత లేదన్నా కనీసం రూ.30 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఏటా ఈ వ్యయాలు పెరుగుతున్నాయి. ఇక ప్రవేశపరీక్షలో విజయం సాధించి కళాశాలల్లో ప్రవేశించాక ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, వసతి, భోజన ఖర్చులకు ఏటా లక్షల్లో ఖర్చు తప్పడం లేదు. ఇక డొనేషన్లు కూడా కలుపుకుంటే ఈ భారం చెప్పనలవి కాదు. రాష్ట్రంలో గతంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో గరిష్టంగా రూ.60 వేల లోపు ఉన్న ఫీజులను ఇటీవల ఏకంగా 1.10 లక్షలకు ప్రభుత్వం పెంచేసింది. దీన్ని 1.50 లక్షలకు పెంచాలని ప్రైవేటు కాలేజీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలైన ఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లనే తీసుకుంటే గతంలో రూ.50 వేలుగా ఉన్న ఫీజును కొద్దికాలం క్రితం రూ.90 వేలకు పెంచగా ఇటీవల రూ.2 లక్షలు చేశారు. గతంలో కేంద్రీయ విద్యాలయాల్లో రూ.4500 ఫీజు ఉండగా ఇప్పుడు దాన్ని రూ.12 వేలకు పెంచారు.

జాతీయ గణాంకాలిలా...
గత కొన్నేళ్లుగా చేరికలు తగ్గిపోతుండగా పురుషుల్లో చేరికలు ఎక్కువగా ఉన్నట్లు జాతీయ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2013-14లో దేశంలో ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో చేరిన వారి సంఖ్య 20,50,561. కాగా, అది 2014-15లో 20,02,551, 2015-16లో 19,46,907, 2016-17లో 18,15,367కి తగ్గగా 2017-18కి వచ్చేసరికి 17,61,886కి చేరుకుంది. ఈ చేరికల తగ్గుదలలో మహిళల కంటే పురుషుల సంఖ్యే ఎక్కువ ఉండడం విశేషం. పురుషుల్లో గత ఐదేళ్లలో 2,43,421 మంది (16.08 శాతం) తగ్గగా మహిళల్లో 45,254 మంది (0.08 శాతం) మాత్రమే తగ్గుదల ఉంది. మహిళల్లో ఓపెన్, ఓబీసీ కేటగిరీ కన్నా ఎస్సీ, ఎస్టీ మహిళల చేరికలు స్పల్పంగా పెరగడం గమనార్హం.

దేశంలో ఉన్నత ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ విద్యాసంస్థలు 2014-15లో 9,854 ఉండగా 2018-19 విద్యా సంవత్సరానికి 9,570కి చేరాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 1,554 సంస్థలుండగా తర్వాత స్థానాల్లో తమిళనాడు (1333), ఉత్తరప్రదేశ్ (1261) ఆంధ్రప్రదేశ్ (790), కర్ణాటక (751), తెలంగాణ (669) ఉన్నాయి.

రాష్ట్రం

విద్యాసంస్థలు

 

2014-15

2018-19

మహారాష్ట్ర

1,549

1,554

తమిళనాడు

1,356

1,333

ఉత్తరప్రదేశ్

1,067

1,261

ఆంధ్రప్రదేశ్

856

790

కర్ణాటక

752

751

తెలంగాణ

820

669

మధ్యప్రదేశ్

538

575

రాజస్థాన్

460

422

పంజాబ్

456

393

Published date : 28 Aug 2018 02:30PM

Photo Stories