కేఎల్‌యూ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
Sakshi Education
విజయవాడ (గాంధీనగర్): కేఎల్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించిన రాతపరీక్ష, ఆన్‌లైన్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
విజయవాడలోని యూనివర్సిటీ ప్రధాన కార్యాలయంలో యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు కోనేరు రాజాహరీన్ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 160 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహించగా 64 మార్కులు కనీస అర్హతగా నిర్ణయించినట్లు చెప్పారు. మొత్తం 18,500 విద్యార్థులు ప్రవేశ పరీక్షలో అర్హత సాధించారన్నారు. విజయవాడ చైతన్య కళాశాలకు చెందిన ఎస్‌ఎన్‌వీఎస్ కృష్ణప్రశాంత్ 146 మార్కులతో ప్రథమ ర్యాంకు, నారాయణ కళాశాలకు చెందిన కేఎస్ వెంకట రత్నరిత్విక్ 142 మార్కులతో ద్వితీయ ర్యాంక్, హైదరాబాద్ చైతన్యకు చెందిన ఎంఆర్‌వీవీఎస్ సాయితేజ 140 మార్కులతో తృతీయ ర్యాంక్ సాధించారన్నారు. ఈ ప్రవేశ పరీక్షలో మొదటి 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు, ఎంసెట్, జేఈఈ, ఇంటర్మీడియెట్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నూరు శాతం ఫీజు రాయితీ అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు ప్రత్యేక ఫీజు రాయితీ కల్పిస్తున్నామన్నారు. కేఎల్‌యూ ఈఈఈలో 1 నుంచి 750 ర్యాంకులు, జీఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో 139 మార్కులకన్నా ఎక్కువ సాధించిన విద్యార్థులకు, అలాగే ఎంసెట్‌లో 2 వేలలోపు ర్యాంకులు సాధించిన వారికి ఫీజు రాయితీ ప్రకటించారు. కేఎల్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 19 నుంచి 23 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఎల్‌ఎస్‌ఎస్ రెడ్డి తెలిపారు.
Published date : 11 May 2016 01:49PM