TSCHE: ఆన్‌లైన్‌లోకి ఇంజనీరింగ్ యాజమాన్య కోటా!
ఇందుకు సంబంధించి ఇటీవల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నేతృత్వంలో మండలి ఉన్నతాధికారులు, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యల మధ్య కీలక భేటీ జరిగింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తేవాలనే యోచనలో అధికారులున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.10 లక్షల ఇంజనీరింగ్ సీట్లలో 70 శాతం కన్వినర్ కోటా కింద, మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం ‘బీ’ కేటగిరీ కింద భర్తీ చేస్తున్నారు. మరో 15 శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటా కింద నింపుతున్నారు. నిబంధనల ప్రకారం బీ–కేటగిరీ కింద జేఈఈ ర్యాంకర్లకు ముందుగా సీటివ్వాలి. ఆ తర్వాత ఎంసెట్ ర్యాంకులను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఇంకా సీట్లు ఉంటే ఇంటర్ మార్కులు ఎక్కువగా వచ్చిన వారికి సీట్లివ్వాలి. ఈ కేటగిరీ సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన వార్షిక ఫీజు వర్తిస్తుంది.
చదవండి: ఇంజనీరింగ్ - జాబ్ గైడెన్స్ | ప్రాజెక్ట్ గైడెన్స్ | సక్సెస్ స్పీక్స్ | గెస్ట్ స్పీక్స్ | న్యూస్
నిబంధనలకు యాజమాన్యాల తిలోదకాలు...
అయితే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ర్యాంకులు, మార్కుల ప్రామాణికత పాటించకుండా, ఎక్కువ డబ్బులిచ్చిన వారికే సీట్లు ఇస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది కూడా ఇలాంటి ఫిర్యాదులు 40 వరకూ వచ్చాయి. ఒక్కో సీటునూ రూ. 18 లక్షల వరకూ కాలేజీలు అమ్ముకుంటున్నాయని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు సైతం చేశాయి.
బీ–కేటగిరీ కింద దరఖాస్తు చేశామని చెప్పుకొనే ఆధారాలు లేకపోవడంతో మండలి అధికారులూ చర్యలు తీసుకోలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నీట్ తరహాలో బీ–కేటగిరీ సీట్లనూ ఆన్‌లైన్ పరిధిలోకి తేవడం ద్వారా మెరిట్ ఉన్నవారికే సీట్లు వచ్చే వీలుందని భావిస్తున్నారు. అయితే ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లపై ఇంతవరకూ ఎలాంటి చర్చ జరగలేదు.
ఫీజులపైనే పేచీ...
ఇటీవల జరిగిన సమావేశంలో ప్రైవేటు కాలేజీలు ఫీజుల అంశాన్ని తెరమీదకు తెచ్చాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకన్నా మూడు రెట్లు అదనంగా వసూలు చేసుకొనేందుకు అనుమతించాలని, అప్పుడే ఆన్‌లైన్ విధానానికి అనుమతిస్తామని పట్టుబట్టాయి. ఒక కాలేజీలో కన్వినర్ కోటా సీటు రూ. లక్ష ఉంటే బీ–కేటగిరీ సీటుకు ఏటా రూ. 3 లక్షలు చెల్లించాల్సి వస్తోంది.
ఎన్‌ఐసీ కొత్త డిమాండ్
ఇంజనీరింగ్ కన్వినర్ కోటా సీట్ల భర్తీ వ్యవహారానికి సాంకేతిక నిర్వహణ నేషనల్ ఇన్‌ఫర్మేషన్ సెంటర్ చూస్తుంది. దీనికోసం ఏటా రూ. 60 లక్షలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు బీ–కేటగిరీ సీట్ల విషయంలో అవసరమైన సాఫ్ట్‌వేర్ రూపొందించడంపై అధికారులు ఎన్‌ఐసీ సహకారం కోరారు. కేవలం ఇదొక్కటే చేయలేమని, దోస్త్ ద్వారా నిర్వహించే డిగ్రీ సీట్ల భర్తీని కూడా తమ పరిధిలోకి తేవాలని ఎన్‌ఐసీ మండలి ముందు కొత్త డిమాండ్ పెట్టింది.
తలనొప్పి తగ్గుతుంది
యాజమాన్య కోటా సీట్ల భర్తీ ఆన్‌లైన్‌లో చేపట్టడం వల్ల కాలేజీలు సీట్లు అమ్ముకుంటున్నాయనే ఆరోపణలను దూరం చేయవచ్చు. పారదర్శకత కూడా పెరుగుతుంది. దీనిపై కాలేజీలను ఒప్పించేందుకు కృషి
చేస్తున్నాం.
– ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, చైర్మన్, ఉన్నత విద్యామండలి
ఎన్‌ఆర్‌ఐ కోటానూ చేర్చాలి..
ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల భర్తీని కూడా ఆన్‌లైన్ ద్వారా చేపడితే బాగుంటుంది. మూడు రెట్లు ఫీజులుంటే సీట్లు మిగిలిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. అందువల్ల దీనిపైనా స్పష్టత ఇస్తేనే ఆన్‌లైన్ విధానం సంక్రమంగా ఉంటుంది.
– ఎస్‌జీఎస్ మూర్తి, ఎంవీఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వైఎస్ ప్రిన్సిపల్