Skip to main content

తెలంగాణలో 11 ఇంజనీరింగ్ కాలేజీల మూత!

సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు తక్కువగా ఉన్న, విద్యార్థులు లేని ఇంజనీరింగ్ కాలేజీలను మూసివేసేందుకు యాజమాన్యాలు ముందుకు వచ్చాయి. డిమాండ్ లేని కోర్సులను రద్దు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి.
ఇందులో భాగంగా 11 ఇంజనీరింగ్ కాలేజీలను మూసివేయాలని నిర్ణయించాయి. 2018-19 విద్యా సంవత్సరంలో తమకు అనుబంధ గుర్తింపు అవసరం లేదని, తమ కాలేజీలు మూసివేసుకుంటామని, ఇందుకు అనుమతి ఇవ్వాలని జేఎన్టీయూహెచ్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు యాజమాన్యాల నుంచి జేఎన్టీయూహెచ్ ఇటీవల దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. మొత్తంగా 266 ఇంజనీరింగ్ (బీటెక్) కాలేజీలు దరఖాస్తు చేసుకోగా, 11 కాలేజీలు మూసివేత కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలు, ఫ్యాకల్టీ పరిస్థితిని తెలుసుకునేందుకు జేఎన్టీయూహెచ్ ఫిబ్రవరి 26 నుంచి ఆకస్మిక తనిఖీలను ప్రారంభించింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్‌ఎఫ్‌సీ) తనిఖీల్లో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే కాలేజీలకు, సీట్లకు అనుబంధ గుర్తింపు జారీ చేయనుంది. ఈసారి కొత్త కోర్సులను ఇచ్చేది లేదని ఏఐసీటీఈతోపాటు జేఎన్టీయూహెచ్ కూడా చెబుతుండటం, గడిచిన మూడేళ్లలో 25 శాతం లోపే ప్రవేశాలు ఉన్న కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వబోమని ప్రకటించిన నేపథ్యంలో ఈసారి ఇంజనీరింగ్ కాలేజీలతోపాటు సీట్ల సంఖ్య భారీగా తగ్గనుంది.

బ్రాంచీల రద్దుకు మరిన్ని కాలేజీలు..
8 ఇంజనీరింగ్ కాలేజీలు 11 రకాల బీటెక్ కోర్సులను రద్దు చేసుకునేందుకు ముందుకు వచ్చాయి. డిమాండ్ లేని కోర్సులను మూసి వేసుకుంటామని వెల్లడించాయి. దీంతో భారీగా సీట్లు రద్దు కానున్నాయి. అలాగే 28 ఎంటెక్ కాలేజీల్లోనూ 77 బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నాయి. గతంలో 15 వేల వరకు ఎంటెక్‌లో సీట్లు ఉండగా గతేడాది వాటిని జేఎన్‌టీయూహెచ్ 5,400కు పరిమితం చేసింది. ఈసారి 77 బ్రాంచీల రద్దుతో ఎంటెక్ సీట్ల సంఖ్య 3 వేల లోపే ఉండే అవకాశం ఉంది. మరోవైపు 4 ఫార్మసీ కాలేజీలు 7 బ్రాం చీలను, ఒక ఎంబీఏ కాలేజీ ఒక బ్రాంచీని, 3 ఎంసీఏ కాలేజీలు 3 బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాయి.

25 శాతం లోపు ప్రవేశాలు..
జేఎన్టీయూహెచ్ పరిధిలో 266 ఇంజనీరింగ్ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో వరుసగా మూడేళ్లపాటు 25 శాతంలోపే ప్రవేశాలు ఉన్న కాలేజీలు అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలిసింది. 30 శాతం ప్రవేశాలు ఉన్న కాలేజీలను కొనసాగించడం సాధ్యం కాదని, వాటిని మూసివేయాలని ఏఐసీటీఈ నిర్ణయం తీసుకోగా, 25 శాతం లోపు ప్రవేశాలు ఉన్న కాలేజీలను మూసివేయాలని జేఎన్టీయూహెచ్ ఇదివరకే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అలాంటి కాలేజీలు పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలిసింది.

ముందుగానే అనుబంధ గుర్తింపు:
ప్రవేశాల కోసం గుర్తింపు పొందిన కాలేజీలు, బ్రాంచీల వారీగా సీట్ల జాబితాను ఈసారి ముందుగానే ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు జేఎన్టీయూహెచ్ వైస్ చాన్‌‌సలర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ముందస్తుగానే అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. గతేడాది మార్చి నెలలో ఎఫ్‌ఎఫ్‌సీల ఆకస్మిక తనిఖీ లు ప్రారంభం కాగా, ఈసారి ఫిబ్రవరి 26నుంచే తనిఖీలను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఏప్రిల్ నెలాఖరులోగా తనిఖీలు, ఆ నివేదికల పరిశీలనను పూర్తి చేసి, అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను రూపొందిస్తామన్నారు. ప్రవేశాలు చేపట్టేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలికి మే మొదటి వారంలో వీలైతే 5వ తేదీ నాటికి గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను అందజేస్తామని వివరించారు. ఈ మేరకు రూపొందించిన షెడ్యూలును కాలేజీలకు పంపినట్లు తెలిపారు.
Published date : 27 Feb 2018 04:32PM

Photo Stories