Skip to main content

ఆ కాలేజీలకు అఫిలియేషన్ ఇవ్వాలని జేఎన్‌టీయూకు హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్: జేఎన్‌టీయూ అఫిలియేషన్ నిరాకరించడంపై హైకోర్టుకు వెళ్లిన కాలేజీలకు ఊరట లభించింది. ఆయా కాలేజీలకు తాత్కాలిక అఫిలియేషన్ ఇవ్వాలని, వాటిని వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలని జేఎన్‌టీయూను మంగళవారం ఆదేశించింది.
మూడేళ్లుగా ఏఐసీటీఈ అనుమతి ఉండి, 2014-15 వరకు అఫిలియేషన్‌తోపాటు తాజా గడువు లోపు గుర్తింపునకు దరఖాస్తు చేసుకుని కోర్టును ఆశ్రయించిన కాలేజీలకు ఈ అఫిలియేషన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ కాలేజీల్లో జేఎన్‌టీయూ ఎత్తిచూపిన లోపాలను ఏఐసీటీఈ పరిశీలించి, నిర్ణయం వెలువరించేంత వరకు తాత్కాలిక అఫిలియేషన్ పొందినకాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలని సూచించింది. 2014-15 నాటికి అమలుల్లో ఉండి, ప్రస్తుతం అఫిలియేషన్ పొందలేని కోర్సులకూ ఈ తాత్కాలిక అఫిలియేషన్ వర్తిస్తుందని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు తీర్పు వెలువరించారు. తమకు జేఎన్‌టీయూహెచ్ అఫిలియేషన్ ఇవ్వడానికి నిరాకరించడాన్ని, సీట్ల సంఖ్యను తగ్గించడాన్ని సవాలు చేస్తూ పలు ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు మంగళవారం తీర్పునిచ్చారు. జేఎన్‌టీయూ చూపిన లోపాలను ఆయా కాలేజీలు సవరించుకున్నాయా లేదా అన్న అంశాలను పరిశీలించేందుకు బృందాలను పంపాలని ఏఐసీటీఈని ఆదేశించారు. పూర్తిస్థాయిలో పరిశీలన జరిపి 2015-16 విద్యా సంవత్సరానికి తుది అఫిలియేషన్ ఇచ్చే జేఎన్‌టీయూకు నివేదిక సమర్పించాలని ఆ బృందాలకు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను ఈనెల 28లోపే పూర్తి చేయాలని ఏఐసీటీఈకి స్పష్టంచేశారు. పరిశీలన చేసే కాలేజీని విద్యార్థులు ఎంపిక చేసుకుని ఉంటే, ఆ కళాశాలకు తాత్కాలిక అఫిలియేషన్ ఇచ్చిన విషయాన్ని వారికి తెలియచేయాలన్నారు. ఏఐసీటీఈ ఏ కాలేజీ అఫిలియేషన్ అయినా తిరస్కరిస్తే.. ఆ కాలేజీ విద్యార్థులను ఇతర కళాశాలల్లో చేర్చేలా చర్యలు తీసుకోవాలని వర్సిటీని ఆదేశించారు.

ఆరు నెలల్లోపు నిబంధనలు వెల్లడించండి
భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఈ తీర్పునకు అనుగుణంగా అఫిలియేషన్ నిబంధనలను సవరించాలని జేఎన్‌టీయూ పాలక మండలికి హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనల సవరించేటప్పుడు న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, ప్రైవేటు కాలేజీల ప్రతినిధులను సంప్రదించాలని సూచించింది. సవరించిన నిబంధనలను ఆరు నెలల్లోపు బహిర్గతం చేయాలని పేర్కొంది.
Published date : 08 Jul 2015 02:03PM

Photo Stories