Skip to main content

షెడ్యూల్ ప్రకారం ‘ఇంజనీరింగ్’ కౌన్సిలింగ్ జరుగుతుందా..?

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సజావుగా జరిగేనా? షెడ్యూల్ ప్రకారం జూన్ 27 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందా? అంటే ఉన్నతాధికారుల నుంచి ఏమోనన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది.
ఫీజుల వ్యవహారంలో తలెత్తిన గందరగోళం ప్రవేశాల కౌన్సెలింగ్‌కు అడ్డంకిగా మారింది. కాలేజీల వారీగా ఫీజులను తేల్చకుండా వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించే అవకాశం లేక పోవడంతో జూన్ 27 నుంచి జరగాల్సిన వెబ్ ఆప్షన్లు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఎంసెట్ అర్హత సాధించి ప్రవేశాల కోసం లక్ష మందికిపైగా విద్యార్థులకు ఎదురుచూపులు తప్పేలా లేవు.

ఫీజులు ఖరారు కాకపోవడం వల్లే...
తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం మే నెలలో నిర్వహించిన ఎంసెట్ పరీక్ష ఫలితాలను ఎంసెట్ కమిటీ జూన్ 9న ప్రకటిం చింది. దానికి అనుగుణంగా ఉన్నత విద్యా మండలి, సాంకేతిక విద్యాశాఖ ప్రవేశాల కమిటీని ఏర్పాటు చేసి జూన్ 22న ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశాయి. అయితే వచ్చే మూడేళ్లలో ఏటా వసూలు చేయాల్సిన ఫీజులను ఖరారు చేయకుండా ఆరు కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. అయితే ప్రభుత్వం తెలంగాణ ఫీజులు, ప్రవేశాల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ)కి చైర్మన్‌ను నియమించకుండా జాప్యం చేసినందున యాజమాన్యాలు టీఏఎఫ్‌ఆర్‌సీకి ప్రతి పాదించిన ఫీజును అమలు చేయాలని, చైర్మన్‌ను నియమించి ఫీజులు ఖరారు చేశాక ఎక్కువ తక్కువలు ఉంటే సర్దుబాటు చేసు కునేలా చర్యలు చేపట్టాలని హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు ఉన్నత విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ తీర్పు కాపీ ఇంతవరకు ప్రభుత్వానికే అందలేదని అధి కారులు పేర్కొంటున్నారు. కోర్టు తీర్పు కాపీ అందగానే అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అంటే జూన్ 27 నాటికి తీర్పు కాపీ అందుతుందా? అప్పీల్‌కు వెళతారా? లేదా? అన్న గందరగోళం నెలకొంది. మరోవైపు ఆరు కాలేజీలే కాకుండా మరో 75 కాలేజీలు కూడా అవే ఉత్తర్వులను తమకు వర్తింపజేయాలంటూ కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. దీంతో కోర్టు తీర్పును అమలు చేస్తే యాజమాన్య ప్రతిపాదిత
ఫీజును 81 కాలేజీల్లో అమలు చేయాల్సి వస్తుంది. అదే జరిగితే తల్లిదండ్రులపై అధిక భారం పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో టీఏఎఫ్‌ఆర్‌సీకి చైర్మన్ నియామకం, వచ్చే మూడేళ్లపాటు వసూలు చేయాల్సిన ఫీజుల ఖరారు వ్యవహారం, హైకోర్టు ఉత్తర్వులు తదితర అంశాలేవీ ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్లనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి జూన్ 25న విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో ఈ వ్యవహారంపై చర్చించినట్లు తెలిసింది. మంత్రి కూడా ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని, సమస్యను త్వరగా పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

జూన్ 27 కల్లా స్పష్టత వచ్చేనా..?
ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్, విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే ప్రక్రియ జూన్ 27 నుంచి ప్రారంభించేలా ప్రవేశాల కమిటీ ఇప్పటికే షెడ్యూల్ జారీ చేసింది. ఇప్పటివరకు 37,909 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నారు. జూన్ 27వ తేదీన వెరిఫికేషన్ చేయించుకున్న వారు అదే రోజు నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఫీజుల వ్యవహారమే తేలలేదు. ఫీజుల వ్యవహారంలో కోర్టు తీర్పు కాపీనే అందలేదంటున్న అధికారులు దానిపై అప్పీల్‌కు వెళ్లడం ఈ రెండు రోజుల్లో సాధ్యం కాకపోవచ్చన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వాయిదా వేయకుండా జూన్ 27వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభించాలంటే కోర్టు ఉత్తర్వుల అమలుతోనే ముందుకు వెళ్లాల్సి వస్తుంది. లేదంటే ఇప్పటివరకు కోర్టు తీర్పు కాపీ అధికారికంగా అందలేదని చెబుతున్నారు కాబట్టి కొత్త ఫీజులు ఖరారు చేసే వరకు పాత ఫీజులే అన్న ఆప్షన్‌ను పెట్టి వెబ్ ఆప్షన్లను ప్రారంభించే అవకాాశం ఉన్నట్లు సమాచారం. కోర్టు తీర్పు వ్యవహారం అయినందున ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుందా? లేదా? అన్నది జూన్ 26న తేలనుంది. మరోవైపు వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేయకుండా ఏమేం ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.
Published date : 26 Jun 2019 02:52PM

Photo Stories