నూజివీడు ఐటీ విద్యార్థులకు బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు
Sakshi Education
నూజివీడు: ట్రిపుల్ ఐటీ నూజివీడు విద్యార్థులు ప్లేస్‌మెంట్స్, యోగాలోనే కాకుండా కార్ డిజైన్‌తో పాటు ర్యాలీ పోటీల్లో కూడా ప్రతిభ కనబరుస్తూ తమ సత్తా చాటుతున్నారు.
రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ స్థాయి ‘ర్యాలీ కార్ డిజైన్ చాలెంజ్’లో పాల్గొని డబుల్ సీటర్ ఏటీవీ కేటగిరీలో ద్వితీయ స్థానంతో పాటు మూడు కేటగిరీల్లో కలిపి బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. ‘ర్యాలీ కార్ డిజైన్ చాలెంజ్’ అనేది ఇంజినీరింగ్ విద్యార్థులకు ముఖ్యంగా మెకానికల్ బ్రాంచ్ విద్యార్థులకు ఉద్దేశించినది. కార్ల డిజైన్, బాడీ తయారీ విషయాల్లో పోటీని పెంపొందించి తద్వారా వారిలో సృజనాత్మకతను వెలికితీసేందుకు దో హదపడుతుంది. ఈ ర్యాలీలో సింగిల్ సీటర్ ఏటీవీ, క్వార్డ్‌బైక్, డబుల్ సీటర్ ఏటీవీ వాహనాలకు పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలకు ఉపయోగించే ట్రాక్ కూడా అత్యంత అననుకూలంగా ఉంటుంది. అడుగడుగునా పెద్దపెద్ద గోతులతో, గతుకులతో, అకస్మాత్తుగా వచ్చే మలుపులతో ఉంటుంది. అందుకే ఈ పోటీలను రాజస్థాన్ రాష్ట్రంలోని థార్ ఎడారిలో నిర్వహిస్తూ ఉంటారు. ఇక ‘ర్యాలీకార్ డిజైన్ చాలెంజ్’లో మూడు కేటగిరీల్లో పోటీలు నిర్వహించగా ఎక్స్‌ట్రీం కేటగిరీ అయిన డబుల్ సీటర్ ఏటీవీ కేటగిరీలో 20 జట్లు పాల్గొన్నాయి. అందులో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ద్వితీయ స్థానాన్ని సాధించారు. 32 మంది విద్యార్థు లు నెలరోజుల పాటు కారును తయారు చేసి ఈ పోటీల్లో పాల్గొనడం గమనార్హం. వీరం తా బ్రేకింగ్ సిస్టమ్స్, సస్పెన్షన్స్, ఇంజిన్, బాడీ తదితర డిజైన్‌లలో తమవంతు పాత్ర పోషించారు. కారు తయారీకి రూ.5 లక్షలు ఖర్చయ్యాయి.
Published date : 18 Oct 2019 05:29PM