Skip to main content

నిబంధనలు మాకో లెక్కా?!

సాక్షి, అమరావతి: కొత్త ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటు, ఇంజనీరింగ్ కోర్సుల నిర్వహణకు సంబంధించి అఖిలభారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ప్రవేశపెట్టే విధానాలు, నిబంధనలు నీరుగారిపోతున్నాయి.
క్షేత్రస్థాయిలో తనకంటూ ఒక యంత్రాంగం లేకపోవడం, పూర్తిగా రాష్ట్రప్రభుత్వాల పరిధిలో ఉండే యూనివర్సిటీలపైనా, ఉన్నత విద్యామండళ్లపైనా ఆధారపడుతున్నందన నిబంధనలకు ఎక్కడికక్కడ గండి పడుతోంది. సిబ్బంది, ల్యాబ్‌లు, ఇతర అంశాలకు సంబంధించిన నియమాలను ఏమీ పాటించకున్నా... అన్నీ పాటిస్తున్నట్లుగా తప్పుడు రిపోర్టులతో కాలేజీల యజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఏఐసీటీఈ తరచూ నిబంధనలు మారుస్తుండడం, ఏడాదికో రకమైన విధానాలను ప్రకటిస్తుండడంతో వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో వర్సిటీలు, ఉన్నత విద్యామండళ్లు సరిగా స్పందించడం లేదు. ‘ఏఐసీటీఈ రోజుకో నిబంధనను విడుదల చేస్తుంటుంది. అవన్నీ అమలు చేయాలంటే సిబ్బంది లేరు. మాటిమాటికీ మార్పులు చేస్తూ ఇచ్చే నిబంధనలు అమలు చేయడం ఎవరికి సాధ్యం’ అని ఉన్నత విద్యామండలి వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఫ్యాక్టు ఫైండింగ్ నివేదికల్లో అంతా డొల్లే..
కొత్త ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటుకు, కొత్తగా కోర్సుల అనుమతికి సంబంధించి ఏఐసీటీఈ నిబంధనలను క్షేత్రస్థాయిలో కాలేజీలు పాటిస్తున్నాయా? లేదా? అని పరిశీలించి నివేదికలు ఇవ్వాల్సిన బాధ్యత ఆయా యూనివర్సిటీలదే. యూనివర్సిటీలు ఫ్యాక్టు ఫైండింగ్ కమిటీలను నియమించి, తమ పరిధిలోని కాలేజీలు ఏఐసీటీఈ నిబంధనలను పాటిస్తున్నాయా? లేదా? అనే దానిపై అధ్యయనం చేపడుతాయి. అయితే, ఈ ఫ్యాక్టు ఫైండింగ్ కమిటీలు వాస్తవ పరిస్థితిని పరిశీలించకుండానే.. నిబంధనల ప్రకారం అన్నీ ఉన్నట్లుగా రిపోర్టులు ఇచ్చేస్తున్నాయి. ఇందుకు స్థానికంగా రాజకీయ ఒత్తిళ్లు, ఆయా యాజమాన్యాలు అందించే ముడుపులే కారణం అన్నది బహిరంగ రహస్యమే. మరోపక్క ఏఐసీటీఈకి ఆయా కాలేజీలు సమర్పించే పత్రాలు, నివేదికలు కూడా వాస్తవానికి భిన్నమైనవేనని పేర్కొంటున్నారు. ఏఐసీటీఈకి ఒకరకమైన నివేదికలు ఇస్తుంటారు. విద్యార్థుల స్కాలర్‌షిప్పులకు సంబంధించిన సమాచారం వేరే రకంగా ఉంటుంది. కాలేజీ వెబ్‌సైట్‌లోని వివరాలకు, అఖిల భారత ఉన్నత విద్యా సర్వే(ఏఐఎస్‌హెచ్‌ఈ)కి ఇచ్చే నివేదికలకు పొంతన ఉండదు. ఇక కాలేజీలో అడ్మిషన్లకు, ఫీజుల నిర్ణయానికి సంబంధించి రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ)కి ఇచ్చే నివేదికలు వేరేగా ఉంటున్నాయి. కాలేజీలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బోధనా సిబ్బంది ఉండాలి. కానీ ఉన్నట్లుగా రికార్డుల్లో చూపించడమే తప్ప నిజంగా ఉండరు. కాలేజీల్లోని అధ్యాపకులు, ఆచార్యులకు కేంద్రప్రభుత్వ వేతన సవరణ సంఘం నిర్ణయించిన మేరకు జీతాలు ఇవ్వాలి. అధ్యాపకులకు రూ.49 వేలు ఇవ్వాల్సి ఉండగా, రూ.15 వేలు, రూ.20 వేలు మాత్రమే అందజేస్తున్నారు. ఇవేవీ రికార్డుల్లో కనిపించవు.

నాణ్యతా ప్రమాణాలపై దృష్టి
ఇంజనీరింగ్ కాలేజీల్లో ల్యాబ్‌లు, ఫ్యాకల్టీ, సదుపాయాలకు ప్రాధాన్యం ఇచ్చిన ఏఐసీటీఈ ఇకపై వాటితోపాటు నాణ్యతా ప్రమాణాలు, ఉపాధి అవకాశాల పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి చేపట్టే ప్రవేశాల్లో ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలంటూ కొత్త ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల ఇంటర్న్‌షిప్, ఫ్యాకల్టీ నిరంతరం అప్‌గ్రేడ్ అయ్యేలా శిక్షణ, ఒక్కో కాలేజీ కనీసంగా 5 కంపెనీలతో ఒప్పందాలు, ప్రతి కాలేజీలో క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ ఏర్పాటు, ఇంజనీరింగ్ విద్యపై అవగాహన పెంపొందించడంతోపాటు వారిలో సృజనాత్మక ఆలోచన విధానాన్ని పెంపొందించేలా పరీక్షల్లో సంస్కరణలు అమలు చేసేందుకు, విద్యార్థులకు తగిన సలహాలు సూచనలు ఇచ్చేందుకు ‘ఇనిస్టిట్యూషన్ ఇండస్ట్రీ సెల్’ను ప్రతి కాలేజీలో కచ్చితంగా ఏర్పాటు చేయాలని పేర్కొంది. అధ్యాపకులు నిరంతరం ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంపై అప్‌గ్రేడ్ కావాలి. అందుకోసం వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. కాలేజీలో విద్యాబోధనలో నాణ్యతా ప్రమాణాల పెంపునకు చేపట్టాల్సిన చర్యలపై ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ ఎప్పటికప్పుడు పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. కాలేజీకి నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు లభించేందుకు అవసరమైన అన్ని చర్యలు ఈ సెల్ ఆధ్వర్యంలో చేపట్టాలి. అలాగే ప్రతి బ్రాంచి నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్‌బీఏ) గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టాలి. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పరీక్షల విధానంలో సంస్కరణలు అమలు చేయాలి. అందుకు అనుగుణంగా సిలబస్‌ను మార్చుకోవాలి. విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించేలా అవకాశాలు కల్పించాలి. ఇందుకోసం ఓపెన్ బుక్ పరీక్ష విధానం అమల్లోకి తీసుకురావాలి.

కొత్త నిబంధనలు అమలయ్యేనా?
ఏఐసీటీఈ తాజాగా కొన్ని కొత్త నిబంధనలను విడుదల చేసింది. కొత్తగా కోర్సులకు అప్రూవల్‌కు దరఖాస్తు చేసే వారు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలని పేర్కొంది. బీఈ/బీటెక్ కోర్సులను నిర్వహించే ఇంజనీరింగ్ కాలేజీలతోపాటు పీజీ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ తదితర కాలేజీలన్నీ ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే వీటిని క్షేత్రస్థాయిలో అమలు పరిచే యంత్రాంగం లేక మళ్లీ ఎప్పటిలాగే ఫ్యాక్టు ఫైండింగ్ కమిటీలు ఏఐసీటీఈ కళ్లకు గంతలు కడతాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Published date : 18 Jan 2019 03:00PM

Photo Stories