Skip to main content

నేడు ఏపీ ఈసెట్-2020 పరీక్ష

అనంతపురం విద్య: ‘ఏపీ ఈసెట్-2020’ సోమవారం రాష్ట్రంలోని 79 కేంద్రాల్లో ఆన్‌లైన్ ద్వారా పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీ ఈసెట్ కన్వీనర్ పీఆర్ భానుమూర్తి తెలిపారు.
వరుసగా ఏడో దఫా జేఎన్‌టీయూఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ ఈసెట్‌లో మొత్తం 14 బ్రాంచిలకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ, బీఎస్సీ (మేథమేటిక్స్), సిరామిక్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సీఎస్‌ఈ, ఈఈఈ బ్రాంచిలకు పరీక్ష జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈసీఈ, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ, మైనింగ్, ఫార్మసీ బ్రాంచిల వారికి పరీక్ష ఉంటుందన్నారు. ఇక కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో బయోమెట్రిక్ హాజరు విధానం రద్దు చేసి ఫేస్ రికగ్నేషన్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. కాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ పరీక్ష కేంద్రంలో పూర్తిగా నిషేధించామన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్ వెనుక ఉన్న సెల్ఫ్ డిక్లరేషన్ స్థానంలో తప్పనిసరిగా సంతకం చేయాలన్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన అభ్యర్థి టెస్ట్ సర్టిఫికెట్‌ను అందజేస్తే.. ఐసోలేషన్ కేంద్రంలో ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
Published date : 14 Sep 2020 02:03PM

Photo Stories