Skip to main content

మే 18న ‘ఇంజనీరింగ్’ ప్రవేశాలకు నోటిఫికేషన్ !

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు సాంకేతిక విద్యా శాఖ కసరత్తు వేగవంతం చేసింది.
మే 18న ప్రవేశాల నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజు ఎంసెట్ ఫలితాలను విడుదల చేసేందుకు జేఎన్‌టీయూహెచ్ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మే 26 నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించాలని భావిస్తోంది. 26 నుంచి సాధ్యం కాకపోతే 28 నుంచి కచ్చితంగా వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు ఇంజనీరింగ్ ప్రవేశాల కమిటీ మే 17న సమావేశం కావాలని నిర్ణయించింది. ఆ సమావేశానికి జేఎన్‌టీయూహెచ్ అధికారులు కూడా హాజరుకానున్నారు. ఎక్కువ శాతం ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు జేఎన్‌టీయూహెచ్ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యం లో అనుబంధ గుర్తింపునకు సంబంధించి జేఎన్‌టీయూహెచ్ ఇచ్చే సమాచారాన్ని బట్టి కచ్చితమైన షెడ్యూల్‌ను మే 17న ఖరారు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

మే 18 నుంచే వెబ్ ఆప్షన్లు ప్రారంభించాల్సి ఉన్నా..
ఇంజనీరింగ్ ప్రవేశాలను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ భావించారు. అందులో భాగంగా కాకతీయ, ఉస్మానియా, జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయాల పరిధిలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఎన్నింటికి అనుబంధ గుర్తింపు ఇచ్చారు.. ఏయే కాలేజీలకు ఇచ్చారన్న వివరాలను ప్రవేశాల కమిటీకి అందజేయాలని లేఖ రాశారు. అంతే కాకుండా మే 18 నుంచే వెబ్ ఆప్షన్లను ప్రారంభించాలని భావించారు. కానీ ఆయా వర్సిటీల నుంచి అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల వివరాలు అందలేదు. పైగా ఎంసెట్ ఫలితాలు కూడా విడుదల కాకపోవడంతో ప్రవేశాల నోటిఫికేషన్ జారీలో జాప్యం ఏర్పడింది.

అనుబంధ గుర్తింపు ప్రక్రియ షురూ !
జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని ఆయా కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియను మే 15 నుంచి ప్రారంభించింది. మే 16 సాయంత్రం వరకు దాదాపు 110 కాలేజీ లకు గుర్తింపును జారీ చేసినట్లు తెలిపింది. ఆ వివరాలను సంబంధిత కాలేజీలకు పంపిస్తోంది. మే 16, 17 తేదీల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. అన్ని కాలేజీలకు సంబంధించి కోర్సుల వారీగా ఇచ్చిన గుర్తింపు వివరాలను క్రోడికరించి ప్రవేశాల కౌన్సెలింగ్, వెబ్ ఆప్షన్లు ప్రారంభించనున్నారు.
Published date : 17 May 2018 02:33PM

Photo Stories