Skip to main content

వెబ్‌సైట్, వాట్సాప్‌ల ద్వారా విద్యార్థుల చెంతకు డిజిటల్‌ పాఠాలు : జేఎన్‌టీయూ

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌తో విద్యాసంస్థలు మూతపడిన నేపథ్యంలో సిలబస్‌ పూర్తికి పక్కాగా ముందుకు సాగాలని జేఎన్‌టీయూ తన అనుబంధ కాలేజీలకు ఆదేశాలిచ్చింది.
ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి, సాంకేతిక విద్యాకోర్సులు చదివే విద్యార్థులకు వెబ్‌సైట్, వాట్సాప్, గూగుల్‌ డ్రైవ్‌ వంటి ఆన్‌లైన్‌ సేవల ద్వారా పాఠ్యాంశాలను బోధించాలని సూచించింది. కాలేజీల ఫ్యాకల్టీ వీడియో పాఠాలను రికార్డు చేసి విద్యార్థులకు పంపి చదివించాలని, తద్వారా సిలబస్‌ పూర్తిచేయాలని పేర్కొంది. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపంలోనూ పాఠ్యాంశాలను రూపొందించి విద్యార్థులు చదువుకునేలా చర్యలు చేపట్టాలంది. ఈ ఆదేశాలను వర్సిటీ పరిధిలోని అటానమస్, నాన్‌ అటానమస్‌ కాలేజీలన్నీ విధిగా పాటించాలని స్పష్టంచేసింది. సిలబస్‌ పూర్తికి ఆన్‌లైన్‌ బోధన నిర్వహించాలని ఇటీవల అన్ని వర్సిటీల రిజిస్ట్రార్లను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆదేశించిన నేపథ్యంలో జేఎన్‌టీయూ ఈ చర్యలు చేపట్టింది. ఉస్మానియా, కాకతీయ వర్సిటీలూ ఈ దిశగా చర్యలు చేపట్టాయి.

ఇవీ ఆదేశాల్లోని ప్రధాన అంశాలు
లాక్‌డౌన్‌లో విద్యార్థులకు బోధనను అందించేందుకు అందుబాటులో ఉన్న ఆన్‌లైన్‌ సేవలన్నింటినీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, డైరెక్టర్లు సద్వినియోగపర్చు కోవాలి. పరీక్షలకు సంబంధించి వర్సిటీ జారీచేసే ఆదేశాలను పాటించాలి.

ఈ–మెయిల్‌ గ్రూప్స్‌: విద్యార్థుల ఈ–మెయిల్‌ ఐడీలతో గ్రూప్‌ను ఏర్పాటు చేయాలి. ఫ్యాకల్టీ తమ సబ్జెక్టుల మెటీరియల్స్‌ ఈ గ్రూపునకు పంపించాలి. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపంలోనూ పాఠాలను పంపించాలి.

వీడియో లెక్చర్స్‌: ఫ్యాకల్టీ, లెక్చరర్లు తమ పాఠాలను వీడియో రూపంలో రికార్డు చేసి గూగుల్‌ డ్రైవ్, ఈ–మెయిల్, వాట్సాప్‌ ద్వారా విద్యార్థులకు పంపించాలి. వెబ్‌సైట్‌లోనూ అప్‌లోడ్‌చేసి విద్యార్థులకు తెలపాలి.

స్కైప్‌: లెక్చరర్లు స్కైప్‌ ద్వారా, గూగుల్‌ డ్యూయో, జూమ్‌ ద్వారా పాఠాలను బోధించాలి.

ఎన్‌పీటీఈఎల్, స్వయం పోర్టల్, మూక్స్‌లలో అందుబాటులో ఉన్న వీడియోపాఠాలు, పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్స్‌ గురించి విద్యార్థులకు తెలపాలి. వీటికి సంబంధించి కాలేజీల వారీగా చేపట్టిన చర్యలపై ఈనెల 10లోగా యూనివర్సిటీకి తెలియజేయాలి.

యూజీసీ ఆదేశాలు..: ఆన్‌లైన్‌లో ఉన్న వీడియో పాఠాలు, స్టడీమెటీరియల్‌ పోర్టల్స్‌ గురించి ఇప్పటికే యూజీసీ, ఏఐసీటీఈ ప్రకటించాయి. తాజాగా హాస్టళ్లు, ఇళ్లల్లో ఉండే విద్యార్థులు పాటించాల్సిన జాగ్రత్తలు, నిపుణుల సూచనలతో కూడిన వీడియో సందేశాలను యూట్యూబ్‌లో ఉంచినట్లు యూజీసీ పేర్కొంది. ఆ లింక్స్‌ను విద్యార్థులకు ఈ–మెయిల్, ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్‌ వంటి వాటి ద్వారా యూనివర్సిటీలు, కాలేజీలు పంపించాలని పేర్కొంది. ప్రవర్తనపరంగా సమస్యలు గుర్తిస్తే సైకో సోషల్‌ టోల్‌ ఫ్రీ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 08046110007కు తెలపాలని సూచించింది.
Published date : 09 Apr 2020 06:14PM

Photo Stories