లోపాలున్న ఇంజనీరింగ్ కాలేజీలే ఎక్కువ !
Sakshi Education
-ఇంజనీరింగ్ కాలేజీల్లో ముగిసిన మొదటిదశ తనిఖీలు<br/>
హైదరాబాద్: తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో మొదటిదశ తనిఖీలు సోమవారంతో ముగిశాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ జేఎన్‌టీయూ ఈ తనిఖీలు చేపట్టింది
బిట్స్, ఎన్‌ఐటీ, ఐఐటీ, పాలిటెక్నిక్ ప్రొఫెసర్ల నేతృత్వంలో 16 బృందాలను ఏర్పాటు చేసిన హైదరాబాద్ జేఎన్‌టీయూ మొదటి దశలో 164 కాలేజీల్లో తనిఖీలను పూర్తి చేసింది. తనిఖీ బృందాల ప్రాథమిక సమాచారం ప్రకారం, ఏఐసీటీఈ నిబంధనల మేరకు లేనివి, లోపాలున్నవే ఎక్కువ కాలేజీలు ఉన్నట్టు తెలిసింది. కొన్ని కాలేజీల్లో ఎక్కువ లోపాలు ఉండగా, మరికొన్నింటిలో కొద్దిపాటి లోపాలున్నట్టు తేలింది. నాలుగు కాలేజీలైతే తనిఖీలకే సహకరించలేదు. ఎక్కువ కాలేజీల్లో అధ్యాపకుల కొరతే అత్యధికంగా ఉన్నట్టు తేలింది. ఆ తరువాత మౌలిక సదుపాయాల కొరత ఉన్న కాలేజీలూ ఎక్కువే ఉన్నాయి. అధ్యాపకులకు తక్కువ వేతనాలను ఇస్తూ ఎక్కువగా ఇస్తున్నట్టు రాస్తున్న కాలేజీలు అత్యధికంగా ఉన్నట్టు సమాచారం. మొదటి దశలో తనిఖీలు పూర్తయిన కాలేజీలన్నీ సుప్రీంకోర్టు నుంచి అనుమతి తెచ్చుకొని ప్రవేశాలు చేపట్టినవే కావడం గమనార్హం. ఇక మిగతా 174 కాలేజీల్లో రెండోదశ తనిఖీలను రెండు, మూడు రోజుల్లో ప్రారంభించనున్నారు. వీటితోపాటు హైకోర్టు ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ పోస్టు గ్రాడ్యుయేషన్ కాలేజీల్లోనూ తనిఖీలను చేపడతామని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ఎన్‌వీ రమణరావు తెలిపారు. అపోహలకు తావు లేకుండా తనిఖీ అధికారులను కంప్యూటర్ ఆధారిత ర్యాండమ్ (లాటరీ) పద్ధతిలో ఎంపిక చేస్తున్నామని, కాలేజీలను కూడా ఆ పద్ధతిలోనే ఎంపిక చేస్తున్నట్టు తెలిపారు.
Published date : 09 Dec 2014 01:01PM