మళ్లీ 1:15నే ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో : ఏఐసీటీఈ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియోను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) మళ్లీ తగ్గించింది.
డీమ్డ్ యూనివర్సిటీలు, అటానమస్ కాలేజీలు, నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు ఉన్న కాలేజీలు 1:15 ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియోను అమలు చేయాలని పేర్కొంది. గతంలో ఇది 1:15 ఉండగా, దాన్ని గతేడాది 1:20కి పెంచింది. అయితే ఇప్పుడు మళ్లీ 1:15కు తగ్గించింది. అలాగే పీజీ కోర్సుల్లో (ఎంటెక్) ఇప్పటివరకు ఉన్న ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని 1:12 నుంచి 1:15కు పెంచింది. 2020-21 విద్యా సంవత్సరంలో దేశంలో వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల నిర్వహణకు అనుమతి ఇచ్చేందుకు ఏఐసీటీఈ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్‌ను జారీ చేసింది. అలాగే దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. యాజమాన్యాలు ఆ నిబంధనలను పాటిస్తూ అనుమతుల కోసం ఫిబ్రవరి 6 నుంచి 29లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఆలస్య రుసుముతో యాజమాన్యాలు మార్చి 5 వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. దరఖాస్తు చేసుకున్న కాలేజీలకు ఏప్రిల్ 30లోగా అనుమతులు జారీ చేస్తామని వివరించింది. అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్‌లో మార్పులు కావాలని కోరుకునే యాజమాన్యాల కోసం ఫిబ్రవరి 10న ముంబైలో, 12న ఢిల్లీలో, 13న అనంతపూర్ జేఎన్టీయూలో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈసారి దరఖాస్తు ఫీజును రూ.లక్ష నుంచి రూ.15 వేలకు తగ్గించింది.
అప్రూవల్ హ్యాండ్ బుక్‌లోని ప్రధాన అంశాలు..
కాలేజీల్లోకచ్చితంగా అమలు చేయాల్సినవి..
అప్రూవల్ హ్యాండ్ బుక్‌లోని ప్రధాన అంశాలు..
- కొన్నేళ్లు ఇంజనీరింగ్ కోర్సుల్లో సీట్ల భర్తీ తగ్గిపోతున్న నేపథ్యంలో కొత్త కాలేజీలకు అనుమతించవచ్చని ఏఐసీటీఈ నిపుణుల కమిటీ పేర్కొంది. అయితే నేషనల్ పర్‌స్పెక్టివ్ ప్లాన్ ప్రకారం కొత్త కోర్సులకు అనుమతి ఇస్తామని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి వాటికి అనుమతి ఇస్తామని వెల్లడించింది. గతంలో దరఖాస్తు చేసుకొని ఉండి, ఆ ఆయా కోర్సులను ప్రవేశ పెట్టే కాలేజీలకే, అదీ 25 ఏళ్ల లీజ్ డీడ్ ఉంటే ప్రారంభించేందుకు అనుమతిస్తామని పేర్కొంది.
- కంప్యూటర్ సైన్స్ లో ఎక్కువ సీట్లు భర్తీ అవుతున్నాయని, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ తదితర ఇతర కోర్సుల్లో 40 శాతమే సీట్లు భర్తీ అవుతున్నాయిని పేర్కొంది. అందుకు సీఎస్సీ కాకుండా మిగతా కోర్సుల్లో అదనపు ఇంటేక్ అడిగితే ఇస్తాం.
- ఫ్యాకల్టీ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ కోసం చర్యలు చేపట్టాలి. ఇండస్ట్రీలకు పంపించడం, ఎన్‌ఐటీ, ఐఐటీ ఫ్యాకల్టీతో సంప్రదించి క్వాలిటీ పెంచాలి.
- కాలేజీ అడ్వైజరీ బోర్డులో పారిశ్రామిక రంగానికి చెందిన వారు ఇద్దరిని కచ్చితంగా నియమించాలి.
- 2020-21 విద్యా సంవత్సరం నుంచి రెండేళ్ల పాటు కొత్త ఫార్మసీ కాలేజీల ఏర్పాటుకు (డిప్లొమా, డిగ్రీ కోర్సుల కోసం) అనుమతించబోమని స్పష్టం చేసింది.
- డీమ్డ్ యూనివర్సిటీలు దూర విద్యా విధానంలో ఎంబీఏ, ఎంసీఏ, ట్రావెల్ అండ్ టూర్స్ కోర్సులను నిర్వహించవచ్చు. అయితే ఆయా కోర్సుల నిర్వహణకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అనుమతి తప్పనిసరి. అలాగే ఆనరరీ డిగ్రీలను ప్రవేశ పెట్టొచ్చు. అయితే అదనపు సీట్లను ఇవ్వకుండా, ఉన్న సీట్లలోనే వాటిని ప్రవేశ పెట్టాలి.
- కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినా యూనివర్సిటీలు మంజూరు చేయకపోతే ఫ్యాకల్టీ సంఖ్యను పరిగణనలోకి తీసుకోరు.
కాలేజీల్లోకచ్చితంగా అమలు చేయాల్సినవి..
- క్యాంపస్‌లలో గ్రీనరీకి ప్రాధాన్యం ఇవ్వాలి. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే చర్యలు చేపట్టాలి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ తప్పనిసరిగా అమలు చేయాలి. - విద్యార్థుల అభిప్రాయాల స్వీకరణ, ఫ్యాకల్టీ వివరాలను కాలేజీ ఆవరణలో డిస్‌ప్లే చేయాలి.
- స్టూడెంట్స్ సేఫ్టీ ఇన్సూరెన్స్ ను కచ్చితంగా అమలు చేయాలి. ఉద్యోగుల కోసం గ్రూపు యాక్సిడెంట్ పాలసీ వర్తింపజేయాలి.
- ఆన్‌లైన్ కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ‘స్వయం’పోర్టల్ ద్వారా విద్యార్థులు ఆన్‌లైన్ పాఠాలను చూసే, వినే ఏర్పాట్లు చేయాలి.
- ఆన్‌లైన్ ఫిర్యాదులు, పరిష్కార విభాగం ఉండాలి. గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీని ఏర్పాటు చేయాలి. యూనివర్సిటీ తరఫున అంబుడ్‌సమెన్‌ను నియమించాలి.
- మహిళా అధ్యాపకులు, విద్యార్థులపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు, ఫిర్యాదులను పరిష్కరించేందుకు కాలేజీల్లో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలను (ఐసీసీ) ఏర్పాటు చేయాలి.
- ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలి. - విద్యార్థులకు ఇంటర్న్‌షిప్, టీచర్ ట్రైనింగ్, విద్యార్థులకు 3 వారాల ఇండక్షన్ ట్రైనింగ్ అమలు చేయాలి. ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్‌లు ఏర్పాటు చేయాలి.
Published date : 06 Feb 2020 04:09PM