Skip to main content

తెలంగాణ పీజీఈసెట్‌లో 85% మంది అర్హత

సాక్షి, హైదరాబాద్: పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ పీజీఈసెట్-2016 ఫలితాల్లో 85.01 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
వీరిలో అబ్బాయిలు 85.38 శాతం.. అమ్మాయిలు 84.48 శాతం. గతనెల 30 నుంచి ఈ నెల 3 వరకు రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ రీజియన్ సెంటర్లలో పీజీఈసెట్ నిర్వహించారు. మొత్తం 18 వేర్వేరు సబ్జెక్టులకు జరిగిన పరీక్షలకు 41,281 మంది అభ్యర్థులు హాజరు కాగా.. 35,093 మంది అర్హత పొందారు. పీజీఈసెట్ చైర్మన్ ఇ.సురేష్‌కుమార్, కన్వీనర్ ఎస్.రామచంద్రంతో కలసి ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం ఫలితాలను విడుదల చేశారు. 17,222 మంది అమ్మాయిలకు 14,550 మంది, 24,059 మంది అబ్బాయిలకు 20,543 మంది పీజీ ప్రవేశాలకు అర్హత పొందారని చెప్పారు. ఫలితాలను www.tspgecet.org, www.osmania.ac.in వెబ్‌సైట్‌లలో చూడొచ్చు. వీటి నుంచి అభ్యర్థులు ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

‘గేట్’వారికి తొలి ప్రాధాన్యం...
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ తేదీలను త్వరలో ప్రకటిస్తామని పాపిరెడ్డి తెలిపారు. అలాగే యూనివర్సిటీల వారీగా అనుబంధ గుర్తింపు పొందిన కళాశాలల జాబితా ఖరారయ్యాక అడ్మిషన్ షెడ్యూల్, అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామన్నారు. ప్రవేశాల్లో మొదటి ప్రాధాన్యత.. గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) అభ్యర్థులకు ఉంటుందన్నారు. ఆ తర్వాత పీజీఈసెట్‌లో అర్హత సాధించినవారికి సీట్లు కేటాయిస్తామన్నారు. ఇప్పటివరకు 1,700 దరఖాస్తులు గేట్ అభ్యర్థుల నుంచి అందాయన్నారు. కాగా, ఒక్కో సబ్జెక్ట్‌లో 120 మార్కులకు పరీక్ష నిర్వహించారు. గతేడాది కంటే ఈసారి పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య, ఉత్తీర్ణత శాతం తగ్గాయి. గతేడాది 48,482 మంది పరీక్ష రాయగా.. 88.82 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు.

గతేడాది సీట్లు ఇలా...
రాష్ట్రంలోని వివిధ వర్సిటీల, అనుబంధ గుర్తింపు పొందిన కళాశాలల్లో గతేడాది దాదాపు 17,500 సీట్లు ఉన్నాయి. ఇందులో వర్సిటీ కళాశాలల్లో 1,200, కన్వీనర్ కోటా కింద 15,756, మేనేజ్‌మెంట్ కోటా కింద 500 సీట్లు ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది వర్సిటీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ త్వరలో కొలిక్కి రానుంది. అలాగే కళాశాలల వారీగా ఉండే బ్రాంచ్‌లు, సీట్ల సంఖ్యతేలనుంది. దాదాపు ఇదే స్థాయిలో ఈ సారి సీట్లు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
Published date : 17 Jun 2016 03:08PM

Photo Stories