Skip to main content

కొత్త ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు మరో రెండేళ్లు నో: ఏఐసీటీఈ

సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో 40 శాతానికి పైగా సీట్లు భర్తీ కావడం లేదని, అందుకే వచ్చే రెండేళ్లు కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రైవేటు రంగంలో అనుమతి ఇచ్చేది లేదని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి స్పష్టం చేసింది.
2020-21 విద్యా సంవత్సరంతోపాటు 2021-22, 2022-23 విద్యా సంవత్సరం వరకు కొత్త కాలేజీల లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌వోఐ) కూడా ఇవ్వబోమని తెలిపింది. గతంలో ఎల్‌వోఐ ఇచ్చిన వారికి మాత్రం లెటర్ ఆఫ్ అప్రూవల్ (ఎల్‌వోఏ) ఇస్తామంది. మరోవైపు ప్రభుత్వ రంగంలో కొత్త కళాశాలల ఏర్పాటుకు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వంతోపాటు ప్రైవేటు రంగంలోనూ కొత్త కాలేజీల ఏర్పాటుకు ఎల్‌వోఐ ఇస్తామని, మిగతా వాటికి ఇవ్వబోమని తేల్చేసింది. 2020-21 విద్యా సంవత్సరం కోసం జారీ చేసిన సాంకేతిక విద్యా సంస్థల అప్రూవల్ హ్యాండ్‌బుక్‌లో మార్పులు చేర్పులపై ఇటీవల ఢిల్లీ, చెన్నైలో జరిగిన కన్సల్టేషన్ సమావేశాల్లో ఈ నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు కొత్త ఫార్మసీ కాలేజీలకు కూడా వచ్చే రెండేళ్లు అనుమతి ఇవ్వమని చెప్పింది. 2019-20 విద్యా సంవత్సరంలో దేశంలోని విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ సీట్లు 27 లక్షలు ఉంటే అందులో 14 సీట్లు మిగిలిపోయాయని, 13 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని పేర్కొంది. రాష్ట్రంలోనూ 217 కాలేజీల్లో 1,12,090 సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం తెలుపగా, రాష్ట్రంలోని యూనివర్సిటీలు 187 కాలేజీల్లో 93,790 సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అందులో 62,744 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే 55.97 శాతం సీట్లు భర్తీకాగా 44.03 శాతం సీట్లు ఖాళీగానే ఉండిపోయాయి. ఫార్మసీలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే స్థితి ఉండటంతో ఇంజనీరింగ్, ఫార్మసీలో వచ్చే రెండేళ్లపాటు కొత్తగా ప్రైవేటు కాలేజీలకు అనుమతించబోమని ఏఐసీటీఈ స్పష్టం చేసింది.

డిమాండ్ ఉండే కోర్సులకు ఓకే...
మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కొత్త కోర్సులను మాత్రం ప్రస్తుతం ఉన్న కాలేజీల్లో ప్రారంభించేందుకు అనుమతి ఇస్తామని (అదనపు ఇంటేక్) వెల్లడించింది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించే, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్, మిషన్ లెర్నింగ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, త్రీడీ ప్రింటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌‌స, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను ప్రారంభించేందుకు అదనపు ఇంటేక్‌ను మంజూరు చేస్తామని చెప్పింది. దానికి అనుగుణంగా జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు కూడా తమ పరిధిలోని కాలేజీల్లో ఆయా కోర్సులను ప్రవేశపెట్టేందుకు అనుబంధ గుర్తింపు ఇస్తామని తమ అఫిలియేషన్ ప్రాసెస్ హ్యాండ్ బుక్‌లో స్పష్టం చేశాయి. దీంతో ప్రస్తుతం ఉన్న కళాశాలల్లో కొత్త కోర్సులను ప్రవేశ పెట్టవచ్చు తప్ప కొత్త వాటికి అనుమతులు లభించవు. మరోవైపు డీమ్డ్ యూనివర్సిటీలు, అటానమస్ కాలేజీల్లో ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియోను 1:15 అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.దీనిపై ఆయా కాలేజీలు ఫ్యాకల్టీ దొరకడం లేదని, సమస్యగా ఉందని ఏఐసీటీఈ దృష్టికి తీసుకువెళ్లాయి. దానిపై ఆలోచనలు చేసిన ఏఐసీటీఈ నిర్దేశిత రేషియోలో ఫ్యాకల్టీని నియమించేందుకు రెండేళ్ల వరకు గడువు ఇచ్చింది. వచ్చే రెండేళ్లలోగా ఫ్యాకల్టీని నియమించాల్సిందేనని, తగిన సదుపాయా లు కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది.

ఇదీ దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ ప్రవేశాల పరిస్థితి..

విద్యా సంవత్సరం

దేశవ్యాప్తంగా సీట్లు

భర్తీ అయినవి

2019-20

27 లక్షలు

13 లక్షలు

2018-19

27.31 లక్షలు

14.15 లక్షలు

2017-18

28.88 లక్షలు

14.96 లక్షలు

2016-17

30.16 లక్షలు

15.70 లక్షలు

2015-16

31.13 లక్షలు

16.89 లక్షలు.

Published date : 22 Feb 2020 01:01PM

Photo Stories