Skip to main content

రివ్యూ పిటిషన్‌తోనే విద్యార్థులకు న్యాయం

  • ఎంసెట్ కౌన్సెలింగ్‌పై‘సాక్షి’ చర్చావేదికలో నిపుణులు
  • భేషజాలకు పోకుండా విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి
  • ఇరు ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలి
హైదరాబాద్: ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియలో ఈ ఏడాది ఎన్నడూ లేనంత అయోమయం నెలకొంది. రాష్ట్ర విభజన విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. సాఫీగా సాగాల్సిన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆరంభం నుంచీ వివాదాస్పదమే. ఇరు ప్రభుత్వాల సమన్వయ లోపమే సమస్యకు ప్రధాన కారణంగా నిలిచింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. వందల కళాశాలల్లో సీట్లు మిగిలిపోయినా.. అర్హత ఉన్నవారు సైతం చేరలేని దుస్థితి. సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లడమే ఇందుకు కారణం. అక్కడ కూడా సరిగా వ్యవహరించక పోవడంతో రెండో విడత ఈ కౌన్సెలింగ్‌కూ అవకాశం లేకుండా పోయింది. లక్షలాదిమంది తల్లిదండ్రులు, విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్న జటిలమైన ఈ సమస్యపై ‘సాక్షి’ మీడియా అక్షరయజ్ఞం ప్రారంభించింది. ఎంసెట్ కౌన్సెలింగ్‌లో తలెత్తిన సమస్యపై ‘తప్పెవరిది? శిక్షెవరికి?’ పేరిట ఇరు రాష్ట్రాల్లో నాలుగు ప్రాంతాల్లో చర్చావేదికలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని పొ ట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో తొలిచర్చా కార్యక్రమం నిర్వహించింది. ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ చర్చావేదికలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ తిరుపతిరావు, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటికైనా రెండు ప్రభుత్వాలు భేషజాలు వీడి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, రెండో విడత కౌన్సెలింగ్‌కు ఆస్కారం కలిగే విధంగా ఇరు ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు ముందుకు రావాలని చర్చావేదికలో పాల్గొన్న విద్యావేత్తలు సూచించారు. కళాశాలలకు అనుమతుల విషయంలో ప్రభుత్వం ముందే చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, ప్రస్తుత అనుభవాలను ఓ గుణపాఠంగా భావించి సమస్య పునరావృతమవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సభకు అధ్యక్షత వహించిన ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం కోసం ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఓ ఫోరం ఏర్పాటుకు చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు.

వర్సిటీలే కౌన్సెలింగ్ బాధ్యత చేపట్టాలిః చుక్కా రామమ్య
విద్యార్థుల్ని అయోమయానికి గురిచేస్తున్న ఎంసెట్ కౌన్సెలింగ్ వ్యవహారంపై తప్పిదమంతా ఇరు రాష్ట్ర ప్రభుత్వ పాలకులదే. దీనివల్ల శిక్ష అనుభవిస్తున్నది మాత్రం విద్యార్థులు. కౌన్సెలింగ్ నిర్వహణకు ఉన్నత విద్యామండలికి ఎలాంటి అధికారం లేదనేది సుస్పష్టం. యూనివర్సిటీలే స్వయంగా తీర్మానం చేసి తమకున్న అధికారాన్ని విద్యామండలికి కట్టబెట్టాయి. ఫలితంగా అకడమిక్ స్వేచ్ఛను కోల్పోయాయి. ప్రస్తుతం యూనివర్సిటీలు అకడమిక్ ఫ్రీడమ్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కౌన్సెలింగ్ నిర్వహణ బాధ్యతలు కూడా యూనివర్సిటీలే చేపట్టాలి.

ముందుగా మేల్కొంటే సమస్య తలెత్తేది కాదుః ప్రొఫెసర్ తిరుపతిరావు, ఓయూ విశ్రాంత ఉపకులపతి
కౌన్సెలింగ్ సమస్యకు అందరూ భావిస్తున్నట్లు రాష్ట్ర విభజన కారణం కాకపోవచ్చు. కేవలం ఇదొక సాకు మాత్రమే. విభజన నేపథ్యంలో ఆయా ప్రభుత్వాలకు నిర్దిష్టమైన నిబంధనలు తెలియజేశారు. ఇరు ప్రభుత్వాలు వుుందుగా మేల్కొంటే సవుస్య తలెత్తేది కాదు. రెండు రాష్ట్రాలు సవున్వయుంతో వ్యవహరించి, సవుస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉన్నా సుప్రీంకోర్టు వరకూ వెళ్లారుు. న్యాయస్థానం జోక్యం చేసుకుని సెప్టెంబరు మొదటి తారీఖుకల్లా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేయమని ఆదేశించటంతో ప్రక్రియను వేగవంతంగా ముగించారు. ఫలితంగా విద్యార్థులు నష్టపోవాల్సి వచ్చింది.

సామరస్య ధోరణితోనే పరిష్కారంః మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి సయోధ్య ఉందనేది చెప్పేందుకు ‘ఏ భాషలో చెబితే మీకు అర్థమవుతుంది’ అంటూ ఎంసెట్ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యానం ఒక్కటి చాలు. సామరస్య ధోరణిలో చర్చించుకోవాల్సిన అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం వరకూ తీసుకెళ్లటం పెద్ద తప్పు. ఎంసెట్ కౌన్సెలింగ్‌పై ఇంతటి గందరగోళ పరిస్థితులకు ఇరు ప్రభుత్వాలదే బాధ్యత.
Published date : 23 Sep 2014 11:36AM

Photo Stories