కొత్త కాలేజీలకు అనుమతుల్లేవ్!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: దేశంలో కొత్త ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల అనుమతులపై నిషేధం విధించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే దేశంలో అత్యధికంగా కాలేజీ సీట్లు ఉన్నందున, ఉన్న సీట్లలో సగం వరకు మిగిలిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే 30 శాతం లోపు ప్రవేశాలు ఉన్న బ్రాంచీలను, కాలేజీలను రద్దు చేసేందుకు చర్యలు చేపట్టింది. వివిధ రాష్ట్రాల్లో యాజమాన్యాలు కొత్త కాలేజీల కోసం దరఖాస్తు చేసుకొని ఉన్నందున 2019 నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఢిల్లీలో ఏఐసీటీఈ ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల యాజమాన్యాలతో వేర్వేరుగా నిర్వహించిన ఏఐసీటీఈ అప్రూవల్ ప్రాసెస్-2018పై నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. కనీసం ఐదేళ్ల పాటు కొత్త కాలేజీలకు అను మతులిచ్చే ప్రక్రియను నిలిపేయడంతో పాటు ఆ ఐదేళ్ల కాలంలో కాలేజీల పనితీరు, మార్కెట్ డిమాండ్ తదితర అంశాలపై సర్వే చేయాలని నిర్ణయించింది. ఏదైనా రాష్ట్రం కచ్చితంగా తమకు కొత్త కాలేజీలు కావాలని కోరితే అక్కడ అధ్యయనం చేశాకే నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనకు వచ్చింది.
Published date : 04 Oct 2017 02:15PM