Skip to main content

మే 7వ తేదీలోగా ఇంజనీరింగ్ కాలేజీల జాబితా

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఈసారి మే నెలలోనే ప్రారంభించేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేస్తోంది.
తద్వారా జూన్‌లో ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసి జూలై ఒకటి నుంచే తరగతులను ప్రారంభించాలని భావిస్తోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించింది. మొత్తానికి మే నెలాఖరులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. మరోవైపు అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను మే 7వ తేదీలోగా అందజేయాలని యూనివర్సిటీలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి సూచించారు. దీంతో ఇంజనీరింగ్ కాలేజీలలో తనిఖీలు, అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తిచేసేందుకు యూనివర్సిటీలు చర్యలు చేపట్టాయి. ఇక ఎక్కువ కాలేజీలు కలిగిన జేఎన్‌టీయూ మే 5వ తేదీనాటికే అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ఉన్నత విద్యా మండలికి ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అనుబంధ గుర్తింపుకోసం దరఖాస్తు చేసుకున్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్‌ఎఫ్‌సీ) నేతృత్వంలో తనిఖీలు చేపట్టింది. ప్రస్తుతం ఆ తనిఖీలు పూర్తి కావచ్చాయి. వాటి ఆధారంగా కాలేజీలకు వసతులు, సదుపాయాలు, ఫ్యాకల్టీని అనుబంధ గుర్తింపును ఖరారు చేయనున్నారు. అయితే గతంలో కంటే ఈసారి కాలేజీల్లో లోపాల సంఖ్య తగ్గినట్లు జేఎన్‌టీయూ ఉన్నతాధికారులు గుర్తించారు. గతంలో ఫ్యాకల్టీ, ల్యాబ్స్, లైబ్రరీ వంటి అంశాల్లో అనేక లోపాలు ఉండేవని, ఈసారి అలాంటి లోపాలు ఉన్న కాలేజీల సంఖ్య భారీగా తగ్గిందని జేఎన్‌టీయూ వైస్ చాన్‌‌సలర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కొన్ని కాలేజీల్లో మాత్రం చిన్నచిన్న లోపాలు ఉన్నాయని వెల్లడించారు. అయితే ప్రస్తుతం కాలేజీ యాజమాన్యాల్లోనూ మార్పువచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 11 ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేతకు దరఖాస్తు చేసుకోగా, మరో 8 ఇంజనీరింగ్ కాలేజీలు 11 రకాల బీటెక్ కోర్సులను రద్దు చేసుకునేందుకు ముందుకు వచ్చాయి. 28 ఎంటెక్ కాలేజీల్లోనూ 77 బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నాయి. 4 ఫార్మసీ కాలేజీలు 7 బ్రాంచీలను, ఒక ఎంబీఏ కాలేజీ ఒక బ్రాంచీని, 3 ఎంసీఏ కాలేజీలు 3 బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు ముందుకు వచ్చాయి. దీంతో వాటిల్లో సీట్లు భారీగా తగ్గనున్నాయి.
Published date : 21 Mar 2018 03:58PM

Photo Stories