Skip to main content

పెరిగిన టాప్ ర్యాంకర్ల చేరికలు...

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ప్రారంభమైన ఎంసెట్-2019 ప్రవేశాలకు టాప్ ర్యాంకర్ల నుంచి స్పందన బాగుంది.
5 వేల లోపు ర్యాంకర్లు ఈసారి 846 మంది కౌన్సెలింగ్‌లో పాల్గొని వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. వారికి వర్సిటీ కాలేజీలు, ప్రముఖ కాలేజీల్లో సీట్లు కేటాయించారు. గతంలో కన్నా ఈసారి టాప్ ర్యాంకర్ల చేరికలు పెరిగాయని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చేరికల షెడ్యూల్ ఈసారి కొంత ఆలస్యమైనా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటుతో పాటు ప్రభుత్వం చేపడుతున్న అనేక సంస్కరణలతో ప్రవేశాలపై వ్యతిరేక ప్రభావం పడలేదు. ఎంసెట్‌లో 5వేల లోపు ర్యాంకులు వచ్చిన వారిలో 846 మంది ఈ సారి సీట్లు పొందడం విశేషం. 300లోపు ర్యాంకు వచ్చిన వారిలో ఒకరు ఉండగా ఆ తరువాత 500లోపు ర్యాంకు వచ్చిన వారు నలుగురు ఉన్నారు. ఇప్పటివరకు ఎంసెట్‌లో రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. చివరి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మాడీ, ఫార్మసీ కోర్సులకు సంబంధించి మొత్త 440 కాలేజీలకు గానూ కన్వీనర్ కోటా కింద 1,06,030 సీట్లు ఉన్నాయి. ఇందులో 96,470 రెగ్యులర్ కోటా సీట్లు కాగా (ఈడబ్ల్యూఎస్) ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదల కోటా కింద 9,560 సీట్లు సూపర్ న్యూమరరీ కింద కేటాయించారు. ఎంసెట్‌లో 1,32,983 మంది అర్హత సాధించగా రెండు విడతల కౌన్సెలింగ్‌లో 68,508 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరిలో 67,915 మంది ధ్రువపత్రాల పరిశీలన చేయించుకున్నారు. 60,862 మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 45,168 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 4,016 మందికి సీట్లు కేటాయించారు.
Published date : 21 Aug 2019 04:01PM

Photo Stories