నిర్ణీత ఫీజులకు మించి వసూలు చేస్తే గుర్తింపు రద్దు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్డగోలు ఫీజులవసూళ్లపై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన తెలంగాణ ఫీజులు, ప్రవేశాల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించిన ఫీజులను కాకుండా అధిక ఫీజులను వసూలు చేస్తున్నట్లు ఏఐసీటీఈ దృష్టికి రావడంతో జూన్ 27న ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని సాంకేతిక విద్యా సంస్థలు ఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలని వెల్లడించింది. ఈ నిబంధనను అతిక్రమించిన యాజమాన్యాలపై కఠిన చర్యల తీసుకోవటంతో పాటు ఆయా కాలేజీల గుర్తింపునూ రద్దు చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు రూ. 4 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తిని 1:15 నుంచి 1:20కి పెంచిన నేపథ్యంలో కొన్ని యాజమాన్యాలు ఫ్యాకల్టీని తొలగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. కాలేజీల నుంచి ఫ్యాకల్టీని తొలగించవద్దని, రిటైర్ అయ్యే వారి స్థానాల్లో ఫ్యాకల్టీని సర్దుబాటు చేసుకోవాలని సూచించింది.
Published date : 28 Jun 2018 02:42PM